బైకుల మీద వచ్చి ఒకే ఊరిలో 160 మంది కిడ్నాప్, 10 మంది కాల్చివేత... అక్కడేం జరిగింది?

    • రచయిత, క్రిస్ ఎవోకర్, థామస్ మకింతోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

నైజీరియా కేంద్ర ప్రాంతం నైజర్ రాష్ట్రంలోని ఒక మారుమూల కమ్యూనిటీ నుంచి 160 మంది గ్రామస్థులు కిడ్నాప్‌కు గురికాగా, 10 మంది హత్యకు గురైనట్లు అధికారులు చెప్పారు.

నైజీరియా మిలిటెంట్ ఇస్లామిస్ట్ గ్రూప్ బోకో హరామ్‌ సభ్యులుగా అనుమానిస్తున్న కొందరు ముఠా సభ్యులు పెద్ద సంఖ్యలో శుక్రవారం రాత్రి కుచి గ్రామంపై దాడులు చేశారని బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు స్థానిక అధికారి అమిను అబ్దుల్‌హమీద్ నజుమే తెలిపారు.

కిడ్నాప్‌కు గురైన వారిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలు ఉన్నారు. చనిపోయిన వారిలో ఈ ప్రాంతానికి రక్షణ కల్పిస్తున్న స్థానిక ప్రజలు కూడా ఉన్నట్లు చెప్పారు.

గన్‌లు పట్టుకున్న కొందరు వ్యక్తులు మోటార్‌బైకులపై కుచి గ్రామంలోకి దూసుకొచ్చారని తెలిపారు.

రెండు గంటల పాటు గ్రామంలోనే హడావుడి చేసిన వీరు, వంట చేసుకోవడం, టీ పెట్టుకోవడం, ఇళ్లను దోచుకోవడంలాంటివి చేశారు.

తమ గ్రామానికి చెందిన చాలా మందిని వీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు తెలుసుకున్న కుచీ కమ్యూనిటీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని నజుమే అన్నారు.

మాస్ కిడ్నాప్‌పై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో పేర్కొంది.

గన్‌మెన్లు గ్రామంలోకి చొరబడి, పెద్ద సంఖ్యలో ప్రజలను కిడ్నాప్ చేయడం ప్రజల జీవితాలను కాపాడటంలో నైజీరియా అధికారులు విఫలమవుతున్నట్లు సూచించే ఘటనగా పేర్కొంది.

‘‘2021 నుంచి గన్‌మెన్లు కుచి గ్రామంపై దాడులు చేయడం, వారి ఇళ్లలోకి ప్రవేశించి మహిళలను, అమ్మాయిలను అత్యాచారం చేయడం చేస్తున్నారు. ప్రజల్ని కిడ్నాప్ చేయకుండా ఉండాలంటే పెద్దమొత్తంలో నైరా(నైజీరియా)లను ఇవ్వాలని ఎప్పటికప్పుడు ఈ గన్‌మెన్లు డిమాండ్ చేస్తున్నారు’’ అని అమ్నెస్టీ పేర్కొంది.

నైజీరియా అధికారులు ఈ మాస్ కిడ్నాప్‌లను కట్టడి చేసే చర్యలు తీసుకోవాలని, అనుమానితులుగా భావిస్తున్న వారిని చట్టం ముందు నిల్చోబెట్టాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పిలుపునిచ్చింది.

తరచూ ముష్కరుల దాడులు, కిడ్నాప్‌లు, కాల్చివేతలు జరుగుతున్నాయని, ప్రజల జీవితాలను సంరక్షించడంలో అధికారులు విఫలమవుతున్నాయని ఈ ఘటనలు స్పష్టంగా సూచిస్తున్నాయని చెప్పింది.

నైజర్ రాష్ట్రంలో దాడులు చేసిన వారికి జిహాదిస్ట్ గ్రూప్‌లతో ఏమైనా సంబంధాలున్నాయా అనే దానిపై స్పష్టత లేదు. డబ్బు కోసం గత నెలలో కూడా సాయుధ గ్యాంగులు పలు గ్రామాలపై దాడులు చేశాయి.

కిడ్నాప్‌లు ఎందుకు చేస్తున్నారు?

