బలభద్రపురం: ఈ గ్రామానికి ఏమైంది, ఇక్కడ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్‌ బాధితులు పెరిగిపోతున్నారంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాలుగు రోజుల కిందట అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

స్పందించిన అధికారులు ఆ గ్రామంలో సర్వేతో పాటు స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు.

సరిగ్గా స్క్రీనింగ్‌ పరీక్షలు జరిగిన సోమవారం రోజే గ్రామానికి చెందిన పల్లేటి లక్ష్మి పేగు క్యాన్సర్‌తో మరణించారని ఆమె బంధువులు తెలిపారు.

ఆరు నెలల కిందట క్యాన్సర్‌ వ్యాధి బయటపడిందని, చికిత్స చేయించామని.. మూడు నెలలుగా ఆరోగ్యం క్షీణించి సోమవారం కన్నుమూశారని ఆమె అల్లుడు ప్రభాస్‌ బీబీసీతో తెలిపారు.

ఈ ఘటన గ్రామంలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని స్థానికులు అంటున్నారు.

ఊళ్లో ప్రతి వీధికో కేసు..

3500 ఇళ్లు.. 10,800 జనాభా ఉన్న మేజర్‌ పంచాయతీ బలభద్రపురంలో రెండు మూడేళ్లుగా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

మహిళలకే ఎక్కువగా క్యాన్సర్ సోకుతోందని, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, మెదడు, గొంతు, పెద్ద పేగు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు క్యాన్సర్‌ సోకుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూలి పనులు చేసుకుని జీవించే తాము లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స చేయించుకుంటున్నా ఆరోగ్యం మెరుగుపడటం లేదని అంటున్నారు.

ఊళ్లోని ప్రతి వీధిలో క్యాన్సర్‌ బాధితులు ఉంటున్నారని వారు చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు గ్రామంలో ఎవరిని పలకరించినా క్యాన్సర్‌ వ్యాధిపైనే చర్చ నడుస్తోంది.

ఉంటే తింటున్నాం.. లేదంటే అదీ లేదు

ఆ ఊళ్లో క్యాన్సర్‌ బాధిత కుటుంబాల్లో ఒక్కొరిదీ ఒక్కో వ్యధ.

ఆర్థికంగా ఇబ్బంది లేని కుటుంబాలకు చెందినవారైతే ఖర్చుకు వెనకాడకుండా చికిత్స చేయిస్తున్నారు.

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద వ్యవసాయ కూలీలు మాత్రం క్యాన్సర్ చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామానికి చెందిన ధారాలమ్మకు గొంతు క్యాన్సర్‌ రాగా ఏడాది కిందట చికిత్స చేయించుకున్నారు. వయస్సు మీద పడ్డా కడుపు నింపుకోవడం కోసం కూలి పనులు చేసుకునే ఆమె క్యాన్సర్‌ సర్జరీ తర్వాత పనులు చేసే శక్తి కోల్పోయారు.

''ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా.. పని లేదు.. చేతిలో డబ్బులూ లేవు'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ పనులు చేసుకునే చొల్లంగి వెంకట లక్ష్మికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రావడంతో పది నెలల కిందట సర్జరీ చేశారు. వ్యవసాయ పనులు చేసుకునే తాము మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి క్యాన్సర్‌కు చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

బోన్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న మరో మహిళ తాతపూడి ముసలమ్మ మాట్లాడుతూ.. ‘మూడేళ్ల కిందట క్యాన్సర్‌ బారిన పడడంతో చికిత్స చేయించుకున్నాను. నా భర్తకు కూడా పేగు క్యాన్సర్‌ వచ్చి రెండేళ్ల కిందట చనిపోయారు. డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్‌ చేసిన తర్వాత పదిహేను రోజుల్లోనే చనిపోయారు’ అంటూ ఆమె ఆవేదనచెందారు.

‘మా అమ్మ భవానీకి క్యాన్సర్‌ ఉందని తెలిసి 13 లక్షలు ఖర్చు చేసి వైజాగ్‌లో సర్జరీ చేయించాను. కానీ చేసిన ఆరెల్లలోగానే చనిపోయారు’.. అని గ్రామంలో ఫైనాన్స్‌ వ్యాపారం చేసే ద్వారంపూడి దుర్గా రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఇంటింటి సర్వే చేయిస్తోన్న ప్రభుత్వం

క్యాన్సర్‌ కేసులు పెరగడంపై ప్రజల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం గ్రామంలో ఇంటింటి సర్వే చేయిస్తోంది. ఆరోగ్య, వైద్య. కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర క్యాన్సర్‌ సర్వే గ్రామంలో రెండు రోజులుగా జరుగుతోంది. 31 వైద్య బృందాలు గ్రామంలోని ప్రతి ఇంటినీ సందర్శించి, ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నాయి.

