'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్‌లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?

    • రచయిత, చెరిలాన్ మొలన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబై

భారత ప్రభుత్వం పాకిస్తాన్‌లో చట్టవిరుద్ధంగా కనీసం 20 హత్యలు చేసిందని 'ది గార్డియన్‌' మీడియాలో కథనాలు వచ్చాయి.

గతవారం ఈ కథనం వెలువడటంతో ఇరు దేశాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. ది గార్డియన్ కథనంపై భారత్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్త సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పటివరకు మూడు యుద్ధాలు జరిగాయి.

2019లో పుల్వామాలో భారత ఆర్మీ సైనికులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది.

ఈ ఆత్మాహుతి దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌కు చెందిన బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.

ఎలా బయటికొచ్చింది?

‘విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవడం’ అనే పాలసీలో భాగంగా 2020 నుంచి పాకిస్తాన్‌లో జరిగిన 20 హత్యల్లో భారత్ ప్రమేయం ఉందని 'ది గార్డియన్' కథనం వెలువడింది.

భారత్‌లో ఏప్రిల్ నుంచి లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఆరోపణలు వచ్చాయి. మరోవైపు భారత్‌కు పాకిస్తాన్‌ అంశం సున్నితమైనది.

రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార బీజేపీ అభ్యర్థులు, జాతీయవాద ఓట్ల కోసం పాకిస్తాన్ అంశాన్ని ఉపయోగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ హత్యల్లో భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ప్రత్యక్ష ప్రమేయం ఉందని రెండు వేర్వేరు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులు చెప్పినట్లు ది గార్డియన్ రిపోర్టు చేసింది.

2023 నుంచి పాకిస్తాన్‌తో పాటు పశ్చిమ దేశాలలో భారత్ చేస్తున్న హత్యలు పెరిగాయని వారు ఆరోపించినట్లు తెలిపింది. విదేశీ గడ్డపై చట్టవిరుద్ధమైన హత్యలలో పాల్గొన్న ఇతర విదేశీ గూఢచార సంస్థల నుంచి భారత్ ప్రేరణ పొందిందని పాక్ అధికారులు ఆరోపించారు. అయితే, ఆ కథనంలో అధికారుల పేర్లు వెల్లడించలేదు.

2019 పుల్వామా దాడి తర్వాత ఇక విదేశాల్లో ఉన్న అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవాలని భారత్ నిర్ణయించుకుందని ఇద్దరు భారతీయ అధికారులను ఉటంకిస్తూ గార్డియన్ పేర్కొంది.

"పుల్వామా తర్వాత, భారత్ బయట ఉన్న తీవ్రవాద శక్తులు దేశంలో దాడులు చేయడానికి, ఆటంకాలు సృష్టించడానికి ముందు, మేమే వారిపై దాడి చేసేలా మా విధానం మారింది" అని భారత ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపినట్లు ఆ కథనం పేర్కొంది.

"మేం దాడులను ఆపలేకపోయాం, ఎందుకంటే వారి స్థావరాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి, అందుకే మేం మూలం తెలుసుకోవాలి, దానికోసం అత్యున్నత స్థాయిలో ప్రభుత్వ ఆమోదం అవసరం" అని భారత అధికారి ఒకరు చెప్పినట్లు ది గార్డియన్ తెలిపింది.

భారత్ స్పందన ఏమిటి?

గార్డియన్ కథనంపై భారత్ అధికారికంగా స్పందించలేదు.

అయితే, ఇతర దేశాలలో హత్యలు చేయడం భారత ప్రభుత్వ విధానం కాదని విదేశాంగ మంత్రి జైశంకర్‌ గతంలో చెప్పిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత శుక్రవారం మాట్లాడుతూ "భారత్‌లో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఏ ఉగ్రవాది తప్పించుకోలేడు" అని అన్నారు.

సీఎన్ఎన్-న్యూస్18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్‌ను, ది గార్డియన్ కథనంపై అడిగినప్పుడు "వారు పాకిస్తాన్‌కు పారిపోతే, వారిని చంపడానికి మేం పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తాం" అని తెలిపారు.

పాకిస్తాన్ ఏమంది?

అయితే, రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. రాజ్‌నాథ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని తెలిపింది.

"ఇటువంటి హ్రస్వదృష్టి, బాధ్యతారహిత ప్రవర్తన ప్రాంతీయ శాంతికి హాని కలిగించడమే కాకుండా, దీర్ఘకాలికంగా నిర్మాణాత్మక చర్యల్లో పాల్గొనే అవకాశాలను కూడా అడ్డుకుంటుంది" అని పేర్కొంది.

''మా దేశంలో జరిగిన చట్టవిరుద్ధమైన హత్యలతో భారత్‌కు సంబంధం ఉందని బలమైన సాక్ష్యాలను అందించాం. తన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు భారత్‌ను బాధ్యురాలిని చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి'' అని పాకిస్తాన్ కోరింది. కాగా, పాకిస్తాన్ తాజా ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇండియాపై అమెరికా, కెనడాల ఫిర్యాదు

సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయంపై విశ్వసనీయమైన సమాచారం ఉందని సెప్టెంబరులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను భారత్ ఖండించింది, కెనడా దీనికి సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాలను అందించలేదని పేర్కొంది.

ఆ తర్వాత కొద్దిరోజులకు తమ పౌరుడు, సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపట్వంత్ సింగ్ పన్నూని చంపడానికి భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తా చేసిన కుట్రను విఫలం చేసినట్లు నవంబర్‌లో అమెరికా వెల్లడించింది.

అయితే, ఈ హత్యాయత్నంతో తమకు సంబంధం లేదని భారత్ ఖండించింది. దీనిపై అమెరికా అధికారులకు సహకరిస్తున్నట్లు భారత్ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)