You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
45 ఏళ్ల వయసులోనూ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ గెలిచిన బాక్సింగ్ లెజండ్ జార్జ్ ఫోర్‌మన్ మృతి
- రచయిత, క్రిస్టల్ హేస్
- హోదా, బీబీసీ న్యూస్, లాస్ ఏంజిల్స్
బాక్సింగ్ హెవీవెయిట్ లెజెండ్ జార్జ్ ఫోర్‌మన్ మరణించారు. ఆయన వయసు 76 ఏళ్లు.
బాక్సింగ్ రింగ్‌లో బిగ్ జార్జ్‌గా పిలిచే ఈ అమెరికన్ బాక్సర్ తన కెరీర్‌ను గొప్పగా మలచుకున్నారు.
ఆయన 1968లో ఒలింపిక్ స్వర్ణం గెలుచుకున్నారు.
21 సంవత్సరాల తేడాతో రెండుసార్లు ప్రపంచ హెవీవెయిట్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 45 ఏళ్ల వయసులో రెండోసారి ప్రపంచ హెవీ వెయిట్ టైటిల్ సాధించి ఆ టైటిల్ సాధించినవారిలో అత్యంత పెద్ద వయసు బాక్సర్‌గా రికార్డ్ నెలకొల్పారు.
1974లో జరిగిన ప్రసిద్ధ ‘రంబుల్ ఇన్ ది జంగిల్’ పోరాటంలో ముహమ్మద్ అలీతో చేతిలో ఓటమి పాలైన ఆయన తన తొలి టైటిల్‌ను చేజార్చుకున్నారు.
అయితే మొత్తంగా 68 నాకౌట్‌ల సహా 76 విజయాలను సాధించారు. ఇవి అలీ విజయాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు.
ఫోర్‌మన్ 1997లో బాక్సింగ్ నుంచి రిటైరయ్యారు. అంతకుముందే ఆయన లండన్‌లో గ్రిల్ మెషీన్‌ల బ్రాండ్‌ను తన పేరుతో ప్రారంభించారు.
దాంతో ఆయన తాను కోల్పోయిదంతా తిరిగి సంపాదించగలిగారు.
ఫోర్‌మన్ మరణించిన విషయం ఆయన కుటుంబం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుక్రవారం రాత్రి వెల్లడించింది.
‘మానవతావాది, ఒలింపియన్, రెండుసార్లు ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ అయిన ఆయనను ఎంతో గౌరవించారు. తన మంచిపేరు కాపాడుకునేందుకు ఆయన అవిశ్రాంతంగా పోరాడేవారు. క్రమశిక్షణ, దృఢ విశ్వాసం, తన లెగసీని కాపాడుకునే వ్యక్తి ఆయన’ ఫోర్‌మన్ కుటుంబం ఆ పోస్ట్‌లో పేర్కొంది.
మాజీ ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ మైక్ టైసన్ సహా అనేక మంది ఆయనకు నివాళులర్పించారు.
‘బాక్సింగ్, ఇతర రంగాలలో ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరచిపోలేం’ అని టైసన్ నివాళులర్పించారు.
బాక్సింగ్ బైబిల్‌గా పిలిచే ‘రింగ్ మ్యాగజీన్’ "ఆయన్ను గొప్ప హెవీవెయిట్ బాక్సర్" అని అభివర్ణించింది.
"ఆయన బాక్సింగ్ చిహ్నంగా ఎప్పటికీ గుర్తుంటారు" అని ఆ మ్యాగజీన్ పేర్కొంది.
ఫోర్‌మన్ టెక్సాస్‌లోని మార్షల్‌లో 1949 జనవరి 10న జన్మించారు. అమెరికన్ సౌత్‌లో ఆరుగురు తోబుట్టువులతో కలిసి పెరిగారు.
ఆయన చదువు మధ్యలోనే ఆపేశారు. వీధి దొంగతనాలు చేశారు. ఆ తర్వాత బాక్సింగ్‌ను ఎంచుకున్నారు.