గత కొన్ని నెలల్లో నైజీరియాలో 4 వేలమందికి పైగా కిడ్నాప్ అయ్యారని అంచనా. దశాబ్దన్నర కాలంలో నైజీరియాలోని ప్రజలపై సాయుధ మిలిటెంట్ గ్రూపులు దాడులు చేస్తూనే ఉన్నాయి.

ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలైన బోర్నో, అడమావా, యోబేలో ఇవి జరిగాయి. ఇక్కడ బోకో హరామ్ (పాశ్చాత్య విద్యపై నిషేధం) అని పిలిచే ఇస్లామిస్ట్ గ్రూపు చురుకుగా ఈ దాడులు చేస్తోంది.

ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధమున్న మరో దళం కూడా అక్కడ పుట్టుకొచ్చింది.

ఈ రెండు జిహాదీ గ్రూపులు కిడ్నాప్‌లు చేయడం, రైతులను, ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని గ్రామాలను ధ్వంసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

పాశ్చాత్య విద్యకు నిలయంగా భావించే పాఠశాలలు వీరికి లక్ష్యంగా మారాయి. ఇలాగే 10 సంవత్సరాల క్రితం చిబోక్‌లోని బాలికల పాఠశాలపై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

"ఉత్తర నైజీరియాలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు దాడికి గురయ్యాయి" అని కదునా రాష్ట్ర మాజీ సెనేటర్ షెహు సాని చెప్పారు.

తమ పిల్లలను బడికి పంపకుండా తల్లిదండ్రులను నిరుత్సాహపరచడమే వీరి లక్ష్యం అని షెహు సాని అంతకుముందు ఆరోపించారు.

''నేర కార్యకలాపాల కోసం నిధులు సేకరించడం, ఆయుధాలు కొనుగోలు చేయడం కోసం కూడా వీళ్లు కిడ్నాప్‌లు చేస్తుంటారు'' అని తెలిపారు.

బందిపోట్లుగా పేరుగాంచిన క్రిమినల్ ముఠాలు అదే విధానాన్ని అవలంబించడంతో వారి దాడులు ఉత్తరానికి వ్యాపించాయి. ఇక్కడ పాఠశాల పిల్లలను కిడ్నాప్ చేసి, డబ్బులు తీసుకుంటున్నారు.

"వారు డబ్బు కోసం ప్రజలను కిడ్నాప్ చేస్తారు, డబ్బులు చెల్లించిన తర్వాతే బందీలను విడిచిపెడతారు. వారికి ఏ రకమైన రాజకీయ ఎజెండా లేదు" షెహు సాని చెప్పారు.

డబ్బులిచ్చినా గ్యారంటీ లేదు

బందిపోట్లు తరచుగా మోటార్‌బైక్‌లపై సంచరిస్తారు. ఇన్‌ఫార్మర్ల సమాచారంతో దాడి ప్రాంతాలను, నిర్దిష్ట కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది వారికి డబ్బు సంపాదించే ఆపరేషన్.

రాజధాని అబుజాలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రకారం వాయువ్య నైజీరియాలో 100కు పైగా ముఠాలలో 30,000 మంది బందిపోట్లు పనిచేస్తున్నారు.

తన చర్చల ఫలితం కిడ్నాపర్ల నాయకుడిపై ఆధారపడి ఉంటుందని సులైమాన్ అనే వ్యక్తి అంటున్నారు.

ఈయన కిడ్నాప్‌కు గురైన వ్యక్తులను విడిపించడానికి మధ్యవర్తిగా పనిచేస్తున్నారు.

"కొంతమంది బందిపోట్లు డబ్బు చెల్లించిన తర్వాత కూడా, బందీలను తమ దగ్గరే ఉంచుకుని మరింత డబ్బు డిమాండ్ చేస్తారు'' అని తెలిపారు.

"కొందరు చెల్లించిన వెంటనే బందీలను విడుదల చేస్తారు" అని అన్నారు మధ్యవర్తి సులైమాన్.

ఇది చాలా శ్రమతో కూడుకున్నదని, బందీగా ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి 50 రోజులు పడుతుందని, 20, 30 ఫోన్ కాల్స్ ఉండొచ్చంటున్నారు.

"వారు అసభ్యంగా ప్రవర్తిస్తారు, అవమానిస్తారు, కానీ మనం ప్రశాంతంగా ఉండాలి. సున్నితంగా మాట్లాడాలి." అని సులైమాన్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)