కల్తీ మద్యం: ఆ ఊళ్లో ఎక్కడ చూసినా మృతదేహాలే, 47మందిని బలి తీసుకున్న ఘటనపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కళ్లకురిచ్చి పట్టణంలో స్థానిక కోర్టు వెనుక ఉన్న కరుణాపురం పరిసరాల్లోకి అడుగుపెట్టగానే మాకు మృత్యుఘోష వినిపించింది.

"అన్నయ్య నా కళ్ల ముందే చచ్చిపోతుండటం చూశాను సార్" అని ఏడుస్తూ మణి అనే యువకుడు వివరించారు. తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం (హూచ్‌) తాగి మృతిచెందిన మొదటి వ్యక్తి సురేశ్. ఆయన సోదరుడు ఈ మణి.

“ మొదట్లో తన చెయ్యి నొప్పిగా ఉందని, తర్వాత తిమ్మిరిగా ఉందని చెప్పారు. ఒక్కసారిగా కడుపు నొప్పి అంటూ అరిచాడు. ఆసుపత్రికి తీసుకెళ్లాను. డాక్టర్ ఎంత ప్రయత్నించినా అన్నయ్య బతకలేదు. కడుపు ఉబ్బి, చివరికి చనిపోయారు.’’ అని తెలిపారు మణి.

‘‘కల్తీ మద్యం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూశా. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నా." అని మణి ఆవేదనతో చెప్పారు.

మణిలాగే కళ్లకురిచ్చి జోగియర్ స్ట్రీట్, కరుణాపురం ప్రాంతాలకు చెందిన చాలామంది తమ కుటుంబీకులను కోల్పోయారు. కొన్ని కుటుంబాలలో పిల్లలను అనాథలను చేసి తల్లిదండ్రులిద్దరూ మరణించిన ఘటనలు ఉన్నాయి. చాలా ఇళ్లలో కుటుంబాన్ని పోషించే వ్యక్తులే చనిపోయారు.

అసలేం జరిగింది?

కళ్లకురిచ్చి సమీపంలోని కరుణాపురానికి చెందిన నలుగురు బుధవారం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఆ నలుగురు మద్యం (కల్తీ మద్యం) సేవించినట్లు వారి బంధువులు బీబీసీతో చెప్పారు.

బుధవారం మధ్యాహ్నానికి కరుణాపురం, దాని పరిసరాలలోని 4 గ్రామాల నుంచి కల్తీ మద్యం సేవించిన అనేకమంది విపరీతమైన విరేచనాలు, చేతులు, కాళ్లు తిమ్మిరి వంటి సమస్యలతో కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు.

కల్తీ మద్యం బాధితులతో 20కి పైగా అంబులెన్స్‌లు ఒకే సమయంలో ఆసుపత్రికి చేరుకున్నాయి. ఆసుపత్రి పేషెంట్లతో నిండిపోవడంతో వారిలో కొందరిని సేలం, పుదుచ్చేరి, విల్లుపురం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ఉపయోగించే మిథనాల్‌ను మద్యంలో కలపడం వల్ల ఇది జరిగినట్లు తెలిసింది. పరిశ్రమల నుంచి మిథనాల్‌ను కొన్నిసార్లు స్థానిక విక్రేతలు చట్టవిరుద్ధంగా కొనుగోలు చేస్తుంటారు. కల్తీ మద్యాన్ని తయారు చేసేటప్పుడు దీనిని అందులో కలుపుతారు.

ఆల్కహాల్‌లలో మిథనాల్‌ అత్యంత ప్రమాదకరమైంది. దీనిని యాంటీ-ఫ్రీజింగ్ ఏజెంట్ (నీరు గడ్డకుండా చేసే రసాయనం) గా కూడా ఉపయోగిస్తారు. మిథనాల్ తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది అంధత్వం, కాలేయం దెబ్బతినడంలాంటి తీవ్ర పరిణామాలతోపాటు, మరణానికి కూడా దారితీయవచ్చు.

కుటుంబాల రోదనలు

కల్తీ మద్యం తాగి 47 మందికి పైగా మృతి చెందిన ఘటన ఒక్క కళ్లకురిచ్చి మాత్రమే కాకుండా తమిళనాడును కుదిపేసింది. బాధితులు ఏం చెబుతున్నారో తెలుసుకోవడానికి బీబీసీ అక్కడికి వెళ్లింది.

బీబీసీ సిబ్బంది కరుణాపురం గ్రామంలోకి ప్రవేశించినప్పుడు, వీధిలో ఫ్రీజర్ బాక్సులలో పక్కపక్కనే మృతదేహాల వరుసలు కనిపించాయి. ఆ వీధిలో ఉన్న దాదాపు అన్ని ఇళ్ల బయట టెంట్ వేసి ఉంది. టెంట్ కింద ఫ్రీజర్ బాక్సులలో మృతదేహాలు కనిపించాయి.

