You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ది కేరళ స్టోరీ: అదా శర్మకు బెదిరింపులు వస్తున్నాయా... తాజా వివాదాలపై ఆమె ఏమంటున్నారు?
- రచయిత, మధు పాల్
- హోదా, బీబీసీ కోసం
‘‘ది కేరళ స్టోరీ’’ సినిమా మే 5న విడుదలైంది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచీ ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
సినిమా విడుదలైన తర్వాత కూడా చాలా వివాదాలు రాజుకున్నాయి. వీటికి ప్రధాన కారణం ఈ సినిమా కథే.
కేరళకు చెందిన హిందూ మహిళలు మతమార్పిడుల అనంతరం సిరియాకు వెళ్లడం చుట్టూ అల్లిన కథే ‘‘ది కేరళ స్టోరీ’’. దీనికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.
వాస్తవాల ఆధారంగా దీన్ని తెరకెక్కించామని సినిమా దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.
ఎన్నికల సభల్లోనూ దీనిపై చర్చ జరగడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హరియాణా లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ రాయితీలు కల్పించారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లో దీనిపై నిషేధం విధించారు.
తమిళనాడులోని చాలా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించకుండా నిలిపివేశారు. కేరళలో కూడా దీనిపై నిషేధం విధించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే, వీటిని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది.
ఎవరీ అదా శర్మ?
‘‘ది కేరళ స్టోరీ’’పై జరుగుతున్న చర్చలో నటి అదా శర్మ పేరు కూడా వినిపిస్తోంది.
ఈ సినిమా ప్రధానంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. వీటిలో ఒక పాత్రలో అదా శర్మ నటించారు.
చాలా ఏళ్ల నుంచీ అదా శర్మ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే, ఈ స్థాయి ప్రజాదరణ ఆమెకు ఎప్పుడూ లేదు.
31 ఏళ్ల అదా శర్మ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పెరిగింది మాత్రం ముంబయిలో.
12వ తరగతి పూర్తవుతూనే అదా శర్మ మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. జిమ్నాస్ట్ అయ్యేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కథక్‌తోపాటు ఆమె సాల్సా డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు.
కెరియర్‌లో..
అయితే, ఆమె కెరియర్ అంత సాఫీగా సాగలేదు. బాలీవుడ్‌లో అడుగుపెట్టే ముందు కొన్ని తెలుగు, తమిళ్ సినిమాల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులోనే అల్లు అర్జున్హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సన్నాఫ్ సత్యమూర్తి కూడా ఒకటి. ఆ సినిమాలోని ముగ్గురు హీరోయిన్లలో అదా శర్మ ఒకరు.
విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ‘‘1920’’తో ఆమె బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కమాండో 2, కమాండో 3, ‘‘హసీ తో ఫసీ’’ లాంటి సినిమాల్లోనూ ప్రధాన పాత్రలు పోషించారు.
అయితే, దక్షిణాది చిత్రపరిశ్రమలో వచ్చినంత గుర్తింపు కూడా హిందీ సినిమాలు ఆమెకు తెచ్చిపెట్టలేదు. ‘‘పుకార్, ద హాలిడే, పతీ పత్నీ ఔర్ పంగా, ఐసా వైసా ప్యార్’’లాంటి సిరీస్‌లలోనూ ఆమె కనిపించారు.
ఆమె పేరు ఎందుకు మార్చుకున్నారు?
గత 15 ఏళ్ల నుంచీ సినిమాల్లో అదా శర్మ నటిస్తున్నారు.
అయితే, ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమా విడుదల తర్వాత ఆమెపై మొదలైనంత స్థాయిలో చర్చ గతంలో ఎప్పుడూ జరగలేదు.
కొన్ని రోజులుగా సినిమాతోపాటు ఆమె పేరు కూడా వార్తల్లో నిలుస్తోంది.
తన అసలు పేరు అదా శర్మ కాదని, సినిమాల కోసం మాత్రమే ఆ పేరు ఎంచుకున్నానని ఇటీవల ఆమె వెల్లడించారు.
ఒక యూట్యూబర్‌తో ఇంటర్వ్యూలో ఆమె తాజాగా మాట్లాడారు. తన అసలు పేరు చాముండేశ్వరీ అయ్యర్ అని చెప్పారు. అయితే, ఈ పేరును పలకడం కాస్త కష్టమని, అందుకే పేరు మార్చుకున్నానని ఆమె చెప్పారు.
15 ఏళ్ల కెరియర్‌లో ఇదే తొలిసారి..
ఇన్‌స్టాగ్రామ్‌లో అదా శర్మకు 80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అప్పుడప్పుడు శాస్త్రీయ సంగీతం నుంచి జిమ్నాస్టిక్స్ వరకు ఫోటోలు, వీడియోలను ఆమె అభిమానులతో పంచుకుంటారు.
ట్రావెలింగ్ గురించి కూడా అభిమానులతో ఆమె తరచూ మాట్లాడుతుంటారు. ఇంట్లో పెద్దవారితో మాట్లాడుతున్న వీడియోలను కూడా ఆమె పోస్ట్ చేస్తుంటారు.
