చైనాలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం నిర్బంధాలు, వేధింపులను తట్టుకోలేక కుటుంబాలను వదిలేసి పారిపోతున్న ప్రజలు

    • రచయిత, మైఖేల్ బ్రిస్టో
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

చైనాలో ప్రజలు, బాధితుల తరఫున నిలిచేవారి మీద కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం, షి జిన్‌పింగ్ నాయకత్వంలో జరుగుతున్న నిర్బంధం, వేధింపులను తట్టుకోలేక ఆత్మీయులను వదిలేసి పారిపోతున్న భార్యలు, పిల్లలు, విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను.. జెంగ్ హె కథ కళ్లకు కడుతుంది.

జెంగ్ హె ఒక రోజు తన కూతురు గ్రేస్‌తో కలిసి బీజింగ్‌లోని ఒక హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లారు. గ్రేస్‌కు జట్టు కత్తిరించటం కోసం వాళ్లు అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా పదుల సంఖ్యలో దుండగులు లోపలికి చొచ్చుకొచ్చి వాళ్లను చుట్టుముట్టారు. తమతో రావాలంటూ ఆ తల్లీకూతుళ్లను పట్టుకెళ్లారు.

ఏం జరుగుతోందో గెంగ్ హేకు అర్థంకాలేదు. వాళ్లెవరో కూడా తెలీదు. బయటకు వచ్చి చూస్తే అక్కడ రోడ్డు మీద ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ల అపార్ట్‌మెంట్ దగ్గర మరింత మంది ఉన్నారు.

‘‘చుట్టూ చూస్తే కళ్లు బైర్లు కమ్మాయి. మొదటి అంతస్తు, రెండో అంతస్తూ అంతా జనంతో కిక్కిరిసిపోయి ఉంది’’ అని చెప్పారామె.

జెంగ్ హె భర్తను బీజింగ్‌కు దక్షిణంగా కొన్ని గంటల ప్రయాణం దూరంలో ఉన్న షాండాంగ్ ప్రావిన్స్‌లో అతడి సోదరి ఇంటి దగ్గర అరెస్ట్ చేసినట్లు వాళ్లు జెంగ్‌ హెకు చెప్పారు. వారి అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారు. ఆ వచ్చిన వాళ్లంతా సీక్రెట్ పోలీసులు అని అప్పుడు తెలిసింది ఆమెకు.

2006లో జరిగిన ఈ ఉదంతం జెంగ్ హె కుటుంబం విచ్ఛిన్నం కావటానికి నాంది పలికింది. ఆమె భర్త గావో ఝీషెంగ్ లాయర్‌గా పనిచేసేవారు. ఆయనను గతంలో కమ్యూనిస్టు ప్రభుత్వం సన్మానించింది. కానీ ఆ తర్వాత ఆయన ప్రభుత్వం పట్టించుకోని జనానికి మద్దతుగా నిలవటం మొదలుపెట్టారు. ఆ జనంలో నిషిద్ధ ఆధ్యాత్మిక ఉద్యమం ‘ఫాలున్ గాంగ్‌’ను అనుసరిస్తున్న వారు కూడా ఉన్నారు. చైనీస్ క్రైస్తవులైన వీరు అనధికారికంగా మతబోధనలు చేస్తున్నారనేది ఆరోపణ. అలాగే స్థానిక అధికారులు తమ భూములను స్వాధీనం చేసుకోవటం మీద పోరాడుతున్న వారి తరఫున కూడా ఆయన పని చేస్తున్నారు. అవిధేయతను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ ఝీషెంగ్‌ను అరెస్ట్ చేసి కొన్ని సంవత్సరాలు జైలులో పెట్టారు. కొన్నేళ్లు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ గృహ నిర్బంధంలో ప్రతి రోజూ 24 గంటల పాటూ మరింత నిశితంగా కాపలా కాయటానికి ఈ దంపతుల అపార్ట్‌మెంట్ భవనంలో పోలీసులు ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కూడా నిర్మించారు. ‘‘కింద ఎన్ని పోలీస్ కార్లు ఉన్నాయో చూడటానికి అప్పుడప్పుడూ నేను కర్టెన్లు పక్కకి జరిపేదాన్ని. నా భర్త వెంటనే నా మీద కేకలు వేసేవాడు. ‘ఏం చేస్తున్నావు? వాళ్లవైపు చూస్తున్నామనే సంతృప్తిని వాళ్లకు ఎందుకు ఇవ్వటం?’ అనేవాడు’’ అని జెంగ్ హె చెప్పారు.

