You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నీట్, నెట్ వివాదం: పేపర్ లీక్‌కు పాల్పడితే 10 ఏళ్ళ వరకు జైలు, కోటి రూపాయల దాకా జరిమానా, ఇంకా ఈ కొత్త చట్టంలో ఏముందంటే...
నీట్, నెట్ పరీక్షల వివాదాల నేపథ్యంలో పోటీపరీక్షలలో పేపర్ లీకులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
యూజీసీ నెట్ పరీక్ష రద్దు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై వ్యవహారంపై దేశ్యవాప్తంగా పలు ప్రాంతాలలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమైంది.
ఈ క్రమంలో కొత్త చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్రం శుక్రవారం రాత్రి ( జూన్ 21) పొద్దుపోయాక విడుదల చేసింది.
ఈ కొత్త చట్టం ప్రకారం పరీక్షలకు సంబంధించి అక్రమాలకు పాల్పడేవారికి తక్కువలో తక్కువ మూడేళ్ళ నుంచి ఎక్కువలో ఎక్కువ పదేళ్ళ వరకు జైలు శిక్ష, కనీసం రూ. 10 లక్షల నుంచి అత్యధికంగా రూ. కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు నెలల కిందటే ఆమోదించారు.
కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
యూజీసీ -నెట్ 2024 పరీక్షా పత్రం లీక్‌పై వివాదం ముదురుతున్న వేళ కేంద్రం తీసుకున్న ఈ చర్య కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ), రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తదితర సంస్థలు నిర్వహించే పరీక్షలలో అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు.
చట్టంలో ఏముంది?
ఈ కొత్త చట్టం ప్రకారం ఏ వ్యక్తి , లేదా సంస్థ అయినా పరీక్షల విషయంలో ఎలాంటి పనులకు పాల్పడితే అది చట్టవిరుద్ధమో స్పష్టం చేశారు.
- ఏదైనా ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ లేదా అందులోని కొంత భాగం లీక్ చేయడం, లీక్ చేయడంలో ఇతరులకు సహాయపడటం.
- ప్రశ్నపత్రాలు లేదా ఓఎంఆర్ షీట్లను అక్రమంగా తమ దగ్గర పెట్టుకుని ఉండటం
- అభ్యర్థులకు పరీక్ష సమయంలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, అభ్యర్థికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయం చేయడం, జవాబు పత్రం-ఓఎంఆర్ షీట్ తారుమారు చేయడం
- ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం
- ముఖ్యమైన తుది జాబితా కోసం కీలక డాక్యుమెంట్లను తారుమారు చేయడం
- పరీక్షకు సంబంధించిన కంప్యూటర్ నెట్‌వర్క్ లేదా పరికరాలను తారుమారు చేయడం, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడం, నకిలీ పరీక్షలు రాయడం, నకిలీ పత్రాలను అందించడం
- పరీక్షలకు సంబంధించి ఎటువంటి బెదిరింపులు చేసినా...
జైలుశిక్ష, జరిమానా
సిబ్బంది వ్యవహారాల శాఖ జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ చట్టం కింద కు వచ్చే నేరాలన్నింటినీ కాగ్నిజబుల్‌గానూ, నాన్ బెయిలబుల్‌గానూ, నాన్ కాంపౌండ్‌బుల్‌గానూ పేర్కొన్నారు.
ఈ కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి పోలీసు అధికారిగానీ, అంతకుమించిన హోదా కలిగిన అధికారులు గానీ విచారిస్తారు.
ఈ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది.
పరీక్షలలో అవకతవకలకు పాల్పడేవారికి ఈ చట్టం కింద కనీసం 3 ఏళ్ళ నుంచి గరిష్ఠంగా ఐదేళ్ళ జైలుశిక్ష రూ. పది లక్షల నుంచి రూ. కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష విధిస్తారు.
పరీక్షలకు సేవలందించే వారిపై కూడా ఈ చట్టం కింద చర్యలు తీసుకుంటారు.
సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న సంస్థలో డైరక్టర్ లేదా యాజమాన్యంలోని సీనియర్ వ్యక్తుల అనుమతితో అక్రమాలకు పాల్పడినట్టు తేలితే, దోషులుగా తేలిన సర్వీస్ ప్రొవైడర్లకు రూ. కోటి వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. వీరికి మూడేళ్ళ నుంచి పదేళ్ళవరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
అలాగే పరీక్షలకు అయిన ఖర్చును కూడా వారినుంచే రాబడతారు. అవసరమైతే ఆయా సర్వీస్ ప్రొవైడర్ల ఆస్తులను జప్తు చేస్తారు
అలాంటి సర్వీస్ ప్రొవైడర్లకు నాలుగేళ్ల వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించరు.
జరిమానా చెల్లించలేని పక్షంలో అదనపు జైలు శిక్ష విధిస్తారు.
భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం అమల్లోకి వచ్చే వరకు ఈ చట్టంలోని శిక్షలన్నింటినీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అమలు చేస్తారు.
ముందురోజు పరీక్ష, తరువాత రోజు రద్దు
నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై ఆందోళనల నడుమ ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం (18.06.2024) నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్షను ఆ మరుసటి రోజైన బుధవారం (19.06.2024)న రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా ఎన్‌టీఏ నిర్వహించింది. సుమారు 9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
అయితే, ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రద్దు చేసిన నెట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత చెబుతామని పేర్కొంది.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు, యూనివర్సిటీ, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు అభ్యర్థులు యూజీసీ – నెట్ పరీక్ష రాస్తారు.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నెట్ పరీక్ష జరిగిన మరుసటిరోజు అంటే జూన్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ ఎనలిటిక్స్ యూనిట్ నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు ఒక సమాచారం అందింది.
యూజీసీ-నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేది ఆ సమాచార సారాంశం.
దీంతో నెట్ పరీక్షను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది.
హోం మంత్రిత్వశాఖలోని భారత సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ ఎనలిటిక్స్ యూనిట్ పని చేస్తుంది.
సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
గ్రేస్ మార్కులు రద్దు
నీట్‌లో గ్రేస్ మార్కుల కేటాయింపు కూడా వివాదాస్పదమైంది. నీట్‌లో పరీక్షా సమయం కోల్పోయారంటూ 1,563మందికి అదనపు మార్కులు కలపడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై తొలుత ఎన్‌టీఏ స్పందించి, కొందరు అభ్యర్థులు పరీక్షా సమయం కోల్పోయినందున 1,563 మందికి అదనపు మార్కులు ఇచ్చినట్లు తెలిపింది.
కానీ తరువాత ఆ గ్రేస్ మార్కులను రద్దు చేసినట్టు ఎన్‌టీఏ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈమేరకు గ్రేస్ మార్కులు కలిపినవారికి మళ్ళీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని పేర్కొంది.
మరోపక్క పరీక్షా ఫలితాలలో 67మందికి 1వ ర్యాంక్ రావడం కూడా వివాదానికి కారణమైంది.
దీంతో అనేక ప్రాంతాలలో పరీక్షను రద్దుచేసి, తిరిగి నిర్వహించాలనే డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై సుప్రీం కోర్టు సహా దేశవ్యాప్తంగా పలు కోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి.
నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందనే ఆరోపణలపై నమోదైన కేసులో బిహార్ పోలీసులు 13మందిని అరెస్ట్ చేశారు.
అయితే గ్రేస్ మార్కులు రద్దు చేసినట్టు ఎన్‌టీఏ సుప్రీం కోర్టుకు తెలపడంతో గ్రేస్ మార్కుల సమస్య పరిష్కారమైందని, పేపర్ లీక్, అక్రమాలపై జులై 8న విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఈ ఓడలు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేస్తున్నాయంటే..
- క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ: ‘నేను గర్భవతినని బిడ్డను కనడానికి నెల రోజుల ముందు వరకు నాకు తెలియలేదు’
- పదేళ్ల పాత బియ్యం తినొచ్చా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది
- కల్తీ మద్యం: ఆ ఊళ్లో ఎక్కడ చూసినా మృతదేహాలే, 47మందిని బలి తీసుకున్న ఘటనపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ‘స్త్రీ తన వస్త్రాలతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ - సెక్స్ గురించి ప్రాచీన కాలంలో మహిళలు ఎలా చర్చించుకునేవారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)