You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శుక్రవారం ప్రార్థనలు ముస్లింలకు ఎందుకంత ప్రత్యేకం?
హరియాణా గుర్‌గ్రామ్‌లో బహిరంగంగా నమాజు చేయడం వివాదాస్పదం అవుతోంది. కొన్ని వారాల క్రితం శుక్రవారం రోజు బయట నమాజు చేయడంతో ఇది మొదలైంది.
హిందూ సంఘర్ష్ సమితి అనే హిందూ సంస్థ బహిరంగ ప్రాంతంలో నమాజు చేస్తున్న వారిని అక్కడ్నుంచి తరిమేసింది.
తర్వాత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బహిరంగ స్థలాల్లో నమాజు చేయడంపై స్పందించారు.
"కేవలం మసీదులు, ఈద్గాల్లో మాత్రమే నమాజు చేయాలని" హరియాణా ముఖ్యమంత్రి అన్నారు.
సీఎం చేసిన ఈ వ్యాఖ్యలను హిందూ సంఘర్ష్ సమితి స్వాగతించింది.
బహిరంగంగా నమాజు చదవడంపై నిషేధం విధించాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తోంది.
దీనికోసం ఆందోళనలు కూడా నిర్వహించింది.
ప్రతి వ్యక్తీ అల్లాను విశ్వసించడం, నమాజు చదవడంలోనే ఇస్లాం మతం పునాది ఉంటుంది.
ఇస్లాంలో ఐదుసార్లు నమాజు చదవడం తప్పనిసరి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.
ప్రయాణంలో కూడా ముస్లింలు నమాజు చదవడం తప్పనిసరి. కానీ ఆ సమయంలో నమాజు చేసే ప్రక్రియ తక్కువ సమయం ఉంటుంది.
ఉదాహరణకు సాధారణంగా నమాజు చేయడానికి 16 నిమిషాలు పడుతుందని అనుకుంటే, ప్రయాణంలో అది సగం మాత్రమే అంటే 8 నిమిషాలే ఉంటుంది.
నమాజు చేసే వారు పరిశుభ్రంగా (శరీరం నుంచి దుస్తుల వరకూ అపరిశుభ్రంగా ఉండకూడదు) ఉండడం తప్పనిసరి.
దీంతోపాటూ నమాజు చేసే ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలి.
అన్ని చోట్లా నమాజు చేయవచ్చా?
ఒక ముస్లిం ఎక్కడైనా నమాజు చేయవచ్చు. కానీ కచ్చితంగా అతడితోపాటూ ఆ ప్రాంతం శుభ్రంగా ఉండాలి.
ముస్లింలు నమాజు చేయకుండా అడ్డుకునే ప్రాంతం ఏదైనా ఉందా?
"షరియత్ (ఇస్లాం చట్టం) ప్రకారం భూమంతా శుభ్రమైనదే. ఎవరైనా ఎక్కడైనా నమాజు చదవచ్చు" అని ఇస్లాం మతపెద్ద మౌలానా అబ్దుల్ హమీద్ నౌమానీ చెప్పారు.
"ఏదైనా భూమిని అక్రమంగా కబ్జా చేసుంటే అలాంటి చోట నమాజు చదవకూడదు. కానీ ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే, దాన్ని ఎవరూ ఆక్రమించకుంటే అక్కడ నమాజు చదవచ్చు, కానీ ఆ ప్రాంతం శుభ్రంగా ఉండడం తప్పనిసరి" అని కూడా ఆయన చెప్పారు.
వేరే వ్యక్తుల స్థలంలో యజమానికి ఇష్టం లేనప్పుడు అక్కడ నమాజు చదవడాన్ని ఇస్లాం అంగీకరిస్తుందా అన్న ప్రశ్నకు నౌమానీ ఇలా సమాధానమిచ్చారు. "భూమి యజమాని అంగీకరించనపుడు షరియత్ ప్రకారం ఆ స్థలంలో నమాజు చదవకూడదు".
ప్రభుత్వ స్థలంలో నమాజు చదవచ్చా?
"ప్రభుత్వ భూమి లేదా ముందు నుంచీ ఎక్కడైనా నమాజు చదువుతుంటే.. అక్కడ నమాజు చేయవచ్చు" అని నౌమానీ వివరించారు.
జుమా ఎందుకు భిన్నంగా ఉంటుంది?
ఇస్లాంలో రోజుకు ఐదుసార్లు నమాజు చదవడం తప్పనిసరి. దీనిని ఐదు సమయాలుగా విభజించారు.
ఉదయం చేసే నమాజును ఫర్జ్, మధ్యాహ్నం నమాజును జుహ్ర్, సాయంత్రానికి ముందు అస్ర్, సాయంత్రం మగ్రిబ్, అర్థరాత్రికి ముందు చదివేది ఇషా నమాజు అంటారు.
కానీ ఈ ఐదు నమాజులకు శుక్రవారం రోజున ప్రత్యామ్నాయం ఉంటుంది. ఇస్లాంలో శుక్రవారం (జుమా) రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది.
ఈ రోజును ఒకరినొకరు కలుసుకునే రోజుగా చెప్పుకుంటారు. అలా తమ ఐకమత్యం చాటుకుంటారు.
అందుకే శుక్రవారం రోజున మధ్యాహ్నం నమాజు సమయంలో జుహ్ర్ నమాజు చేసే ప్రాంతంలో జుమా నమాజు జరుగుతుంది.
ఎవరైనా జుమా నమాజు చదవలేకపోతే, వారు జుహ్ర్ నమాజు చేయాల్సి ఉంటుంది.
జుమా నమాజులో మరో నియమం కూడా ఉంది. దీనిని అందరూ ఒకటిగా కలిసిమెలిసి చదవాల్సి ఉంటుంది.
దీనిని ఒంటరిగా చేయకూడదు. ఈ నమాజు సమయంలో ఖుత్బా ( మతపరమైన ప్రవచనం ) ఉంటుంది.
ఎవరైనా జుమా నమాజు చదవలేకపోతే?
"ఎవరైనా జుమా నమాజు చదవలేకపోతే, వారు జుహ్ర్ నమాజు చదవడం తప్పనిసరి అని నౌమానీ చెప్పారు. ఎందుకంటే ఇస్లాం ప్రకారం నమాజు చేయకుండా ఉండకూడదని" ఆయన తెలిపారు.
జుమా రోజుకు చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే జనం నమాజు చదవడానికి భారీగా వస్తారు. ఒక్కోసారి మసీదు నిండిపోతే రోడ్ల మీద కూడా నమాజు చేస్తారు. అయితే, ఈ రద్దీ కాసేపే ఉంటుందని అన్నారు.
ప్రభుత్వం అనుమతించకపోతే నమాజు గురించి షరియత్ ఏం చెబుతుంది?
"ఒక రాజు మొత్తం ప్రజలందరికీ రాజు అవుతారు. అందుకే వారికి మతపరమైన స్థలాలను సమకూర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అందరితో సమానంగా వ్యవహరించాల్సుంటుంది" అని నౌమానీ చెప్పారు.
"గురుగ్రామ్ లాంటి ప్రాంతాల్లో నమాజు చేయకుండా అడ్డుకోవడం వెనుకున్నది కూడా రాజకీయాలే" అని అన్నారు.
ఏదైనా చట్టపరమైన సమస్యలుంటే బహిరంగ ప్రాంతాల్లో నమాజు చేయకుండా ఆపవచ్చని కూడా ఆయన చెప్పారు. అలా లేనప్పుడు ప్రార్థనలను అడ్డుకోకూడదని ఆయన అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. )