You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
షిహాన్ హుస్సైనీ: పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ గురువు, జయలలిత కోసం రక్తంతో బొమ్మలు గీసిన వ్యక్తి... ఎవరీయన?
నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుస్సైనీ చెన్నైలో మరణించారు. కొన్నాళ్లుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేవారు.
గత 22 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం మరణించారు.
హుస్సైనీ మృతికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటిస్తూ, ఆయన తన మార్షల్ ఆర్ట్స్ గురువు అని వెల్లడించారు.
బ్రూస్ లీ సినిమాలు చూసి..
1970ల ప్రాంతంలో అనేక చైనీస్ సినిమాలు తమిళం, ఇంగ్లిష్‌లో డబ్ అయి తమిళనాడులో విడుదలయ్యేవి.
ఆ సినిమాలు సయ్యద్ అలీ ముర్తుజా హుస్సైనీపై ప్రభావం చూపించాయి. ఆ సినిమాల్లో బ్రూస్ లీ, ఇతర నటుల మార్షల్ ఆర్ట్ ప్రావీణ్యానికి హుస్సైనీ ఆకర్షితుడై తాను కూడా సాధన చేశారు.
అలా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించిన హుస్సైనీ మదురైలో కరాటే తరగతులు నిర్వహించేవారు.
అనంతరం మదురై నుంచి చెన్నైకి మారారు.
అక్కడ ఆయన దర్శకుడు బాలచందర్ దృష్టిలో పడ్డారు. 1986లో పున్నగై మన్నన్ అనే సినిమాలో ఒక నెగెటివ్ రోల్ పోషించే అవకాశం హుస్సైనీకి దక్కింది.
రజినీకాంత్ సినిమా వేలైక్కారన్, బ్లడ్ స్టోన్, రాబర్ట్ వంటి చిత్రాలలో ఆయన నటించారు. విజయ్ సినిమా బద్రిలో కోచ్‌గా ఆయన పోషించిన పాత్ర పేరు తెచ్చింది.
జయలలిత అంటే వీరాభిమానం
సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కరాటే, విలువిద్య నిపుణుడిగా హుస్సైనీకి మరింత పేరు ఉండేది.
చెన్నైలో ఆయన కరాటే, ఆర్చరీ క్లాసులు నిర్వహించేవారు. ఆయన తొలి నుంచి అన్నాడీఎంకే సభ్యుడు.
1994లో ఆయన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత 56వ పుట్టిన రోజు సందర్భంగా తన రక్తంతో 56 చిత్రాలు గీశారు.
2015లో జయలలిత పుట్టిన రోజుకు ముందు తన చేతులు, కాళ్లకు మేకులు కొట్టుకుని 6 నిమిషాల పాటు నిల్చున్నారు హుస్సేనీ.
జయలలిత మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ తాను అలా చేసినట్లు ఆయన అప్పట్లో చెప్పారు.
తలతో మంచుదిమ్మెలు పగలగొట్టి.. పాములతో విన్యాసాలు చేసి
హుస్సేనీకి కరాటే, ఆర్చరీతో పాటు మరికొన్ని మార్షల్ ఆర్ట్స్, క్రీడల్లో కూడా ప్రవేశం ఉండేది.
భారీ మంచు దిమ్మెలను తలతో పగలగొట్టడం, పాముల మధ్య గడపడం వంటి సాహస ప్రదర్శనలు చేశారాయన.
కరాటేతో పాటు తైక్వాండో, ఇతర మార్షల్ ఆర్ట్స్‌కు శిక్షణ కూడా ఇచ్చేవారు.
రియో ఒలింపిక్స్ సమయంలో కొరియా ఆర్చరీ కోచింగ్ టీంలో హుస్సైనీ కూడా ఉన్నారని ఆయన వెబ్‌సైట్ పేర్కొంది.
హుస్సైనీ తమిళనాడు ఆర్చరీ అసోసియేషన్ ఏర్పాటు చేసి, చాలాకాలం దానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
'తమ్ముడు' సినిమాలో కిక్ బాక్సింగ్ ఆయన వల్లే..
హుస్సైనీ మృతికి సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్ తాను నటించిన ‘తమ్ముడు’ సినిమాలో కఠోర సాధన చేసినట్లుగా కనిపించిన సన్నివేశాలకు ఆయన వద్ద శిక్షణ పొందిన అనుభవాలే ప్రేరణ అని చెప్పారు.
హుస్సైనీకి మార్షల్ ఆర్ట్స్‌లోనే కాదు సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళలోనూ ప్రావీణ్యం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు.
హుస్సైనీ దగ్గర శిక్షణ కోసం వెళ్లినప్పుడు మొదట ఒప్పుకోలేదని, తర్వాత ఎంతో బతిమాలితే తనకు ట్రైనింగ్ ఇచ్చారని..తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆయన దగ్గరే ఉంటూ శిక్షణ పొందానని పవన్ కల్యాణ్ చెప్పారు.
అలాంటి గురువును కోల్పోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)