‘‘అత్యాచారం చేశారని ఒక పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేశా, తప్పుడు ఆరోపణలు అంటూ వాళ్లు నాపైనే కేసు పెట్టారు’’

    • రచయిత, రెబెకా వుడ్స్, హేలీ మార్టిమర్
    • హోదా, బీబీసీ ఫైల్ ఆన్ 4 ఇన్వెస్టిగేట్స్

(గమనిక: ఒక మహిళ ఆరోపించిన లైంగిక దాడికి సంబంధించి బాధాకరమైన వివరాలు ఈ కథనంలో ఉన్నాయి)

పార్టనర్ తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రూత్ (వ్యక్తిగత గోప్యత కోసం ఆమె పేరు మార్చాం), తనే నిందితురాలిగా బోనులో నిలబడాల్సి వస్తుందని ఆ సమయంలో అస్సలు ఊహించలేదు.

'తప్పుడు అత్యాచార ఆరోపణ' చేశారని పోలీసులు ఆమెపైనే నింద మోపారు. ఆమెపై చార్జ్‌షీట్ దాఖలు చేసి విచారణకు పంపారు.

చివరకు ఆమె నిర్దోషిగా విడుదలయ్యే వరకు, తనపై పడ్డ నిందను తొలగించుకోవడానికి ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చింది.

రూత్ 2020 ప్రారంభంలో ఈ అత్యాచార ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడు ఒక పోలీస్ అధికారి. వారు విడిపోయిన ఏడు నెలల తర్వాత ఆమె ఈ ఫిర్యాదు చేశారు. ఆ దాడి జరిగిన రోజే వారు చివరిసారిగా కలవడం.

''ఆ దాడిపై నేను ఫిర్యాదు చేయకపోతే, నా జీవితం సవ్యంగా సాగించలేనని అనిపించింది'' అని 'ఫైల్ ఆన్ 4 ఇన్వెస్టిగేట్స్'తో రూత్ అన్నారు.

ఆ పోలీస్ అధికారిపై ఎలాంటి నేరారోపణలు నమోదు కాలేదు. కానీ, రూత్ మాత్రం 'న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించారు' అనే ఆరోపణల మేరకు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి కేసులో గరిష్ఠంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది.

బ్రిటన్‌లో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) ప్రకారం, తప్పుడు అత్యాచార ఆరోపణల కింద విచారణ ఎదుర్కొనే వారి సంఖ్య చాలా తక్కువ. 2011-12 సంవత్సరాల మధ్య 17 నెలల కాలంలో ఇంగ్లండ్, వేల్స్‌లలో 5,651 అత్యాచార కేసులు నమోదుకాగా, తప్పుడు ఆరోపణల కింద కేవలం 35 కేసులే నమోదయ్యాయి. సీపీఎస్ మార్గదర్శకాలు మార్పు చేసిన తర్వాత, ఈ కేసుల సంఖ్య మరింత తగ్గింది.

అత్యాచార నేరం కింద తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనేవారు విచారణకు ముందే పోలీసుస్టేషన్ సెల్ లేదా జైలులో గడపాల్సి వస్తుంది. ఒకవేళ వారిపై అభియోగాలు నమోదైతే వారి పేర్లను బహిర్గతం చేస్తారు. నిర్దోషులని తేలినవారు సైతం సమాజంలో అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.

తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనే వారు జైలుశిక్ష అనుభవించాల్సి రావడం, వారి పేర్లు బహిర్గతం కావడం వల్ల సమాజంలో తీవ్ర అవమానానికి గురవుతారని సీపీఎస్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అందుకే ఇలాంటి కేసులను అత్యున్నత స్థాయి న్యాయవాదుల పర్యవేక్షణలో మాత్రమే ముందుకు తీసుకెళ్లాలని నిబంధనలు ఉన్నాయి.

రూత్ కేసులో విచారణ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, ''ఈ మొత్తం విచారణ సరైన మార్గంలో మొదలైనట్లు లేదు'' అని వ్యాఖ్యానించారు. పోలీసులు ఈ కేసును డీల్ చేసిన విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రూత్ మాజీ భాగస్వామి రహస్యంగా రికార్డ్ చేసిన ఒక ఆడియో క్లిప్‌ను కీలక సాక్ష్యంగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అసలు ఆ రోజు ఏం జరిగింది?

రూత్‌కి, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి మధ్య సంబంధం కొనసాగింది స్వల్ప కాలమే అయినా చాలా గాఢంగా సాగింది. 2019 వేసవిలో జరిగిన ఒక బాధాకరమైన లైంగిక ఘటన తర్వాత వారి బంధం ముగిసిపోయింది.

ఆయనతో లైంగికంగా కలవడానికి రూత్ అయిష్టంగానే అంగీకరించారు. ఆమె రెండు షరతులు పెట్టారు. అందులో ఒకటి, తనకు నొప్పి కలిగితే తన భాగస్వామి వెంటనే ఆపాలి.

లైంగికంగా కలిసిన సమయంలో తన సమ్మతిని వెనక్కి తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అయితే లైంగిక చర్య ఆపేయాలని చెబుతున్నా తన భాగస్వామి ఆపలేదని ఆమె చెప్పారు.

దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ‘మన బంధం ముగిసిపోయింది’’ అని ఆ సమయంలో రూత్ ఆయనతో అన్నారు. ఆ తర్వాత ఆమె తీవ్రమైన నొప్పితో ఫ్యామిలీ డాక్టరును సంప్రదించారు.

ఆమె పరిస్థితిని గమనించిన డాక్టర్ ఆమెను హాస్పిటల్‌కు పంపి పరీక్షలు, స్వాబ్ టెస్టులు చేయించారు. దీంతో, తనపై అత్యాచారం జరిగిందని ఆమె బలంగా నమ్మారు.

''అతను ఒక పోలీస్ అధికారి కావడంతో, మొదట ఫిర్యాదు చేయకూడదని అనుకున్నా" అని రూత్ చెప్పారు. జరిగిన దారుణాన్ని మర్చిపోవడానికి ఆమె ప్రయత్నించారు.

కానీ, కొన్ని నెలల తర్వాత మరొక కొత్త బంధంలో ఉన్నప్పుడు ఆమెకు ఇబ్బందులు ఎదురవ్వడంతో, చివరకు వార్విక్‌షైర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

రూత్ మాజీ భాగస్వామి వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీస్ విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విచారించగా, రూత్ చేసిన రేప్ ఆరోపణలను తోసిపుచ్చారు.

ఆ లైంగిక చర్య తమ ఇద్దరి సమ్మతితోనే జరిగిందని నిరూపించడానికి సాక్ష్యంగా, ఆయన తన మొబైల్ ఫోన్‌లో రహస్యంగా రికార్డ్ చేసిన ఒక ఆడియో ఫైల్‌ను పోలీసులకు సమర్పించారు. రూత్ అబద్ధం చెబుతోందనడానికి ఇదే సాక్ష్యమని ఆయన వాదించారు.

ఆ ఆడియో వార్విక్‌షైర్ పోలీసు అధికారులు కూడా విన్నారు. ఆమె నవ్వుతూ, సమ్మతి తెలిపినట్లు ఆడియోలో వినిపిస్తోందన్న ఆయన వాదనతో పోలీసులు ఏకీభవించారు.

ఆరు వారాల తర్వాత, రూత్ మాజీ పార్ట్‌నర్‌పై కేసును నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

అయితే, ఆ తర్వాత రూత్‌కు పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. స్వచ్ఛందంగా విచారణకు హాజరు కావాలని వారు ఆమెకు చెప్పారు.

''వారు (పోలీసులు) నిజంగా నాకు మద్దతు ఇస్తున్నారని నమ్మాను. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది'' అని రూత్ వాపోయారు.

''నన్ను తిరస్కరించినందుకు కక్షతోనే ఆయనపై అత్యాచార ఆరోపణలు చేశానని వారు చెబుతున్నారు''

తన మాజీ భాగస్వామి రహస్యంగా ఆడియో రికార్డ్ చేసిన విషయం రూత్‌కు పోలీసుల విచారణ సమయంలోనే తెలిసింది.

2020 నవంబర్‌లో అంటే ఫిర్యాదు చేసిన తొమ్మిది నెలల తర్వాత, రూత్‌పై 'న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించారు' అని పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.

కేసులో వైరుధ్యాలు, సాక్ష్యాధారాలు...

న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడం అంటే ఉద్దేశపూర్వకంగా న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడం లేదా అడ్డుకోవడం. స్నేహితుడిని లేదా బంధువును రక్షించడానికి తప్పుడు ఆధారాలు సృష్టించడం, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం లేదా దాచడం, సాక్షులను బెదిరించడం లేదా తప్పుడు ఆరోపణలు చేయడం వంటివి ఈ నేరం పరిధిలోకి వస్తాయి.

ఇంగ్లండ్, వేల్స్‌లలో తప్పుడు అత్యాచార ఆరోపణలపై ఎవరినైనా విచారించాలనుకున్నప్పుడు, పోలీసులు ఆ నిర్ణయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్‌కు తెలియజేయాలి. సీపీఎస్ మార్గదర్శకాల ప్రకారం, ఎవరైనా తప్పుడు ఆరోపణ చేశారని నిరూపించడానికి అధికారుల వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉండాలి.

రూత్ కేసులో, ఆడియో రికార్డింగ్‌తో పాటు, ఆమె చేసిన ఆరోపణలకు, గతంలో తన భాగస్వామికి పంపిన వాట్సాప్ సందేశాలకు మధ్య తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆ సందేశాలలో ఆమె లైంగిక చర్యకు సమ్మతి తెలిపినట్లు వారు వాదించారు.

రూత్ కేసులో తుది విచారణ 2023 ఏప్రిల్‌లో ప్రారంభమైనప్పుడు, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, ఆ ఆడియో రికార్డింగ్, వాట్సాప్ మెసేజ్‌లు, ఆ ఘటనకు ముందు, ఆ తర్వాత ఆమె ప్రవర్తన కూడా ఆమె ఆరోపణలు తప్పని చెబుతున్నాయని చెప్పారు.

