You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘అన్నీ మంచి శకునములే’ రివ్యూ: నందినీ రెడ్డి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండాయా?
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
తెలుగు చిత్రసీమలో మహిళా దర్శకుల సంఖ్య చాలా తక్కువ. ఉన్నవారు సరిగా వెలుగులోకి రాలేదు. నందినీ రెడ్డి మాత్రం క్రమం తప్పకుండా సినిమాలు తీస్తున్నారు.
మహిళలు మెగాఫోన్ పడితే కొత్త తరహా దృక్పథాలు బయటకు వస్తాయని, కొత్త కథలు వినిపిస్తారని చాలా మంది నమ్ముతారు. నందిని దాన్ని నిజం చేశారు కూడా.
'అలా మొదలైంది', 'ఓ బేబీ'.. రెండూ పిల్లల్నీ, పెద్దల్నీ ఆకట్టుకొన్నాయి. అవి రెండూ క్లీన్ 'యూ' సినిమాలు. స్వచ్ఛమైన వినోదాన్ని అందించాయి. అందుకే ఆమెపై ప్రేక్షకులకు గౌరవం ఎక్కువ.
'ఓ బేబీ' తరవాత కొంత విరామం తీసుకొని నందిని తీసిన సినిమా 'అన్నీ మంచి శకునములే'.
మహిళా దర్శకులే కాదు, మహిళా నిర్మాతలూ కరువైపోతున్న కాలంలో స్వప్నదత్, ప్రియాంక దత్... ఇద్దరూ అశ్వనీదత్ బాధ్యతలను భుజాన వేసుకొన్నారు. వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఈ సినిమా కూడా వారు నిర్మించినదే.
అందుకే 'అన్నీ మంచి శకునములే' చుట్టూ ఓ పాజిటీవ్ వైబ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పాజిటివ్ టైటిల్‌తో తీసిన ఈ సినిమాలో పాజిటివ్ విషయాలేంటి? నెగెటివ్ పాయింట్లేంటి?
అల విక్టోరియా పురంలో....
అది విక్టోరియా పురం అనే హిల్ స్టేషన్. కాఫీ తోటలెక్కువ. ఓ విలువైన ఎస్టేట్‌కు సంబంధించి రెండు కుటుంబాల మధ్య 80 ఏళ్ల నుంచీ ఓ కోర్టు కేసు నడుస్తూ ఉంటుంది.
సుధాకర్ (నరేష్), ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) రెండు కుటుంబాల తరపున కోర్టులో పోరాడుతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు కుటుంబాల మధ్య ఓ అనుకోని సంఘటన జరుగుతుంది.
డాక్టర్ (ఊర్వశి) తప్పిదం వల్ల సుధాకర్ ఇంట్లో పుట్టిన అబ్బాయి రిషి (సంతోష్ శోభన్) ప్రసాద్ ఇంట్లో పెరుగుతాడు. ప్రసాద్ కూతురు ఆర్య (మాళవికా నాయర్) సుధాకర్ కూతురుగా అయిపోతుంది.
అలా ఎందుకు జరిగింది? ఈ బిడ్డల మార్పిడి వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గి, గోడలు కూలాయా, లేదంటే కొత్త సమస్యలు వచ్చాయా అనేది మిగతా కథ.
ఆసుపత్రిలో బిడ్డలు మారిపోతే ఒకరి ఇంట్లో పెరగాల్సిన వాళ్లు మరో ఇంటికి వెళ్లిపోతే అనే పాయింట్‌తో కథ మొదలవుతుంది.
ఇదేం కొత్త కథ కాదు. ఇది వరకు ఇదే పాయింట్‌తో కొన్ని సినిమాలొచ్చాయి. అందులో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురము’లో పెద్ద హిట్.
కాకపోతే ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో ఇంకో ఉప కథ ఉంది. అది కాఫీ ఎస్టేట్ గొడవ. ఈ కేసు గురించి రెండు కుటుంబాలూ పోరాడుతుంటాయి. రిషి, ఆర్యల ప్రేమ కథ, వాళ్ల క్యారెక్టరైజేషన్ ఈ కథకు మరింత కీలకం.
నందిని కథలు సున్నితంగానూ, పాత్రలు పాజిటివ్‌గానూ ఉంటాయి. కథ రేఖామాత్రంగా ఎంచుకున్నా ఉద్వేగాలను బాగా పండిస్తారామె. కాబట్టి కథపరంగా అద్భుతమనిపించేవి లేకపోయినా, సన్నివేశాలు పండితే చాలు ఆడియన్స్‌ను మెప్పించగలరు.
