ఒక్కో రాత్రికి రూ. 16 వేలు పెడితే దొరికింది ఇదేనా.. ఖతర్‌లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అభిమానుల నిరాశ

    • రచయిత, నెస్టా మెక్‌గ్రెగర్
    • హోదా, బీబీసీ స్పోర్ట్

‘ఇది ఇంకా నిర్మాణంలోనే ఉంది. పగటిపూట అక్కడ ఉండాలంటే నరకంలో ఉన్నట్లుంటుంది. ఎడారి... చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ’

ఈ మాట చెబుతున్న షోగో నకాషిమా తాను ఉంటున్న చోటు గురించి రివ్యూలు ఇస్తున్నప్పుడు ఆయన మొఖంలో నవ్వు ఉంది.. ‘నేను నవ్వకపోతే ఏడవాలి కదా’ అంటారాయన.

‘నాకిక్కడ వేరే ఆప్షన్ లేదు. జపాన్ మ్యాచ్ జరిగే రోజు వరకు ఇక్కడ గడపాల్సిందే’ అన్నారు నకాషిమా. ‘ఇక్కడ కేవలం పడుకునేటప్పుడే ఉంటున్నాను. మిగతా సమయమంతా సిటీలో తిరుగుతున్నాను. ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు’ అన్నారు నకాషిమా.

31 ఏళ్ల నకాషియా ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతున్న ఖతర్ దేశంలోని క్వెటాయిఫాన్ ఐలాండ్ ఫ్యాన్ విలేజ్‌లో మొట్టమొదట అడుగుపెట్టిన అతికొద్దిమందిలో ఒకరు. ఆయన అక్కడకు వచ్చేటప్పటికి ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

చాలామంది విదేశీ అతిథులు అక్కడికి రావడానికి ముందే పరిస్థితులు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చనే సూచనలు కనిపించాయి.

ఈ ప్రాంతానికి చేరుకుంటున్న దారిలో నిర్మాణ పనులు సాగుతున్నాయనడానికి నిదర్శనంగా భారీ యంత్రాలు కనిపించడంతో పెద్దపెద్ద శబ్దాలూ వినిపిస్తున్నాయి.

ఆకాశాన్నంటే క్రేన్లు, పేవ్‌మెంట్లు నిర్మాణానికి రాళ్లు వేస్తున్న కార్మికులు, వైరింగ్ పనులు, లైట్లు అమర్చే పనుల్లో కార్మికులు కనిపిస్తున్నారు.

ఫ్యాన్ విలేజ్‌లో మొత్తం 1800 టెంట్‌లు ఉన్నాయి. ప్రతి టెంట్‌లో ఇద్దరు ఉండొచ్చు.

పెడ్రో, ఫాతిమాలు స్పెయిన్‌లో ఉంటారు. వారు మెక్సికో జట్టును ఉత్సాహపరిచేందుకు ఇక్కడకు వచ్చారు.

ఏప్రిల్‌లో వివాహం చేసుకున్న ఈ జంట తమ హనీమూన్‌లో భాగంగా ఇక్కడకు వచ్చారు.

‘ఇక్కడ ఒక రాత్రి గడపడానికి 200 డాలర్లు(సుమారు రూ. 16,000) ఖర్చవుతుంది. నేను అనుకున్న కంటే ఎక్కువ ఖర్చే ఇది. ఇది ఫిఫా వరల్డ్ కప్.. ఇంకొంచెం ఎక్కువ క్వాలిటీ ఆశిస్తాం’ అన్నారు పెడ్రో.

ప్రపంచంలో అనేక చోట్ల కనిపించే సాధారణ హాస్టల్ గదుల కంటే కూడా నాసిరకంగా ఉంది ఇది అన్నారు పెడ్రో.

‘గ్రీన్‌హౌస్‌లో ఉన్నట్లుంది ఇక్కడ. ఫ్లైట్ ప్రయాణం కారణంగా అలసిపోయి ఉన్నప్పటికీ పొద్దున్న 9 గంటల తరువాత ఇక ఇందులో పడుకోలేకపోయాం’ అంటూ తమ తొలిరోజు అనుభవాన్ని వివరించారు పెడ్రో.

