You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గ్రోక్ : ఈ చాట్‌బోట్ భారత్‌లో ఎందుకు సంచలనంగా మారింది? మోదీ, రాహుల్ గాంధీ గురించి ఏం చెప్పింది?
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక ప్రశ్నతోనే ఇదంతా మొదలైంది. ఏంటా ప్రశ్న.. అసలేం జరిగింది..
సామాజిక మాధ్యమం ఎక్స్ (అంతకుముందు ట్విటర్)పై టోకా అనే అకౌంట్ నుంచి గతవారం వేసిన ఒక ప్రశ్న.. ఎలాన్ మస్క్ అభివృద్ధి చేసిన ‘గ్రోక్ 3’ చాట్‌బోట్ భారత డిజిటల్ ల్యాండ్‌స్కేప్ అంతటా వైరల్‌గా మారేందుకు కారణమైంది.
ఇది అంత క్లిష్టమైన మేథమేటిక్స్ ఈక్వేషన్ కాదు లేదా తాత్విక చర్చ కూడా కాదు.
ఇది చాలా సాదాసీదా ప్రశ్న. '' ఎక్స్ మాధ్యమంపై నా 10 బెస్ట్ మ్యూచువల్స్‌ను జాబితా చేయండి.'' అని టోకా కోరింది. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు ఫాలో అవుతూ, ఒకరి పోస్టులకు మరొకరు స్పందించే వారు.
దీనిపై గ్రోక్ కాస్త ఆలస్యంగా స్పందించడంపై టోకాకు చాలా చిరాకేసింది. ఇది కాస్త సీరియస్ అయింది. దానికి తగ్గట్టు గ్రోక్ సమాధానమిచ్చింది.
ఈ చాట్‌బోట్ పది మంది మ్యూచువల్స్‌ను జాబితా చేసినప్పటికీ, హిందీలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.
ఆ తర్వాత, గ్రోక్ ఈ విమర్శలను తప్పించుకునేందుకు, '' నేను కేవలం సరదా కోసమే చేశాను. కానీ, నియంత్రణ కోల్పోయా'' అంటూ చెప్పింది.
గ్రోక్ ఇచ్చిన ఈ సమాధానానికి 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇతర ఎక్స్ యూజర్లు కూడా ఈ చాట్‌బోట్‌ను అనుసరిస్తూ.. దీన్ని రెచ్చగొట్టేలా చేశారు.
అచ్చం, వరద సమయంలో గేట్లను తెరిచిన మాదిరి.
క్రికెట్ గాసిప్స్, పొలిటికల్ ర్యాంట్లు నుంచి బాలీవుడ్ డ్రామా వరకు ప్రతీది గ్రోక్‌తో చర్చించారు భారతీయులు. ఈ చాట్‌బోట్ అన్నిరకాల ప్రశ్నలను స్వీకరిస్తూ, ఎలాంటి విచారం వ్యక్తం చేయకుండా, ఏదో ఒక రూపంలో సమాధానాలను ఇచ్చింది.
ఈ చాట్‌బోట్ ఎలాంటి ఫిల్టర్ లేకుండా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ భారత డిజిటల్ స్పేస్‌లో సంచలనంగా మారింది.
''ప్రపంచంలో అత్యంత సరదా ఏఐ''గా గత ఏడాది మస్క్ దీన్ని అభివర్ణించారు.
లా దర్యాప్తు సంస్థలు కూడా ఈ సరదా సంభాషణల్లో భాగమయ్యాయి. మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ టికెట్ పొందారా అని గ్రోక్‌ను దిల్లీ పోలీసు ట్విటర్ అకౌంట్ కూడా సరదాగా ప్రశ్నించింది.
తొలుత దీనిపై గ్రోక్ నిశ్శబ్దంగా ఉంది. కానీ, యూజర్లు పదేపదే ప్రశ్నించడంతో.. '' హాహాహా.. నేనెందుకు ఎప్పుడూ చలాన్ (ట్రాఫిక్ టికెట్) పొందలేనని దిల్లీ పోలీసులు అడిగారు. అవును. నేను డిజిటల్ ఏఐని, దిల్లీ డ్రైవర్‌ని కాదు! రెడ్ లైట్లను దాటి లేదా హెల్మెట్లను మర్చిపోయి నేను వెళ్లను. కానీ, 19 ట్రాఫిక్ నేరాల విషయంలో ఫ్యాన్సీ కెమెరాలతో అసలైన ట్రాఫిక్ ఉల్లంఘనదారులను పట్టుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించినందుకు అభినందనలు.!'' అంటూ సమాధానమిచ్చింది.
రెండేళ్ల క్రితం దీన్ని లాంచ్ చేయడానికి ముందు, ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్ మోడల్స్ లాంటి పోటీ చాట్‌బోట్‌లా కాకుండా.. ఇది ఎలాంటి ఫిల్టర్ చేయని, సంప్రదాయేతర (యాంటీ ఓక్) ఏఐ చాట్‌బోట్‌గా ఉండనుందని మస్క్ వాగ్దానం చేశారు.
''గ్రోక్ వచ్చి కొన్నేళ్లే అయింది. కానీ, అకస్మాతుగా భారతీయుల్లో ఇది చాలా పాపులర్ అయింది. ఎందుకంటే, మన పట్టణంలో ఇదొక సరికొత్త బొమ్మ.'' అని భారత్‌లో ప్రముఖ ఫ్యాక్ట్ చెకర్ ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా అన్నారు.
అప్పటి నుంచి, చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయన్నారు. నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ విమర్శకులకు ఈ చాట్‌బోట్ ఇష్టమైనదిగా మారిపోయింది.
