You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ఉగ్రం' రివ్యూ: 'నాంది' కాంబినేషన్‌లో అల్లరి నరేశ్ మరో హిట్ కొట్టాడా?
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
‘నాంది’ సినిమాతో అల్లరి నరేష్ కొత్తదారిలో నడుస్తున్నారు. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో హ్యాసప్రధానమైన కథలను పక్కన పెట్టి గంభీరమైన పాత్రలను ఎంచుకుంటున్నారు.
'నాంది' కాంబినేషన్‌లోనే తాజాగా ఉగ్రం విడుదలైంది. నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలసి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
‘ఉగ్రం’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? ‘నాంది’ వేసిన బాట ఫలించిందా?
మిస్సింగ్ కేసుల అంతు చిక్కిందా ?
సీఐ శివకుమార్ (అల్లరి నరేష్).. కనిపించకుండా పోయిన తన భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురు లక్కీ (బేబీ ఊహ)ల ఆచూకీ ఎలా కనుకున్నాడన్నది ఉగ్రం కథ.
ఓ కారు ప్రమాదంతో కథను ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఈ ప్రమాదం తరువాత శివ కుమార్ డిమెన్షియా (జ్ఞాపక శక్తిని కోల్పోయే స్థితి)కు గురికావడం, ఆ క్రమంలో వచ్చే హాస్పిటల్ సన్నివేశాలు కథపై కుతూహలాన్ని పెంచుతాయి.
అయితే, కథానాయకుడి ప్రేమ, పెళ్లి సన్నివేశాలను తెరపైకి తీసుకురావడంతో అసలు కథ నడక దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది.
ప్రథమార్ధంలో గతి తప్పిన ఉగ్రం
మిస్సింగ్ కేసుల సంబంధించిన కథ 'ఉగ్రం'. కానీ, కథలోకి వెళ్ళడానికి దాదాపు ప్రథమార్ధం అంతా కాలయాపన చేయడంతో ప్రేక్షకులకు నీరసం వస్తుంది.
పేపర్‌లో తరుచూ వచ్చే మిస్సింగ్ కేసులకు సంబధించిన వార్తలతో ఈ కథను తయారుచేసుకున్నామని దర్శకుడు చెప్పాడు.
ఇలాంటి సోషల్ కథను తెర పైకి ఎక్కిస్తున్నప్పుడు కథానాయకుడి ప్రయాణంలో సహజత్వం వుండాలి. కానీ, ఇందులో శివకుమార్ పాత్రను ఒక రొటీన్ పోలీసు అధికారిలానే తీర్చిదిద్దడం ఒక బలహీనత.
కథానాయకుడి పరిచయంలో ఒక పోరాట సన్నివేశం, అతని ప్రేమని పరిచయం చేస్తూ మరో పాట, తండ్రిని ఎదురించి పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి రొటీన్ సన్నివేశాలు కథకు అడ్డంకిగా మారాయి.
ద్వితీయార్ధంలో అసలు కథ మొదలు
దర్శకుడు చెప్పదలచుకున్న అసలు కథ ద్వితీయార్ధంలో మొదలవుతుంది.
తప్పిపోయిన వారు ఎక్కడి వెళ్లారు, ఎలా వున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, కథానాయకుడి అన్వేషణ ఎలా సాగింది, ఈ క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి వంటి అంశాలు కథకు ఆయువు పట్టు. కానీ ఇక్కడ కూడా కథ బొటాబొటిగానే సాగింది.
ఒక హార్డ్ డిస్క్‌లోని ఫుటేజ్ చూసి కిడ్నాప్‌లు ఎక్కడ జరుగుతున్నాయో క్లూ పట్టేయడం, గాజు ముక్కల సాయంతో లేడి రౌడీలను విచారించేయడం అంత తెలివైన కథనంలా అనిపించదు.
అయితే, ఈ విచారణలో హిజ్రాల ఎపిసోడ్ మాత్రం చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు.
లారెన్స్ కాంచన సినిమాని గుర్తుకు తెచ్చే విధంగా ఓ భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించాడు. తర్వాత నిజమైన హిజ్రాల గురించి ఇచ్చే సందేశం కూడా బావుంది.
సహజత్వం లేని ముగింపు
మిస్సింగ్ కేసులు సమాజంలోని సమస్య. ఇలాంటి వాటిని సినిమాగా మలిచినపుడు సహజత్వం, నిజాయితీ రెండూ కావాలి.
కానీ, ఈ కథలో కమర్షియల్ కోటింగ్ తప్పితే మరేదీ కనిపించలేదు.
