You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముంబయి 26/11 దాడులు: ‘మీరు పైకి రావొద్దండి.. వాళ్ల సంగతి నేను చూసుకుంటా’ అని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎందుకన్నారు?
- రచయిత, భాను ప్రకాశ్ కర్నాటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
“మీరు పైకి రావొద్దు.
వాళ్ల సంగతి నేను చూసుకుంటాను.“
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన బృందంతో చెప్పిన చివరి మాటలివి.
2008 నవంబరు 26 సాయంత్రం నుంచి 29 ఉదయం వరకు సాగిన ముంబయి దాడులు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.
నాడు ఈ దాడులతో ప్రపంచం ఉలిక్కి పడింది.
26/11 ముంబయి దాడులు జరిగి 15 ఏళ్లు అవుతున్నా, ఆ సమయంలో ఉగ్రవాదులతో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జరిపిన వీరోచిత పోరాటం చాలా మంది మదిలో మెదులుతూనే ఉంటుంది.
2008 నవంబర్ 26న పది మంది లష్కరేతోయిబా టెర్రరిస్టులు దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబయి నగరంలోకి సముద్ర మార్గం గుండా ప్రవేశించి, ప్రధాన రైల్వే స్టేషన్ అయిన ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబేరాయ్ ట్రైడెంట్, తాజ్ ప్యాలెస్, యూదుల సాంస్కృతిక కేంద్రమైన నారీమన్ హౌజ్, కామా ఆసుపత్రితోపాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.
నాటి మారణహోమంలో 166 మంది మరణించగా 300 మంది గాయపడ్డారు.
వారిని నిలువరించే ప్రయత్నంలో 15 మంది పోలీసు అధికారులతోపాటు ఇద్దరు ఎన్‌ఎస్‌జీ కమాండోలు ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో ఎన్‌ఎస్‌జీ, 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్(51 ఎస్ఏజీ)కి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు.
ఆపరేషన్ బ్లాక్ టోర్నడో
‘బ్లాక్ క్యాట్స్’గా పిలిచే ఎన్‌ఎస్‌జీ కమాండోలు ‘ఆపరేషన్ బ్లాక్ టోర్నడో’లో భాగంగా నవంబర్ 26, 27వ తేదీల మధ్య అర్ధరాత్రి దిల్లీ నుంచి ముంబయికి చేరుకుని బృందాలుగా విడిపోయారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నేతృత్వంలోని 51 ఎస్‌ఏజీ బృందం తాజ్ ప్యాలెస్‌కు చేరుకుంది.
బ్రిగేడియర్ గోవింద్ సింగ్ సిసోడియా సారథ్యంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సునీల్ షెరోన్ పర్యవేక్షణలోని ఎన్ఎస్‌జీ కమాండోల బృందం ప్రాణనష్టం కలగకుండా, అక్కడున్న వారిని రక్షించడమే తొలి ప్రాధాన్యంగా ముందుకు కదిలింది.
ముంబయి దాడుల గురించి రచయిత సందీప్ ఉన్నిథన్ తాను రాసిన ‘బ్లాక్ టోర్నడో-ది త్రీ సీజెస్ ఆఫ్ ముంబయి 26/11’ పుస్తకంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరోచిత పోరాటం గురించి వివరించారు.
51 ఎస్ఏజీ (స్పెషల్ యాక్షన్ గ్రూప్) బృందం తాజ్ హోటల్‌లో ఉంది. 27వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఓ కాల్ వచ్చింది.
ప్రియ ఫ్లోరెన్స్ మార్టిస్ అనే మహిళ తాజ్ ప్యాలెస్‌లోని డేటా సెంటర్‌లో, ఆమె సహోద్యోగి మనీష్ సర్వర్ రూంలో ఉన్నట్లుగా సమాచారం అందింది.
బ్రిగేడియర్ గోవింద్ సింగ్ సిసోడియా ఆమెతో మాట్లాడి, “మీరేం ఆందోళన చెందొద్దు. మా కమాండోలు వచ్చి, మిమ్మల్ని రక్షిస్తారు. మీరు ఎక్కడున్నారు” అని అడిగారు.
అప్పటికే ప్రియ ఫ్లోరెన్స్ ఆందోళనలో ఉన్నారు. “ఇది సెకండ్ ఫ్లోర్” అని ఆమె చెప్పారు.
