హుస్సేన్ రాణా ఎవరు... అమెరికా ఆయనను భారత్‌కు ఎందుకు అప్పగిస్తోంది?

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2008 ముంబయి దాడుల కేసులో అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న తహవ్వూర్ హుస్సేన్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అక్కడి కోర్టు ఆమోదం తెలిపింది.

రాణా పాకిస్తాన్‌లో జన్మించినప్పటికీ కెనడా పౌరుడు. రాణాను అప్పగించాలని గతంలో భారత ప్రభుత్వం అమెరికాను కోరింది.

డెన్మార్క్‌లోని తన స్నేహితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి ముంబయి దాడికి కుట్ర చేశాడనే ఆరోపణలపై తహవ్వూర్ రాణాను అమెరికాలో దోషిగా తేల్చారు.

అమెరికా కోర్టు అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 62 ఏళ్ల తహవ్వూర్ హుస్సేన్ రాణా అమెరికా నిర్ణయంపై అప్పీల్ చేస్తారా, లేదా అనే వివరాలు తెలియదు.

రాణాను ఎప్పుడు భారత్‌కు రప్పిస్తారనే స్పష్టత కూడా లేదు.

ఇంతకూ ఈ తహవ్వూర్ హుస్సేన్ రాణా నేపథ్యం ఏమిటి? ముంబయి దాడుల్లో అతడి పాత్ర ఏమిటి? అమెరికాలో శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాడు?

2008 నవంబర్ 26న ముంబయిపై దాడి

2008 నవంబర్ 26న రాత్రి 10 మంది ఉగ్రవాదులు ముంబయిలోని పలు భవనాలపై ఏకకాలంలో దాడి చేశారు .

రెండు ఫైవ్ స్టార్ హోటళ్లు, ఓ హాస్పిటల్, రైల్వే స్టేషన్లు, యూదుల కేంద్రాన్ని టార్గెట్ చేశారు.

ఈ దాడిలో పలువురు విదేశీయులు సహా 164 మంది చనిపోయారు. భారత భద్రతా బలగాల కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు కూడా మరణించారు.

యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అధికారి హేమంత్‌ కర్కరే సహా పలువురు ముంబయి పోలీసు అధికారులు కూడా ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. .

తహవ్వూర్ హుస్సేన్ రాణా పాకిస్తాన్‌లో జన్మించారు. 2001లో హుస్సేన్ రాణా, ఆయన భార్య కెనడా పౌరసత్వం పొందారు.

కోల్‌మన్ హెడ్లీ, తహవ్వూర్ హుస్సేన్ రాణా చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో ఐదేళ్లు చదువుకున్నారు.

వాళ్లు షికాగోలో 2006లో మళ్లీ కలుసుకున్నారు. తర్వాత రాణా అమెరికాలో డేవిడ్ హెడ్లీకి కీలకమైన సహాయం అందించారు.

అయితే పోలీసుల విచారణలో రాణాకు వ్యతిరేకంగా హెడ్లీ అప్రూవర్‌గా మారాడు.

ముంబయిలో అమెరికా పౌరులను చంపడానికి రాణా సహాయం చేశాడని, మరో ఇతర 12 ఆరోపణలపై అక్కడి కోర్టు రాణాను దోషిగా నిర్ధరించింది.

రాణా పాత్ర ఎలా బయటపడింది?

ముంబయి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ గడ్డపై కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని భారత్ ఆరోపించింది.

దాడిలో పాల్గొన్న వారిలో అజ్మల్ కసబ్‌ను మాత్రమే భారత బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. 2012 నవంబర్‌లో అతనికి ఉరిశిక్ష పడింది.

పాకిస్తాన్-అమెరికన్ పౌరుడైన డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి వ్యతిరేకంగా భారత ఏజెన్సీలు చేసిన దర్యాప్తులో ఒక పేరు పదే పదే వినిపించింది. ఆ పేరు తహవుర్ హుస్సేన్ రాణా.

