ఇజ్రాయెల్-గాజా యుద్ధం: ఒకే రోజు 24 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి, గాజాలో 25 వేలు దాటిన మరణాలు

    • రచయిత, మార్క్ లోవెన్
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం

గాజాలో సోమవారం ఒకే రోజు తమ 24 మంది సైనికులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది.

గ్రౌండ్ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దళాలకు ఇదే అత్యంత ప్రమాదకరమైన రోజుగా నిలిచింది.

చనిపోయిన వారిలో మిలిటరీ రిజర్వ్ ఫోర్స్‌కు చెందిన 21 మంది రిజర్విస్టులు ఉన్నారని చెప్పింది. రెండు భవనాలను కూల్చేయడం కోసం వాటిలో ఇజ్రాయెల్ బలగాలు పెట్టిన రెండు మైన్లు పేలడం వల్ల వారు చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.

పాలస్తీనా సాయుధ ఫైటర్లు ప్రయోగించిన ఒక క్షిపణి ఆ భవనాలకు దగ్గర్లోని ఒక ట్యాంకును ఢీకొట్టినట్లుగా వారు భావిస్తున్నారు.

ఏం జరిగిందనే అంశంపై ఐడీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. సెంట్రల్ గాజాలో సోమవారం సాయంత్రం 4 గంటలకు రిజర్విస్టులు చనిపోయినట్లు ఐడీఎఫ్ ముఖ్య అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు.

సోమవారం నాటి మరణాల గురించి మాట్లాడుతూ ఇదొక అత్యంత దుర్దినం అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

ఐడీఎఫ్ వెబ్‌సైట్ ప్రకారం, అక్టోబర్ 27న ఇజ్రాయెల్ భూతల దాడులు మొదలు పెట్టినప్పటి నుంచి 217 మంది సైనికులు చనిపోయారు.

ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 25, 295 మంది మృతి

గాజాలో 25 వేలకు పైగా మృతి

గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ చర్య కారణంగా మహిళలు, పిల్లలతో కలిపి మొత్తం 25,295 మంది చనిపోయినట్లు హమాస్ పరిధిలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో తూర్పు గాజాలో 178 మంది చనిపోయారని, యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన భయంకర దాడుల్లో ఇది కూడా ఒకటని హమాస్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.

ఒకవైపు పోరాటం కొనసాగుతుండగా, మరోవైపు పాలస్తీనా ఏర్పాటును ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి తిరస్కరించారు.

'టూ స్టేట్ సొల్యూషన్' (రెండు దేశాల ఏర్పాటు - ఇజ్రాయెల్, పాలస్తీనా) విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి వేర్వేరుగా ఉందని వైట్‌హౌస్ తెలిపింది.

హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంపై దాడి చేసి 1,300 మందిని హతమార్చడంతో పాటు 240 మందిని బందీలుగా తీసుకెళ్లడంతో అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది.

అక్టోబర్ దాడికి సంబంధించి హమాస్ తొలి బహిరంగ ప్రకటన ఆదివారం ప్రచురితమైంది. అందులో ఇజ్రాయెల్‌పై దాడిని అవసరమైన చర్యగా హమాస్ అభివర్ణించింది. పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా, పాలస్తీనా ఖైదీలను విడిపించేందుక ఒక మార్గంగా దీనిని పేర్కొంది హమాస్.

ఇజ్రాయెల్ సైన్యం, వైమానిక దళం ప్రస్తుతం దక్షిణ గాజాపై దృష్టి పెట్టింది. ఈ ప్రాంతంలోని ఖాన్ యూనిస్ పట్టణంలో లేదా దాని కింద బంకర్లలో హమాస్ అగ్ర కమాండర్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది.

ఈ ప్రాంతంలోనే ప్రాణాంతక ఉచ్చులు (బూబి-ట్రాప్స్), పేలిపోయేలా అమర్చిన డోర్లు(బ్లాస్ట్ డోర్స్) ఉన్న 830 మీటర్ల (2,700 అడుగులు) పొడవైన మరో సొరంగాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తెలిపింది.

ఐడీఎఫ్ విడుదల చేసిన సొరంగం ఫుటేజీలో చిన్నచిన్న గదుల్లాంటి ఏర్పాట్లు, పరుపులు కనిపించాయి. అందులో దాదాపు 20 మంది బందీలను ఉంచి ఉండొచ్చని, వారిలో చిన్నారులు ఉండే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే, సొరంగాన్ని కనుగొనే సమయానికి అందులో ఎవరూ లేరు.

ఇజ్రాయెల్ తన దళాలను, యుద్ధ ట్యాంకులను దక్షిణ గాజాకు తరలించడంతో హమాస్, ఉత్తర గాజాలోని జబాలియా పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడులు ఎదుర్కొంది.