15 ఏళ్ల కెరియర్‌లో ఆమె ఎలాంటి వివాదంలోనూ చిక్కుకోలేదు. కానీ, ది కేరళ స్టోరీతో ఆమెకు ఒకేసారి చాలా వివాదాలు ఎదురయ్యాయి.
ఇటీవల ప్రమాదం
తన కొత్త సినిమా ప్రమోషన్లతో అదా శర్మ తీరిక లేకుండా గడుపుతున్నారు.
ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ సుదీప్తో సేన్‌తో కలిసి భిన్న ప్రాంతాలకు ఆమె వెళ్తున్నారు. ఇటీవల తెలంగాణలోని కరీంనగర్‌కు ఆమె ప్రమోషన్ల కోసం కారులో వెళ్లారు. అయితే, అప్పుడే కారుకు ప్రమాదం జరిగింది.
దీంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా సుదీప్తో సేన్ స్పందించారు. ‘‘ఒక కార్యక్రమం పాల్గొనేందుకు మేం కరీంనగర్‌కు వెళ్తున్నాం. కానీ, కారు ప్రమాదం వల్ల మేం అక్కడికి చేరుకోలేకపోయాం. కరీంనగర్ ప్రజలకు మేం క్షమాపణలు చెబుతున్నాం. మన అమ్మాయిలను కాపాడుకునేందుకు మేం ఈ సినిమా తీశాం. మాకు మీ మద్దతు కావాలి’’అని ఆయన చెప్పారు.
మరోవైపు అదా శర్మ కూడా స్పందిస్తూ.. ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ‘‘నాకు చాలా మంది నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. మేం బానే ఉన్నాం. అది అంత పెద్ద ప్రమాదం కాదు. మేం సురక్షితంగానే ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు’’అని ఆమె చెప్పారు.
అదా శర్మకు బెదిరింపులు వస్తున్నాయా?
‘‘ది కేరళ స్టోరీ’’ విషయంలో ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొంతమంది దీనికి మద్దతు పలుకుతుంటే, చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
తమకు చాలా బెదిరింపులు వస్తున్నాయని సినిమా నిర్మాతలు ఇటీవల అన్నారు. మరి అదా శర్మకు కూడా బెదిరింపులు వస్తున్నాయా?
ఈ ప్రశ్నపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నట్లే బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె చెప్పారు.
‘‘కొన్నిసార్లు చంపేస్తామని కూడా బెదిరింపులు వస్తున్నాయి. కానీ, ప్రజల నుంచి వస్తున్న ప్రేమే నన్ను కాపాడుతోంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు చెందిన ప్రజలు నన్ను మెచ్చుకుంటున్నారు. ఆ మెసేజ్‌లు చూసినప్పుడు నేను సురక్షితంగానే ఉంటాననే భరోసా వస్తుంది’’అని ఆమె అన్నారు.
ఆమె ఇంకా ఏమన్నారు?
మే 17న నిర్మాత విపుల్ షా, డైరెక్టర్ సుదీప్తో సేన్‌లతో ప్రమోషన్ కోసం అదా శర్మ కూడా ముంబయి వెళ్లారు. అక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
‘‘కొందరు మహిళలు, పిల్లలను వాషింగ్ మెషీన్లలో బట్టలు వేసినట్లు ఒక ట్యాంకర్లలో ఎక్కిస్తున్న దృశ్యాలను దర్శకుడు సుదీప్తో సేన్ నాకు చూపించారు. వారికి శ్వాస కూడా లోపల అందేది కాదు. అసలు వారికి ఏమైందో కూడా తెలియదు. పిల్లల్లో చాలా మందిని ఉగ్రవాదుల్లా మార్చేస్తున్నారు. మహిళలను సెక్స్ స్లేవ్‌గా మార్చేస్తున్నారు’’అని ఆమె అన్నారు.
ఈ కథ తన ద్వారా ప్రజలకు పరిచయం అవుతున్నందుకు తాను చాలా గర్వపడుతున్నానని ఆమె చెప్పారు. బ్రెయిన్ వాష్‌చేసి మతం మార్చినట్లుగా చూపిస్తున్న ముగ్గురు అమ్మాయిల కథ ప్రధానంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరేలా వీరిపై ఒత్తిడి చేసినట్లు కూడా చూపిస్తారు.
మొదట 32,000 మందిని ఇలా బలవంతంగా ఇస్లామిక్ స్టేట్‌లో చేరారని సినిమా నిర్మాతలు చెప్పారు. అయితే, వివాదం చెలరేగడంతో ఆ సంఖ్యను ట్రైలర్ నుంచి తొలగించారు.
మొదటి రోజు నుంచి ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. వివాదాల నడుమ ఈ వసూళ్లు మరింత పెరిగాయి.
11వ రోజునాటికి మొత్తంగా రూ. 147.04 కోట్లను సినిమా వసూలు చేసినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు.. ఊళ్లోకి దళితులను రానివ్వరు
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)