దిల్లీ బ్లాస్ట్: సూసైడ్ బాంబర్‌గా చెబుతున్న డాక్టర్ ఉమర్ నబీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసులో నవంబర్ 16న మొదటి అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది.

కశ్మీర్‌కు చెందిన ఆమిర్ రషీద్ అలీని అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది.

ఆయన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ సహచరుడని, దిల్లీ పేలుడు కుట్రలో భాగస్వామిగా ఎన్ఐఏ తెలిపింది.

నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడులో 12 మంది చనిపోయారు.

ఎవరీ ఉమర్ ఉన్ నబీ ?

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ ఉన్ నబీని 'సూసైడ్ బాంబర్'గా ఎన్ఐఏ పేర్కొంది. పేలుడు జరిగిన కారును ఉమర్ నబీనే నడిపారనే ఆరోపణలున్నాయి.

శ్రీనగర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో, పుల్వామా జిల్లాలోని కోయిల్ గ్రామంలో ఉమర్ ఉన్ నబీ ఇల్లు ఉంది. శ్రీనగర్ నుంచి కోయిల్ చేరుకోవడానికి, చాలా గ్రామాలను దాటాలి.

కోయిల్ గ్రామంలో ఒక ఇరుకు సందులో నుంచి ఉమర్ ఉన్ నబీ ఇంటికి వెళ్లాలి.

ఇటీవల, ఉమర్ నబీ ఇంటిని రాత్రిపూట భద్రతా దళాలు పేల్చివేశాయి. ఇప్పుడది శిథిలాల కుప్పగా మారింది.

రాత్రి 12 గంట నుంచి 2:30 గంటల మధ్య మూడు పేలుళ్లు వినిపించాయని ఇల్లు కూల్చివేసిన మరుసటి రోజు పక్కింటివారు చెప్పారు.

మొదట ఇంటి చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించి, ఆ తర్వాత పేలుళ్లు జరిపినట్లు వారు చెప్పారు.

ఉమర్ కుటుంబంలో ఆయన తల్లిదండ్రులు, సోదరుడు, సోదరుడి భార్య, ఒక సోదరి ఉన్నారు.

డాక్టర్ ఉమర్ ఏడాదిన్నర కిందట ఇక్కడి(కశ్మీర్) నుంచి వెళ్లిపోయారని, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని ఆయన సోదరుడి భార్య ముజమ్మిల్ అఖ్తర్ బీబీసీతో చెప్పారు.

"ఆయన చివరిసారిగా రెండు నెలల కిందట ఇంటికి వచ్చారు. గత శుక్రవారం నేను ఉమర్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఇంటికి తిరిగి వస్తానన్నారు కానీ, ఈరోజు ఇది వింటున్నాం. అంతకుముందు, ఆయన అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసేవారు. ఆ తర్వాత, ఆయన ఫరీదాబాద్‌ వెళ్లారు" అని ఆమె అన్నారు.

డాక్టర్ ఉమర్ శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) నుంచి ఎంబీబీఎస్, ఎండీ చదివారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

ఈ ఇల్లు తప్ప వారికి వేరే ఆస్తి గానీ, భూమి గానీ లేదని ముజమ్మిల్ అఖ్తర్ చెప్పారు. పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నట్లు చెప్పారామె.

డాక్టర్ ఉమర్ మరో బంధువు తబస్సుమ్ అరా బీబీసీతో మాట్లాడుతూ, "కుటుంబం గడిచేందుకు ఉమర్ తల్లి చాలా కష్టపడ్డారు. ఇంటింటికీ వెళ్లి పని చేసుకుంటూ పిల్లలను చదివించారు" అని అన్నారు.

కొద్దికాలం కిందట, ఉమర్‌కు నిశ్చితార్థం కూడా జరిగినట్లు తబస్సుమ్ చెప్పారు.

ఆమిర్ రషీద్ అలీ ఎవరు?

దిల్లీ పేలుడు కేసులో పుల్వామాలోని సంబురా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఆమిర్ రషీద్ అలీని ఎన్ఐఏ అరెస్టు చేసింది.

ఆమిర్ కుటుంబం చెప్పినదాని ప్రకారం, ఆయన ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం సంబురాలోని రెండంతస్తుల ఇంట్లో నివసిస్తున్నారు. ఆమిర్‌కు తల్లి, సోదరుడు, సోదరుడి భార్య ఉన్నారు.

