ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ 2022: స్టేడియంలో బీరు అమ్మకాల గురించి ఫీఫా ఎందుకు పోరాడుతోంది?

వరల్డ్‌ కప్ స్టేడియాలలో ఆల్కాహాల్ వాడకం వివాదం ఖతార్‌ తోనే మొదలు కాలేదు.

స్టేడియాలలో బీర్, మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని ఫీఫా చాలాసార్లు ఆతిథ్య దేశాలో పోరాడింది.

అయితే, తన పోరాటంతో ఫీఫా వలసవాద సంస్కృతిని ప్రోత్సహిస్తోందని, క్రీడాభిమానుల భద్రతను విస్మరిస్తోందన్న విమర్శలు వినిపించాయి.

తాజాగా, ఆతిథ్య దేశం ఖతార్ కూడా వరల్డ్ కప్ స్టేడియాలలో ఆల్కహాల్‌ వినియోగాన్ని నిషేధించింది.

‘‘నాకు చాలా నిరాశగా ఉంది. జీరో పర్సెంట్ ఆల్కాహాల్ మాత్రమే దొరికింది. దాని ఫ్లేవర్ దొరకడం ఒకింత నయం. బీరు కోసం జనం అల్లాడిపోతున్నారు’’ అని ఈక్వెడార్‌కు చెందిన ఫ్యాన్ ఒకరు అన్నారు.

నిషేధానికి ఫీఫా మొదట్లో అనుకూలం

ఆల్కహాల్ అమ్మకాల గురించి ఆతిథ్య దేశంతో ఫీఫా అనేకమార్లు ఘర్షణ పడింది.

ప్రేక్షకులకు ఆల్కహాల్ అందుబాటులో ఉంటే ఎంజాయ్ చేస్తారని, లేదంటే స్టేడియం డ్రై గా ఉంటుందని వాదించింది.

ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్లు జరిగే స్టేడియాలలో, దాని పరిసరాలలో ఎట్టి పరిస్థితుల్లో ఆల్కాహాల్ కనిపించరాదని, మద్యం ప్రభావం ఉన్న వ్యక్తులను స్టేడియంలో ఉండనివ్వరాదని 2004 సంవత్సరం వరకు ఫీఫా నిబంధనల్లో ఉంది.

కానీ, ఆ తర్వాత తన పాలసీ మార్చుకుని ప్రపంచ కప్ స్టేడియాల్లో ఆల్కహాల్ అమ్మకాల కోసం ఫీఫా మద్ధతివ్వడం ప్రారంభించింది.

అయితే, కొన్ని దేశాలతో ఫీఫాకు సమస్యలు ఎదురయ్యాయి.

బ్రెజిల్‌లో నిషేధం ఎత్తివేత

2014 ప్రపంచ కప్‌ను బ్రెజిల్‌కు దక్కింది. ఈ దేశంలో ఫుట్‌బాల్ పిచ్చి ఎక్కువ. ఈ టోర్నమెంట్‌ను బ్రెజిల్ అయిదుసార్లు గెలుచుకుంది.

అలాగే, ఆ దేశంలో బీర్‌కు బాగా ప్రాచుర్యం ఉంది. అయితే, అనేక దేశాల్లో మాదిరిగానే, బ్రెజిల్‌లో కూడా అభిమానులు మద్యం ప్రభావంలో స్టేడియాలలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన సందర్భాలున్నాయి.

దీంతో ఈ తరహా హింసను, ఘర్షణలను నివారించేందుకు 2003లో బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టేడియంలలో మద్యాన్ని నిషేధించారు.

అయితే, ఇలాంటి నిషేధాలను ఎత్తివేయాలని ఫీఫా వరల్డ్ కప్‌కు ప్రధాన స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న బీర్ తయారీ కంపెనీ బడ్‌వైజర్, కొన్ని ఆతిథ్య దేశాలు ఫీఫా నిబంధనలలో మార్పులను కోరుతూ వస్తున్నాయి.

‘‘ఆల్కాహాలిక్ డ్రింక్స్ ఫీఫా వరల్డ్ కప్‌లో ఒక భాగం. అవి మాకు కావాల్సిందే. నేను కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ, ఈ విషయంలో మేం రాజీపడలేం’’ అని అప్పటి ఫీఫా జనరల్ సెక్రటరీ జెరోమ్ వాల్కే అన్నారు.

‘‘బీరు అమ్మకాలనేవి ఇక్కడి నిబంధనల్లో భాగం కావాల్సిందే’’ అని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఈ మార్పులను బ్రెజిల్ ఆరోగ్య శాఖామంత్రి వ్యతిరేకించారు. అప్పటి బ్రెజిల్ అధ్యక్షుడి ప్రధాన సలహాదారుగా ఉన్న మార్కో అరేలియో గార్సియా ఫీఫా జనరల్ సెక్రటరీ వాల్కే పై విరుచుకుపడ్డారు.

ఆయన వలసవాది అని, దుర్మార్గుడని, నోరేసుకుని బతికేవాడనీ విమర్శించారు.

2014లో బ్రెజిల్ ‌వరల్డ్ కప్ సందర్భంగా స్టేడియంలో మద్యం అమ్మకాలపై నిషేధం తొలగించారు.

అయితే, ఈ వరల్డ్ కప్‌ సందర్భంగా స్టేడియంలలో అనేక ఘర్షణలు జరిగాయి. ఒక దశలో వీరిని అదుపుచేయడానికి నిర్వాహకులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఈ సంఘటనల తర్వాత బ్రెజిల్ స్పోర్ట్స్ టెలీవిజన్‌తో మాట్లాడిన జెరోమ్ వాల్కే ‘‘ఇంతమంది, ఇన్ని బీర్లు తాగారని తెలిసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను’’ అని వ్యాఖ్యానించారు.

