You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ధూమపాన నిషేధం: 2008 తర్వాత జన్మించిన వారికి నో సిగరెట్.. బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం
- రచయిత, జేమ్స్ గ్రెగొరీ
- హోదా, బీబీసీ న్యూస్
న్యూజీలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2008 తర్వాత జన్మించిన వ్యక్తులు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు కొనకుండా నిషేధం విధించింది.
ఇందుకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ మంగళవారం ఆమోదించింది. దీంతో పొగాకు కొనుగోలు చేయడానికి అర్హుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గిపోనుంది.
ఉదాహరణకు 2050 నాటికి 40 ఏళ్ల లోపు వయసు గల వాళ్లు సిగరెట్లు కొనడానికి వీలులేదు.
ఈ బిల్లును ప్రవేశపెట్టిన ఆరోగ్య శాఖ మంత్రి అయేషా వెరాల్ మాట్లాడుతూ.. "పొగ రహిత భవిష్యత్తు వైపు" ఇది ఒక అడుగు అని అన్నారు.
బిల్లు అమలైతే ఏం జరగనుంది?
"వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యవంతమైన జీవితాలు గడుపుతారు.
ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన అవసరం లేకుండా దాదాపు 26 వేల కోట్ల రూపాయలు ఆరోగ్య వ్యవస్థ ఆదా చేయనుంది" అని డాక్టర్ వెర్రాల్ అన్నారు.
కాగా, న్యూజిలాండ్ ధూమపాన రేటు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుంది.
నవంబర్‌లో విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం 8 శాతం మంది పెద్దలు ప్రతిరోజూ ధూమపానం చేస్తున్నారు.
అయితే గత సంవత్సరం ఇది 9.4 శాతంగా ఉంది. స్మోక్‌ఫ్రీ ఎన్విరాన్‌మెంట్ బిల్లు 2025 నాటికి ఆ సంఖ్యను 5 శాతం కంటే తగ్గించగలదని నమ్ముతున్నారు.
చివరికి ఈ పద్ధతితో మొత్తం అంతం అవుతుందని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులను విక్రయించగల రిటైలర్ల సంఖ్యను 6,000 నుంచి 600కి పరిమితం చేసేలా కూడా ఈ బిల్లు రూపొందించారు.
''తద్వారా పొగాకు ఉత్పత్తులలో నికోటిన్ స్థాయిలను తగ్గించి, వాటిపై వ్యసనం తగ్గించేలా చేస్తుంది.
కొన్ని ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులను విక్రయించడానికి రిటైలర్లను విస్తరించే వాళ్లు, క్లస్టరింగ్ తదితరాల నుంచి ఆయా కమ్యూనిటీలకు విముక్తి లభించనుంది'' అని వెరాల్ స్పష్టం చేశారు.
ఈ చట్టం మావోరీ (న్యూజిలాండ్‌లోని ఓ జాతి), మావోరీయేతర పౌరుల మధ్య ఆయుష్షు అంతరాలను చెరిపేయగలదని డా. వెరాల్ అన్నారు.
మావోరీ పౌరుల మొత్తం ధూమపాన రేటు 19.9 శాతం వద్ద ఉంది. గత సంవత్సరం ఇది 22.3 శాతంగా ఉంది.
కాగా, ఈ కొత్త చట్టం వేప్ ఉత్పత్తులను ( ఈ-సిగరెట్ లాంటివి) నిషేధించలేదు. అయితే సిగరెట్ల కంటే ఇవే యువతలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
పార్లమెంటులో 10 సీట్లను కలిగి ఉన్న ఏసీటీ పార్టీ, విమర్శకులు పలు విధాలుగా స్పందించారు. ఈ విధానం పొగాకు ఉత్పత్తుల బ్లాక్ మార్కెట్‌కు ఆజ్యం పోస్తుందని ఆరోపించాయి.
ఇది చిన్న దుకాణాలను నాశనం చేయగలదని హెచ్చరించారు.
"ప్రజలు ధూమపానం చేయడం ఎవరూ కోరుకోరు. కానీ, ఈ నిషేధం కొన్ని సమస్యలను సృష్టిస్తుంది'' అని ఏసీటీ డిప్యూటీ లీడర్ బ్రూక్ వాన్ వెల్డెన్ అన్నారు.
2023 నుంచి ఈ చట్టం అమలు కానుందని 'ది గార్డియన్' వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- తండ్రి సమాధి వెతుకుతూ మలేసియా వరకు సాగిన భారతీయుడి ప్రయాణం
- కేరళలో ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఈ ఇరాన్ మహిళా నిర్మాత జుట్టు కత్తిరించి పంపించారు ఎందుకు
- బంగ్లాదేశ్: షేక్ హసీనా గద్దె దిగాలంటూ నిరసనలు
- అరుణాచల్ ప్రదేశ్: 'చైనా సైన్యం వాస్తవాధీన రేఖ మీదకు వచ్చింది.. మన సైన్యం తిప్పికొట్టింది'
- సుప్రీంకోర్టులోనైనా ఉచితంగా వకీలును పెట్టుకుని వాదించడం ఎలా, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)