‘చదువైనా మానేస్తాం కానీ, హిజాబ్‌ను వదిలేయం’ అంటున్న ముస్లిం విద్యార్థినులు.. రాజస్థాన్‌లో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం

    • రచయిత, మొహర్ సింగ్ మీనా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“నేను హిజాబ్‌ను వదిలేయను, కావాలంటే చదువు మానేస్తాను. మేము ఈ స్కూలు నుంచి టీసీ( ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్) తీసుకొని వెళ్లడానికి కూడా సిద్ధం. అంతే కానీ హిజాబ్‌ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు” - పన్నెండో తరగతి చదువుతున్న కైనాత్ బీబీసీతో చెప్పిన మాట ఇది. హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ జైపుర్ పోలీస్ స్టేషన్‌ ఎదుట విద్యార్థినులతో కలిసి ఆమె ధర్నాలో పాల్గొన్నారు.

రాజస్థాన్‌ జైపుర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హిజాబ్ ధరించడంపై బీజేపీ ఎమ్మెల్యే బాల ముకుంద్ ఆచార్య చేసిన ప్రకటనతో ఈ అంశంపై చర్చ మొదలైంది. ఆయన ముస్లిం విద్యార్థినులతో ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేయించారని, హిజాబ్ గురించి వివాదాస్పద ప్రకటనలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

బాల ముకుంద్ ఆచార్య ప్రకటనలను వ్యతిరేకిస్తూ ముస్లిం బాలికలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలో లేవనెత్తాయి. హిజాబ్ మీద నిషేధం విధించాలని బీజేపీ నాయకులు ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారం గురించి నివేదిక అందించాలని రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖమంత్రి కిరోడి లాల్ మీనా కూడా రాష్ట్రంలో హిజాబ్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

వివాదం ఎలా మొదలైంది?

బీజేపీ ఎమ్మెల్యే బాల ముకుంద్ ఆచార్య క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన చేస్తామని ముస్లిం విద్యార్థులు హెచ్చరించారు.

జైపుర్‌లో సుభాష్ నగర్ ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం. సుభాష్‌నగర్‌లోని గవర్నమెంట్ గాళ్స్ హయ్యర్ సెకండరీ స్కూలులో జనవరి 27న స్కూలు వార్షికోత్సవాన్ని నిర్వహించారు.

“అంతా వీడియోలో ఉంది. నేను దీని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు” అని స్కూలు ప్రిన్సిపల్ రూబీ క్రిష్టి బీబీసీతో చెప్పారు.

“ఎమ్మెల్యే బాల ముకుంద్ ఆచార్యను స్కూలు వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచాం. బాలికలంతా స్కూలు డ్రస్‌లోనే వచ్చారు. కొంత మంది బాలికలు మొహానికి ముసుగు తొడుక్కున్నారు. మొహాన్ని కప్పుతూ స్కార్ఫ్ కట్టుకోవడాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారు. వార్షికోత్సవం ప్రశాంతంగా జరిగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు” అని ఆమె చెప్పారు.

“ఈ హిజాబ్ గోలేంటి? ఇక్కడేమైనా పెళ్లి జరుగుతోందా? హిజాబ్ వేసుకోవడం మానుకోండి. హిజాబ్ వేసుకుని మీరు ఈ వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. స్కూల్‌లో హిజాబ్ ధరించడం ఆపేయండి” అని ఎమ్మెల్యే బాల ముకుంద్ ఆచార్య ప్రిన్సిపల్‌తో చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

తనపై కుట్ర జరుగుతోందన్న బాల ముకుంద్

“స్కూలు డ్రెస్ విషయంలో విద్యార్థినులకు స్వేచ్ఛ ఇవ్వాలని మేం డిమాండ్ చేస్తున్నాం. కొంత మంది లంగా, చున్నీ వేసుకుంటారు. కొంత మంది సల్వార్ కమీజ్ ధరిస్తారు. ఇంకొంత మంది జీన్స్, టీ షర్ట్ వేసుకుంటారు. ఎవరిష్టం వచ్చిన డ్రెస్ వాళ్లు వేసుకుంటే అదొక ఫ్యాషన్‌షో అవుతుంది కానీ స్కూలు ఎలా అవుతుంది? ఫ్యాషన్‌ షో చేద్దామా, లేకపోతే ప్రభుత్వ నియమావళిని అమలు చేద్దామా’’ అని బాల ముకుంద్ ఆచార్య ప్రశ్నించారు.

స్కూళ్లలో అందరికీ ఒకే డ్రెస్ కోడ్ ఉండేలా చర్యలు చేపట్టాలని తాను విద్యాశాఖ మంత్రికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు.

ఈ అంశం గురించి ఏం జరిగిందో పూర్తి సమాచారం అందించాలని తాను అధికారులను కోరినట్లు విద్యశాఖ మంత్రి మదన్ దిలావర్ చెప్పారు.

పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థినుల ఆందోళన

ఎమ్మెల్యే బాల ముకుంద్ వీడియో బయటకు రాగానే జనవరి 29న వందల మంది ముస్లిం విద్యార్థినులు సుభాష్ నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

స్కూలు రెండు షిఫ్టుల్లో నడుస్తుందని స్కూలు ప్రిన్సిపల్ రూబీ క్రిస్టి చెప్పారు. “ఉదయం పది గంటల సమయంలో ఫస్ట్ షిఫ్ట్ లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు పిల్లలంతా బయటకు వెళ్లి తల్లిదండ్రులను పిలుచుకొచ్చారు. వాళ్లను ఆపేందుకు స్కూలులో టీచర్లు ప్రయత్నించారు. అయితే తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చెయ్యలేదు. ఆందోళన చేసిన తర్వాత వాళ్లంతా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు” అని డిప్యూటీ కమిషనర్ రాశి డోగ్రా చెప్పారు.

