You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హమాస్ లీడర్ సలేహ్ అల్ అరూరీ: బేరూత్ బాంబు దాడిలో చనిపోయిన ఈ నాయకుడి చరిత్ర ఏంటి?
- రచయిత, జెరూసలేం నుంచి షైమా ఖలీల్, లండన్ నుంచి అలీ అబ్బాస్ అహ్మదీ
- హోదా, బీబీసీ న్యూస్
హమాస్ అధికార క్రమంలోని అత్యంత సీనియర్ వ్యక్తుల్లో సలేహ్ అల్ అరూరీ ఒకరు. హమాస్ రాజకీయ, మిలిటరీ దళాలకు ఆయన నాయకుడు.
హమాస్ పొలిటికల్ బ్యూరోకు 57 ఏళ్ల సలేహ్ అల్ అరూరీ డిప్యూటీ హెడ్‌గా పనిచేశారు. అలాగే హమాస్ మిలిటరీ వింగ్ అయిన ‘ఇజ్దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్’ను స్థాపించడంలో ఆయన సాయపడ్డారు.
హమాస్ మిలిటరీ వ్యవహారాల్లో అరూరీ పాత్ర చాలా లోతైనది. ఆ పాత్రలోనే ఆయన కీలకంగా వ్యవహరించారు.
బేరూత్‌లో జరిగిన ఒక పేలుడులో సలేహ్ అల్ అరూరీ మరణించారు. ఇది ఇజ్రాయెల్ చేసిన దాడిగా ఆరోపిస్తున్నారు.
1987లో హమాస్‌లో చేరిన సలేహ్ అల్ అరూరీ, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ ఏర్పాటుకు కృషి చేశారు.
లెబనాన్‌లో ఇరాన్, ఇరాక్ మద్దతు ఉన్న హెజ్బొల్లాకు అత్యంత సన్నిహితులైన హమాస్ అధికారుల్లో సలేహ్ ఒకరు.
అతను ఇజ్రాయెల్ జైళ్లలో కూడా శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఒక ఒప్పందానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు.
ఈ ఒప్పందం ప్రకారం, 2011లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ విడుదలకు బదులుగా వెయ్యి మందికి పైగా పాలస్తీనా ఖైదీలను జైళ్ల నుంచి విడిపించారు.
2023 అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ఆర్మీ, అరురా పట్టణంలో సలేహ్‌కు చెందిన వెస్ట్‌బ్యాంక్ ఇల్లును ధ్వంసం చేసింది.
సలేహ్ అల్ అరూరీ మరణించే సమయంలో లెబనాన్‌లో నివసిస్తున్నారు.
ఉత్తర బేరూత్‌లోని హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో సలేహ్ అల్ అరూరీతో పాటు మరో ఆరుగురు హమాస్ సభ్యులు మరణించినట్లు లెబనాన్ మీడియా పేర్కొంది.
ఎవరు చనిపోయారన్నది కాదు ఎక్కడ ఆయనను చంపారన్నదే ఇక్కడ ముఖ్యం.
హెజ్బొల్లా కోట అయిన లెబనాన్‌లో ఒక సీనియర్ హమాస్ అధికారి చనిపోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మరింత ప్రమాదకరంగా మారుతుంది.
ఈ హత్యను ఇజ్రాయెల్ చేసిన కొత్త యుద్ధ నేరంగా లెబనాన్ తాత్కాలిక ప్రధానమంత్రి నజీబ్ మికాటి అభివర్ణించారు. ఇది లెబనాన్‌ను కూడా యుద్ధంలోకి లాగడానికి ఇజ్రాయెల్ చేసిన పనిగా ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ దాడిని లెబనాన్ సార్వభౌమత్వం, భద్రత, తమ ప్రజలపై జరిగిన తీవ్ర దాడిగా హెజ్బొల్లా పేర్కొంది.
ఇదొక పిరికిపంద చర్య అని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఇజ్జత్ అల్ రిష్క్ అన్నారు.
ఈ అంశంపై ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. విదేశీ మీడియాలో వచ్చే అంశాలపై తాము స్పందించబోమని బీబీసీకి తెలిపింది.
విదేశీ గడ్డపై టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్నట్లుగా ఇజ్రాయెల్ మీద విస్తృతంగా వార్తలు వచ్చాయి. కానీ, సరిహద్దు దాడుల మీద ఇజ్రాయెల్ చాలా అరుదుగా స్పందిస్తుంది.
ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సలహాదారు మార్క్ రెగెవ్ మాట్లాడుతూ హమాస్ నాయకత్వంపై జరిగిన సర్జికల్ స్ట్రైక్ అని పేర్కొన్నారు. అంతేగానీ ఆ దాడికి ఇజ్రాయెల్‌దే బాధ్యత అని చెప్పలేదు.
ఇప్పుడు హెజ్బొల్లా ఎలా స్పందిస్తుంది? గాజాలో ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధం లెబనాన్‌లోకి చొచ్చుకుపోతుందా? అనే అంశాలపై అందరూ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: పుంజుది దక్షిణ అమెరికా.. పందెం గోదావరి జిల్లాలో
- ‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసే మహిళ
- కాళేశ్వరం ప్రాజెక్ట్: తెలంగాణ మంత్రుల పర్యటనతో తేలిందేమిటి... కుంగిన మేడిగడ్డ బరాజ్ పియర్లను ఏం చేస్తారు?
- 6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)