వివాదం చెలరేగిన తర్వా త, ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థావరాలే లక్ష్యంగా మూడు నెలలకుపైగా విరుచుకుపడుతున్నప్పటికీ, గాజా ప్రాంతంలో ఇంకా ప్రతిఘటన ఎదుర్కొంటూనే ఉంది.

ఇజ్రాయెల్ సైన్యం 20 శాతం నుంచి 30 శాతం మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. అయితే, సాయుధ దళాలను పూర్తిగా సర్వనాశనం చేయాలన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లక్ష్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ సైన్యంపై దాడి చేసేందుకు కొద్దినెలలకు సరిపడా ఆయుధాలు హమాస్ వద్ద ఇంకా ఉన్నట్లు క్లాసిఫైడ్ రిపోర్ట్ ఒకటి తెలియజేస్తోంది. ఇది సుదీర్ఘ యుద్ధ భయాన్ని పెంచుతోంది.

స్పష్టంగా పైచేయి సాధించినప్పటికీ, ఇప్పటి వరకూ హమాస్ అగ్రనేతల్లో ఎవరూ బందీలుగా దొరకడం గానీ, దాడుల్లో చనిపోవడం గానీ జరగలేదు. మరోవైపు ఇంకా 130 మందికి పైగా ఇజ్రాయెలీ బందీలు హమాస్ వద్ద ఉండడం.. ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ వ్యతిరేకతకు ఆజ్యం పోస్తోంది.

హమాస్‌ను నాశనం చేయాలన్న కష్టతరమైన లక్ష్యం కంటే, హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు ప్రధాని నెతన్యాహు ప్రాధాన్యం ఇవ్వాలంటూ బందీల కుటుంబ సభ్యులు, బంధువుల నిరసనలు కొనసాగుతున్నాయి. దానికి తోడు యుద్ధ వ్యతిరేక ఉద్యమం కూడా నెమ్మదిగా మొదలైంది. ఇటీవలి కాలంలో అత్యంత తీవ్రమైన, విధ్వంసక సైనిక చర్యతో గాజాకి జరిగిన నష్టాన్ని చూసి యుద్ధంపై భయాందోళన వ్యక్తమవుతోంది.

చాలా మంది ఇజ్రాయెల్‌ను సమర్థిస్తున్నారు కానీ, ప్రధాన మంత్రిని కాదు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, యుద్ధం ముగిసిన తర్వాత ప్రస్తుత పాలకులు పదవిలో ఉంటారని కేవలం 15 శాతం మంది మాత్రమే భావిస్తున్నారు.

ఈ యుద్ధం ఎలా ముగుస్తుందనే విషయంలో ఇజ్రాయెల్, దాని పశ్చిమ మిత్రదేశాల మధ్య అసమ్మతి పెరుగుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడిన తర్వాత, ప్రత్యేక దేశంగా పాలస్తీనా ఏర్పాటును మరోసారి ఇజ్రాయెల్ ప్రధాని తిరస్కరించారు.

''జోర్డాన్‌కు నదికి పశ్చిమ ప్రాంతమంతా ఇజ్రాయెల్ నియంత్రణలో ఉండాలి'' అని గతంలో ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. అంటే, ఇజ్రాయెల్ ఆక్రమిత్ వెస్ట్ బ్యాంక్ కూడా ఇందులోనే ఉంటుందని దానర్థం.

తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచీ పాలస్తీనా ఏర్పాటును నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు నెతన్యాహు. కానీ, అదే విషయాన్ని పదేపదే నొక్కిచెప్పడం ద్వారా, క్రమంగా ప్రజాదరణ కోల్పోతున్న ప్రధాన మంత్రి దేశంలో మెజార్టీ ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

రాజకీయ మనుగడ కోసం ఆయన చేస్తున్న పోరాటం ఇజ్రాయెల్ - మిత్రదేశాల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. ఈ రక్తపాతం 'టూ స్టేట్ సొల్యూషన్ - రెండు దేశాల ఏర్పాటు' దిశగా దౌత్యపరమైన మార్గాలను అనుసరించేందుకు ఇరుదేశాలను పురిగొల్పుతుందని భావించి మిత్రదేశాలు విసిగిపోయాయి.

నెతన్యాహు వైఖరి నిరాశపరిచిందని యూకే రక్షణ కార్యదర్శి గ్రాంట్ షాప్స్ గతంలో బీబీసీతో చెప్పారు. అలాగే టూ స్టేట్ సొల్యూషన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి వేర్వేరుగా ఉందని వైట్‌హౌస్ కూడా పేర్కొంది.

పాలస్తీనా ఏర్పాటును తిరస్కరించడం సరైనది కాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ''ఇది ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిన ఘర్షణను మరింత కాలం పొడిగించేందుకు కారణమవుతుంది'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)