సమాధి నిండా బంగారం, నరబలి ఆధారాలు

మధ్య అమెరికాలోని పనామాలో పురాతత్వశాఖ ఒక సమాధిలో జరిపిన తవ్వకాల్లో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

మధ్య అమెరికాలోని ‘ప్రి హిస్పారిక్’ సంస్కృతుల్లో చనిపోయిన వారిని ఖననం చేసే విధానాలు ఎలా ఉండేవో సూచించే ఆధారాలు ఈ పరిశోధనలో బయటపడ్డాయి.

పనామాలో ఒక ఉన్నత వర్గానికి చెందిన ప్రభువు సమాధిలో పురాతత్వ శాఖ వీటిని కనుగొంది.

క్రీ.శ. 750-800 మధ్య కోక్లే కేంద్ర ప్రావిన్సు ప్రాంతంలో ఆయన జీవించారు.

ఎల్ కానో ఆర్కియలాజికల్ పార్క్‌లోని 9వ నంబర్ సమాధిగా దీన్ని గుర్తించారు.

ఈ సమాధి నిండా సిరామిక్ వస్తువులతో పాటు బంగారం ఫలకాలు ఉన్నాయి.

ఆ కాలంలో అంత్యక్రియల సమయంలో చనిపోయిన వారితో పాటు ఖననం చేసే వస్తువులుగా వీటిని భావించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించి ఫిబ్రవరి 27న పనామా సాంస్కృతిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

సమాధిలో ఇంకా ఏమేం ఉన్నాయి?

సమాధిలో బయల్పడిన వస్తువులకు ఆర్థిక విలువే కాకుండా చారిత్రక ప్రాధాన్యం ఉందని పనామా సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎందుకంటే, అందులో ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ మృతదేహాలను ఖననం చేసినట్లుగా తెలుస్తోందని, ఈ ప్రక్రియ ప్రత్యేకంగా కనిపిస్తోందని చెప్పింది.

అప్పటి పోకడల ప్రకారం, చనిపోయిన ఉన్నతస్థాయి వ్యక్తితో పాటు వారి కోసం బలిదానం చేసిన దాదాపు 8 నుంచి 32 మందిని కూడా అదే సమాధిలో ఖననం చేసేవారు.

సమాధిలో కనుగొన్నవాటిలో బంగారు దుస్తులతో పాటు అయిదు పెక్టోరల్స్, గోళాకారంలోని బంగారు పూసలతో కూడిన రెండు బెల్ట్‌లు, నాలుగు కంకణాలు, మానవుల ఆకారంలోని రెండు చెవిదుద్దులు, నెక్లెస్‌లు, పిల్లనగోవితో పాటు ఒక స్కర్టు ఉంది.

శవాన్ని ఎలా ఖననం చేశారు?

ఆర్కియాలజికల్ జోన్‌లో 2022లో ప్రారంభమైన దీర్ఘకాలిక ప్రాజెక్టును పనామా పురాతత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. ఇక్కడి తవ్వకాలు ఇంకా పూర్తికాలేదు. కాబట్టి, తొమ్మిదో నంబర్ సమాధిలో ఎంత మందిని ఖననం చేశారో కచ్చితంగా ఇంకా పేర్కొనలేకపోయారు.

కానీ, ‘‘మృతదేహాన్ని బోర్లించి ఖననం చేసినట్లు తెలిసింది. ఖననం చేసే సమయంలో ఇలా చేయడం చాలా సాధారణం’’ అని ఆ శాఖ తెలిపింది.

‘‘ఎ గ్రేట్ లార్డ్’’ గా పేరున్న ఈ సమాధిని సుమారు క్రీ. శ. 750లో నిర్మించినట్లు భావిస్తున్నారు.

క్రీ. శ. 700 నాటి సమయంలో ఎల్ కానో అనేది అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన ఆవరణ.

క్రీ.శ. 1000 సమయంలో ఇక్కడ కార్యక్రమాలు నిలిపివేశారు. ఇక్కడ ఒక శ్మశానవాటికతోపాటు, చెక్క భవనాలతో కూడిన ఉత్సవ ప్రాంతం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)