You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుద్ధానికి పిలుస్తారన్న భయంతో అడవిలోకి పారిపోయిన వ్యక్తి, అక్కడెలా బతుకుతున్నారంటే...
- రచయిత, బెన్ టోబియాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వ్లాదిమిర్ పుతిన్ గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్ పౌరులు కూడా యుక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో పాల్గొనాలని పిలుపునివ్వడంతో, ఆడమ్ కాలినిన్(అసలు పేరు కాదు) అనే వ్యక్తి అడవుల్లోకి వెళ్లి నివసించడమే మంచిదని నిర్ణయించారు.
ఐటీ నిపుణుడైన ఆడమ్ కాలినిన్, మొదట్నుంచి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తన అపార్ట్‌మెంట్ బిల్డింగ్ గోడకు ‘నో టు వార్’ అనే పోస్టర్‌ను అతికించిన ఆయన, యుద్ధం మొదలైన కొత్తల్లో రెండు వారాల పాటు ఇంట్లోనే తనను తాను నిర్భందించుకున్నారు.
3 లక్షల మంది రష్యన్ పౌరులు వచ్చి యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు.
అయితే, యుక్రెయినియన్లను చంపేందుకు ఫ్రంట్‌లైన్ సోల్జర్‌గా యుద్ధంలో పాల్గొనడం కాలినిన్‌కు ఇష్టం లేదు.
అలాగే, వేలాది మంది తమ దేశ పౌరులులాగా దేశం విడిచి కూడా వెళ్లాలనుకోలేదు.
మూడు అంశాలు ఆయన్ని రష్యాలోనే ఉండేలా చేశాయి. స్నేహితులు, ఆర్థిక ఇబ్బందులతో పాటు దేశం విడిచి వెళ్లడం అంత తేలిక కాదని ఆయనికి అనిపించింది.
‘‘నా సౌకర్యవంతమైన జోన్ నుంచి బయటికి వెళ్లడం కష్టమైన విషయం’’ అని కాలినిన్ బీబీసీతో అన్నారు.
ఇక్కడ కచ్చితంగా సౌకర్యవంతంగా ఉండకపోయినా, మానసికంగా ఈ దేశాన్ని విడిచి వెళ్లడం కష్టమనిపించిందని చెప్పారు.
ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న కాలినిన్, భార్యకు గుడ్‌బై చెప్పి, అడవులకు పయనమయ్యారు.
అక్కడే సుమారు నాలుగు నెలల పాటు ఒక టెంట్ వేసుకుని నివసిస్తున్నారు.
ఇంటర్నెట్ యాక్సెస్ కోసం యాంటెన్నాను ఒక చెట్టుకి కట్టారు. పవర్ కోసం సోలార్ ప్యానల్స్ ఉపయోగిస్తున్నారు.
మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో కూడా ఆయన ఆ అడవిలోనే నివసించారు. ఆయనకు కావాల్సిన ఆహారాన్ని భార్య అందిస్తున్నారు.
ఇంటిని వదిలి బయటికి వచ్చేయడమన్నది యుద్ధం నుంచి తప్పించుకునేందుకు సరైన మార్గమని కాలినిన్ భావించారు. అధికారులు వ్యక్తిగతంగా ఆయన చేతికి సమన్లు ఇస్తే తప్ప, యుద్ధంలో పాల్గొనాలని బలవంతం పెట్టకూడదు.
‘‘ఒకవేళ వారు నన్ను వారి చేతులతో తీసుకెళ్లకపోతే, మొబెలైజేషన్ లేదా ఇతర వేధింపుల నుంచి నేను 99 శాతం తప్పించుకోవచ్చు’’ అని అన్నారు.
కాలినిన్ ఇంట్లో ఎలాగైతే తన జీవనాన్ని సాగించారో అక్కడ కూడా అలానే గడుపుతున్నారు.
రోజులో ఎనిమిది గంటల పాటు అదే ఉద్యోగం చేశారు. శీతాకాలం కావడంతో పగలు తక్కువగా ఉండేది. దీంతో ఆయన రోజంతా పని చేసుకునేందుకు అవసరమైన సోలార్ విద్యుత్ అందేది కాదు. సెలవు దినాల్లో కూడా పనిచేయాల్సి వచ్చేది.
