You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సొమాలియా: నేరస్థులకు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో మరణ శిక్షల అమలు తీరు ఇదీ
- రచయిత, నైమా సలాహ్
- హోదా, జర్నలిస్ట్, మొగదిషు
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
సొమాలియా రాజధాని మొగదిషు తీరంలో ఆరు పెద్ద కాంక్రీట్ స్తంభాలు ఉన్నాయి. దీనికి సమీపంలోనే నీలం రంగులో కనిపించే హిందూ మహాసముద్రం ఉంటుంది. ఈ సముద్రపు అలలు హృదయాలను కదిలించే ఘటనలకు కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి.
అక్కడి భద్రతా బలగాలు ‘నేరస్థులను’ తీరానికి తీసుకొచ్చి ఫుట్‌బాల్ మైదానంలోని గోల్ పోస్టులకు కట్టేస్తుంటారు. వారి ముఖాలకు నల్లగుడ్డలు కప్పి, తలపై కాల్చి చంపేస్తుంటారు.
అక్కడికొచ్చే ఫైరింగ్ స్క్వాడ్ కూడా ముఖాలు కవర్ చేసుకుంటారు. కాల్చి చంపిన తర్వాత వారి శరీరాలు అక్కడ వేలాడుతూ కనిపిస్తుంటాయి.
‘నేరస్థులకు’ ఇస్లామిక్ గ్రూప్ అయిన 'అల్-షబాబ్' సైనిక కోర్టు శిక్ష విధిస్తుంది. సొమాలియాలో ఎక్కువ భాగం అల్-షబాబ్ నియంత్రణలో ఉంది. దాదాపు 20 ఏళ్లుగా దేశంలో ఆ సంస్థ అంటే భయం నెలకొని ఉంది. పౌరులను లేదా వారి సహచరులను చంపినందుకు కొందరు సైనికులను కూడా దోషులుగా తేల్చింది కోర్టు. తీవ్ర నేరాలకు పాల్పడే సాధారణ పౌరులకూ ఇక్కడే శిక్ష వేస్తుంటారు.
2023లో ఇదే బీచ్‌లో 25 మందికి మరణశిక్ష విధించారు.
ఈ ఏడాది మార్చి 6న సయ్యద్ అలీ మోలిమ్ దావూద్ అనే వ్యక్తిని భార్యకు నిప్పంటించినందుకు కోర్టు దోషిగా తేలుస్తూ, మరణశిక్ష విధించింది. విడాకులు అడిగినందుకు భార్యను సజీవ దహనం చేసినట్లు దావూద్ నేరాన్ని అంగీకరించారు.
హమర్ జజాబ్ జిల్లాలోని మొగదిషు తీరం వద్ద ఒక చిన్న స్థలం ఉంది. అక్కడ 50 కుటుంబాల వరకు నివసిస్తున్నాయి. ఒకప్పుడు దానిలో పోలీసు అకాడమీ ఉండేది. అయితే ఆ కుటుంబాలు భయంతో బతుకుతున్నాయి.
ఎందుకు భయం?
ఈ గోల్‌పోస్టులను మరణ శిక్షకు స్తంభాలుగా ఉపయోగిస్తారని అక్కడ నివసిస్తున్న ఫర్తున్ మొహమ్మద్ ఇస్మాయిల్ అంటున్నారు.
"నా ఐదుగురు కుమారులు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఫుట్‌బాల్ ఆడటానికి బీచ్‌కు వెళతారు" అని ఫర్తున్ గుర్తుచేసుకుంటున్నారు.
"నా పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నా, ఎందుకంటే నేరస్థులను కాల్చి చంపేసిన చోట, రక్తం పడిన చోట పిల్లలు ఆడుతుంటారు. కాల్చిన తర్వాత ఆ స్థలం శుభ్రం కూడా చేయరు" అని ఫర్తున్ అంటున్నారు.
అంతేకాదు చనిపోయిన వారిని అదే బీచ్‌లో ఖననం చేస్తారు.
"నా పిల్లలు మొగదిషులోనే పుట్టారు, హింస, అభద్రతలోనే పెరిగారు, ఈ నగరం 33 ఏళ్లుగా హింసతో బాధపడుతోంది" అని ఫర్తూన్ అన్నారు.
వారికి వేసే శిక్షలు చాలా ఎక్కువని ఫర్తూన్‌తోపాటు పరిసర ప్రాంతంలో నివసించేవాళ్లు భావిస్తుంటారు.
తల్లిదండ్రులు రోజువారీ పనుల్లో తలమునకలై ఉంటుంటారు, పిల్లలను చూసుకోవడానికి వారికి అంత సమయం కూడా దొరకదు. దీంతో బీచ్‌లో పిల్లలు ఆడకుండా అడ్డుకోలేకపోతున్నారు.
ఈ మరణ శిక్షలు సాధారణంగా ఉదయం ఆరు, ఏడు గంటల మధ్య అమలు చేస్తుంటారు.
ఆ శిక్షను చూడటానికి జర్నలిస్టులను పిలుస్తారు. అయితే, దాన్ని చూడకుండా ఎలాంటి ఆంక్షలూ లేకపోవడంతో పిల్లలతో పాటు స్థానిక ప్రజలు కూడా అక్కడ గుమికూడుతుంటారు.