బ్రిగేడియర్, “సరే, కంగారుపడొద్దు” అని చెప్పి, ఓ కాగితంపై ఆ సమాచారాన్ని కల్నల్ సునీల్ షెరోన్‌కు పంపారు.
కల్నల్ షెరోన్ ఆ బాధ్యతను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు అప్పగించారు.
సునీల్ జోధా, మనోజ్ కుమార్, బాబూ లాల్, కిషోర్ కుమార్‌లతో కలిసి సందీప్ ఉన్నికృష్ణన్ వారిని రక్షించేందుకు సిద్ధం అయ్యారు.
అద్దంలో కమాండోలను పసిగట్టిన టెర్రరిస్టులు
సందీప్ వ్యూహాన్ని సిద్ధం చేశారు. దీని ప్రకారం వారు ‘Y’ ఆకారంలో ఉన్న విశాలమైన మెట్ల మార్గం గుండా పైకి చేరుకోవాలి. ఆ మెట్లమార్గం నుంచి పామ్ లాంజ్, బాల్ రూంలకు వెళ్లాలి. అందుకోసం రెండు అతిపెద్దవైన తలుపులు ఉన్నాయి.
అప్పటికే హోటల్‌కు విద్యుత్ సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. టెర్రరిస్టులు ఏ ప్రాంతంలో దాక్కున్నారో తెలీదు. వారి ఉనికిని గుర్తించేందుకు ప్రయత్నిస్తూ, ముందుకు వెళ్లింది సందీప్ బృందం.
మెట్ల మార్గాన్ని చేరుకున్నారు. అప్పుడే వారిపైకి తుపాకీ కాల్పులు మొదలయ్యాయి. సందీప్ వెంటనే సునీల్, బాబులాల్‌లను దక్షిణం వైపున ఉన్న తలుపుల దగ్గరకు వెళ్లమని సంకేతాలిచ్చాడు. ఆ తలుపులు పామ్ లాంజ్, బాల్ రూంలకు దారి తీస్తాయి.
అక్కడికి చేరుకున్నాక వారిద్దరూ ఆ తలుపులకు చెరోవైపున ఉండి, గ్రెనేడ్‌లు విసిరి, పామ్ లాంజ్‌ను క్లియర్ చేయాల్సి ఉంది.
సునీల్ జోధా, బాబూ లాల్‌లు ఇద్దరూ ఆ తలుపులకు చెరోవైపున దాక్కున్నారు.
కానీ, అప్పుడే చీకట్లో నుంచి వచ్చిన గ్రనేడ్ నేరుగా మెట్లపై పడి, పేలింది. ఆ వెంటనే పై నుంచి ఏకే47 కాల్పులు మొదలయ్యాయి. తన ఇద్దరు కమాండర్ల ఫైర్ కవర్‌లో సందీప్ వేగంగా కదిలారు.
అక్కడున్న అతిపెద్ద అద్దంలో కమాండోల ప్రతిబింబాలను పైనున్న టెర్రరిస్టులు పసిగట్టారు. మరో గ్రనేడ్ పైనుంచి వచ్చి, గ్రానైట్ నేలపై పడి, పేలింది.
ఆ పేలుడికి సునీల్ జోధా తీవ్రంగా గాయపడి, ఆ మెట్లపై నుంచి దొర్లుతూ కిందకు జారాడు. రెండు బుల్లెట్లు అతడి శరీరంలోకి దిగాయి. వెంటనే కమాండోలు అతడికి కవర్ ఇస్తూ, పైకి కాల్పులు జరిపారు.
సందీప్ వెంటనే సునీల్ జోధాను చేరుకున్నారు. రక్తమోడుతున్న సునీల్‌ను చూసి, “ఫస్ట్ ఎయిడ్‌కు తీసుకుని వెళ్లండి” అంటూ బాబూలాల్‌కు చెప్పారు. మెరుపువేగంతో ఒక్కడే పామ్ లాంజ్ వైపు వెళ్లిపోయారు.
సందీప్ నుంచి జవాబు రాలేదు
పామ్‌లాంజ్ నుంచి బాల్ రూంకి చేరుకుని అంతా క్లియర్ చేయాలనేది సందీప్ లక్ష్యం.
“సియెరా ఫైవ్.. సియెరా ఫైవ్.. దిసీజ్ సియెరా వన్” అంటూ కల్నల్ షరీన్ అదే పనిగా సందీప్‌ను సంప్రదించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. సందీప్ నుంచి ఎలాంటి జవాబూ రాలేదు.