షికాగోలో నాలుగు వారాల పాటు జరిగిన విచారణలో రాణాకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఈ కేసులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాణాకు వ్యతిరేకంగా హెడ్లీ సాక్షిగా మారాడు.

ముంబయి దాడి ప్రణాళికపై హెడ్లీ వివరంగా వాంగ్మూలం ఇచ్చాడు. దాడిలో అతని ప్రమేయం, రాణా పాత్ర గురించి కూడా వివరించాడు.

పాకిస్తాన్‌లో వైద్య పట్టా.. ఆర్మీలో ఉద్యోగం

రాణా పాకిస్తాన్‌లో పుట్టి, పెరిగాడు. వైద్య పట్టా పొందిన తరువాత, పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో చేరాడు.

రాణా భార్య కూడా డాక్టర్‌. భార్యాభర్తలిద్దరూ 1997లో కెనడాకు వెళ్లారు. 2001లో కెనడియన్ పౌరసత్వం పొందారు.

2009లో అరెస్టు కావడానికి కొన్ని సంవత్సరాల ముందు రాణా అమెరికాలోని షికాగోలో ఇమ్మిగ్రేషన్, ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. అలాగే మరికొన్ని వ్యాపారాలు కూడా మొదలుపెట్టాడు.

హెడ్లీ ముంబయిపై దాడికి సిద్ధమైనప్పుడు రెక్కీ కోసం 2006 నుంచి 2008 వరకు చాలాసార్లు ముంబయికి వచ్చాడు

మళ్లీ మళ్లీ ముంబయికి ఎందుకు వెళ్తున్నాడో ఎవరికీ అనుమానం రాకూడదని ముంబయిలో రాణా ట్రావెల్ ఏజెన్సీ బ్రాంచ్‌ను ప్రారంభించాడు.

లష్కరేతోయిబా సూచన మేరకే రాణా ఇలా చేశాడని తెలిసింది.

ఎఫ్‌బీఐకి దొరికిన రాణా, హెడ్లీ

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అక్టోబర్ 2009లో షికాగో విమానాశ్రయంలో రాణా, హెడ్లీలను పట్టుకుంది.

జిల్లాండ్స్-పోస్టెన్ అనే వార్తాపత్రిక కార్యాలయాలపై దాడి కోసం డెన్మార్క్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ చేరుకున్నారని ఎఫ్‌బీఐ పేర్కొంది.

జిలాండ్స్-పోస్టెన్ ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్‌లను ప్రచురించింది.

విచారణలో ముంబయి దాడుల్లో కూడా రాణా హస్తం ఉన్నట్లు బయటపడింది. ఇలా రెండు వేర్వేరు కుట్రల్లో పాల్గొన్నందుకు రాణాకు 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

ముంబయి దాడులకు కుట్ర పన్నడమే కాకుండా, డానిష్ వార్తాపత్రికపై దాడికి కుట్ర పన్నడంలో కూడా రాణాను దోషిగా తేల్చారు.

హెడ్లీ కోపెన్‌హాగన్‌లో ఫస్ట్ వరల్డ్ ఆఫీస్ శాఖను ఏర్పాటు చేసేందుకు రాణా సమ్మతించాడు.

2009 అక్టోబరులో అరెస్ట్ తర్వాత రాణా, పాకిస్తాన్‌లోని లష్కరేతోయిబా శిక్షణ శిబిరాల్లో హెడ్లీ పాల్గొన్నట్లు అంగీకరించాడు.

అప్రూవర్‌గా మారిన హెడ్లీ

2002, 2005 మధ్య ఐదు వేర్వేరు సందర్భాల్లో తాను పాకిస్తాన్‌లో లష్కరేతోయిబా శిక్షణా శిబిరాలకు హాజరయ్యానని కూడా హెడ్లీ అంగీకరించాడు.