ఈ కల్తీ మద్యం విషాదం కారణంగా ఒకే వీధిలో చాలామంది మరణించడంతో వారి బంధువులు మొదట ఎవరిని పరామర్శించాలో, ఎవరిని ఓదార్చాలో అర్థంకాక బోరుమన్నారు.

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు

ఇద్దరు స్కూలు విద్యార్థులు ఏడుస్తూ కనిపించారు. ఈ పిల్లల ఏడుపు వీధిలో ఉన్నవారిని కంటతడి పెట్టించింది. వారిలో ఒకరు పదో తరగతి విద్యార్థి. తల్లి వడివుకరసి, వికలాంగుడైన తండ్రి సురేశ్ ఇద్దరూ కల్తీ మద్యం తాగి చనిపోయారని ఏడుస్తూ చెప్పారు.

“ఏం చేయాలో మాకు తెలియదు. నాకు అక్క ఉంది. 11వ తరగతి చదువుతోంది. అమ్మా నాన్న ఇద్దరూ లేకుండా ఏం చేయాలో తెలియడం లేదు." అని అన్నారు.

ఆ ఇంటి పక్కనే ఉండే కందన్ కూడా మద్యం తాగి చనిపోయారు. దీని గురించి ఆయన తల్లి బీబీసీతో మాట్లాడుతూ “కందన్‌కు ఇద్దరు పిల్లలున్నారు. రోజూ కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఇపుడేం చేయాలి? నేను ముసలిదాన్ని. ఈ వయసులో పనికి ఎలా వెళ్లగలను.’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

కరుణాపురం గ్రామంలో చాలా ఇళ్లలో దాదాపు ఇలాంటి బాధితులే కనిపించారు. ఎక్కువ మంది చనిపోవడంతో కొన్ని ఇళ్లలో మృతదేహాన్ని పెట్టడానికి ఫ్రీజర్ బాక్స్ కూడా దొరకలేదు. వారి ఇంటి ముందు చెక్క బల్ల మీదనే మృతదేహాలను పడుకోబెట్టాల్సి వచ్చింది.

‘24 గంటలు అందుబాటులో మద్యం’

అక్కడ గుమిగూడిన పలువురు మహిళలు బీబీసీతో మాట్లాడుతూ.. ఈ మద్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఇతర సరుకుల మాదిరిగానే ఈ మద్యాన్ని ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో తీసుకొచ్చి విక్రయిస్తున్నారని వారు వెల్లడించారు. ఊళ్లోకి వచ్చే ఈ మద్యాన్ని స్త్రీ పురుషులు కొనుక్కుని తాగుతారని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని కరుణాపురం ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషాదం తరువాత కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీతో పాటు మరో 10 మంది పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జిల్లా కలెక్టర్‌ను కూడా బదిలీ చేసింది.

కరుణాపురం ప్రాంతంలో నివాసముంటున్న ఇద్దరు వ్యక్తులే చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు బీబీసీ క్షేత్రస్థాయి విచారణలో వెల్లడైంది.

ఎక్కువగా కూలీలే

ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువగా గిరిజన, షెడ్యూల్డ్ తరగతులకు చెందినవారు. వీరిలో చాలామంది మార్కెట్లో బరువులు ఎత్తే పనులు, ఇతర కూలి పనులు చేస్తుంటారు.

ఈ కూలీలు ఉదయం వెళ్లి, పని ముగించుకుని ఇంటికి వచ్చి, కరుణాపురానికి చెందిన ఆ ఇద్దరు వ్యాపారుల వద్ద మద్యం కొని తాగుతుంటారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణం నడుస్తుండగా ఈ అక్రమ మద్యాన్ని ఎందుకు కొని తాగుతున్నారనే ప్రశ్నకు స్థానికులు సమాధానమిస్తూ.. “ప్రభుత్వ మద్యం దుకాణంలో అయితే 150 రూపాయలు ఖర్చు చేయాలి. ఈ మద్యం 50 రూపాయలకే లభిస్తోంది. వారికొచ్చే రూ. 300- 500 ఆదాయంలో తక్కువ ఖర్చుతో ఈ మద్యం కొంటారు.” అని చెప్పారు.

సీబీసీఐడీ విచారణ

కల్తీ మద్యం కారణంగా 47 మంది మరణించడంతో కేసు దర్యాప్తును సీబీసీఐడీకి బదిలీ చేశారు. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు.

మరణించిన వారికి 10 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి. అలాగే అక్రమ మద్యం వ్యాపారం, దానికి సంబంధించిన మరణాలపై దర్యాప్తుకు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

గతేడాది విల్లుపురంలో ఇటువంటి ఘటనలోనే 22 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కల్తీ మద్యం అమ్మకాలను నిలువరించడంలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నాయి.

“కళ్లకురిచ్చి దుర్ఘటన తమిళనాడును 1980లలోకి తీసుకెళ్లింది” అని ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిసామి విమర్శించారు.

ఈ వ్యవహారంపై అన్నాడీఎంకే కోర్టును ఆశ్రయించింది. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)