కల్నల్ పక్కనే ఉన్న బ్రిగేడియర్ సిసోడియా, “బహుశా, అతను వారికి దగ్గరగా ఉండి ఉండొచ్చు. అందుకే స్పందించలేదేమో”అని సర్దిచెప్పారు.
తన ఎంపీ5 తుపాకీతో కాల్పులు జరుపుతూ, వేగంగా కదులుతూ మరోవైపు నుంచి పామ్ లాంజ్‌కు వెళ్లే తలుపుల దగ్గరకు చేరుకున్నారు సందీప్. ఆయన్ను కవర్ చేయడానికి మరో కమాండర్ కూడా లేరు. టెర్రరిస్టుల సంగతి తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు సందీప్.
అదే సమయంలో మేజర్ కంద్వల్ టీం హోటల్‌లో చిక్కుకున్నవారిని రక్షిస్తూ, అంతా క్లియర్ చేస్తూ వెళ్తోంది. మరోవైపు మేజర్ సందీప్ గురించిన సమాచారం అందలేదు.
కల్నల్ సునీల్ షెరోన్ ఆదేశాలతో మేజర్ కంద్వల్, మేజర్ జస్రోషియా సందీప్ ఆచూకీ తెలుసుకునేందుకు బయలుదేరారు.
పామ్ లాంజ్‌లోని కారిడార్ వద్ద రక్తపు మడుగులో సందీప్ పడిపోయి ఉండడం కనిపించింది.
ఎడమ వైపు నుంచి ఆయనపై కాల్పులు జరిగినట్లుగా శరీరానికి ఎడమ వైపున బుల్లెట్ గాయాలున్నాయి. తల నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన వద్ద ఉండాల్సిన ఎంపీ5 తుపాకీ కూడా లేదు.
ఏం జరిగిందో అధికారులకు అర్థమైంది.
మేజర్ కంద్వల్ తన వాకీటాకీని కాకుండా మొబైల్ ఫోన్‌ను తీసుకుని కల్నల్ షెరోన్‌కు ఫోన్ చేసి, “సర్, ఉన్ని ఇక లేరు” అని చెప్పారు.
అవతలి వైపు నుంచి వెంటనే సమాధానం రాలేదు. బ్లాక్ టోర్నడో -ది త్రీ సీజెస్ ఆఫ్ ముంబయి 26/11 పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి.
అప్పుడు సందీప్ వయసు 31 ఏళ్లు.
ఎలా జరిగింది?
కారిడార్‌లోకి ప్రవేశించిన సందీప్ ఉన్నికృష్ణన్‌పై ఎడమ వైపు ఉన్న టేబుల్, సోఫాల వెనక దాక్కుని ఉన్న టెర్రరిస్ట్ ఏకే-47తో కాల్పులు జరిపాడు.
అక్కడి నుంచి సందీప్ దగ్గరున్న ఆయుధాలను తీసుకుని ఉత్తరం వైపుగా వెళ్లినట్లుగా రక్తపు మరకలతో కూడిన బూటు గుర్తులను గమనించారు.
సందీప్ చనిపోయే ముందు ఆ ఉగ్రవాదిపై కాల్పులు జరిపినట్లుగా అక్కడున్న గోడలకు ఉన్న బుల్లెట్ గుర్తులు, రక్తపు మరకలతో ఉన్న బూటు గుర్తులు చెప్తున్నాయి.
కొద్దిక్షణాలకు కల్నల్ నుంచి “సరే, అక్కడే వేచి ఉండండి. నేను ఎవరినైనా పంపిస్తాను” అని సమాధానం వచ్చింది.
సందీప్ ఉన్నికృష్ణన్ తన ప్రాణాలకు తెగించి, వారు మళ్లీ పై ఫ్లోర్లకు వెళ్లకుండా, నిలువరించి, వారు ఉత్తరం వైపున ఉన్న రెస్టారెంట్ల వైపు వెళ్లేలా చేశాడు.
సందీప్ ప్రాణత్యాగాన్ని వృథా పోనివ్వదలచుకోలేదు కల్నల్ షెరోన్. ఆ ఉగ్రవాదుల సంగతి చూడటానికి మరో వ్యూహం రచించారు.
తరువాతి కొద్ది గంటలకు వారి పని ముగించారు ఎన్‌ఎస్‌జీ కమాండోలు.
కోజికోడ్ నుంచి బెంగళూరుకు..