ఒక వేళ ఫీఫా భవిష్యత్తులో మళ్లీ నిబంధనలు మార్చితే ఏం చేస్తారని అడిగినప్పుడు ‘‘ఒకవేళ వాళ్లు ఆల్కాహాల్‌ను కంట్రోల్ చేయక తప్పదు అనుకున్నప్పుడు మేం వారిని కంట్రోల్ చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

రష్యాపైనా ఒత్తిడి.

2018 వరల్డ్ కప్‌ సందర్భంగా రష్యా పెద్దగా నిబంధనల్లో మార్పులను చూడలేదు. కానీ, బ్రెజిల్‌లాగే రష్యా కూడా ఇంతకు ముందు నుంచే ఆ దేశపు క్రీడావేడుకల్లో ఆల్కహాల్‌ను నిషేధిస్తూ వస్తోంది.

రష్యా క్రీడా మైదానాల్లో ఆల్కాహాల్ వినియోగాన్ని రష్యా 2005 లోనే నిషేధించింది. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్ లో ఆల్కహాల్ బ్రాండ్స్ స్పాన్సర్‌షిప్‌లు పెద్దగా కనిపించలేదు.

2012లో టీవీ, ఆన్‌లైన్, ప్రింట్ మీడియాలలో ఆల్కాహాల్ యాడ్స్‌ను కూడా రష్యా బ్యాన్ చేసింది.

కానీ, తర్వాత సంవత్సరం వరల్డ్ కప్ స్పోర్ట్స్ స్టేడియాలలో ఆల్కాహాల్ వినియోగాన్ని ఆమోదిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఒక చట్టానికి ఆమోదం తెలిపారు.

అలాగే ఆల్కహాల్ అడ్వర్టయిజ్‌మెంట్లపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేశారు.

మతపరమైన అభ్యంతరాలు

ఫుట్‌బాల్ స్టేడియాల్లో ఆల్కాహాల్ వినియోగానికి సంబంధించిన వివాదాలు కేవలం ఫీఫాకు, ఆతిథ్య దేశాలకే పరిమితం కాలేదు.

యూరో 2022లో యూయెఫా (యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్)కు, ఆటగాళ్లకు మధ్య గొడవైంది.

ఈ టోర్నమెంట్ ప్రధాన స్పాన్సరర్ అయిన హైనకెన్ బ్రాండ్ బీర్ బాటిల్స్ పట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రావాలని యూయెఫా కోరగా, కొందరు ఆటగాళ్లు అందుకు నిరాకరించారు.

ఫ్రెంచ్ మిడ్ ఫీల్డర్ పాల్ పోగ్బా, అప్పటికే మీడియా సమావేశం టేబుల్ మీద ఉన్న ఒక బాటిల్‌ను అక్కడి నుంచి తొలగించారు.

అతని సహచరుడైన కరీమ్ బెంజెమా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టేబుల్ మీద ఎలాంటి బాటిల్స్ కనిపించకుండా మాట్లాడారు.

ఈ టోర్నమెంట్ మొత్తం జీరో పర్సెంట్ ఆల్కాహాల్ ఉన్న హైనకెన్‌ బీర్‌ను సరఫరా చేశారు.

కానీ, ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒక ఆల్కాహాల్ కంపెనీతో అనుబంధం కలిగి ఉండరాదన్న భావనతో దీనిని వ్యతిరేకించారు.

ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులలో హైనకెన్ బాటిళ్లను అనుమతిస్తారా లేదా అన్న విషయం కోచ్‌లను, ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని యుయేఫా నిర్ణయించింది.

అయితే, హైనకేన్ తప్ప మరో బ్రాండ్‌తో ఆటగాళ్లు కనిపిస్తే మాత్రం టీమ్‌లకు ఫైన్ విధిస్తామని యుయేఫా స్పష్టం చేసింది.

బ్యాన్ విధించిన ఖతార్

మత పరమైన కారణాలతో ఖతార్ దేశంలో ఆల్కహాల్‌పై నిషేధం ఉంది. దీంతో చివరి నిమిషంలో ఫీఫా స్టేడియంలలో ఆల్కహాల్‌ను నిషేధానికి అంగీకరించాల్సి వచ్చింది.

అయితే, వీఐపీ టికెట్ కొనుక్కున్న వారు ఆట జరుగుతున్నప్పుడు, తర్వాత కూడా ఎగ్జిక్యుటివ్ బాక్స్‌లో ఆల్కహాల్‌ను కొనుక్కునే సదుపాయం ఉంది.

ఫీఫా వరల్డ్ కప్‌కు, ఇతర ప్రధాన టోర్నమెంట్‌లకు 1980ల నుంచి బడ్ వైజర్ మాతృసంస్థ ఏబీ ఇన్బెవ్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది.

ప్రతి వరల్డ్ కప్‌కు ఈ సంస్థ 7.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.613 కోట్లు) చెల్లిస్తుంది. అయితే,

ఈ నిషేధం తర్వాత ఫీఫా, ఏబీ ఇన్బెవ్ కంపెనీల మధ్య సంబంధాలు ఏమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

2026 వరల్డ్ కప్‌కు మూడు ఆతిథ్య దేశాలలో అమెరికా ఒకటి. బడ్ వైజర్ మాతృసంస్థది కూడా అమెరికాయే. కాబట్టి, ఈసారి తన అదృష్టం పండుతుందని ఏబీ ఇన్బేవ్ ఆశగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)