పరిస్థితి అంతకంతకూ భరించలేనంతగా మారింది. ఈ దంపతులు ఇల్లు మారేలా అధికారులు ఒత్తిడి చేశారు. మారిన చోట తమ కూతురు గ్రేస్‌ను చేర్చుకోవటానికి స్కూళ్లు నిరాకరించేవి. ఆమె చదువు కోసం చాలా కష్టాలు పడేవారు. వారికి పీటర్ అనే ఆరేళ్ల వయసు కొడుకు కూడా ఉన్నాడు. ఈ పరిస్థితులు జెంగ్ హెను తీవ్రమైన పరిస్థితుల్లోకి నెట్టాయి. భర్తతో కలిసివుంటూ ఆ నిర్బంధ బాధలను భరించటమా లేక భర్తను వదిలేసి, అప్పటికి తన పిల్లలను తీసుకుని చైనా నుంచి బయటపడటమా అన్న సంశయంలో పడ్డారామె. ‘‘నా భర్త, నా పిల్లల మధ్య ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన దుస్థితి నాది. చివరికి నా పిల్లలనే ఎంచుకున్నాను’’ అని చెప్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఆ ముగ్గురూ 2009లో మానవ హక్కుల ఉద్యమకారుల సాయంతో పారిపోయారు. జెంగ్ హె, ఆమె భర్త తాము పారిపోవటానికి ప్రయత్నించాలని అప్పటికే అంగీకారానికి వచ్చారు. కానీ ఆ సమయం వచ్చినపుడు తన భర్తకు చెప్పకుండానే ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని చాలా హడావుడిగా పారిపోవాల్సి వచ్చింది. ఆ నిర్బంధం నుంచి స్వేచ్ఛ దిశగా సాగిన తమ ప్రయాణం వివరాలను వెల్లడించటానికి జెంగ్ హె ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ వివరాలు బయటకు తెలిస్తే.. అదే దారిలో పారిపోవాల్సిన అవసరం ఉన్నవారిని అది ప్రమాదంలో పడేయవచ్చు. అయితే ఆ ప్రయాణంలో.. ఓ బస్సులో సామాన్ల అరలో దాక్కుని ప్రయాణించటం కూడా ఆ దారిలో ఉంది.

చివరికి వారిని చైనా నుంచి బయటకు పంపించి థాయ్‌లాండ్‌కు దొంగతనంగా రవాణా చేశారు. అక్కడి నుంచి వారికి ఆశ్రయం ఇవ్వటానికి ఐక్యరాజ్యసమితి అంగీకరించింది. తల్లీ పిల్లలు అమెరికా చేరుకున్నారు.

అమెరికాలో వారి జీవితం తొలుత చాలా కఠినంగా ఉంది. తనకు తెలియని భాషతో జెంగ్ హె ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తన పిల్లల విషయమై ఆమె నిరంతరం ఆందోళన చెందుతూనే ఉన్నారు. తండ్రి లేకుండా ఉండటం ఆ పిల్లలకు చాలా కష్టమైంది. గ్రేస్ అయితే మానసిక ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 13 ఏళ్లు గడిచిపోయాయి. పిల్లలు చివరికి తమ గతాన్ని అంగీకరించారు. అమెరికాలో తమ సొంత జీవితాలను నిర్మించుకున్నారు. గ్రేస్ వయసు ఇప్పుడు 28 ఏళ్లు. ఆమెకు పెళ్లయింది. కొడుకు పీటర్ వయసు ఇప్పుడు 19 ఏళ్లు. ఒక యూనివర్సిటీలో మెడిసిన్ చదవటానికి చేరబోతున్నాడు. ‘‘అతడు రోజూ ఆశావహంగా సంతోషంగా ఉంటాడు. చదువుకుంటున్నాడు. చిన్న ఉద్యోగం కూడా చేస్తున్నాడు. మంచి భవిష్యత్తు ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని జెంగ్ హె గర్వంగా చెప్తున్నారు.

