క్రైస్తవం: జెరూసలేంలో మొదటి మహిళా పాస్టర్ నియామకం

    • రచయిత, యేలాందే నెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, జెరూసలేం

చర్చిలలో మహిళా మతాధికారులు చాలా తక్కువ.

బైబిల్‌లో ప్రస్తావించిన పవిత్ర స్థలాలుగా చెబుతున్న ప్రాంతాలలో కూడా మహిళా మతాధికారులు లేరు.

కానీ, ఆదివారం జెరూసలేంలో పాలెస్తీనాకు చెందిన సాలీ అజార్‌ను మొదటి మహిళా పాస్టర్‌గా నియమించారు.

ఓల్డ్ సిటీ నడిబొడ్డున ఉన్న లూథరన్ చర్చిలో జరిగిన ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు.

‘‘అందరి ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు మరింత సంతోషంగా ఉంది. చర్చి మద్దతుతో ఈ అడుగు వేయడం మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇస్తోంది.

చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఇలాంటివి సాధ్యమని నమ్ముతారు. ఇతర చర్చిలలోని మహిళలు కూడా మాతో చేరుతారని ఆశిస్తున్నా.

దీనికి చాలా సమయం పడుతుందని తెలుసు. అయితే పాలెస్తీనాలో ఇది మార్పును తీసుకొస్తే చాలా ఆనందంగా ఉంటుంది’’ అని అజార్ అన్నారు.

పాలెస్తీనా భూభాగాలు, ఇజ్రాయెల్, జోర్డాన్‌లలో క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్నారు. ఇక్కడ చాలా మంది క్రైస్తవులు గ్రీక్ ఆర్థోడాక్స్, లాటిన్ కాథలిక్ చర్చిలకు చెందినవారు. ఈ చర్చీలు మహిళలను మతాధికారులు కావడానికి ఒప్పుకోవు.

గత కొన్ని దశాబ్దాలుగా ప్రొటెస్టంట్ చర్చిలల్లో మహిళలను మతాధికారులను చేయడం పెరుగుతోంది.

"పితృస్వామ్య సంస్కృతిని కలిగి ఉన్న సమాజాల్లో ఇది ఒక ప్రధానమైన అడుగు" అని స్వీడన్ చర్చ్ ఆర్చిబిషప్‌గా సేవలందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన ఆంట్జే జాకెలెన్ అంటున్నారు.

"సన్యాసం స్వీకరించిన ఈ 40 ఏళ్లుగా ఇలాంటివి సాధ్యం కావని భావించిన వారిని చాలా మందిని కలిశా. కానీ, ఇప్పుడు మహిళలు పాస్టర్‌లుగా, బిషప్‌లుగా, ఆర్చిబిషప్‌లుగా సేవ చేయడాన్ని వాళ్లు చూస్తున్నారు. వాస్తవానికి ఇది బైబిల్‌కు అనుగుణంగా ఉందని తెలుసు" అని ఆంట్జే జాకెలెన్ అన్నారు.

మిడిల్ ఈస్ట్‌లో లెబనాన్, సిరియాలోని చర్చిలు ఇప్పటికే మహిళలకు ఉత్తర్వులు అందించాయి.

బిషప్ సాని అజార్ తన కుమార్తె అయిన సాలీ అజార్‌ను పాస్టర్‌గా నియమించారు. తన తండ్రి ఆమెకు స్ఫూర్తి అని, మత గ్రంథాలను అధ్యయనం చేయడంలో ఒత్తిడికి గురికాలేదని సాలీ అంటున్నారు.

జెరూసలేంలో, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని బీట్ సాహోర్‌లోఇంగ్లీష్ మాట్లాడే గ్రూపుల కోసం అజార్ పని చేస్తుంటారు.

"ఇది మా చర్చి చరిత్రలో చాలా పెద్ద రోజు. చాలా ముఖ్యమైన ముందడుగు" అని బెత్లెహెమ్ బీట్ సాహోర్ లూథరన్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ముంథర్ ఐజాక్ వ్యాఖ్యానించారు.

స్థానిక లూథరన్ పాఠశాలల్లో సాలీ అజార్‌ను రోల్ మోడల్‌గా చూపించడానికి ఎదురుచూస్తున్నానని ఐజాక్ చెప్పారు.

అంతేకాదు బైబిల్‌లో మహిళల నాయకత్వం, మహిళల ఆర్డినేషన్‌కు మద్దతుగా ఐజాక్ అరబిక్‌లో ఒక పుస్తకాన్ని కూడా రాశారు.

"మనం మహిళా మంత్రులను, ప్రొఫెసర్లను అంగీకరిస్తాం. మహిళలు చేసే శస్త్రచికిత్సలూ అంగీకరిస్తాం. అయితే మహిళలు బైబిల్ బోధించగలరని, మతకర్మలు చేయగలరని మనం ఇంకా వాదించవలసి రావడం వింతగా ఉంది" అని ఆయన అంటున్నారు.

"పాలస్తీనియన్లుగా మనం పురోగతి సాధించినప్పటికీ మహిళలు, వారి హక్కుల సాధికారత విషయానికి వస్తే ఇంకా చేయవలసి ఉందని ఇది సూచిస్తోంది" అని ఐజాక్ అన్నారు.

మూస పద్ధతులను ప్రశ్నించడానికి, దాంట్లోని బూజు దులపడానికి సాలీ అజార్ సరైన వ్యక్తి అని ఆమె మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)