దళసరి ప్లాస్టిక్‌తో చేసిన ఈ టెంట్లలో ఒక్కోదాంట్లో రెండు సింగిల్ బెడ్‌లు ఉంటాయి. పొడవాటి స్టాండ్‌తో ఒక లైట్ ఉంటుంది. పల్చని కార్పెట్ ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ ఫ్యాన్ కూడా ఉంటుంది.

‘నిర్వహణ సంగతేంటో ఎవరికీ ఏమీ తెలియదు’ అని ఫాతిమా బీబీసీతో చెప్పారు.

‘ఇక్కడ ఉండాల్సిన దుకాణాలన్నీ మూసివేసి ఉన్నాయి. తాగునీరు అందుబాటులో లేదు. మేం చెల్లించిన డబ్బుకు ఇక్కడి పరిస్థితులకు పొంతనే లేదు’ అన్నారామె. ఇక్కడకు వచ్చినవారిలో ఎవరితో మాట్లాడినా అందరూ ఇదే చెబుతున్నారు, సదుపాయాలు లేవంటూ పెదవి విరుస్తున్నారు అన్నారు ఫాతిమా.

ఇంకొందరి పరిస్థితి అయితే మరీ దారుణం. పారిస్ నుంచి వచ్చిన జమాల్ ఈ ఫ్యాన్ విలేజ్‌లో మూడు వారాల పాటు ఉండేందుకు 2,700 పౌండ్లు(సుమారు రూ. 2.6 లక్షలు) చెల్లించాడు. కానీ, ఇక్కడకు వచ్చిన 24 గంటల్లోనే బయటపడేందుకు తన బ్యాగ్ సర్దుకున్నారాయన.

‘ఈ అనుభవం ఏమాత్రం బాగులేదు. షవర్ జెల్ లేదు, టూత్ పేస్ట్ లేదు, టూత్ బ్రష్ లేదు’ అన్నారు జమాల్.

ఈ స్టేను బుక్ చేసుకున్న కన్ఫర్మేషన్ షీట్‌ను ఆయన బీబీసీకి చూపించారు. తనకు హోటల్ రూమ్ కేటాయిస్తున్నారని అనుకున్నారాయన.

అయితే, ఇక్కడ సదుపాయాలలేమి ఎలా ఉన్నా సిబ్బంది మాత్రం నవ్వుతూ, ఉత్సాహంగా ఉంటూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడమనేది ఒక సానుకూల విషయమని చెప్పారు. నీరు ఎక్కడ దొరుకుతుంది.. ఎక్కడకు వెళ్లి కొనుక్కోవాలి వంటి సమాచారం స్పష్టంగా ఇవ్వలేకపోయినా ఉత్సాహంగా మాత్రం కనిపిస్తారు.

ఫ్యాన్ విలేజ్ నుంచి కొంచెం దూరం నడిస్తే బీచ్ క్లబ్ పార్క్ ఉంది. అక్కడ మ్యాచ్‌లను చూపించడానికి పెద్ద స్క్రీన్ ఉంది. అంతేకాదు.. అక్కడే ఆల్కహాల్ కూడా దొరుకుతుంది. అయితే, ఇప్పుడు స్టేడియంలలో ఆల్కహాల్ బ్యాన్ చేస్తున్నట్లు చెప్పారు.

బీచ్ క్లబ్‌ను చూసినా అది ఇంకా పూర్తికాలేదని అర్థమవుతుంది. ఆ ప్రాంతం చుట్టూ నిర్మాణ సామగ్రి, మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. నిర్మాణ పనుల్లో వాడే వాహనాలూ ఇంకా ఉన్నాయి.

ఖతర్ ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్ కోసం 200 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 18 వేల కోట్లు) ఖర్చు చేసింది.

2022 ప్రపంచకప్ నిర్వహణ ఖతార్‌కు కేటాయిస్తూ 2010లోనే నిర్ణయమైంది. సుమారు పన్నెండేళ్ల సమయం దొరికినప్పటికీ ఇంకా నిర్మాణ పనులు హడావుడిగా చేస్తుండడం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన, వేల డాలర్లు ఖర్చు చేసిన ఫుట్‌బాల్ అభిమానులను ఏమాత్రం రుచించకపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)