24 మనిషి పుర్రెలతో దొరికిన ‘స్వయం ప్రకటిత వైద్యుడు’.. నరబలి నిషేధ చట్టం ప్రకారం ఏ శిక్ష పడొచ్చంటే

    • రచయిత, స్వాయిబు ఇబ్రహిం
    • హోదా, బీబీసీ న్యూస్, కంపాలా

(నోట్: ఈ కథనంలో ఒక ఫొటో కొందరిని కలచివేయొచ్చు)

యుగాండాలో ఓ వ్యక్తి దగ్గర 24 మానవ కపాలాలు దొరికాయి. ఆయన నరబలికి పాల్పడినట్లు అనుమానాలున్నాయి. ఆ ఆరోపణలు రుజువైతే యావజ్జీవ శిక్ష పడొచ్చని యుగాండా పోలీసులు ‘బీబీసీ’తో చెప్పారు.

ఈ కేసుపై పోలీస్ శాఖ అధికార ప్రతినిధి పాట్రిక్ ఒన్యాంగో ‘బీబీసీ’తో మాట్లాడారు. దాములిరా గాడ్‌ఫ్రే అనే అనుమానితుడి నుంచి 24 మనిషి పుర్రెలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ‘నరబలి నిరోధక, నిషేధ చట్టం’ కింద ఆయనపై అభియోగాలు మోపనున్నట్లు తెలిపారు.

రాజధాని కంపాలా శివార్లలో ఉన్న గాడ్‌ఫ్రే ఆధ్యాత్మిక కేంద్రంలో జంతువుల చర్మాలు, అవశేషాలు కూడా దొరికాయని పోలీసులు చెప్పారు.

మనుషులకు సంబంధించిన అవశేషాలు ఇంకా ఏమైనా దొరకొచ్చనే అనుమానంతో గాడ్‌ఫ్రేకు సంబంధించిన ఆ కేంద్రంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు.

‘మేం ఆయనపై తొలుత నరబలి నిరోధక, నిషేధ చట్టం కింద అభియోగాలు నమోదు చేయనున్నాం. ఈ చట్టం ప్రకారం మనుషుల శరీర భాగాలను, నరబలికి ఉపయోగించే సామగ్రిని కలిగి ఉండడం నిషేధం’ అని ఒన్యాంగో చెప్పారు.

గాడ్‌ఫ్రేపై నేరం రుజువైతే ఆయన జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.

గాడ్‌ఫ్రే తనను తాను సంప్రదాయ వైద్యుడిగా, మూలికావైద్యుడిగా చెప్పుకొంటారు. కానీ యుగాండాకు చెందిన సంప్రదాయ వైద్యుల సంఘం మాత్రం గాడ్‌ఫ్రేను దూరం పెట్టింది.

యుగాండాలో ఇలా పుర్రెలు దొరకడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల కొన్నివారాల్లో ఇలాంటి ఘటనలే మరికొన్ని జరిగాయి.

జులైలో కంపాలాకు 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఎంపిగీలోని ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో 17 మనిషి పుర్రెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అవి అంధవిశ్వాసాలతో నరబలి ఇచ్చిన ఘటనలకు సంబంధించినవని పోలీసులు చెప్పారు.

మానవ శరీర భాగాలతో చేసే పూజలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని, శత్రువులను నాశనం చేయడానికి పనికొస్తాయన్న మూఢ నమ్మకాలు కొన్ని ఆఫ్రికా దేశాల్లోని కొందరు ప్రజల్లో ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్‌ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)