యూఏఈ అణు కేంద్రంపై ఇరాన్ దాడి, ఖండించిన భారత్.. ఈ ప్లాంట్ ఎందుకంత ముఖ్యం?

ఫొటో సోర్స్, adel SENNA/AFP via Getty Images
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని బరాకా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని భారత్ ఖండించింది.
"ఇలాంటి చర్యలు అంగీకరించదగ్గవి కావు, ఉద్రిక్తతలను పెంచుతాయి. తక్షణమే సంయమనం పాటించాలి. చర్చలకు, దౌత్యానికి రావాలని పిలుపునిస్తున్నాం" అని భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అబుదాబిలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రంపై ఆదివారం రాత్రి డ్రోన్ దాడి జరిగిందని అబుదాబి ప్రభుత్వ మీడియా కార్యాలయం కూడా పేర్కొంది.
అయితే, ఈ దాడిని ఎవరు చేశారన్నది మాత్రం యూఏఈ వెల్లడించలేదు.
యూఏఈ విదేశాంగ శాఖ తన ప్రకటనలో ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఏదైనా ముప్పు ఏర్పడితే లేదా శత్రువు దాడి చేస్తే స్పందించడానికి దౌత్య, సైనిక హక్కులు తమకు ఉన్నాయని ఆ దేశం స్పష్టం చేసింది.

పశ్చిమ సరిహద్దు నుంచి యూఏఈలోకి ప్రవేశించిన ఒక డ్రోన్, దఫ్రా ప్రాంతంలోని బరాకా అణు విద్యుత్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుందని యూఏఈ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
దాడి అనంతరం విద్యుత్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
''అల్ దఫ్రా ప్రాంతంలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సరిహద్దు వెలుపల ఉన్న పవర్ జనరేటర్లో జరిగిన అగ్నిప్రమాదానికి అబుదాబి అధికారులు తక్షణమే స్పందించారు" అని ప్రభుత్వ మీడియా కార్యాలయం జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
''ఈ అగ్నిప్రమాదం డ్రోన్ దాడి కారణంగా సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రేడియోలాజికల్ భద్రతా స్థాయిలకు కూడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఆందోళన వ్యక్తం చేసిన సౌదీ అరేబియా, ఐఏఈఏ
ఈ ఘటనపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని బీబీసీ పర్షియన్ పేర్కొంది.
యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్‌తో ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ఫోన్లో మాట్లాడి, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
ఇటీవల ఇరాన్, యూఏఈ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత.. ఇరాన్ తమ పౌరులకు చెందిన భవనాలు, కార్యాలయాలపై 3 వేలకు పైగా దాడులు చేసిందని యూఏఈ శుక్రవారం పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో యూఏఈ చురుకైన పాత్ర పోషిస్తుందని ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు.
అయితే, ఎమిరేట్స్‌లోని అమెరికా, ఇజ్రాయెల్‌లతో సంబంధం ఉన్న సైనిక స్థావరాలు, సంస్థలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ చెప్పింది.
యూఏఈ అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడిని సౌదీ అరేబియా కూడా ఖండించింది.
యూఏఈపై జరిగిన డ్రోన్ దాడిని తమ దేశం తీవ్రంగా ఖండిస్తుందని సౌదీ అరేబియా తన ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, enec.ae
బరాకా విద్యుత్ కేంద్రం ఎంత ముఖ్యమైంది?
ఖతార్, సౌదీ అరేబియా సరిహద్దుకు సమీపంలో, యూఏఈ వాయువ్య ఎడారిలోని అల్ దఫ్రా ప్రాంతంలో బరాకా అణు విద్యుత్ కేంద్రం ఉంది.
దక్షిణ కొరియా విద్యుత్ కంపెనీ సహకారంతో ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్‌కు చెందిన ఒక గ్రూప్ ఈ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
యూఏఈ ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. బరాకా ప్లాంట్ ఫోర్ ఏపీఆర్1400 డిజైన్ న్యూక్లియర్ రియాక్టర్లు వార్షికంగా 40 టెరావాట్ అవర్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం యూఏఈ విద్యుత్ అవసరాల్లో ఇది 40 శాతం.
యూఏఈలో విద్యుత్ ఉత్పత్తికి అతిపెద్ద వనరు బరాకా విద్యుత్ కేంద్రమే. ఇక్కడ ఉత్పత్తి చేసే ప్రతి మెగావాట్ విద్యుత్ కూడా కార్బన్ రహితమైనదే.
దేశం తన ఇంధన అవసరాలకు కొత్త వనరులవైపు మళ్లుతున్న సమయంలో ఈ ప్లాంట్ ఒక కీలక భాగం. ఇది పరిశ్రమలకు, గృహాలకు, వ్యాపారాలకు, ప్రభుత్వ సౌకర్యాలకు స్వచ్ఛమైన, సమర్థవంతమైన ఎనర్జీని అందిస్తూ.. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కంపెనీ వెబ్సైట్ ప్రకారం, బరాకా అణు విద్యుత్ కేంద్రం ప్రతి సంవత్సరం సుమారు 22.4 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి వెళ్లకుండా సాయపడుతుంది. ఇది 48 లక్షల కార్లను వాడకుండా ఆపేయడంతో సమానం.
ఇటీవలి యుద్ధంలో మధ్యప్రాచ్యంలోని అనేక అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి.
బుషెహర్ అణు విద్యుత్ కేంద్రాన్ని కనీసం నాలుగు క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నారని ఐఏఈఏకు తెలిపింది ఇరాన్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