ఆ రికార్డింగ్‌కు సంబంధించిన లిఖితపూర్వక ప్రతిని మాత్రమే వారు కోర్టుకు సమర్పించారు. ఆ ఆడియోను జ్యూరీకి వినిపించకూడదని నిర్ణయించుకున్నారు.

అయితే, రూత్ తరపు న్యాయవాది సోఫీ ముర్రే మాత్రం ఆ ఆడియోను కోర్టులో వినిపించారు.

మరి ఆ నవ్వులు, కేరింతలు ఎవ్వరివి...

కోర్టులో ఆ ఆడియో రికార్డింగ్‌ను ప్లే చేశారు. తనకు నొప్పిగా ఉందని, 'వద్దు', 'బయటికి తీసేయండి' అని రూత్ అనడం కోర్టులో అందరికీ వినిపించింది.

అప్పటివరకు పోలీసులు చెప్పినట్లుగా ఆ ఆడియోలో వినిపించిన నవ్వులు, కేరింతలు రూత్‌వి కావు.

రూత్ తరపు న్యాయవాదుల బృందం ఆ ఆడియోను లోతుగా విశ్లేషించగా, అంతా విస్తుపోయే ఒక నిజం బయటపడింది.

ఆ నవ్వులు, కేరింతల శబ్దాలు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న ఒక అశ్లీల చిత్రంలోని నటులవని తేలింది.

దీంతో అకస్మాత్తుగా ఆ కోర్టు గదిలోని వాతావరణమే మారిపోయిందని రూత్ ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నారు.

తనపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన ఆ రికార్డింగ్‌ను ఆమె వినడం అదే మొదటిసారి.

"నేను ఊహించిన దానికంటే అది చాలా ఘోరంగా ఉంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

'ఆడియో రికార్డింగ్'తో అడ్డంగా దొరికిపోయారు...

రూత్ తరపు న్యాయవాది సోఫీ ముర్రే వాదన ప్రకారం, లైంగిక నేరాల చట్టం కింద ఒక వ్యక్తి లైంగిక చర్యకు అంగీకరించేటప్పుడు భాగస్వామికి కొన్ని షరతులు పెట్టవచ్చు. ఉదాహరణకు, తప్పనిసరిగా కండోమ్ వాడాలనే షరతు. అలాంటి షరతులను ఉల్లంఘించి చేసిన లైంగిక చర్యను అత్యాచారంగానే పరిగణిస్తారు.

అయితే, ‘‘అత్యాచారం వంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఒక పీడకల’’ అని రూత్ మాజీ భాగస్వామి తన 'విక్టిమ్ ఇంపాక్ట్ స్టేట్‌మెంట్' (బాధితుడి వాంగ్మూలం)లో పేర్కొన్నారు. ఆ లైంగిక చర్యకు రూత్ నిస్పందేహంగా సమ్మతించిందని ఆయన చెబుతున్నారు.

అయితే, న్యాయవాది ముర్రే చేసిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆయన అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. నొప్పి కలిగితే లైంగిక చర్య ఆపేయమని రూత్ కోరారని, తర్వాత ఆమె చెప్పినప్పటికీ తాను ఆపలేదని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఆయన పోలీసు శాఖ నుంచి సస్పెండ్ అయ్యారు.

అంతేకాదు, రూత్‌కు తెలియకుండా తమ లైంగిక చర్య సమయంలో ఆడియో రికార్డింగ్ చేయడం ద్వారా పోలీసు నైతిక నియమావళిని ఉల్లంఘించారా అనే దానిపైనా ఆయన క్రమశిక్షణాపరమైన విచారణను ఎదుర్కోనున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఆయన్ను సంప్రదించడానికి ప్రయత్నించాం. కానీ ఆయన స్పందించలేదు.

‘నాలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదనే...’

ఈ కేసును విచారించిన న్యాయమూర్తుల బృందం కేవలం గంట వ్యవధిలోనే, రూత్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఆమె న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించలేదని, ఆమె చేసిన ఫిర్యాదు తప్పుడు ఆరోపణ కాదని జ్యూరీ గుర్తించింది.

వార్విక్‌షైర్ పోలీసుల తీరుపై జడ్జి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. అంతేకాకుండా, రూత్ అత్యాచార ఫిర్యాదుపై దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు.

నిర్దోషిగా విడుదలైనప్పుడు రూత్ తన స్పందన గురించి చెబుతూ, "నేను ఏడవలేదు, అరవలేదు. నిజం చెప్పాలంటే అప్పుడు నాలో ఏ ఫీలింగ్ ఉందో నాకే తెలియదు" అని అన్నారు.

తన మాజీ భాగస్వామిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తనను నిరాశపరిచినప్పటికీ, ఫిర్యాదు చేసినందుకు తాను బాధపడటం లేదని రూత్ చెప్పారు.

"నాలాంటి పరిస్థితి భవిష్యత్తులో మరెవరికీ రాకూడదని ఆశిస్తున్నాను" అని ఆమె ముగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)