19 ఏళ్ల వయసులో 1968లో మెక్సికో నగరంలో జరిగిన ఒలింపిక్స్‌లో హెవీవెయిట్ విభాగంలో ఆయన బంగారు పతకం గెలుచుకున్నారు.
తర్వాత ప్రొఫెషనల్‌గా మారి వరుసగా 37 మ్యాచ్‌లు గెలిచారు. కెరీర్‌లో కేవలం ఐదు బౌట్‌లలో మాత్రమే ఓడిపోయారు.
1974లో కిన్షాసాలో(ప్రస్తుతం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో రాజధాని) ‘ది రంబుల్ ఆఫ్ ద జంగిల్’ పేరుతో ఫోర్‌మన్, ముహమ్మద్ అలీ మధ్య జరిగిన పోటీ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత గొప్ప పోటీల్లో ఒకటిగా నిలిచిపోయింది.
ఈ మ్యాచ్ జరిగిన 50 ఏళ్ల తర్వాత ‘బీబీసీ వరల్డ్ సర్వీస్ న్యూస్‌అవర్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫోర్‌మన్ ఆ మ్యాచ్ గురించి చర్చించారు.
ఆ రోజు అందరూ అలీని ఒడిస్తానని భావించారని ఆయన చెప్పారు.
"ఓహ్, అలీ ఒక్క రౌండ్ కూడా ఉండడు" అని బాక్సింగ్ నిపుణులు ఆ సమయంలో అంచనా వేశారని చెప్పారు.
సాధారణంగా బాక్సింగ్ మ్యాచ్ ముందు తాను కాస్త భయపడతానని, గందరగోళంగా అనిపిస్తుందని, కానీ ఆ మ్యాచ్‌కి ముందురోజు రాత్రి చాలా ప్రశాంతంగా ఉన్నానని ఆయన చెప్పారు.
కానీ చాకచక్యంగా అలీ ఉపయోగించిన వ్యూహం తరువాత "రోప్-ఎ-డోప్" గా ప్రసిద్ధి చెందింది, ఈ టెక్నిక్ ఫోర్‌మన్‌ను అలసిపోయేలా చేసింది, దీని వలన ఎనిమిదో రౌండ్‌లో అలీ ఫోర్‌మన్‌పై వందలాది పంచ్‌లు కురిపించి విజయం సాధించారు.
ఆ తరువాత బాక్సింగ్ రెండోసారి ఓటమి పాలైన తరువాత ఆయన 1977లో రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం టెక్సస్‌లో ఆయన స్థాపించిన లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చిలో కీలక బాధ్యతలు వహించారు.
‘అలీ చేతిలో ఓటమి నా జీవితంలో జరిగిన అత్యంత మంచి పని, అలా జరగకపోతే బోధన ద్వారా నా సందేశాన్ని ప్రజలకు అందించేవాడిని కాను’ అని ఫోర్‌మన్ బీబీసీతో చెప్పారు.
తన బోధన స్నేహితులతో ప్రారంభమై, తరువాత విస్తరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
అనంతరం 1987లో ఫోర్‌మన్ తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకుని తాను స్థాపించిన యువజన కేంద్రానికి విరాళాలు కోసం మళ్లీ బాక్సింగ్ రింగ్‌లో దిగారు ఫోర్‌మన్.
1991లో 12 రౌండ్ల తర్వాత ఇవాండర్ హోలీఫీల్డ్ చేతిలో ఓడిపోయిన ఆయన అంతకుముందు 24 మ్యాచ్‌లను గెలిచారు.
ఫోర్‌మన్ 1994లో తన 45 ఏళ్ల వయసులో మైఖేల్ మూరర్‌ను ఓడించి హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలిచారు.
ఆయన తన జార్జ్ ఫోర్‌మన్ గ్రిల్ మిషన్ వ్యాపార ప్రకటనలో నటించారు. 1994లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి లక్షలాది మంది ఈ గ్రిల్స్‌ను కొనుగోలు చేశారు.
ఫోర్‌మన్ ఐదుసార్లు వివాహం చేసుకున్నారు. ఆయనకు 12 మంది పిల్లలు. వారిలో అయిదుగురు కుమారులకు జార్జ్ అనే పేరు పెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)