కేసీఆర్, రేవంత్‌ రెడ్డి, ఈటల అక్కడ ఎలా ఓడిపోయారంటే...

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిట్టింగ్ స్థానం గజ్వేల్‌లో గెలుపొందగా, కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు.

కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఇది రెండోసారి.

1983లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మదన్ మోహన్ చేతిలో ఓడిపోయారు.

ఇప్పుడు కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కె.వెంకట రమణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.

కేసీఆర్‌తో దశాబ్దాల పాటు ప్రయాణం చేసిన ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్‌లో ఆయనపై పోటీకి దిగారు. ఈటలపై కేసీఆర్ 45,031 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

కామారెడ్డిలో కేసీఆర్‌పై కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు.

కామారెడ్డి ఫలితం రౌండ్ రౌండ్‌కూ చాలా ఆసక్తికరంగా మారుతూ వచ్చింది. ఆ స్థానం చివరకు బీజేపీ ఖాతాలో చేరింది. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓడిపోయారు.

కామారెడ్డిలో మొత్తం 19 రౌండ్లు. అక్కడ బీజేపీ అభ్యర్థి కె. వెంకట రమణారెడ్డి 6,741 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ మీద గెలిచారు.

బీజేపీకి 66,652 ఓట్లు, కేసీఆర్‌కు 59,911 ఓట్లు, రేవంత్ రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి.

హైప్రొఫైల్ అభ్యర్థులు బరిలోకి నిలవడంతో గజ్వేల్, కామారెడ్డి స్థానాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

గజ్వేల్ 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే, కేసీఆర్ 1,25,444 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. ఇక్కడ మొత్తం 2,33,260 మంది ఓటర్లు ఉండగా, టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీకి 60.45 శాతం ఓట్లు దక్కాయి.

కాంగ్రెస్ నుంచి పోటీచేసిన వి.ప్రతాప్ రెడ్డి 67,154 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌కు 32.36 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో బీజేపీ నుంచి పోటీచేసిన ఆకుల విజయ డిపాజిట్ కూడా కోల్పోయారు.

ఇక కామారెడ్డి విషయానికొస్తే, టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ (68,167) గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ షబ్బీర్ అలీ 63,610 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి.

కేసీఆర్‌పై పోటీకి కామారెడ్డి నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి, గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా ఈసారి బరిలో నిలిచారు.

కొడంగల్‌లో రేవంత్ రెడ్డి 32,532 ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మీద గెలిచారు.

రేవంత్ రెడ్డికి లక్షా 7,429 ఓట్లు రాగా, నరేందర్ రెడ్డికి 74,897 ఓట్లు పోలయ్యాయి.

కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

2018 ఎన్నికల్లో కొడంగల్‌లోకాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మీద టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలుపొందారు. 9,319 ఓట్ల తేడాతో రేవంత్ రెడ్డికి ఓడిపోయారు.

కొడంగల్‌లో మొత్తం ఓటర్లు 2,01,941 మంది కాగా, టీఆర్‌ఎస్‌కు 48.78 శాతం అంటే 80,754 ఓట్లు పోలయ్యాయి.

రేవంత్ రెడ్డి 71,435 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

హరీశ్ రావు

అధికార పార్టీ నుంచి కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు పోటీ చేసిన నియోజకర్గాల ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది.

ఈ ఎన్నికల్లో సిద్ధిపేట సిట్టింగ్ అభ్యర్థి హరీశ్ రావు 82,308 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

హరీశ్‌కు మొత్తం 1,05,514 ఓట్లు రాగా, కాంగ్రెస్ నాయకుడు పూజల హరికృష్ణకు 23,206 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ నేత డి.శ్రీకాంత్ రెడ్డికి 23,201 ఓట్లు వచ్చాయి.

2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్ రావు లక్షా 18 వేల 699 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

సిద్ధిపేటలో ఓటర్ల సంఖ్య 2,09,410. హరీశ్ రావుకు లక్షా 31 వేల 295 ఓట్లు (78.59%) పోలవ్వగా, రెండో స్థానంలో నిలిచిన టీజేఎస్ అభ్యర్థి ఎం.భవానికి 12,596 ఓట్లు (7.54%) దక్కాయి. బీజేపీ అభ్యర్థి నాయిని నరోత్తమ్ రెడ్డికి 11 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

కేటీఆర్

సిరిసిల్లలో మొత్తం 21 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది.

కేటీఆర్ 29,687 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై గెలుపొందారు.

కేటీఆర్‌కు మొత్తం 89,244 ఓట్లు పోలవ్వగా, మహేందర్ రెడ్డికి 59,557 ఓట్లు వచ్చాయి.

బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డికి 18,328 ఓట్లు పోలయ్యాయి.

సిరిసిల్ల నియోజకవర్గం నేపథ్యాన్ని చూస్తే 2009 నుంచి బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ అక్కడ గెలుస్తున్నారు.

2009 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పటి నుంచి 2010 ఉపఎన్నిక సహా 2018 వరకు వరుసగా నాలుగుసార్లు కేటీఆర్ ఇక్కడ నుంచి గెలిచారు.

న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న కేకే మహేందర్ రెడ్డి 2009 నుంచి మూడు సార్లు కేటీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2009లో, 2010 ఉప ఎన్నికలలో 2018లో ఆయన కాంగ్రెస్ నుంచి ఇక్కడ పోటీ చేశారు.

2009లో కేటీఆర్ తొలిసారి ఇక్కడ పోటీ చేసినప్పుడు కేకే మహేందర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికలలో కేవలం 171 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

అయితే, 2018 ఎన్నికలకు వచ్చేనాటికి కేటీఆర్ మెజారిటీ భారీగా పెరిగింది.

2018 ఎన్నికలలో కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ 89,009 ఓట్ల తేడాతో గెలిచారు.

ఈటల రాజేందర్

హుజురాబాద్‌లో ఫేవరెట్‌గా బరిలోకి నిలిచిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ 16,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి 80,333 ఓట్లు, ఈటలకు 63,460 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి వి. ప్రణవ్ 53,164 ఓట్లు సాధించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రి, ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించిన ఈటల రాజేందర్, కొద్దికాలం కిందట కేసీఆర్‌తో తలెత్తిన విభేదాలతో బీజేపీలో చేరారు.

ఇప్పుడు బీజేపీ నుంచి గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేశారు. అలాగే తన సిట్టింగ్ స్థానం హుజురాబాద్‌ నుంచి ఈటల బరిలోకి దిగారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి రెండు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచిన ఏకైక అభ్యర్థి ఈటల రాజేందర్.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన ఈటెల రాజేందర్ 43 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలి. బీఆర్ఎస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో సుదీర్ఘ కాలంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాజేందర్ గెలిచారు.

ఇప్పుడు హుజూరాబాద్, గజ్వేల్ రెండు చోట్లా ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)