You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘సానియా మీర్జాయే షోయబ్ మలిక్ నుంచి విడాకులు తీసుకుంది’.. స్పష్టం చేసిన తండ్రి ఇమ్రాన్ మీర్జా
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మలిక్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకోవడం, ఆ ఫొటోలను ఆయన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో ఆయన వైవాహిక బంధం ముగిసినట్లు స్పష్టమైంది.
అయితే, వీరిద్దరూ విడాకులు తీసుకున్నారా లేదా అనేది సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.
ఈ నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
తన కుమార్తె సానియా మీర్జా షోయబ్ మలిక్ నుంచి ‘ఖులా’ తీసుకున్నట్లు ఆయన పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు.
ఇస్లాంలో ఖులా అంటే భార్య తన ఇష్టపూర్వకంగా భర్త నుంచి విడాకులు తీసుకోవడం.
సనా జావెద్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందే షోయబ్ మాలిక్, సానియా మీర్జాలు విడిపోయారని ఆయన స్పష్టం చేశారు.
సానియా, షోయబ్‌లకు 5 ఏళ్ల బాబు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షోయబ్ మలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లోనే వీరి వివాహం జరిగింది.
షోయబ్ మలిక్‌తో వివాహానికి ముందు, సానియా మీర్జా తన చిన్ననాటి స్నేహితుడు సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్థం చేసుకున్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల సోహ్రాబ్-సానియాల నిశ్చితార్థం రద్దయింది.
అయితే, షోయబ్, సానియా మీర్జాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
సానియా, షోయబ్‌లకు ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు.
పెళ్లి, విడాకులు అనే అంశంపై గత బుధవారం సానియా మీర్జా తన ఇన్ స్టా అకౌంట్‌లో ఒక పోస్టు పెట్టారు.
పెళ్లి, విడాకులు అనేవి చాలా కష్టమైన విషయాలని, కానీ మనం ఎప్పుడూ కష్టమైన పనులను ఎంచుకోవాల్సి ఉంటుందని సానియా తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
దీంతో షోయబ్, సానియాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయి ఉంటాయని, వారిద్దరూ విడాకులు కూడా తీసుకుని ఉంటారని ఈ పోస్ట్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది యూజర్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సనా జావెద్ ఎవరు?
సనా జావేద్ పాకిస్తానీ నటి. ఉర్దూ టెలివిజన్‌లో ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లో నటించారు. ఆమె 2012లో షెహర్-ఎ-జాత్‌తో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు.
రొమాంటిక్ డ్రామా ఖానీలో టైటిల్ రోల్ పోషించిన తర్వాత ఆమె గుర్తింపు పొందారు. ఆమె లక్స్ స్టైల్ అవార్డ్స్‌లో నామినేషన్ కూడా అందుకున్నారని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
ఆమె నటించిన రుస్వాయి, డంక్ సోషల్ డ్రామాలు ప్రశంసలు అందుకున్నాయి.
2020లో పాకిస్తానీ నటుడు, గాయకుడు-గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.
కొన్నిరోజుల తర్వాత విడిపోయారని సియాసత్ పత్రిక తెలిపింది. సనా,ఉమైర్‌లు తాము కలిసి ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించారని కూడా హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.
సోషల్ మీడియాలో విమర్శలు
షోయబ్ మరో పెళ్లిపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతుంటే, అధిక సంఖ్యలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
షోయబ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై అజీజియ అనే అకౌంట్‌తో నెటిజన్ స్పందిస్తూ ''ఆ మహిళ మొత్తం దేశాన్ని వ్యతిరేకించి నిన్ను పెళ్లి చేసుకుంది. జనం ఆమె జాతీయ నిబద్దతను ప్రశ్నించారు. రకరకాల పేర్లు పెట్టారు. ఆమెపై విషం కక్కారు. కానీ, నువ్వు ఆమెను మోసం చేశావు. వావ్ మ్యాన్.. వావ్ మెన్'' అని కామెంట్ పెట్టారు.
''అసలేంటిది.. ఇప్పుడు జరిగింది నమ్మలేకపోతున్నా!!'' అని హీబా అర్మన్ అనే నెటిజన్ కామెంట్ చేశారు.
ఇక మరో సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో #ShoaibMalik, #Divorce, #SaniaMirza ట్యాగ్ లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)