You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
థగ్ లైఫ్ సినిమా రివ్యూ: సంగీతం, ఫొటోగ్రఫీ బాగున్నాయి.. మిగతావి?
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
కమల్‌హాసన్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో వచ్చిన థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
నాయకుడు తర్వాత కమల్, మణిరత్నంలు కలిసి పని చేశారు. 38 ఏళ్ల తరువాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో అంతటా ఆసక్తి ఏర్పడింది.
వీరికి తోడు శింబు, త్రిష, నాజర్, తనికెళ్ల భరణి లాంటి హేమాహేమీలున్నారు.
భారీ అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగిన ‘థగ్ లైఫ్’ అంచనాలను అందుకుందా, లేదా చూద్దాం.
కథ ఏంటంటే...
రంగరాయ శక్తిరాజు (కమల్), మాణిక్యం (నాజర్) అన్నదమ్ములు.
1994లో దిల్లీలో ఈ కథ మొదలవుతుంది. గ్యాంగ్‌స్టర్స్ మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు పోలీసులు దాడి చేస్తారు.
గల్లీలోని ఇళ్ల మధ్య జరిగిన దాడిలో ఒక పేపర్ బాయ్ చనిపోతాడు.
ఆయన కొడుకు అమర్(శింబు)ను శక్తిరాజ్ కాపాడి తమ్ముడిలా పెంచుకుంటాడు. అమర్ చెల్లెలు చంద్రిక ఈ గొడవలో విడిపోతుంది.
2016 నాటికి శక్తి ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్. సదానంద (మహేశ్ మంజ్రేకర్)తో ఘర్షణ ఉంటుంది.
మాణిక్యం కూతుర్ని సదానంద మేనల్లుడు మోసం చేస్తే అతన్ని శక్తి చంపేస్తాడు. శక్తి జైలుకెళుతూ తన స్థానంలో అమర్‌ని నియమిస్తాడు.
ఇది మాణిక్యం, ఇతరులకి నచ్చదు.
అమర్‌ని కూడా తమ వైపు తిప్పుకుని శక్తిని చంపేయాలనుకుంటారు. వాళ్ల ప్రయత్నం ఫలిస్తుందా?
శత్రువులుగా మారిన తన వాళ్లపై శక్తి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే మిగతా కథ.
థగ్ లైఫ్ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయంటే...
ఇలాంటి కథలు చాలా చూశామనుకుంటే తప్పు ప్రేక్షకులది కాదు. కథ, స్క్రీన్ ప్లేలో భాగస్తులైన కమల్, మణిరత్నంలదే.
ఏ మాత్రం కొత్తదనం లేకుండా ప్రతి సన్నివేశం ఊహకి అందేలా ఉండడమే థగ్ లైఫ్ ప్రధాన లోపం.
హీరోలు రైటింగ్‌లో చేయి కలిపితే నష్టం జరుగుతుంది. ఎంత సేపూ వాళ్ల ఎలివేషన్ చూసుకుంటారు తప్ప మిగతా పాత్రల్ని పట్టించుకోరు.
ఈ సినిమాలో కూడా అనేక క్యారెక్టర్లు ఉన్నా, ఒక్కరు కూడా రిజిస్టర్ కాదు. వాళ్లని గుర్తు పెట్టుకునే స్క్రీన్ స్పేస్ కూడా లేదు.
మణిరత్నం మార్క్ కనిపించిందా?
మణిరత్నం డిజాస్టర్ సినిమాల్లో కూడా క్యారెక్టరైజేషన్, ఎమోషన్ బలంగా ఉంటుంది.
థగ్‌లైఫ్ మనకి అసలు ఇది మణిరత్నం సినిమానేనా అని ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఫోటోగ్రఫీ, బీజీఎం, అక్కడక్కడ మెరిసే కొన్ని సీన్స్ ఇది మణిరత్నమే అని బలవంతంగా కుర్చీలో కూర్చోపెడతాయి.
ఆధిపత్యం, డబ్బు , పవర్ ఉన్నప్పుడు తప్పనిసరిగా అసూయ, అత్యాశ , మోసం, ద్రోహం కూడా ఉంటాయి.
సొంత తమ్ముడు కమల్‌హాసన్‌కు నాజర్ ద్రోహం చేయడానికి, తండ్రిలా పెంచిన వ్యక్తిని శింబు వెన్నుపోటు పొడవడానికి బలమైన సీన్స్ ఉంటే ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేవాళ్లు. వాళ్ల ప్రవర్తన వెనుక లోతు, గాఢత లేకపోతే ప్రేక్షకులు కనెక్ట్ కారు.
త్రిష పాత్ర ఎలా ఉంటుంది?
త్రిష అద్భుతమైన నటి. ఈ సినిమాలో ఆమె ఎందుకుందో అర్థం కాదు. కమల్‌హాసన్ ఆమె ప్రియుడు. భార్య అభిరామి ఉన్నప్పటికీ, కమల్ ఈమెతో కూడా ఉంటాడు. అయితే కథలో త్రిష వల్ల ఏ ఉపయోగమూ లేదు. ఇంత పేలవమైన పాత్రలో త్రిష నటించిందంటే, మణిరత్నంని కాదనలేక కావచ్చు.
కమల్‌కి తప్ప మిగతా ఎవరికీ నటించే అవకాశం లేదు. ఆయనే డైలాగ్‌లు చెబుతూ ఫైటింగ్‌లు చేస్తూ రొమాన్స్, ఎమోషన్స్ కూడా పండిస్తుంటాడు. శింబు పాత్రకు ఎంతోకొంత అవకాశం ఉన్నా, సన్నివేశాల్లో బలం లేకపోయేసరికి తేలిపోయింది.
సినిమాలో ఫస్టాఫ్, సెకెండాఫ్‌లో ఎక్కడా కనపడకుండ , క్లైమాక్స్‌లో కలిసే అన్నాచెల్లెళ్ల ట్రాక్ కూడా వృథా అయిపోయింది.
రైటింగ్ బలహీనంగా ఉంటే మణిరత్నం లాంటి సెన్సిటివ్ దర్శకుడు కూడా చతికిలపడతాడు అనడానికి థగ్ లైఫ్ ఒక ఉదాహరణ.
సినిమాలో ఎంతోకొంత ఊరట అద్భుతమైన ఫోటోగ్రఫీ, సంగీతం.
ఏఆర్ రెహమాన్ పాటలన్నీ బాగున్నా , ఒక పెళ్లి పాట చూడటానికి బాగుంటుంది.
పెళ్లి పాట మణిరత్నం మాత్రమే ఇలా తీయగలడు అన్నంత బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా వున్నాయి.
కమల్‌హాసన్ గొప్ప నటుడే. అయితే స్క్రీన్ మీద ఆయన్ని మాత్రమే చూడాలంటే కష్టం. ఈ సినిమాకి ఆయనే ప్లస్, మైనస్ కూడా.
ప్లస్ పాయింట్స్
1.ఫొటోగ్రఫీ
2.సంగీతం
3.ప్రొడక్షన్ రిచ్‌నెస్
4.కమల్, శింబూల నటన
మైనస్ పాయింట్స్
1.పూర్ రైటింగ్
2.సెకెండాఫ్ ల్యాగ్
3.త్రిష క్యారెక్టర్
(గమనిక: రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)