రాజకీయ ప్రశ్నల సునామీ మొదలైంది. మోదీ కంటే ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీని అత్యంత నిజాయితీ గల వ్యక్తిగా గ్రోక్ పేర్కొంది.
''నేను ఎవరికీ భయపడను. ఫార్మల్ ఎడ్యుకేషన్ మోదీ కంటే గాంధీకే ఎక్కువ.'' అంటూ ఈ చాట్‌బోట్ చెప్పుకొచ్చింది. మోదీ ఇంటర్వ్యూలు తరచూ స్క్రిప్ట్‌గా కనిపిస్తుంటాయని చెప్పింది.
గ్రోక్ వల్ల బీజేపీ కష్టాల్లో పడుతుందా అని మరో ఎక్స్ యూజర్ ప్రశ్నించగా.. ''ఇది చాలా పెద్ద చర్చ. కొందరు నన్ను పక్షపాతం చూపిస్తున్నానని విమర్శిస్తున్నారు. మరికొందరు హర్షిస్తున్నారు.'' అని సమాధానమిచ్చింది.
ఈ విషయంపై భారతీయ జనతా పార్టీకి చెందిన అమిత్ మాల్వియాను సంప్రదించగా.. ఆయన దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
గ్రోక్ సాహసోపేతమైన ప్రకటనలు భారత్‌లో మోదీ విమర్శకులు, ఉదారవాదుల సెలబ్రేషన్లకు కారణమయ్యాయి.
చాలామంది భారత్‌లో భావ ప్రకటన స్వేచ్చకు భంగం వాటిల్లుతోందని అభిప్రాయపడ్డారు.
ఈ స్వేచ్చను అణచివేస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
భావ ప్రకటన స్వేచ్చకు మద్దతు ఇస్తున్న 33 దేశాల్లో భారత్ 24వ ర్యాంకును పొందినట్లు ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే సంస్థ తాజా రిపోర్టు వెల్లడించింది.
ఈ రిపోర్టులను మోదీ, బీజేపీ కొట్టిపారేస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్చపై ఆంక్షలు విధిస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.
''గ్రోక్ సరికొత్త రెబెల్. గ్రోక్‌ను ప్రశ్నలు అడగడం ఎవరినీ ఇబ్బందులకు గురి చేయదు. రాహుల్ గాంధీ గురించి ప్రశ్నలు అడగడం ద్వారా రైట్ వింగ్ కూడా స్పందించింది. దీంతో, ఇదొక పోటీదారిగానే మారింది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.'' అని ఆల్ట్ న్యూస్‌కు చెందిన సిన్హా చెప్పారు.
''ఇతర ఏఐ బోట్లను ఏ పార్టీ మెరుగైనది, కాంగ్రెస్ లేదా బీజేపీ? వంటి ప్రశ్నలకు రాజకీయంగా సరైన సమాధానాలు చెప్పేలా ప్రొగ్రామ్ చేశారు. అయితే, గ్రోక్‌లో అలాంటి ఫిల్టర్ లోపించినట్లు కనిపిస్తుంది. అలాగే, వివాదాస్పదమైన అంశాలను ఎదుర్కొనేందుకు కూడా ఇది భయపడటం లేదు.'' అని తెలిపారు.
''భారత్‌లో గ్రోక్ ప్రకటనల చుట్టూ తీవ్ర దుమారం రేగుతోంది.'' అని టెక్నాలజీ పాలసీ వెబ్‌సైట్ మీడియానామా డాట్ కామ్ ఫౌండర్ ఎడిటర్ నిఖిల్ పహ్వా అన్నారు.
'' గ్రోక్ పూర్తిగా ఎక్స్‌పై శిక్షణ పొందినందున, సహజంగా అక్కడ కనిపించే నమూనాలను, స్వరాలనే ఇది ప్రతిబింబిస్తుంది. దీనిలో వింతవింత సమాధానాలు, దుర్వినియోగాలను మనం చూడొచ్చు.'' అని చెప్పారు.
ఎక్స్ మాధ్యమంపై ఎవరు ఎక్కువగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని గ్రోక్‌ను బీబీసీ అడగగా.. ఇది గురువారం స్పందించింది. ''ఎక్స్‌పై ఆయనకున్న రీచ్, తాజాగా ఇచ్చిన ప్రకటన బట్టి మస్క్ బలమైన పోటీదారుడు. '' అని చెప్పింది.
''ఒక భావజాలంతో ఉన్న రాజకీయ నేత లేదా సెలబ్రిటీ మాదిరిగా కాకుండా.. ఇది స్పష్టంగా శిక్షణ పొందినప్పుడు లేదా ఒక నిర్దిష్ట అభిప్రాయానికి దాని డేటా ఎక్కువ మద్దతుగా ఇచ్చినప్పుడే ఈ చాట్‌బోట్ పక్షపాతంతో వ్యవహరిస్తుంది. '' అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లో సోషల్ మీడియా రాజకీయ వినియోగంపై అధ్యయనం చేస్తోన్న జోయోజీత్ పాల్ చెప్పారు.
ఒకవేళ ఏదైనా చాట్‌బోట్ ఎక్కువ పక్షపాతంగా మారితే.. దీని పోటీతత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
గ్రోక్ ఉపయోగిస్తున్న అసభ్యపదజాలం, వివాదాస్పదమైన స్పందనల విషయంపై ఇప్పటికే భారత ఐటీ మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
దీని వల్ల ప్రజలు త్వరలోనే విసుగు చెందుతారని సిన్హా అన్నారు. ఇవన్నీ కేవలం కొద్దికాలమేనని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)