2005 చివరలో లష్కరేతోయిబా సభ్యులపై నిఘా కోసం హెడ్లీ భారతదేశానికి వెళ్లాలని ఆదేశాలు అందుకున్నాడు.

ఆ తర్వాత మూడేళ్లలో హెడ్లీ ఐదుసార్లు భారత్‌ను సందర్శించాడు.

"2006 వేసవి ప్రారంభంలో హెడ్లీ, ఇద్దరు లష్కరేతోయిబా సభ్యులు తమ లక్ష్యం తెలియకుండా ఉండటానికి ముంబయిలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని తెరవడం గురించి చర్చించారు" అని అమెరికాలో అటార్నీ జనరల్ ప్రకటన తెలిపింది.

హెడ్లీ ఇండియాలో తనకు అప్పగించిన పని పూర్తిచేయడం కోసం షికాగోకు వెళ్లి రాణాను సంప్రదించినట్లు వాంగ్మూలం ఇచ్చాడు.

ముంబయిలో 'ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్' కార్యాలయాన్ని ప్రారంభించడం గురించి రాణాతో హెడ్లీ చర్చించాడు.

వారు ఆ కార్యాలయాన్ని తమ కార్యకలాపాలను కవర్‌ చేయడానికి ఉపయోగించుకోవచ్చనుకున్నారు.

వాంగ్మూలంలో హెడ్లీ- " 2006 జులైలో నేను రాణాను కలవడానికి షికాగో వెళ్లి, లష్కరేతోయిబా నాకు అప్పగించిన మిషన్ (ముంబయి దాడి) గురించి చెప్పాను.

ముంబయిలో ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నా ప్రణాళికను రాణా ఆమోదించాడు. ఐదేళ్ల వ్యాపార వీసాను పొందడంలో సహాయం చేశాడు" అని తెలిపాడు.

2016 ఫిబ్రవరిలో బాంబే సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో వీడియో లింక్ ద్వారా వాంగ్మూలం ఇస్తూ ముంబయి దాడులకు నెలల ముందు తన కార్యకలాపాల గురించి రాణాకు తెలియజేసినట్లు హెడ్లీ చెప్పారు.

అమెరికా అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఏం చెప్పారు?

రాణాకు శిక్ష పడిన తర్వాత అసిస్టెంట్ అటార్నీ జనరల్ లీసా మొనాకో మాట్లాడుతూ.. "హెడ్లీ విదేశాల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నాడని తెలిసి అమెరికాలోని అతని స్థావరం నుంచి రాణా సహాయం అందించాడు'' అన్నారు.

కేసు విచారణకు సహకరించిన ఏజెంట్లు, విశ్లేషకులు, ప్రాసిక్యూటర్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మొనాకో చెప్పారు.

రాణా వంటి ముక్కుసూటి వ్యక్తినే ట్రాప్ చేసిన జిత్తులమారి వ్యక్తి హెడ్లీ అని రాణా న్యాయవాది చార్లీ ఆరోపించారు.

షికాగోలో జరిగిన విచారణలో రాణా కంటే హెడ్లీ లష్కరేతోయిబా కోసం చురుగ్గా పనిచేసేవాడని తేలింది.

2005లో ముంబయి, కోపెన్‌హాగన్‌లలో లష్కరేతోయిబా దాడులకు ప్లాన్‌ చేసిందని వారిద్దరూ కోర్టులో వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ రెండు కుట్రల్లో రాణా కూడా భాగస్వామి.

ముంబయి దాడిలో హెడ్లీ, లష్కరేతోయిబాకు సహాయం చేయడానికి మాత్రమే రాణా పాత్ర పరిమితమైంది.

డెన్మార్క్ విషయానికొస్తే ఇద్దరూ దాడిని స్వయంగా ప్లాన్ చేసుకున్నారు. దానిని అమలు చేయడానికి డెన్మార్క్‌కు బయలుదేరారు. అయితే అక్కడికి చేరుకోక ముందే షికాగో విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడ్డారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)