రాజమండ్రిలోని జీఎస్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, విశాఖ సమీపంలోని హోలీ బాబా క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో గ్రామంలోనే క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.

''ఇక్కడ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి స్క్రీనింగ్‌ టెస్టులు చేయిస్తున్నాం, రెండు రోజులుగా ఇంటింటి సర్వే చేస్తున్నాం'' అని స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ జి.విజయలక్ష్మి బీబీసీకి తెలిపారు.

క్యాన్సర్‌ లెక్కల్లో గందరగోళం

గ్రామంలోని క్యాన్సర్‌ బాధితుల లెక్కలపై గందరగోళం నెలకొంది. బలభద్రపురంలో సోమవారం నాటికి 38 క్యాన్సర్‌ కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. సుమారు రెండేళ్లలో క్యాన్సర్‌తో 19 మంది చనిపోయారని గుర్తించామని తెలిపారు.

అయితే అధికారులు సరైన సర్వే చేయకుండా ప్రభుత్వానికి అప్పుడే నివేదికలు ఇవ్వడం సరికాదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

గత రెండేళ్లలో 63 మంది కేవలం వివిధ రకాల క్యాన్సర్‌‌తోనే చనిపోయారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బీబీసీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

'' ఇప్పటివరకు అధికారులు చెబుతున్న 38 లెక్క శాస్త్రీయంగా లేదు. గ్రామంలో స్క్రీనింగ్‌ టెస్టులు సోమవారం మొదలు పెట్టారు. ఆ టెస్ట్‌లన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే నిర్ధరణకు రాగలం'' అని ఆయన బీబీసీతో అన్నారు.

ఆ ఊళ్లోనే క్యాన్సర్‌ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

నీటి, వాయు కాలుష్యం వల్లనే తమ గ్రామానికి క్యాన్సర్‌ ముప్పు వాటిల్లిందని కొందరు గ్రామస్తులు అంటున్నారు.

ఊరికి సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలే నీటి కాలుష్యానికి కారణమని ఎమ్మెల్యే సహా పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఊరికి సమీపంలోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌ నుంచి వచ్చే జల కాలుష్యం వల్లనే క్యాన్సర్‌ ప్రబలుతోందని గ్రామానికి చెందిన నేదూరి ప్రభాస్, నేదూరి చిన్నా ఆరోపించారు.

మూడేళ్ల కిందట తన తల్లి చనిపోయినప్పుడు నీటి కాలుష్యం వల్లే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని చిన్నా అన్నారు.

గ్రామస్తుల వాదనపై ఎమ్మెల్యే ఏమంటున్నారంటే..

''ఇక్కడ కేపీఆర్‌ ఫెర్టిలైజర్స్‌ యూనిట్‌ కొంతకాలం నడిచి మూతపడింది. మళ్లీ ఇటీవల కాలంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌ రావడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని ప్రజల అభిప్రాయం. ఈ విషయంపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి గ్రామస్తులకు ఉపశమనం కలిగించాలి'' అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు.

ఒక ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదంటున్న కలెక్టర్‌

గ్రామంలోని ప్రస్తుత పరిస్థితికి ఏదో ఒక ఇండస్ట్రీకో ఏదో ఒక యాక్టివిటీకో ఆపాదించడం సరికాదు.. అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మీడియాతో అన్నారు.

''గ్రామంలోని పరిస్థితులపై ఇంకా అధ్యయనం చేయాలి. చేయకుండా మనం నేరుగా ఏ సంస్థపై ఆరోపణలు చేయలేం. ఇక్కడి ప్రజల అనుమానాలపై పూర్తిస్థాయిలో అన్ని అంశాలనూ పరిశీలిస్తాం. ఇక్కడున్న గాలి, నీరు ఎలా ఉందనేది చూడటానికి పీసీబీ చైర్‌పర్సన్‌ ఒక బృందాన్ని పంపారు. నాగ్‌పూర్‌ నుంచి కూడా ఒక స్పెషల్‌ టీం వస్తోంది. అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి రాగలం'' అని కలెక్టర్‌ అన్నారు.

గ్రాసిమ్ సంస్థ ఏమంటోంది?

ఈ ఆరోపణలపై స్పందన కోసం బలభద్రపురం గ్రామ సమీపంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీని బీబీసీ సంప్రదించింది.

