You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సల్మాన్ రష్దీ ఎవరు? ఇండియాలో జన్మించిన ఈ రచయిత సుదీర్ఘకాలం ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు
రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ నగరంలో దాడి జరిగింది. న్యూయార్క్‌లోని ఛౌటౌక్వా సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ దాడి జరిగింది.
ఐదు దశాబ్దాల సాహిత్య కెరీర్ ఉన్న ఈ రచయతకు చాలా సార్లు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.
రష్దీ రచనలు చాలా పాపులర్ అయ్యాయి. ఆయన రాసిన రెండో నవల మిడ్ నైట్స్ చిల్డ్రన్‌కు 1981లో బుకర్ ప్రైజ్ లభించింది.
ఆయన రాసిన నాలుగో నవల 'ది సాటానిక్ వెర్సెస్' (1988) వివాదాస్పదమైంది. ఈ నవల అంతర్జాతీయంగా కల్లోలాన్ని సృష్టించింది.
ఆ నవల తరువాత రష్దీని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు పోలీసు భద్రత కల్పించింది.
ఈ వివాదం నడుమ యూకే ఇరాన్‌తో దౌత్య సంబంధాలు తెంచుకుంది. పాశ్చాత్య దేశాల్లో రచయతలు, మేధావులు మాత్రం ముస్లిం దేశాల నుంచి భావ ప్రకటన స్వేచ్చకు ఎదురైన ముప్పును వ్యతిరేకించారు.
రష్దీ పుస్తకానికి వ్యతిరేకిస్తూ 1989లో ఇరాన్ నాయకుడు అయతొల్లా ఖొమేనీ ఫత్వాను జారీ చేశారు.
ముంబయిలో జన్మించి..
సల్మాన్ రష్దీ 1947లో ముంబయిలో జన్మించారు.
14 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ వెళ్లారు. కేంబ్రిడ్జ్‌లో కింగ్స్ కాలేజీ నుంచి హిస్టరీలో ఆనర్స్ డిగ్రీ సంపాదించారు.
ఆయన బ్రిటిష్ పౌరసత్వాన్ని తీసుకుని ముస్లిం మతాన్ని వదిలిపెట్టారు.
కొంతకాలం పాటు నటుడిగా కొనసాగి, తర్వాత నవలలు రాస్తూ ప్రకటనల రంగంలో కాపీ రైటర్‌గా పని చేశారు.
ఆయన మొదట గ్రైమస్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకానికి ఎక్కువ ఆదరణ లభించలేదు. కానీ, ఆయనను సమర్థుడైన రచయితగా కొంత మంది విమర్శకులు గుర్తించారు.
ఆయన రెండో పుస్తకం మిడ్ నైట్స్ చిల్డ్రన్ రాసేందుకు రష్దీకి ఐదేళ్లు పట్టింది. ఈ పుస్తకానికి విశేష ఆదరణ లభించడంతో పాటు 5 లక్షల కాపీలు అమ్ముడైంది.
ఇది భారతదేశానికి సంబంధించిన ఇతివృత్తంతో రాశారు.
1983లో ప్రచురితమయిన రష్దీ మూడో నవల షేమ్ పాకిస్తాన్‌కు సంబంధించింది. నాలుగేళ్ల తర్వాత ఆయన ‘ది జగౌర్ స్మైల్’ అనే పుస్తకం రాశారు. ఇది నికరాగ్వాలో ఒక ప్రయాణానికి సంబంధించింది.
1988 సెప్టెంబరులో ప్రచురితమైన 'ది సాటానిక్ వెర్సెస్' ఆయన జీవితానికి ముప్పులా మారింది.
ఈ నవల దైవదూషణ చేస్తోందని చాలా మంది ముస్లింలకు ఆగ్రహాన్ని తెప్పించింది.
ఈ పుస్తకాన్ని నిషేధించిన దేశాల్లో భారత్ మొదటిది. తర్వాత పాకిస్తాన్, మరిన్ని ముస్లిం దేశాలతో పాటు దక్షిణ ఆఫ్రికాలో కూడా ఈ పుస్తకాన్ని నిషేధించారు.