పిల్లలకు బుల్లెట్లు తాకితే..
వాస్తవానికి 1975లో సియాద్ బారే సోమాలియా అధ్యక్షుడైనప్పుడు, చుట్టుపక్కల ప్రజలు శిక్షను చూడటం కోసం ఈ స్థలాన్ని ఉరితీసే ప్రదేశంగా ఎంచుకున్నారు.
అబ్బాయిలు, అమ్మాయిలకు సమానమైన వారసత్వ హక్కులను ఇచ్చే కొత్త కుటుంబ చట్టాన్ని వ్యతిరేకించిన కొంత మంది ఇస్లామిక్ మతాధికారులను కట్టి, కాల్చడానికి సియాద్ సైనిక ప్రభుత్వం ఈ స్తంభాలను నిర్మించింది. నేటికీ ఆ స్తంభాలు ఉన్నాయి.
శిక్ష విధించే సమయంలో ఈ మైదానంలో ఆడుకునే పిల్లలకు బుల్లెట్లు తాకే ప్రమాదముందని తల్లిదండ్రులు భయపడుతున్నారు.
పోలీసులను, సైనికులను చూసి పిల్లలు భయపడుతున్నారని వారంటున్నారు.
"నేను రాత్రిపూట సరిగా నిద్రపోలేను" అని మైదానానికి కొన్ని మీటర్ల దూరంలో నివసించే ఫదుమా అబ్దుల్లాహి ఖాసిమ్ అంటున్నారు.
"కొన్నిసార్లు ఉదయాన్నే తుపాకీ కాల్పులు వింటాను, ఎవరినో చంపేశారు, శిక్ష పడింది అనుకుంటా" అని తెలిపారు.
"నా పిల్లలను ఇంటి లోపలే ఉంచుతాను. మాది నిస్సహాయ స్థితి. బయటకు వెళ్లి ఇసుకలో రక్తం చూడలేను" అని ఫదుమా అన్నారు.
సెలవు దినాల్లో గుంపులుగా జనం
అక్కడి చాలా మంది సొమాలీలు ముఖ్యంగా అల్-షబాబ్ సభ్యులు మరణశిక్షలకు మద్దతు ఇస్తున్నారు.
"మరణశిక్ష విధించే వ్యక్తుల గురించి నాకు వ్యక్తిగతంగా తెలియదు, కానీ ఈ పద్ధతి చాలా అమానవీయం" అని ఫదుమా అంటున్నారు.
2022 అక్టోబర్‌లో మొగదిషులో జరిగిన జంట కారు బాంబు పేలుళ్లలో 120 మంది మృతి చెందగా, 300 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు సంబంధించి అల్-షబాబ్‌పై ఆరోపణలు వచ్చాయి.
పేలుళ్లలో స్నాక్ బార్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న ఫదుమా 17 ఏళ్ల కుమారుడు కూడా మరణించారు.
ఈ బీచ్‌లోని స్తంభాల దగ్గర ఇరుగుపొరుగు పిల్లలు ఆడుకోవడమే కాదు, సెలవు దినమైన శుక్రవారం నాడు నగరంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.
"నేను, నా సోదరుడు ప్రతి శుక్రవారం ఈత కొట్టడానికి, ఫుట్‌బాల్ ఆడటానికి బీచ్‌కి వస్తాం. మా సోదరి కూడా మంచి డ్రెస్ వేసుకొని వస్తుంది. మేము ఆమె ఫోటో తీసినప్పుడు, ఆమె అందంగా కనిపిస్తుంది" అని ఆ బీచ్‌కు రెగ్యులర్‌గా వచ్చే 16 ఏళ్ల అబ్దిరహ్మాన్ ఆడమ్ అన్నారు.
ఇక్కడ మరణశిక్ష విధిస్తారని, వారి సమాధులు ఇక్కడే ఉన్నాయని ఆ బాలుడికి, ఇక్కడకు వచ్చే చాలా మందికి తెలుసు. అయినా వారు ఇప్పటికీ వస్తుంటారు. వారికి ఆ స్థలం అందంగా ఉంటే చాలు.
"మా క్లాస్‌మేట్స్ ఈ ఫోటోలను చూసి అసూయపడతారు. మరణశిక్ష విధించే ప్రాంతంలో మేం సరదాగా గడుపుతున్నామని వారికి తెలియదు" అని ఆడమ్ చెప్పారు.
(సొమాలియాలోని ఏకైక మహిళా మీడియా సంస్థ అయిన బిలాన్ మీడియాలో నైమా సలాహ్ జర్నలిస్ట్.)
ఇవి కూడా చదవండి:
- రాంలీలా మైదానంలో ‘ఇండియా’ మెగా ర్యాలీ: ప్రధాని మోదీ రాముడి జీవితం నుంచి నేర్చుకోవాలి- ప్రియాంక గాంధీ
- ఓపెన్‌హైమర్: అణు దాడులతో కకావికలమైన జపాన్ ప్రజలు.. ఆ బాంబుల తయారీపై వచ్చిన చిత్రం చూసి ఏమన్నారు?
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
- ఎలిహు యేల్: భారతీయులను బానిసలుగా మార్చి సంపన్నుడిగా ఎదిగిన ఈయన అసలు చరిత్ర ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)