You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీ20: పాకిస్తాన్ జట్టు ఇది వరల్డ్ కప్ అన్న విషయం అర్థం చేసుకోలేకపోయిందా?
- రచయిత, సమీ చౌధరి, క్రికెట్ జర్నలిస్ట్
- హోదా, బీబీసీ కోసం
వ్యక్తులు సంస్థలను మించిపోయినప్పుడు, భయాలు వాస్తవంగా మారడానికి ఎక్కువ కాలం పట్టదు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చాలా కాలంగా జరుగుతున్న విషాద పరిణామం.
అయితే దానికి ఆటగాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.
పీఎస్‌ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) చివరి దశలో పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అకస్మాత్తుగా రావల్పిండి క్రికెట్ స్టేడియంకు చేరుకున్నారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన కవరేజీతో సంతృప్తి చెందని ఆయన, మ్యాచ్ అనంతరం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌కు సంబంధించినదే. కానీ, ఆ సమావేశంలో నఖ్వీ తన వ్యక్తిత్వాన్ని, తన అంకితభావాలను చాటుకునే ప్రయత్నం చేశారు.
దేశం కోసం తన వ్యాపారాన్ని విడిచిపెట్టి, పదవీ బాధ్యతలు చేపట్టడంపట్ల గర్వం వ్యక్తం చేశారు.
అంతే కాదు, పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రపంచ కప్ ఆడబోతున్నా, వాళ్లకు క్రికెట్‌తో సంబంధం లేని కకుల్ అకాడమీలో శిక్షణ ఇప్పించేందుకు మొహ్సిన్ నఖ్వీ ప్రయత్నించారు.
మొహ్సిన్ నఖ్వీ ప్రయోగాలు
కకుల్ అకాడమీలో ఆ ప్రాక్టీస్ సెషన్‌లకు ఒక ముద్దు పేరు పెట్టారు. వాటిని 'టీమ్ బైండింగ్' ప్రోగ్రామ్స్ అని అన్నారు. ఆ టీమ్ బైండింగ్‌తో వచ్చిన ఫలితం ఏంటంటే, నాలుగు నెలల కిందట నియమితుడైన కెప్టెన్ షాహీన్ అఫ్రిది ద్వారా మొహమ్మద్ అమీర్‌ను రిటైర్మెంట్ ఆలోచన నుంచి బయటపడేయటం.
షాహీన్ అఫ్రిది నుంచి జట్టు నాయకత్వాన్ని తిరిగి బాబర్ ఆజంను కట్టబెట్టే ప్రయత్నాలు అప్పటికే చేశారు మొహ్సిన్ నఖ్వీ.
2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో జట్టును సమర్ధవంతంగా నడిపించలేదన్న కారణంతో బాబర్ ఆజం తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశారు.
అదే బాబర్ ఆజంకు మళ్లీ కెప్టెన్సీ కట్టెబెట్టి, షాహీన్ అఫ్రిదికి వైస్-కెప్టెన్సీ అప్పగించడం ద్వారా ఆయన్ను అవమానించారు మొహ్సీన్ నఖ్వీ.
ఈ మొత్తం డ్రామాలో ఆధునిక క్రికెట్ గేమ్‌ను ఎలా ఆడాలి, ప్రపంచ కప్‌లో అత్యుత్తమ జట్లతో పోటీ పడేటప్పుడు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి అన్న లక్ష్యం పక్కకు పోయింది.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఇదే అత్యంత చెత్త పెర్ఫార్మెన్స్.
ఈ పెర్ఫార్మెన్స్ 2023 వన్డే ప్రపంచ కప్‌ను గుర్తు చేస్తుంది. ఈ టోర్నీని గెలిచేందుకు పాకిస్తాన్ గత దశాబ్దంలో అత్యంత బలమైన జట్టును పంపింది.
ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఇప్పుడు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రీదిలకు చెందిన రెండు ప్రత్యర్థి వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు బలమైన పాకిస్తాన్ జట్టూ ఇలాగే వసీం అక్రమ్, వకార్ యూనిస్ వర్గాలుగా విడిపోయి, మొదటి రౌండ్‌లోనే ఓడిపోయి స్వదేశానికి తిరిగి వచ్చింది.
వైఫల్యానికి కారకులు ఎవరు?
ప్రస్తుతం కెప్టెన్ బాబర్ ఆజం ఖచ్చితంగా బ్యాటింగ్‌లో స్టార్ బ్యాట్స్‌మ్యాన్ కాదని తెలుసు. ఆయన కెప్టెన్సీ వ్యూహాలు ఇండియా, కెనడాలతో జరిగిన మ్యాచ్‌లలో కొంచెం మెరుగ్గా ఉన్నా, గేమ్ రీడర్‌గా ఆయన అవగాహన అంతర్జాతీయ స్థాయి కెప్టెన్‌కి ఉండాల్సినంతగా లేదు.
అలాంటి అసమర్థ కెప్టెన్సీకి తోడు జట్టులోని గ్రూపు రాజకీయాలు టీమ్‌ను దెబ్బ తీశాయి.
ఇంకా, ఏదైనా జరగాల్సిన నష్టం మిగిలి ఉంటే, రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చిన 'సీనియర్' ఆటగాళ్లు దాన్ని భర్తీ చేశారు. మొహమ్మద్ వాసిమ్ ప్రకారం, గతంలో కోచ్‌లుగా పని చేసిన వారు కూడా జట్టులో ‘క్యాన్సర్’ లాంటి వ్యక్తి ఉన్నాడని అభివర్ణించారు.
ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఓటమి అంత ఊహించని విషయమేమీ కాదు. బలమైన ప్రత్యర్థులతో ఆడిన బాబర్ అజామ్ టీమ్‌లో ఆ 'క్యాన్సర్' రోగి చేయగలిగినంత నష్టం చేశాడు.
అమెరికా జట్టు చేతిలో ఓడిపోవడం ఈ పదకొండు మందిని ఎంతగానో నిరుత్సాహపరిచింది. టీమ్ పునరుద్ధరణపై అన్ని ఆశలూ అడుగంటి, ఒక జట్టుగా మారడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంలో, అది మరిన్ని ముక్కలుగా మారే దశలో ఉంది.
ఇదంతా పూర్తిగా ఊహించని విషయం అంటూ ఇప్పుడు పాక్ ప్రేక్షకులతో పాటు పీసీబీ చైర్మన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్ జట్టును న్యూజిలాండ్ 'సి' టీమ్ ఓడించినప్పుడే ఈ విషయం స్పష్టమైంది.
మొహ్సిన్ నఖ్వీ ఇప్పుడు ఈ టీమ్‌లో 'ఆపరేషన్ క్లీనప్' గురించి ప్రస్తావిస్తున్నారు. 'ఆపరేషన్ క్లీనప్' వంటి పెద్ద పెద్ద మాటలను ఉపయోగించి మొహ్సిన్ నఖ్వీ తన నియంతృత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారు.
కొత్త కెప్టెన్ అవసరం
నిస్సందేహంగా జట్టు ప్రయోజనాలు, మైదానం వెలుపల కార్యకలాపాలు రెండూ వేర్వేరుగా ఉంటూ జట్టు పనితీరుపై ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. అయితే చైర్మన్ చెబుతున్న ‘క్లీనప్’తో దీనిని పరిష్కరించడం సాధ్యం కాదు.
పాకిస్తాన్ క్రికెట్ ఇంతకన్నా పతనం కాలేని స్థితికి చేరుకుంది. ఇక్కడి నుంచి మళ్లీ పైకి ఎదిగే దారులు వెతకడం అంత సులభం కాదు.
పాకిస్తాన్ తన తదుపరి ప్రపంచ కప్ పోటీలలో ఇటువంటి అవమానాలకు గురి కాకుండా ఉండాలనుకుంటే, ఆ దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అవసరం. ఇక్కడ ఫస్ట్ క్లాస్ క్రికెట్ వ్యవస్థనే కాకుండా జట్టు ఎంపిక ప్రమాణాలను కూడా మార్చాలి.
షార్ట్‌కట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో స్థానం పొందిన వారిని కాకుండా, దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి పీఎస్‌ఎల్ ప్రాధాన్యత ఇవ్వడం ఆ దిశగా తీసుకున్న సరైన చర్య కాగలదు.
ప్రపంచ కప్‌ను గెలవాలంటే అత్యుత్తమ టీమ్ ఒక్కటే సరిపోదు.
బాబర్ అజామ్ బ్యాటింగ్ సామర్థ్యం, గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.
కానీ ఇప్పుడు ఆ జట్టుకు క్రికెట్‌లోని వ్యూహాలను అర్థం చేసుకోగల కెప్టెన్, స్నేహితులను పక్కన పెట్టి జట్టు కోసం ఆలోచించగల సామర్థ్యం ఉన్న మెరుగైన ఆటగాడు కావాలి.
ఇవి కూడా చదవండి:
- మెదక్‌లో ఉద్రిక్తత: ‘మేం ఏం తప్పు చేశామని మా హాస్పిటల్‌పై దాడి చేశారు?’
- ‘స్త్రీ తన వస్త్రాలతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ - సెక్స్ గురించి ప్రాచీన కాలంలో మహిళలు ఎలా చర్చించుకునేవారు?
- అపాయంలో ఉపాయం: ఎడారిలో సింహాలబారి నుంచి తప్పించుకున్న ఇద్దరు స్నేహితురాళ్ళ కథ...
- సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)