సాధారణంగా ఫీల్ గుడ్ ఎమోషన్స్ సినిమాలన్నీ ప్రశాంతంగా మొదలవుతాయి. స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెడుతుంది. రేసీ స్క్రీన్ ప్లేలూ, యాక్షన్ థ్రిల్లర్‌లూ చూసిన కళ్లకు అది కాస్త 'విసుగు' లానే అనిపిస్తుంది. అదే సమయంలో తెరపై కనిపించే పాత్రధారులు, ఆ వాతావణం కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
రెండు కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని చెబుతూ ఈ కథను మొదలెట్టారు. ఆసుపత్రిలో బిడ్డల మార్పిడితో ఓ మంచి ముడి వేశారు. తరవాత ఏమవుతుందనే ఆసక్తి కలిగించారు. అయితే ఆ తరవాత కథ చాలా సాధారణంగా సాగుతుంది. కోర్టు గొడవ, ఇంటి వ్యవహారాలూ, ఆర్య, రిషిల స్నేహం, వాళ్ల మధ్య గొడవలూ, విడిపోవడం, మళ్లీ కలిసిపోవడాలూ.. వీటి సమాహారంగానే సినిమా నడుస్తుంది.
ఆ పాత్రలు అలా ఎందుకున్నాయో!
ఈ సినిమా కథకు రిషి, ఆర్య మధ్య స్నేహం, ప్రేమ, ఎడబాటు కీలకం. కానీ, అవన్నీ పైపై ముచ్చట్లుగా మలచుకొన్నారు నందిని. అదే ఈ కథలో లోపం.
ఈ సినిమాలో ప్రేమ ఉందా, లేదా అన్నట్టుంటుంది. రిషి, ఆర్యల మధ్య ఎమోషన్‌నీ, వాళ్ల రిలేషన్‌నీ సరిగా క్యాప్చర్ చేయలేకపోయారు.
చిన్నప్పటి నుంచీ స్నేహితులే అయినా కొన్నిసార్లు పరిచయమే లేనట్టు ప్రవర్తిస్తుంటారు. వాళ్ల మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా, ఏం కాలేదన్నట్టు కనిపిస్తుంటారు. అంటే, ఈ క్యారెక్టర్లు రాసుకోవడంలోనే దర్శకురాలు గందరగోళానికి గురయ్యాన్నమాట.
సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోనా, గెస్ట్ రోలా అనే అనుమానం వస్తుంటుంది. రిషి ప్రమేయం లేకుండానే కథలో కీలక విషయాలు జరిగిపోతుంటాయి. అలాంటప్పుడు కథానాయకుడు కేవలం ఓ శ్రోతగా, ప్రేక్షకుడిగా మాత్రమే కనిపిస్తాడు.
కాఫీ ఎగుమతుల విషయమై ఇటలీ వెళ్లడం, అక్కడ రిషి, ఆర్య మధ్య గొడవ కావడం మరీ నాటకీయంగా ఉంది. నిజానికి అక్కడ ఎలాంటి సంఘర్షణ సృష్టించి, ఇంట్రవెల్ కార్డు వేయాలో దర్శకురాలికి అర్థం కాలేదేమో అనిపిస్తుంది.
ఈ గొడవ జరిగిన దాదాపు రేండేళ్ల తరవాత ఆర్య, రిషి కలుస్తారు. అప్పుడు తమ మధ్య ఏం కాలేదన్నట్టు ప్రవర్తిస్తారు. ఆర్య, రిషి మధ్య ఉన్నది స్నేహమో, ప్రేమో, ద్వేషమో తెలియకపోతే, ఆ పాత్రలకు ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారు?
“నాకు ఆర్య అంటే ఎంత ఇష్టమో తెలుసా” అని చివర్లో హీరో ఒక్క డైలాగ్ చెబితే సరిపోతుందా?
ఆర్యకు ఎవరో ప్రపోజ్ చేస్తే.. ఆర్య కూడా ఆ అబ్బాయికి ఓకే చెబితే.. అటు హీరోలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఎలాంటి ఎమోషన్ ఉండదు.
ఆర్య, రిషి కలుసుకోవాలన్న ఆత్రుత, విడిపోతే బాధ ప్రేక్షకుల్లో కలగవు. పాత్ర చిత్రణ, స్క్రీన్ ప్లే ఇలా ఉంటే ఆ పాత్రలను ప్రేక్షకులూ ప్రేమించకపోతే కథ ఆసక్తికరంగా ఉంటుందా?
వెండి తెర నిండుగా..
రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్, షావుకారు జానకి, వాసుకీ.. ఓహ్.. తెర నిండా అద్భుతమైన నటీనటులే. వీళ్లలో ఎవరు తక్కువ?