మరోవైపు.. తన కుటుంబం చైనా నుంచి పారిపోయి అమెరికా వెళ్లిపోవటంతో బీజింగ్‌లో గావో ఝీషెంగ్ భయంకర బాధలు అనుభవించాడు. జైలుకు, ఇంటికి మధ్య చక్కర్లు కొట్టటమే ఆయన జీవితంగా మారిపోయింది. తనను చాలా హింసించారని ఆయన చెప్పారు.

2014లో ఆయన శిక్షా కాలం పూర్తయింది. అప్పటికి తన శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించి పోయిందని ఆయన తెలిపారు. ఆయన పళ్లు ఎంతగా వదులయ్యాయంటే.. తన చేతితో పట్టుకుని వాటిని పీకేసేవాడు. శిక్ష ముగిసిన తర్వాత కూడా గావో ఝిషెంగ్‌ను స్వేచ్ఛగా విడుదల చేయలేదు. షాన్‌షి ప్రావిన్స్‌లోని ఆయన సొంత పట్టణంలో గృహనిర్బంధంలో ఉంచారు. ఇది ‘‘విడుదల కాని విడుదల’’కు ఉదాహరణ అని చైనా చట్టాలపై నిపుణుడైన అమెరికా న్యాయకోవిదుడు ఒకరు అభివర్ణించారు. జెంగ్ హె కొన్నిసార్లు తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడగలిగేవారు. ఆయన ఎలా ఉన్నారనేది తెలుసుకోగలిగేవారు. అయితే ఐదేళ్ల కిందటి ఫోన్ కాల్ వారి మధ్య చివరిది అయింది. ‘‘మేం ఏం మాట్లాడుకున్నామో నాకు గుర్తులేదు. ఎందుకంటే అదే చివరి కాల్ అవుతందని మాట్లాడేటప్పుడు మాకు తెలీదు. అయితే ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మాత్రం అడిగాను. బాగానే ఉన్నానని ఆయన చెప్పారు. ఆయన ఎప్పుడూ అలాగే ధీమాగా, సానుకూల దృక్పథంతో ఉండేవారు’’ అని జెంగ్ హె వివరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ ఫోన్ చేసినపుడు అటువైపు నుంచి జవాబు రాలేదు. అప్పటి నుంచీ తన భర్త నుంచి ఆమెకు ఫోన్ రాలేదు. ఆయన బతికున్నారా, చనిపోయారా అన్నది కూడా ఆమెకు తెలీదు.