ఆమిర్ అన్నయ్య ఉమర్ రషీద్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయనను కూడా అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

నవంబర్ 10వ తేదీ రాత్రి, ఇంట్లో ఉన్న ఇద్దరు సోదరులను పోలీసులు తీసుకెళ్లారని ఆమిర్ సోదరుడి భార్య కుల్సుమ్ జాన్ చెప్పారు.

"రాత్రి 11 గంటలైంది. పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఆమిర్, ఉమర్ రషీద్‌లను తీసుకెళ్లారు. వారిని ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. మరుసటి రోజు ఉదయం, మేం పాంపోర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. కానీ, మమ్మల్ని లోపలికి అనుమతించలేదు" అని ఆమె అన్నారు.

"మూడో రోజు, మేం మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. ఆ రోజు, ఉమర్‌ను కలిసేందుకు మమ్నల్ని అనుమతించారు. ఆయనతో మాట్లాడాం. పోలీసులు ఏదో దర్యాప్తు చేస్తున్నామని, ఆందోళన చెందడానికి ఏమీ లేదని చెప్పారు" అని కుల్సుమ్ అన్నారు.

"అదే రోజు సాయంత్రం, విలేజ్ లంబార్దార్‌(గ్రామస్థులకు, ప్రభుత్వానికి మధ్య అధికారి)కు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఉమర్ రషీద్‌ను తీసుకెళ్లమని చెప్పారు. మేం ఆయనతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇంటికి తీసుకొచ్చాం. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఉమర్ రషీద్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని పోలీసులు చెప్పారు" అని ఆమె అన్నారు.

అదే రోజు సాయంత్రం ఎన్ఐఏ అధికారులు వచ్చి, ఉదయం 8 గంటలకు శ్రీనగర్‌లో దాల్ గేట్‌లోని తమ కార్యాలయానికి ఉమర్ రషీద్‌ను తీసుకురమ్మన్నారని ఆమె చెప్పారు.

మరుసటి రోజు వారు ఉమర్ రషీద్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, అప్పటి నుంచి తనకు ఏమీ తెలియలేదని కుల్సుమ్ జాన్ చెప్పారు. నవంబర్ 10 నుంచి ఆమిర్‌ను కలవలేదని చెప్పారామె.

ఉమర్ రషీద్‌ ఎప్పుడూ దిల్లీకి వెళ్లలేదని కుల్సుమ్ అంటున్నారు.

"మామూలుగా, సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చిన తర్వాత, తినేసి పడుకునేవారు. ఇప్పుడు చెబుతున్న విషయాలేవీ ఆయనకు తెలియదు. మాకు తెలిసింది మేం మీకు చెబుతున్నాం" అని అన్నారు కుల్సుమ్.

ఆమిర్ కుటుంబ సభ్యులు చెబుతున్నదాని ప్రకారం, ఆమిర్ 2020 నుంచి ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు శాలువాలుె తయారు చేసేవారు. శాలువాల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈ పని మానేశారు. ఆమిర్ 10వ తరగతి వరకు చదివారు, వాళ్లన్నయ్య ఉమర్ రషీద్ 12వ తరగతి వరకు చదివారు.

ఆమిర్ ఇంకా వివాహం చేసుకోలేదు, అన్నయ్య ఉమర్ రషీద్‌కు పెళ్లైంది. ఆయనకు ఒక బిడ్డ కూడా ఉన్నారు.

తన కొడుకు గురించి ఏం చెబుతున్నారో తనకు తెలియదని ఆమిర్ తల్లి అంటున్నారు. తల్లిదండ్రులు తమ కొడుకు ఏం చేస్తున్నారని నిరంతరం ఎలా గమనిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు.

"అందరిలాగే అమిర్ కూడా ఇంటి పనులన్నీ చేసేవాడు. ఈసారి, పంట కోయడానికి మాకు కూలీలు దొరకలేదు, అతనే కోశాడు. నాకు అన్ని విధాలా సాయం చేశాడు. నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, మేం అతన్ని అనుమానించడం లేదు. నేను మీకు అబద్ధం చెప్పడం లేదు. అతనిపై ఇంతవరకు ఎలాంటి కేసు లేదు. పోలీసు రికార్డు లేదు. ఇక్కడ రాళ్ల దాడి జరిగినప్పుడల్లా, చాలామందిని అరెస్టు చేశారు. వారిపై కేసులు పెట్టారు. కానీ, వీళ్లిద్దరిపై ఎప్పుడూ కేసు నమోదు చేయలేదు. వీళ్ల జోలికి ఎవరూ రాలేదు" అని అన్నారామె.