కిడ్నాప్ చేసిన ముఠా, వారి లక్ష్యాలను పైపైనే చెప్పేసి, సహజత్వంకు దూరమైనా ఓ భారీ యాక్షన్స్ ఎపిసోడ్‌తో ముగించడం అంతగా ఆకట్టుకోదు.
బలహీనమైన ప్రతినాయకుడు
కథానాయకుడి ఉగ్రరూపం పండాలంటే బలమైన ప్రతి నాయకుడు వుండాలి. కానీ, ఇందులో ప్రతి నాయకుడు ఎవరనేది చివరి సన్నివేశం వరకూ తెలీదు.
ప్రేక్షకుల దృష్టిని మార్చడాని కొందరు దుండగులను విలన్స్‌గా చూపించినప్పటికీ అవి కథకు, హీరో పాత్రకు బలాన్ని చేకూర్చలేదు.
నరేష్ ఉగ్ర రూపం చూపించాడు కానీ..
అల్లరి నరేష్‌ను ఉగ్ర రూపంలో చూడటం కొత్త. పోరాట సన్నివేశాల్లో చాలా గంభీరంగా కనిపించాడు.
గత ఇరవై ఏళ్ళుగా కామెడీతో అలవాటైపోయిన నరేష్, ఇందులో చాలా నియంత్రణతో నటించాడు. కానీ, ఆ పాత్రను తీర్చిద్దిడంలోనే లోపాలు వున్నాయి.
హీరోకు ఒత్తిడి పెరిగితే ముక్కు చెవుల నుంచి రక్తస్రావం జరుగుతుందనే ఒక మెడికల్ కండీషన్ పెట్టారు. దీని ద్వారా కథలో ఉత్కంఠ తీసుకురావచ్చనేది దర్శకుడి ఆలోచన. కానీ అది తెరపై అంతగా కలసిరాలేదు.
ఒక బలమైన స్త్రీ పాత్ర
అపర్ణ పాత్రలో చేసిన మిర్నా మీనన్‌కు కీలకమైన పాత్రే దక్కింది. కథానాయకుడికి సమానంగా సాగే పాత్ర.
కాలేజీ అమ్మాయిగా, గృహిణిగా, తల్లిగా ఇలా మూడు కోణాల్లో ఆమె పాత్ర సాగింది.
నలుగురు దుండగలు ఘోరంగా అవమానించినపుడు ఆమె కనబరిచిన నటన చాలా సహజంగా వుంది.
వైద్యురాలిగా కనిపించిన ఇంద్రజ ఫర్వాలేదనిపిస్తుంది.
పాప పాత్రలో చేసిన ఊహ ముద్దుగా కనిపించింది. ఆ పాత్రతో చివర్లో సెంటిమెంట్ పండించాలని చూశారు. కానీ, అది కాస్త శ్రుతి మించిన సెంటిమెంట్‌గా తెరపైకి వచ్చింది.
మరో పోలీస్ అధికారిగా కనిపించిన శత్రు పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. మిగతా పాత్రలు పరిధిమేర కనిపించాయి.
ఆకట్టుకునే నేపథ్య సంగీతం
సాంకేతికంగా సినిమా బాగానే వుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పోరాట సన్నివేశాలను మరోస్థాయిలో తీసుకెళ్లింది.
సిద్ కెమరా పనితనం డీసెంట్ గావుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పోరాట సన్నివేశాల నిడివి కుదించాల్సింది. అబ్బూరి రవి సంబాషణలు మరీ గుర్తుపెట్టుకునేలా లేవు.
తొలి చిత్రంలో సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు విజయ్ కనకమేడల తన రెండో చిత్రానికి కమర్షియల్ కోటింగ్ వేయడానికి చేసిన ప్రయత్నం అంతగా మెప్పించలేదు.
ఇవి కూడా చదవండి:
- బుద్ధ పూర్ణిమ: గౌతమ బుద్ధుడి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
- ప్రపంచ బ్యాంకును పర్సనల్ లోన్ అడగొచ్చా, ఆ బ్యాంకు ఎలా పని చేస్తుంది?
- ఏపీ-తెలంగాణ వర్షాలు: ఈసారి ఎండాకాలం లేదా అని ఎందుకు చర్చ జరుగుతోంది?
- పట్టాభిషేకాలు - సంప్రదాయాలు: మోకాళ్లపై నడిచే రాణి, ఎవరూ కూర్చోని పవిత్ర సింహాసనం, దూడ చర్మంతో కిరీటం
- వైరల్: శవాన్ని రేప్ చేయకుండా సమాధిపై ఇనుప తలుపు పెట్టారనే వార్తల్లో నిజమెంత? ఇది పాకిస్తాన్లోదా, హైదరాబాద్లోదా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)