Iran: హిజాబ్ ధరించనందుకు అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రాణాలు కోల్పోయిన యువతి

    • రచయిత, రానా రహింపూర్
    • హోదా, బీబీసీ పర్షియన్ ప్రతినిధి

తలను పూర్తిగా కప్పుకోవాలన్న నియమాన్ని పాటించలేదన్న ఆరోపణలతో అరెస్టయిన 22 ఏళ్ల ఇరాన్ యువతి మహ్సా అమినీ ప్రాణాలు కోల్పోయారు.

మంగళవారం టెహ్రాన్‌లో అరెస్టయిన తరువాత అమినీని పోలీస్ వ్యాన్ ఎక్కించి తీవ్రంగా కొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే, పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. 'అమినీకి హఠాత్తుగా గుండెకు సంబంధించిన సమస్య ఏర్పడింది' అని పోలీసులు చెబుతున్నారు.

ఇరాన్‌లో ఇటీవల కాలంలో మహిళలపై అధికారుల కాఠిన్యానికి సంబంధించి ఇది తాజా ఉదాహణ.

అయితే, పోలీసులు చెబుతున్నది అవాస్తవమని అమినీ కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆకస్మికంగా గుండె సమస్య రావడానికి ఆమెకు అంతకుముందు ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదని అంటున్నారు వారు. అమినీ ఆరోగ్యవంతురాలని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

అమినీని అరెస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు కుటుంబసభ్యులకు అధికారుల నుంచి సమాచారం అందింది.

ఆ తరువాత శుక్రవారం ఆమె మరణించారు. మరణించడానికి ముందు ఆమె కోమాలో ఉన్నారని కుటుంబసభ్యులు చెప్పారు.

హిజాబ్ గురించి చైతన్యం కల్పించడం కోసం అమినీని అరెస్ట్ చేసినట్లు ఇరాన్ పోలీసులు చెప్పారు. ఆ దేశంలో మహిళలందరూ హిజాబ్ ధరించడం తప్పనిసరి.

ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించలేదన్న కారణం సహా అనేక కారణాలతో మహిళలపై అణచివేత చర్యలు ఇరాన్‌లో పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించకుండా ఇరాన్‌లో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలలోకి వీల్లేదు.

అమినీ మరణం కూడా ఇలాంటి నేపథ్యంలోనే జరగడంతో అక్కడ దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ అనుకూలురు సహా అనేకమంది ఇరానియన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గైడెన్స్ పెట్రోలింగ్‌గా పిలిచే ఈ మొరాలిటీ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు. చాలామంది మర్డర్ పెట్రోల్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు.

అధికారులు మహిళలను నేలపై ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నవి, కొడుతున్నవి వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

చాలామంది ఇరానియన్లు సుప్రీం లీడర్ అలీ ఖొమేనీపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇస్లామిక్ పాలనలో మహిళలు ఇస్లామిక్ డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని... మొరాలిటీ పోలీసుల పాత్ర సమర్థనీయమని ఖొమేనీ చెబుతున్నట్లుగా ఉన్న ఒక పాత ప్రసంగం క్లిప్‌ను ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)