కానీ ఏదో ఘోరం జరిగిందని ఆమె భయపడుతున్నారు. ‘‘నాకు ఓ పీడకల లాంటి భావన కలుగుతోంది. కమ్యూనిస్టు పార్టీ కోవిడ్‌ను అడ్డుపెట్టుకుని ఆయనను శాశ్వతంగా మాయం చేసేస్తుందనే భయం వేస్తోంది’’ అని చెప్పారామె. కోవిడ్ వల్ల తన భర్త చనిపోయాడని చైనా అధికారులు ప్రకటించవచ్చునని ఆమె ఆందోళన చెందుతున్నారు. అలా చనిపోయినట్లు చెప్తే ఆ మరణానికి చైనా అధికారులకు ఎలాంటి బాధ్యతా వహించాల్సిన అవసరముండదు. గావో ఝీషెంగ్ గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం నిరాకరించింది. ఈ ఉదంతంలో కష్టాల పాలైంది ఆ న్యాయవాది ఒక్కరే కాదు. ఇంకా చైనాలోనే నివసిస్తున్న ఆయన బంధువులు కూడా ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. గావోను తొలుత అరెస్ట్ చేసింది ఆయన సోదరి నివాసంలో. ఆమె అనంతరం కుంగుబాటుకు లోనై రెండేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నారు. గావో బావ కూడా అదే పరిస్థితిలో కడతేరారు. ఆయనకు తీవ్ర జబ్బు సోకింది. కానీ గావో బంధువుల గుర్తింపు కార్డులను పోలీసులు తీసుకెళ్లిపోవటంతో.. ఆయనకు సరైన వైద్య చికిత్స లభించలేదు. దీంతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ పరిణామాలు జెంగ్ హెను భయపెట్టలేదు. కొన్నేళ్ల కిందట శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమె ఇంటి తోటలో అకస్మాత్తుగా ఒక ఆగంతకుడు ప్రత్యక్షమయ్యాడు. రాత్రి పూట సరిగా కనిపించలేదు. కానీ చైనా అధికారులతో సంబంధం ఉన్న వ్యక్తి కావచ్చుననే భయంతో ఆమె తన ఇంట్లో తనతో పాటు అట్టిపెట్టుకునే షాట్‌గన్ తీసుకుని అతడిని హెచ్చరిస్తూ ఒక రౌండ్ కాల్చింది. దీంతో ఆ ఆగంతకుడు పరారయ్యాడు. ఆ ఘటనతో కూడా జెంగ్ హె బెంబేలెత్తిపోలేదు. తన పిల్లలు స్థిరపడటంతో ఇప్పుడామె తన భర్త మీదకు తన దృష్టిని మళ్లించారు. చైనాలోనూ, బయటా ప్రజల మస్తిష్కాల్లోంచి చెరిగిపోయిన తన భర్త కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవటానికి, ఆయన పేరు పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా ఉంచటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో.. గావో అదృశ్యమై ఐదేళ్లు అయిన సందర్భంగా, లాస్ ఏంజెలెస్‌లోని చైనా కాన్సులేట్ భవనం మీద తన భర్త ముఖచిత్రాన్ని ఆమె ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. అలాగే సెప్టెంబర్ నెలలో.. 700 ఖాళీ బుల్లెట్ షెల్స్‌తో తయారు చేసిన తన భర్త ముఖం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

చైనాలో తన భర్త ఆచూకీని వెదికి పట్టుకోవటానికి బీజింగ్‌లో కొందరు లాయర్లను ఆమె నియమించారు. కానీ వారికి ఏ ప్రభుత్వ విభాగమూ ఏ వివరాలూ చెప్పటం లేదు. చైనాలో చిక్కుకుపోయిన తమ ఆత్మీయులకు విముక్తి కల్పించటం కోసం పోరాడుతున్న అనేక మంది చైనీయులు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నారు. చైనాలో ఎంతమంది ఉద్యమకారులను జైళ్లలో పెట్టారనేది తెలుసుకోవటం కష్టం. ఎందుకంటే తమ దగ్గర రాజకీయ ఖైదీలు ఉన్నారనే విషయాన్ని కూడా ఆ దేశం అంగీకరించదు. అమెరికాకు పారిపోయి వచ్చేవరకూ.. తన భర్త చేసే పనిలో ఉన్న ప్రమాదాల గురించి తనకు ఎన్నడూ తెలియలేదని జెంగ్ హె చెప్పారు. ఇప్పుడు తన భర్తకు ఎంతో దూరంగా నివసిస్తున్నా.. ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఆమె భావిస్తున్నారు. ‘‘నా భర్తతో భుజం భుజం కలిపి పోరాడుతున్న సహచరిని నేను అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. నా జీవితానికి ఇది కొత్త అర్థం ఇచ్చింది’’ అంటున్నారామె. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వంటి బలమైన శక్తికి వ్యతిరేకంగా జెంగ్ హె చేస్తున్నది విఫల పోరాటంగా కనిపిస్తుంది. కానీ ఆమె ఆ పోరాటాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. భర్తను ప్రమాదంలో వదిలేసి వచ్చానన్న అపరాధ భావన ఆమెను ఎన్నడూ వీడకపోవచ్చు. కానీ తన పిల్లలు నిలదొక్కుకోవటంలో.. మెరుగైన భవిష్యత్తు మీద నమ్మకం.. ఆమెకు చిరు ఆశను కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి: