You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎర్రకోట సమీపంలో పేలుడుకు, కశ్మీర్‌లో అరెస్టైనవారికి సంబంధం ఉందా?
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో ఎనిమిది మంది మరణించిన మూడు రోజుల తర్వాత, కశ్మీర్‌లో ఇటీవల అరెస్టైన ఏడుగురికి ఈ ఘటనతో సంబంధం ఉందా? అనే దానిపై విచారణ చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు బీబీసీతో చెప్పారు.
దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనంతో దీనికి సంబంధం ఉందా అనేది కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
బుధవారం, కేంద్ర కేబినెట్ ఈ పేలుడును దేశ వ్యతిరేక గ్రూపులు జరిపిన "భయంకరమైన ఉగ్రవాద దాడి"గా పేర్కొంది.
అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ పేలుడు కారకులను వదిలిపెట్టబోమని, చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), అలాగే పేలుడు పదార్థాల చట్టం, క్రిమినల్ కోడ్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించారు.
ఈ కేసు దర్యాప్తుపై పోలీసులు గానీ, ఎన్ఐఏ గానీ ఇంకా మీడియా సమావేశం నిర్వహించలేదు, అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇంతలో, కొన్ని రిపోర్టులు, ధ్రువీకరించని కథనాలు మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారాయి.
మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం అనేక ప్రశ్నలకు సమాధానం దొరకలేదు- ముఖ్యంగా కశ్మీర్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేయడం, ఫరీదాబాద్‌లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో దీనికి సంబంధం ఉందా? వంటివి.
‘వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్’
సోమవారం సాయంత్రం పేలుడుకు కొన్నిగంటల ముందు, కశ్మీర్, ఉత్తరప్రదేశ్, హరియాణాలకు చెందిన ఇద్దరు వైద్యులతో సహా అరెస్టైన ఏడుగురి విషయం జమ్మూకశ్మీర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఫరీదాబాద్‌లో రెండు ఆటోమేటిక్ రైఫిల్స్, 2,900 కిలోల బాంబు తయారీ సామగ్రి సహా కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
వారి ప్రకటనలో "వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్" గురించి ప్రస్తావించారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన వారిని గుర్తించి, అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఎన్ఐఏ ఏమంటోందంటే..
దిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించి పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్స్ అధ్యయనం చేస్తున్నామని, కాబట్టి ఇప్పుడే వివరాలను పంచుకోలేమని ఎన్ఐఏ బీబీసీకి తెలిపింది.
ఇటీవలి అరెస్టులకు, కారు డ్రైవర్‌గా మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న వ్యక్తికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనేది సహా, ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఆ వ్యక్తి గంటల తరబడి దిల్లీలో తిరిగారని, పేలుడు జరగడానికి ముందు మూడు గంటలు పార్కింగ్ స్థలంలో వేచి ఉన్నారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, ఎన్ఐఏ, పోలీసులు ఈ వివరాలను ధ్రువీకరించలేదు.
సోమవారం సాయంత్రం 6:52 గంటలకు ఎర్రకోట సమీపంలోని రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న కారులో పేలుడు జరిగింది. సంఘటన స్థలంలో రికార్డైన వీడియోలలో తెల్లటి కారు, ఆటోరిక్షా, సైకిల్ రిక్షాలు సహా అనేక ఇతర దెబ్బతిన్న వాహనాల కాలిపోయిన దృశ్యాలు కనిపించాయి.
కొన్నిగంటల తర్వాత, హోం మంత్రి అమిత్ షా తెల్లటి హ్యుందాయ్ i20లో పేలుడు సంభవించిందని ధ్రువీకరించారు. కానీ, ఇప్పటివరకు, ఆ కారు ఎవరిది లేదా పేలుడు ఎలా జరిగిందనే దానిపై అధికారిక వివరాలను పంచుకోలేదు.
పేలుడు జరిగిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఎర్రకోటను మూసివేశారు, కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)