ఆందోళనలో పాల్గొన్నవాళ్లు స్కూలు విద్యార్థినులు కాదని, బయట నుంచి కొంత మందిని మభ్యపెట్టి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నట్లు ఎమ్మెల్యే బాల ముకుంద్ ఆచార్య చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమన్నారు?

జైపుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రఫీక్ ఖాన్ బాలికలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు.

బాల ముకుంద్ ఆచార్యపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాల ముకుంద్ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

“బాబా (బాల ముకుంద్ ఆచార్య) సమస్య హిజాబ్ కాదు. విద్వేష పూరిత రాజకీయాల ద్వారా ఆయన హెడ్‌లైన్స్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లలతో బలవంతంగా జైశ్రీరామ్ అని నినాదాలు ఇప్పించారు. రాముడి పేరు తీయడం ద్వారా వారు పిల్లల్లో భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించాలని అనుకుంటున్నారు” అని రఫీక్ ఖాన్ బీబీసీతో చెప్పారు.

రఫీక్‌ఖాన్ వ్యాఖ్యలపై స్పందిచిన బాల ముకుంద్ ఆచార్య, “ఆయనలో జిన్నా దయ్యం ఉంది. అలాంటి దయ్యాలే భారత్‌ మాతాకి జై , వందేమాతం అని నినదించవద్దని చెబుతాయి. ఈ దయ్యాలు భారతదేశానికి, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాయి” అంటూ విమర్శలు గుప్పించారు.

ముస్లిం విద్యార్థినులు ఏమంటున్నారు?

10వ తరగతి వరకు గంగాపోల్‌లోని పాఠశాలలో చదివిన కైనత్‌ ఇప్పుడు మరో పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఆమె చెల్లెళ్లు అదే స్కూలులో చదువుతున్నారు.

“స్కూలులో వాళ్లు హిజాబ్ గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. విద్యార్థినులతో జై శ్రీరామ్ నినాదాలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. నా చెల్లెళ్లు కూడా చెప్పారు” అని కైనాత్ అన్నారు.

“మాకు ప్రత్యేక డ్రెస్ కోడ్ లేదు. మేము స్కూలు యూనిఫామ్‌ మీదనే హిజాబ్ ధరిస్తాం. సల్వార్ కమీజ్, దుపట్టా అంతా స్కూలు యూనిఫామే. ఇంటి నుంచి స్కూలుకు వెళ్లేటప్పుడు, స్కూలు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రమే బురఖా ధరిస్తాం’’ అని ఆమె చెప్పారు.

విద్యార్థినులకు మద్దతుగా బాలల కమిషన్

రాజస్థాన్ బాలల కమిషన్ ఛైర్‌పర్సన్ సంగీతా బెనివాల్, ఈ విషయంలో ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా నిలిచారు.

“నేను పూర్తిగా పిల్లలకు మద్దతిస్తాను. హిజాబ్ ధరించడం వల్ల వాళ్లకు భద్రత ఉంటుందని భావిస్తే వాళ్లు కచ్చితంగా అది ధరించవచ్చు” అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఈ అంశం గురించి నివేదిక సమర్పించాలని అధికారులను బాలల కమిషన్ ఆదేశించింది.

హిజాబ్‌ను నిషేధించాలని డిమాండ్

హిజాబ్ వివాదం మొదలైన తర్వాత బీజేపీ నేతల్లో అనేక మంది బాల ముకుంద్ ఆచార్యకు అండగా నిలుస్తున్నారు.

“మదర్సాలో పిల్లలు ఎలాంటి డ్రెస్‌కోడ్ వేసుకుంటున్నారనే దానిపై మేం ప్రశ్నలు లేవనెత్తడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ నియమావళి ప్రకారం డ్రెస్ వేసుకోవాలనే మేము అడుగుతున్నాం” అని మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్, బీజేపీ నేత సుమన్ శర్మ చెప్పారు.

“స్కూళ్లలో ప్రభుత్వం చెప్పిన డ్రెస్‌కోడ్ మాత్రమే ధరించాలి. ఓ బాలిక హిజాబ్ ధరించి స్కూలుకు వెళ్లిందంటే ఆ స్కూలులో క్రమశిక్షణ లేనట్లే. హిజాబ్‌ను అనేక దేశాల్లో నిషేధించారు. స్కూళ్లలో హిజాబ్ ధరించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదు” అని రాజస్థాన్ వ్యవసాయ శాఖమంత్రి కిరోడిలాల్ మీనా ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా, ప్రైవేట్ స్కూళ్లు, మదర్సాలలో కూడా హిజాబ్‌ను నిషేధించాలన్నారు.

బాల ముకుంద్ ఆచార్య ఎవరు?

జైపుర్‌లోని హథోజ్‌దామ్ మహంత్‌గా ఉన్న బాల ముకుంద్ ఆచార్య తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ‌ఇటీవలి ఎన్నికల్లో ఆయన జైపుర్‌లోని హవా మహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 974 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ఆయన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యక ముందే ఆయన వీధుల్లోకి వచ్చి మటన్ దుకాణాలను మూసివేయించారు. అప్పుడు కూడా ఆయన దుకాణాల యజమానులు, పోలీసులతో వాదనకు దిగారు.

కోర్టు ఆదేశాలతో ఇటీవల ఆయనపై భూముల దురాక్రమణ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

బాల ముకుంద్ ఆచార్య పోలీసులతో వాదిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)