‘నిబంధనల మేరకే మా పరిశ్రమ నడుస్తోంది. ఇప్పుడు వివాదం వచ్చింది. ప్రభుత్వం ఎంక్వైరీ వేసిందని అంటున్నారు. ఈ టైంలో మేం ఏం మాట్లాడలేం. మా యాజమాన్యం కూడా ఏం స్పందిస్తుంది'' అని పరిశ్రమ మానవ వనరులు విభాగానికి చెందిన మురళీకృష్ణ బీబీసీతో అన్నారు.

స్పందన కోసం ముంబయిలోని గ్రాసిమ్ పరిశ్రమ ప్రధాన కార్యాలయానికి బీబీసీ మెయిల్‌ పంపింది. కంపెనీ స్పందన రాగానే ఈ కథనంలో అప్‌డేట్‌ చేస్తాం.

అసలు ఏమిటీ గ్రాసిమ్ ఫ్యాక్టరీ.. ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారు?

''బలభద్రపురం ఊరు పొలిమేరలో వివిధ రకాల పురుగుమందుల తయారీ కోసం కేపీఆర్‌ కెమికల్‌ సంస్థ 2013లో పర్యావరణ అనుమతులు పొందింది. అప్పట్లో ఈ కర్మాగారాన్ని స్థానికులు వ్యతిరేకించడంతో కొన్నాళ్ల తర్వాత దాన్ని మూసేసింది.

2023లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ దాన్ని మళ్లీ ప్రారంభించింది. కాస్టిక్‌ సోడా, క్లోరిన్‌ ఆధారిత ఉత్పత్తుల తయారీ విస్తరణకు ఈ సంస్థ 2023లో అనుమతి పొందింది. ఆ ఉత్పత్తులు వాటి తయారీలో వాడే రసాయనాల్లో అనేక క్యాన్సర్‌ కారకాలు ఉంటాయి. పైగా ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు ఎటుపోతున్నాయి... భూమిలో కలుస్తున్నాయా లేదా సమీప కాలువల్లో కలుస్తున్నాయా..అనే దానిపై స్పష్టత లేదు. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి'' అని 'సైంటిస్ట్‌ ఫర్‌ పీపుల్‌' సంస్థ ప్రతినిధి డాక్టర్‌ కె.బాబూరావు బీబీసీతో అన్నారు.

కాగా, బలభద్రపురంలో క్యాన్సర్‌ అదుపులోనే ఉందని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ప్రకటించారు. ప్రస్తుతం 38 కేసులు నమోదయ్యాయనీ, ఈ నెంబర్‌ అనేది జాతీయ సగటుతో పోలిస్తే తీవ్ర ఆందోళనకరమేమీ కాదని ఆమె మీడియాతో అన్నారు.

ఈ విషయంలో గ్రామస్తులు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఓ అంచనా ప్రకారం ప్రతి పది వేల మందిలో 30 మందికి క్యాన్సర్‌ పాజిటివ్‌గా నమోదు అయితే అది అసాధారణ స్థాయి కాదని ఆమె తెలిపారు.

ఆ లెక్కలు సరికాదన్న పర్యావరణ వేత్తలు

బలభద్రపురంలో కాన్సర్‌ వ్యాప్తి ఆందోళనకరంగానే ఉన్నట్టు అర్ధమవుతోందని పర్యావరణవేత్తలు, 'సైంటిస్ట్‌ ఫర్‌ పీపుల్‌' సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ కే బాబూరావు, డాక్టర్‌ ఎం బాపూజీ, డాక్టర్‌ డి రాంబాబు అభిప్రాయపడ్డారు.

గ్రామంలో ఇప్పటికి 38 కాన్సర్‌ కేసులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని, భారత్‌లో సగటు కాన్సర్‌ రేటు వెయ్యి మందికి ఒకటి (1/1000) కాగా.. 10,800 మంది ఉన్న గ్రామంలో 38 కేసులు రావడమంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు.

జనాభా 11 వేలుగా పరిగణనలోకి తీసుకున్నా జాతీయ సగటు ప్రకారం 12 కేసుల వరకు ఉంటే సాధారణం అనుకోవచ్చు.. కానీ, ఇక్కడ 38 కేసులున్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

సర్వే ఇంకా పూర్తి కాలేదు. సర్వే పూర్తయ్యే సరికి ఈ సంఖ్య ఎంత ఉంటుందో.. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని డాక్టర్‌ బాబూరావు బీబీసీతో అన్నారు.

కలెక్టర్‌ చెబుతున్న ప్రతి పది వేలకి 30 మంది క్యాన్సర్ లెక్క విదేశాల్లో... మన దేశంలో కాదు అని బాబూరావు వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)