కరవు గుప్పిట్లో యూరప్: పశువులకు, పంటలకు నీళ్లు లేవు.. కారు కడగడానికీ కష్టాలే

యూరప్‌లోని చాలా ప్రాంతాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నదుల్లో నీటి లభ్యత తగ్గుతోంది. దీంతో చాలా ప్రాంతాలలో నీటి వినియోగంపై నియంత్రణలు విధించారు.

నెదర్లాండ్స్‌లో వాల్ నది (రైన్ నదికి ప్రధాన ఉప నది) నైమేగన్ బ్రిడ్జ్ దగ్గర చూస్తే అత్యల్ప స్థాయి నీటి మట్టం కంటే తక్కువ నీరు ఉంది.

నైమేగన్ పట్టణం జర్మనీ సరిహద్దుల్లో ఉంటుంది. కార్గో బోట్లు, ఫెర్రీలు ప్రయాణించడానికి ఇక్కడ ఇదే ప్రధాన జల మార్గం.

నదిలో నీరు ఎండిపోవడంతో అందులో పారవేసిన కొట్టుకొచ్చిన టైర్లు, పాత సైకిళ్లు, ఇతర వ్యర్థాలు అన్నీ బయటకు కనిపిస్తున్నాయి ఇప్పుడు.

ఉత్తరాన ప్రవహించే మరో నది ఐసెల్ చాలా సన్నని పాయగా మారిపోయింది. దీంతో ఇందులో ఒకేసారి రెండు నౌకలు ప్రయాణించకుండా నిషేధం విధించారు.

మరోవైపు తీవ్రమైన వేడి కారణంగా మాస్, వాల్ నదులలో విషపూరిత ఆల్గేలు ఎక్కువయ్యాయి.

దీంతో ఆ నదీ జలాల్లో ఈత కొట్టరాదని, పెంపుడు కుక్కలను కూడా నీటిలో విడిచిపెట్టొద్దని అధికారులు సూచించారు.

స్పెయిన్‌ దక్షిణ ప్రాంతం వేసవిలో భగభగలాడుతుంది. అయితే, అక్కడి ఆండలూసియా ప్రాంతం ఐరోపాలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాలలో ఒకటి. ప్రస్తుత పొడి వాతావరణంలో అక్కడి పంటలకు నీరు అవసరం.

ప్రధానంగా అవకాడో, ఆలివ్ తోటలు పెంచే రైతులు నీటి కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పంటలకు నీటి అవసరం ఎక్కువ.

కానీ, స్పెయిన్ ప్రధాన నదుల్లో ఒకటైన గ్వాదల్‌క్వివిర్ నదిలో సాధారణ స్థాయిలో పావు వంతు నీరు మాత్రమే ఉంది.

స్పెయిన్‌లో వ్యవసాయం విస్తృతంగా ఉండడంతో అందుకు తగ్గట్లుగానే నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, వేడి వాతావరణం కారణంగా నీటి వనరులు అడుగంటుతుండడంతో వ్యవసాయదారుల్లో ఆందోళన పెరుగుతోంది.

యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా సరఫరాలో ఆటంకాల వల్ల యూరప్‌లో ఆహార ధాన్యాల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యూరప్‌లో వ్యవసాయంపై ఆధారపడాలన్న ఆలోచనలకు నీటి కొరత ఇబ్బందులు కలిగిస్తోంది.

ఇటలీలోనూ నీటి లభ్యత తగ్గింది. అక్కడి ఉత్తర ప్రాంతంలోని పో నది ఎండిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబులు బయటపడ్డాయి.

ఆదివారం ఉదయం వాటిని సురక్షిత పద్ధతుల్లో పేల్చి ప్రమాదం తప్పించారు.

450 కేజీల ఒక బాంబును స్థానిక మత్స్యకారులు ఆ నదిలో చూసి సమాచారం ఇచ్చారు.

ఇటలీలో వందల కిలోమీటర్ల దూరం ప్రవహించే పో నది ఎండిపోవడంతో 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు ఏర్పడింది.

ఫ్రాన్స్‌లో ఈ వేడి వాతావరణాన్ని అక్కడి ఉప్పు రైతులు ఉపయోగించుకుంటున్నారు.

ఆ దేశ పశ్చిమ ప్రాంతంలోని లీ పౌలింగ్వెన్‌లో తీవ్రమైన వేడి వాతావరణం కారణంగా ఉప్పు కయ్యల్లో సముద్రం నీరు తొందరగా ఆవిరవుతుండడంతో రికార్డు స్థాయిలో ఉప్పు ఉత్పత్తవుతున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

సాధారణంగా ఒక్కో కయ్యలో సగటున 1.3 టన్నుల ఉప్పు లభిస్తుందని.. గత పదేళ్లుగా ఇలాగే జరుగుతోందని, కానీ, ఈసారి మాత్రం 2.5 టన్నుల సగటు ఉత్పత్తి ఉంటోందని ఉప్పు వ్యాపారి ఫ్రాంకోయిస్ డ్యురాండ్ చెప్పారు.

అయితే, ప్రాన్స్‌లో కరవు పరిస్థితులు ఉప్పు రైతుల మాదిరిగా అందరికీ అనుకూలించడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా పశువులకు నీరు కోసం సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో ఎంతో దూరం వెళ్లి వాహనాల్లో నీరు తెచ్చుకుంటున్నారు.

100కి పైగా ఫ్రెంచ్ పట్టణాలు నీటి కొరత ఎదుర్కొంటున్నాయి.

దీంతో గోల్ఫ్ కోర్సులు, గార్డెన్లకు నీరు పెట్టడంపై ఆంక్షలున్నాయి.

ఫ్రాన్స్ వ్యాప్తంగా చాలాచోట్ల కార్ వాష్ దుకాణాలు మూసివేశారు, ఫౌంటెయిన్‌లు ఎండిపోయాయి.

స్లొవేనియాలో కరవు కారణంగా పంటలు నాశనమవుతున్నాయని ఆ దేశ వ్యవసాయ మంత్రి తెలిపారు.

జొన్న పంట ఉత్పత్తి ఈ ఏడాది అంచనాల్లో సగం కూడా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పశుదాణా దొరక్క కష్టాలుపడుతున్న పాడి రైతులకు ఇది విఘాతమే.

కరవు కారణంగా పచ్చ గడ్డి కూడా ఎక్కడా దొరకడంలేదు.

గుమ్మడి, బంగాళాదుంపల ఉత్పత్తి కూడా ఈ ఏడాది భారీగా తగ్గనుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)