ఈ పుస్తకానికి చాలా చోట్ల ప్రశంసలు లభించి విట్‌బ్రెడ్ ప్రైజ్ గెలుచుకుంది. అదే సమయంలో, ఈ పుస్తకానికి వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఈ ప్రచురణకు వ్యతిరేకంగా నిరసనలు కూడా పెరగడం మొదలయింది.
కొంత మంది ముస్లింలు ఈ పుస్తకం ఇస్లాంను అవమానించిందని భావించారు. ఈ పుస్తకంలో ఇద్దరు వేశ్యలకు మహమ్మద్ ప్రవక్త భార్యల పేర్లు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఖురాన్‌లో మహమ్మద్ ప్రవక్త తొలగించిన రెండు పంక్తులను ఈ పుస్తకం టైటిల్‌గా పెట్టారు.
1989 జనవరిలో బ్రాడ్‌ఫోర్డ్‌లో ముస్లింలు ఈ పుస్తకం కాపీని దహనం చేశారు. పుస్తకాల విక్రయ ఏజెన్సీ డబ్ల్యూ హెచ్ స్మిత్ ఈ పుస్తకాన్ని ప్రదర్శనలో పెట్టడం మానేసింది. అయితే, రష్దీ మాత్రం దైవ దూషణ చేశారన్న ఆరోపణలను ఖండించారు.
అదే ఏడాది ఫిబ్రవరిలో రష్దీకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కొంత మంది మరణించారు. టెహ్రాన్‌లో బ్రిటిష్ రాయబార కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఆయనను పట్టి ఇచ్చిన వారికి 3 మిలియన్ డాలర్లు (రూ.23.89 కోట్లు) ఇస్తామని ప్రకటించారు.
మరో వైపు యూకేలో కొంత మంది ముస్లిం నాయకులు సహనం వహించాలని పిలుపునివ్వగా కొంత మంది మాత్రం ఆయతోల్లాను సమర్థించారు. అమెరికా, ఫ్రాన్స్, ఇతర పాశ్చాత్య దేశాలు చంపేస్తామని వచ్చిన బెదిరింపులను ఖండించాయి.
రష్దీ అజ్ఞాతంలో పోలీసు భద్రతలో ఉండేవారు. ఆయన వల్ల ముస్లింలు బాధపడటం గురించి ఆయన చింతించారు. కానీ, అయతొల్లా ఖొమేనీ మాత్రం ఆయనపై జారీ చేసిన మరణ ఫత్వాను వెనక్కి తీసుకోలేదు.
పుస్తక ప్రచురణకారులు వైకింగ్ పెంగ్విన్ లండన్ ఆఫీసును ముట్టడించారు. న్యూ యార్క్ ఆఫీసులో సిబ్బంది కూడా చంపేస్తామని బెదిరింపులు ఎదుర్కొన్నారు.
కానీ, పాశ్చాత్య దేశాల్లో ఈ పుస్తకం బాగా అమ్ముడయింది. యూరోపియన్ ఎకనామిక్ కమిటీలోని దేశాలు మాత్రం ముస్లిం స్పందనలకు వ్యతిరేకంగా ఎదురైన నిరసనలను సమర్ధించారు. ఈ దేశాలన్నీ టెహ్రాన్ నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించాయి.
జపాన్‌లోకి అనువదించిన హితోషీని చంపేశారు
ఈ పుస్తకంలో రాసిన విషయానికి బెదిరింపులు ఒక్క సల్మాన్ రష్దీకి మాత్రమే ఎదురవ్వలేదు.
ది సాటానిక్ వెర్సస్ ను అనువాదం చేసిన జపాన్ అనువాదకుడు హితోషీ ఇగరాషీను టోక్యోలో 1991లో దారుణంగా హత్య చేశారు. ఆయన కంపేరిటివ్ కల్చర్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారు.
అదే నెలలో ఇటాలియన్ అనువాదకులు ఎటోరె కాప్రియోలోను కూడా మిలాన్‌లో ఆయన అపార్ట్మెంట్ లో ఉండగా దాడి చేశారు. కానీ, ఆయన ఆ దాడి నుంచి తప్పించుకోగలిగారు.
చివరకు 1998లో రష్దీకి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం జారీ చేసిన మరణ శిక్షను నిలిపేశారు.
ఇవి కూడా చదవండి:
- కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- పాప్ స్మియర్: మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఈ టెస్ట్ వెనుక ప్రేమ కథ మీకు తెలుసా?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)