షావుకారు జానకి లాంటి నటిని మళ్లీ వెండి తెరపై చూస్తుంటే, ఆమె మాట్లాడుతుంటే మనసు నిండిపోతుంది. కానీ ఆయా పాత్రల ప్రాధాన్యమేమిటి, ఈ పాత్రల్లో వాళ్లే ఎందుకు కనిపించాలి అనేది మరో ప్రధానమైన ప్రశ్న.
తొలి ప్రేమ తరవాత వాసుకి తెలుగులో చేసిన రెండో సినిమా ఇది. ఇంత సుదీర్ఘ విరామం తరవాత వాసుకి నటిస్తున్నారంటే ఆ పాత్రపై చాలా అంచనాలు పెట్టుకుంటాం. కానీ ఆ పాత్ర చేసిందేమీ లేదు. ఓ రెగ్యులర్ సోదరిలా అలా కనిపించి, ఇలా మాయమైపోతుంది.
ఈ కథను నడిపిన పాత్రలు మూడే. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్. ఇచ్చిన పాత్రలకు వాళ్లు నూరు శాతం న్యాయం చేశారు. వాళ్ల వల్లే సాదా సీదా సీన్లు కూడా చూడగలిగాం.
ఓ సన్నివేశంలో సోదరుల (నరేష్, రావు రమేష్) మధ్య ఎమోషన్ బాగా ఎలివేట్ అయ్యింది. దానికి కారణం ఆ పాత్రల్లో వారిద్దరూ ఉండటమే.
మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరో లెక్క. ఎందుకంటే ఆమె పాత్ర చిత్రణ అలానే ఉంటుంది. అమ్మాయిలేం తక్కువ అనుకొనే టైపు. ఆమె కూడా సహజంగా నటించారు.
తండ్రి అప్పును కూతురు తీరిస్తే, “నీకు పుట్టింది అమ్మాయి కాదు.. అబ్బాయి” అంటూ పక్కనున్న పాత్ర ఓ మాట అంటుంది. అప్పుడు వెంటనే “నాన్నల అప్పులు అబ్బాయిలే తీర్చాలా, అమ్మాయిలు తీర్చలేరా” అని అడుగుతుంది.
స్త్రీ స్వాభిమానం, వాళ్ల వ్యక్తిత్వం, తమ కాళ్లపై తాము నిలబడే విధానానికి ఈ సీన్ ఓ ప్రతీకగా కనిపిస్తుంది. తండ్రి బాధ్యతలను భుజాన వేసుకొని, అందుకోసం అహర్నిశలూ కష్టపడే అమ్మాయిల తత్వానికి ఈ సన్నివేశం అద్దం పడుతుంది.
పుట్టిన రోజు పార్టీ అడిగితే లెక్కలు మాట్లాడి, ఇంటిపై అప్పులున్నాయని, అందుకే ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక పాఠాలు చెప్పగలిగేది అమ్మాయిలు మాత్రమే.
సంతోష్ శోభన్ తన సహజమైన నటనతో కొన్ని సన్నివేశాలను పండించగలిగారు.
మామగారి ఇంటికి వచ్చి, ప్రేమతో తమ డిమాండ్లను పరిష్కరించుకొనే అల్లుడి పాత్రలో వెన్నెల కిషోర్ కాసేపు నవ్విస్తారు. తనకు మరో రెండు సీన్లు పడితే మరింత బాగుండేదనిపిస్తుంది.
రంగురంగుల లొకేషన్లు
విక్టోరియా పురం అనే ఓ ఊహాత్మక లొకేషన్లో ఈ కథ నడుస్తుంది. ఊటీలో తీసిన సినిమా ఇది. ఆ పచ్చదనం వెండి తెర అంతా పరచుకుంది.
ఫొటోగ్రఫీ బాగుంది. మిక్కీ జె.మేయర్ అందించిన స్వరాలు అంతగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతంలోనూ ఆయన ముద్ర కనిపించలేదు.
ఏ పాత్ర కోణంలో కథను చూడాలో ప్రేక్షకులకు అంతుచిక్కకపోవడమే ఈ సినిమాలో ప్రధానమైన లోపం.
అక్కడక్కడా కొన్ని సరదా సన్నివేశాలు, ఎమోషన్ సీన్లు తప్పితే పెద్దగా మెరుపులేం కనిపించవు. స్లో నేరేషన్ మరింత ఇబ్బంది పెడుతుంది. మొత్తమ్మీద ‘అన్నీ మంచి శకునములే’ అంచనాలను అందుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు.. ఊళ్లోకి దళితులను రానివ్వరు
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)