ఆమిర్‌కు న్యాయం చేయాలని ఆయన తల్లి డిమాండ్ చేస్తున్నారు.

ఎన్ఐఏ ఏమంటోంది?

ఎర్రకోట సమీపంలో పేలుడుకు సంబంధించి, ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి సహచరుడిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. దాడికి కుట్ర పన్నిన కశ్మీరీ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ అనుమానితుడిని ఆమిర్ రషీద్ అలీగా ఏజెన్సీ గుర్తించింది. దాడికి ఉపయోగించిన కారు ఆమిర్ రషీద్ అలీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. దిల్లీలో ఆమిర్ రషీద్‌ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

"జమ్మూ కశ్మీర్‌లోని పాంపోర్‌ పరిధిలో ఉన్న సంబురా గ్రామ నివాసి అయిన నిందితుడు, ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ నబీతో కలిసి ఉగ్రవాద దాడికి కుట్ర పన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది" అని పత్రికా ప్రకటన పేర్కొంది.

ఐఈడీగా ఉపయోగించిన కారు కొనుగోలుకు సాయం చేసేందుకు ఆమిర్ దిల్లీకి వచ్చారని ఎన్ఐఏ తెలిపింది. అంతేకాదు, డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి చెందిన మరో కారునూ స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.

ఈ కేసులో సాక్ష్యాల కోసం వాహనాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో గాయపడిన వారితో సహా ఇప్పటివరకు 73 మంది సాక్షుల నుంచి ఏజెన్సీ వాంగ్మూలాలను నమోదు చేసింది.

జాసిర్ బిలాల్ అరెస్టు

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసులో సోమవారం అంటే నవంబర్ 17న ఎన్ఐఏ రెండవ అరెస్టు చేసింది.

కశ్మీర్ నివాసి అయిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్‌ను శ్రీనగర్‌లో అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.

దిల్లీ పేలుడుకు ముందు డ్రోన్లు, రాకెట్లను తయారు చేయడానికి ప్రయత్నించడం ద్వారా జాసిర్ ఉగ్రవాద దాడులకు సాంకేతిక మద్దతు అందించారని ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉమర్ నబీతో పాటు జాసిర్ కూడా పేలుడు కుట్రలో ఉన్నారని ఏజెన్సీ పేర్కొంది.

జాసిర్ తండ్రి బిలాల్ అహ్మద్ వాని రెండు రోజుల కిందట తనను తాను తగలబెట్టుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి.

బిలాల్‌ను శ్రీనగర్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆయన సోమవారం ఆసుపత్రిలోనే మరణించారు.

బిలాల్ అహ్మద్ వాని సోదరుడి భార్య నసీమా అఖ్తర్ మీడియాతో మాట్లాడుతూ, "మా మరిది బిలాల్ అహ్మద్ అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నారు. అరెస్టైన డాక్టర్ ఆదిల్ మా పక్కింటివ్యక్తి. ఆయన గురించి మాకెలా తెలుస్తుంది? తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి వ్యక్తులతో స్నేహం చేయమని చెబుతారు. కానీ, ఎవరేమిటో మనకెలా తెలుస్తుంది? ఒక వ్యక్తి తప్పు చేస్తే, దానికి ప్రతి ఒక్కరినీ శిక్షించలేం" అని అన్నారు.

"లెక్చరర్ అయిన నా భర్త నవీల్ అహ్మద్‌ను కూడా అరెస్టు చేశారు. తనను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన విధుల్లోనే ఉన్నారు. డానిష్‌ను కూడా అరెస్టు చేశారు. మాకేమీ తెలియదు. ఆయన్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం" అన్నారు నసీమా.

డాక్టర్ ఆదిల్‌ను ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

(ఆత్మహత్య అనేది తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, మీరు భారత ప్రభుత్వ జీవన్‌సాథీ హెల్ప్‌లైన్ 18002333330 నుంచి సహాయం పొందవచ్చు. మీ స్నేహితులు, బంధువులతో కూడా మీరు మాట్లాడండి).

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)