సందీప్ ఉన్నికృష్ణన్ కేరళలోని కోజికోడ్‌లో1977 మార్చి 15న కె.ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ దంపతులకు జన్మించారు. తండ్రి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో పనిచేశారు. సందీప్‌కు సోదరి ఉంది.
కేరళ నుంచి బెంగళూరుకు వచ్చిన ఉన్నికృష్ణన్ కుటుంబం అక్కడే స్థిరపడింది.
బెంగళూరులోని ఫ్రాంక్ ఆంటోని స్కూల్‌లో చదువుకున్నారు సందీప్ ఉన్నికృష్ణన్. ఆ తరువాత నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చేరారు.
ఇండియన్ మిలటరీ అకాడెమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని, 1999లో భారత సైన్యంలో బిహార్ రెజిమెంట్‌లోని ఏడో బెటాలియన్‌లో చేరారు. సైన్యంలో తన ధైర్యసాహసాలతో ‘ఆపరేషన్ విజయ్’తోపాటు పలు ఆపరేషన్లలో పాల్గొన్నారు.
2007లో డిప్యుటేషన్‌పై ఎన్‌ఎస్‌జీ విభాగంలోకి వెళ్లారు.
సందీప్‌కు మరణానంతరం, భారత ప్రభుత్వం ‘అశోక చక్ర ’అవార్డును ప్రకటించింది. యుద్ధ రంగంలో కాకుండా ఇతర ఆపరేషన్లలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘అశోక చక్ర’.
2009 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా సందీప్ కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందుకున్నారు.
తోటి కమాండోలతో ఆ మాట ఎందుకన్నారు?
తన కుమారుడు దాతృత్వ కార్యక్రమాల కోసం డబ్బులు ఇస్తున్న విషయం కూడా తండ్రి కె.ఉన్నికృష్ణన్‌కు అప్పటివరకు తెలీదు.
“నా కుమారుడు చనిపోయాక, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో చూశాను. మంచి జీతమే వస్తున్నప్పటికీ మూడు, నాలుగు వేలు మాత్రమే అకౌంట్లో ఉన్నాయి. మొదట ఆ డబ్బంతా ఖరీదైన బ్రాండెడ్ వస్తువుల కోసం ఖర్చుపెట్టాడని అనుకున్నాను. కానీ, అతడి సహచరుల ద్వారా సందీప్ దాతృత్వం గురించి తెలిసింది. ఓ సహచరుడి తల్లి ఆపరేషన్ కోసం సందీప్ ఆర్థిక సాయం చేశాడని తెలిసింది. అంతేకాదు సందీప్ క్రమం తప్పకుండా చాలా చారిటీ సంస్థలకు డబ్బు పంపిస్తున్నాడన్న విషయం, డొనేషన్ రెన్యువల్ రిమైండర్స్ వచ్చాక గానీ తెలీలేదు” అని ఆయన వార్తాసంస్థ పీటీఐతో గతంలో చెప్పారు.
సందీప్ ఏ పని చేసినా సరే, అందులో విజయం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడని ఆయన చెప్పారు. క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అంటే తనకు చాలా అభిమానమని తెలిపారు.
సందీప్ తల్లిదండ్రులు ఆయన స్ఫూర్తితో ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మెమోరియల్ ట్రస్ట్’ పేరిట సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బెంగళూరులోని యలహంక పరిధిలో ఓ రోడ్డుకు ‘సందీప్ ఉన్నికృష్ణన్ రోడ్’గా పేరు పెట్టారు.
సందీప్ చివరిసారిగా, “పైకి రావొద్దు. వారిని నేను చూసుకుంటాను” అని తన తోటి కమాండోలతో అన్న మాటల గురించి తండ్రి ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ, “సందీప్, తన సహోద్యోగి శరీరం దగ్గర అతడి తల్లి ఏడుస్తుంటే చూడటానికి తాను ఇష్టపడనని, అందుకు బదులుగా తన తల్లి ఆ నష్టాన్ని భరించేందుకు ఇష్టడతానని అంటుండేవాడు” అంటూ తన కుమారుడి మాటలను గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్: సొరంగంలో కార్మికులను రక్షించడం ఎప్పటికి సాధ్యమవుతుంది?
- భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరు ఉన్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
- దేశానికి పెళ్లికళ, ఏకంగా 38 లక్షల వివాహాలు.. ఈ సీజన్లో ఖర్చు ఎంతో తెలుసా?
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- డీప్ ఫేక్ ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)