తొమ్మిది ఏనుగుల బరువుండే డైనోసార్.. పేరు నాగటైటాన్

డైనోసార్, థాయ్‌లాండ్, ఆసియా, జీవవైవిధ్యం

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, విక్కీ వోంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

థాయిలాండ్‌ తవ్వకాల్లో లభించిన అవశేషాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఇటీవల ఓ కొత్త రకం డైనోసార్‌ను గుర్తించారు. ఈ డైనోసార్ మెడ చాలా పొడవుగా ఉంటుంది.

దక్షిణాసియాలో గుర్తించిన వాటిలో ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద డైనోసార్.

దీని బరువు 27 టన్నులుంటుంది. ఇది తొమ్మిది ‘ఆసియా ఏనుగు’ల బరువుతో సమానం.

88 అడుగుల పొడవుంటుంది.

ఇది డిప్లోడోకస్(పొడవు మెడ, పొడవు తోక ఉండే పెద్ద డైనోసార్)కంటే పొడవైనది. దానిలానే పొడవాటి మెడ ఉండే శాకాహారి సౌరోపాడ్ కుటుంబానికి చెందినది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డైనోసార్ పేరు నాగటైటాన్ ఎందుకంటే...

దాదాపు పదేళ్ల క్రితం ఈశాన్య థాయ్‌లాండ్‌లో ఓ చెరువు పక్కన దొరికిన శిలాజాలను పరిశోధించి థాయ్‌లాండ్, అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం ఈ జాతిని గుర్తించింది.

పురాతకాలంలోని వాతావరణ మార్పులు భారీ డైనోసార్లు అభివృద్ధి చెందడానికి ఎలా కారణమయ్యాయో ఈ ఆవిష్కరణ తెలియజేస్తుందని వారు అంటున్నారు.

ఈ డైనోసార్ మొత్తం పేరు నాగటైటాన్ చయ్యాఫుమెన్సిస్. ఇందులో ''నాగ'' అన్నది దక్షిణ-తూర్పు ఆసియా జానపద కథల్లో సర్పానికి సంకేతం. ''టైటాన్'' అన్నది గ్రీకు పురాణాల్లో కనిపించే దేవతలను సూచిస్తుంది. చయ్యాఫుమెన్సిస్ అనేది శిలాజాలను గుర్తించిన ప్రావిన్స్ ''చయ్యాఫుమ్''కు చెందినదని అర్ధం.

ఈ డైనోసార్ వంద నుంచి 12 కోట్ల సంవత్సరాల క్రితం జీవించింది. అంటే టైరానోసారస్ రెక్స్ కంటే 4 కోట్ల సంవత్సరాలకు ముందు.

టైరానోసారస్ రెక్స్(మాంసం తినే భారీ డైనోసార్) కంటే ఈ డైనోసార్ పరిమాణం రెండింతలు ఎక్కువ ఉంటుంది.

యూనివర్శిటీ కాలేజ్ లండన్(యూసీఎల్)కు చెందిన థాయ్ డాక్టోరల్ స్టూడెంట్ థిటివూట్ సెథాపానిచ్‌సాకుల్ ఈ అధ్యయానికి నేతృత్వం వహించారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఇది ప్రచురితమైంది.

డైనోసార్, థాయ్‌లాండ్, ఆసియా, జీవవైవిధ్యం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నాగటైటాన్ ముందు కాలి ఎముకతో డాక్టోరల్ స్టూడెంట్ థిటివూట్

థాయిలాండ్‌లో పేరు పెట్టిన 14వ డైనోసార్

థాయిలాండ్‌లో డైనోసార్ అవశేషాలున్న తాజా రాతి నిర్మాణంలో ఈ శిలాజాలను గుర్తించారు కాబట్టి నాగటైటాన్‌ను పరిశోధకులు థాయ్‌లాండ్ చివరి టైటాన్‌గా చెప్తారని ఆయన అన్నారు.

''డైనోసార్ల కాలం అంతమయ్యే సమయంలో ఏర్పడే రాతి నిర్మాణాల్లో డైనోసార్ల అవశేషాలుండవు. అప్పటికే ఆ ప్రాంతం అప్పటికే అగాధంలా మారిపోతుంది. అందుకే దక్షిణాసియాలో బహుశా మనం గుర్తించగలిగే చివరి, ఇటీవలి అతిపెద్ద సౌరోపాడ్ ఇదే అయ్యుండొచ్చు'' అని ఆయన అన్నారు.

సెథాపానిచ్‌సాకుల్ తనను తాను డైనోసార్ కిడ్ అని చెప్పుకుంటారు. ఓ డైనోసార్‌కు పేరు పెట్టాలన్న తన చిన్ననాటి కల కూడా దీనివల్ల నెరవేరిందని యూసీఎల్ పత్రికా ప్రకటనలో ఆయన అన్నారు.

థాయిలాండ్‌లో పేరు పెట్టిన 14వ డైనోసార్ నాగాటైటాన్. థాయ్‌లాండ్‌లో డైనోసార్ శిలాజాలకు సంబంధించిన వైవిధ్యం చాలా ఉందని మహాసరాఖమ్ యూనివర్శిటీకి చెందిన శిలాజ శాస్త్రవేత్త డాక్టర్ సీతా మనిట్‌కూన్ చెప్పారు. ఆసియాలో డైనోసార్ అవశేషాలు చాలా ఎక్కువ ఉన్నదేశం కూడా ఇదే కావొచ్చన్నారు.

డైనోసార్, థాయ్‌లాండ్, ఆసియా, జీవవైవిధ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థాయ్‌లాండ్ మ్యూజియంలో ఉంచిన నాగటైటాన్ మోడల్ డైనోసార్ అస్థిపంజరం

‘భారీ డైనోసార్లు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోయాయా?’

నాగటైటాన్ ఉన్న సమయంలో భూమి వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేవి.

ఆ సమయంలో సౌరోపాడ్‌ కుటుంబానికి చెందిన డైనోసార్లు బాగా పెద్ద పరిమాణంలో పెరిగాయని ఈ అధ్యయనం సహ రచయిత యూసీఎల్ ప్రొఫెసర్ పాల్ ఉప్‌చర్చ్ నేషనల్ జియోగ్రఫిక్ చానల్‌తో చెప్పారు. ''అంత అధిక ఉష్ణోగ్రతలను సౌరోపాడ్లు తట్టుకోగలగడం ఆశ్చర్యం కలిగిస్తుంది'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.