ప్రస్తుతం తన కొలీగ్స్‌లో కొందరు కజఖ్‌స్తాన్‌లో ఉన్నారని, వారు మొబెలైజేషన్ ప్రారంభమైన తర్వాత రష్యా వదిలి బయటికి వెళ్లిపోయారని కాలినిన్ చెప్పారు.
కానీ, ఆయన దేశం విడిచి పెట్టకుండా అడవిలో నివసిస్తూ పనిచేసుకునేందుకు వీలుగా దేవదారు వృక్షానికి లాంగ్ రేంజ్ యాంటెన్నాను అమర్చుకున్నారు. కమ్యూనికేషన్ విషయంలో తనకెలాంటి సమస్య రాలేదని అన్నారు.
ఇళ్లు వదిలి ప్రశాంతమైన అవుట్‌డోర్లలో నివసించడం కాలినిన్‌కి ఎంతో ఇష్టం. తన భార్యతో కలిసి దక్షిణ రష్యాలో చాలా ప్రాంతాల్లో ఎన్నో హాలిడేస్‌ను ఆయన ఆస్వాదించారు.
అడవుల్లో శాశ్వాత నివాసం ఏర్పరచుకోవాలని నిర్ణయించిన కాలినిన్, అక్కడ నివసించేందుకు కావాల్సిన పరికరాలన్నింటిన్ని ముందుగానే కొనుగోలు చేశారు.
కాలినిన్‌కి అడవిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.
ప్రతి మూడు వారాలకు ఒకసారి ఆమె, వారిద్దరూ రహస్యంగా కలుసుకునే చోటికి ఆహార ధాన్యాలను చేరవేసేవారు.
కాలినిన్ వాటిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లి భద్రపరుచుకునే వారు. కట్టెల పొయ్యిపైనే ఆయన వంట చేసుకునేవారు.
‘ఓట్స్, టీ, కాఫీ, షుగర్ నా వద్ద ఉండేవి. తాజా కూరగాయలు, పండ్లు ఉండేవి కావు. కానీ, నా పరిస్థితంత అధ్వానమైతే కాదు’’ అని కాలినిన్ చెప్పారు.
మంచు ప్రాంతాల్లో చేపలు పట్టుకునేటప్పుడు వాడే ఒక రకం టెంట్‌తో ఇంటిని నిర్మించుకున్నారు.
‘‘నేను అడవిలోకి వచ్చిన కొత్తలో ఐదు నిమిషాలు ప్రయాణించేంత దూరంలో రెండు క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాను. ఒకటి పనిచేసుకునేందుకు వీలుగా ఇంటర్నెట్ యాక్సెస్‌తో, మరొకటి నిద్రపోయేందుకు షెల్టర్ స్పాట్‌గా నిర్మించుకున్నాను’’ అని కాలినిన్ చెప్పారు.
కానీ, శీతాకాలం సమీపించి, వాతావరణం మరింత చల్లగా మారిన సమయంలో పడుకునేందుకు, పని చేసుకునేందుకు రెండింటినీ ఒకే కాన్వాస్ కిందకి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు.
కాలినిన్ అంచనావేసిన దాని కంటే తక్కువకి -11 డిగ్రీల సెల్సియస్‌కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ప్రస్తుతం చల్లదనం కాస్త తగ్గుముఖం పట్టడంతో, మంచంతా కరుగుతుంది. మున్ముందు కూడా ఇక్కడే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతానికైతే తనకు పిలుపు అందనప్పటికీ, పరిస్థితులు స్థిరంగా మారుతూ వస్తున్నాయని, భవిష్యత్‌లో సమన్లు అందుకునే అవకాశం ఉంటుందన్నది కాలినిన్ ఆందోళన.
అయితే, కాలినిన్ లాంటి ఐటీ ఉద్యోగులకు యుద్ధంలో పాల్గొనాలనే డ్రాఫ్ట్ నుంచి మినహాయింపు ఉంది. అయితే, ఈ మిపహాయింపులను కూడా తీసేస్తున్నట్టు రష్యాలో పలు మీడియా కథనాలు వస్తున్నాయి.
ఖార్కియెవ్ ప్రాంతంలో రష్యన్ దళాలకు యుక్రెయిన్ల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో సెప్టెంబర్ 21న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొబిలైజేషన్‌కు పిలుపునిచ్చారు.
రష్యన్ బలగాలు ఆక్రమించుకున్న వేలాది చదరపు కిలోమీటర్లను యుక్రెయిన్లు ఈ ఎదురుదాడికి దిగి వారి ప్రాంతాన్ని చేజిక్కించుకున్నారు.
పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు రష్యాకు మొబెలైజేషన్ తప్పనిసరని వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కానీ, దేశంలో చాలా మంది దీనికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.
పుతిన్ మొబెలైజేషన్‌కు పిలుపునివ్వడంతో, వేలాది మంది రష్యన్లు దేశం విడిచి పారిపోయేందుకు సరిహద్దు ప్రాంతాలకు వచ్చారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అప్పటి వరకు చాలా మంది రష్యన్లు యుద్ధానికి ముందు వరకు ఎలాగైతే నివసించారో అలానే తమ జీవితాలను కొనసాగించగలిగారు. కొన్ని పశ్చిమ కంపెనీలు దేశం విడిచి వెళ్లిపోయాయి.
ఆర్థిక లావాదేవీలపై విధించిన ఆంక్షలు కష్టతరంగా మారాయి. కానీ, సమాజంపై నేరుగా పడిన ప్రభావం చాలా వరకు పరిమితంగానే ఉండేది.
కానీ, మొబెలైజేషన్ అనేది ఎంతో మంది రష్యన్ కుటుంబాల ఇళ్ల ముందుకు యుద్ధ ప్రభావాన్ని తీసుకొచ్చింది. తక్కువ వ్యవధిలోనే తమ కొడుకులను, తండ్రులను, సోదరులను యుద్ధానికి పంపించాల్సి వచ్చింది.
తగిన ఎక్విప్‌మెంట్ కానీ, శిక్షణ కానీ లేకుండానే వారు యుద్ధ భూమిలోకి దిగాల్సి వచ్చింది. ఒకవేళ ఈ యుద్ధం మరింత కాలం కొనసాగితే, దీన్ని తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే.
రష్యాలో ప్రజాందోళనలు చాలా వరకు అరుదుగా జరుగుతుంటాయి. ప్రస్తుతం ప్రజలు వారికి ఏమవుతుందోననే ఆందోళనలో ఉన్నారని కాలినిన్ చెప్పారు.
‘‘మాకు నిరంకుశ ప్రభుత్వం ఉంది. అది కూడా శక్తిమంతమైనది. గత ఆరు నెలలుగా చట్టాలను వేగంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఎవరైనా యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’’ అని కాలినిన్ చెప్పారు.
అడవిలో కాలినిన్ నివసించిన జీవితం ఆన్‌లైన్‌లో ఎంతో పాపులర్ అయింది. టెలిగ్రామ్‌లో ఆయన రోజువారీ అప్‌డేట్లను 17 వేల మంది ఫాలో అవుతున్నారు.
తను నివసించే చుట్టుపక్కల ప్రాంతాల వీడియోలు, ఫొటోలు, ఆయన రోజువారీ జీవితం, క్యాంపు నిర్వహణ, కట్టెలు నరకడం వంటివి కాలినిన్ ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు.
తన మునపటి జీవితాన్ని కోల్పోతున్నట్టు తనకు అనిపించలేదని కాలినిన్ అన్నారు. తనకు తాను ఇంట్రోవర్ట్(అంతర్ముఖ వ్యక్తిత్వం గల)గా కాలినిన్ అభివర్ణించుకున్నారు.
తన భార్యను మిస్ అవుతున్నప్పటికీ, అప్పుడప్పుడు తాను తనని చూడగలిగారు. యుద్ధానికో, జైలుకో వెళ్లడంకన్నా ఇది నయమంటారాయన.
‘‘నేను చాలా మారాను. ముందు వేటికైతే ఎక్కువ శక్తి లేదని నేను భావించానో అవే నాకు అత్యంత ముఖ్యమైనవిగా మారాయి. మాకంటే అత్యంత దుర్భలమైన పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నారు’’ అని కాలినిన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్: వంట గదిలోకి దూసుకొచ్చిన మిసైల్, ఇంటి యజమాని మృతి
- యుక్రెయిన్: యుద్ధ క్షేత్రంలో కొడుకు మృతదేహాన్ని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?
- సైనికుల వీర్యాన్ని ఉచితంగా ఫ్రీజర్‌లో భద్రపరిచేందుకు రష్యా ఎందుకు అనుమతిస్తోంది?
- రష్యా - యుక్రెయిన్ యుద్ధం: ‘‘రష్యాను తప్పుపట్టొద్దు.. ఇరు దేశాలకూ అది విషాదమే’’: పుతిన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)