You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తుమ్మినప్పుడు ముక్కు, నోరు మూసుకోవడం ప్రమాదకరమా? నిపుణులు ఏమంటున్నారు?
తుమ్మును ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తికి గొంతులో తీవ్ర గాయమైన ఘటనతో స్కాట్‌లాండ్ వైద్య బృందం ఒక హెచ్చరిక జారీ చేసింది.
స్కాట్లండ్‌లోని డుండీలోని నైన్‌వెల్స్ ఆస్పత్రికి 30 ఏళ్లున్న ఒక రోగిని తీసుకొచ్చారు. తుమ్ము వస్తోందని నోరు, ముక్కు మూసుకోవడంతో గొంతులో తీవ్రమైన నొప్పి ఏర్పడిన కారణంగా ఆయన్ను ఆస్పత్రికి తెచ్చారు.
అలా నోరు, ముక్కు మూసుకోవడంతో అతని శ్వాసనాళం 2 మిల్లీమీటర్ల మేర చిరిగిపోయిందని స్కానింగ్‌లో తేలింది.
తుమ్ములు వచ్చేప్పుడు నోరు, ముక్కు మూసుకుంటే శ్వాసనాళం ఎగువ భాగంపై దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఒత్తిడి పడుతుందని డుండీ యూనివర్సిటీ వైద్యులు చెప్పారు.
ఈ కేసును మెడికల్ జర్నల్ బీఎంజే కేస్ రిపోర్ట్స్‌లో నమోదు చేశారు.
వైద్యులు రోగిని పరీక్షిస్తూ అతని గొంతును తాకినప్పుడు లోపల పగుళ్లు వచ్చిన శబ్దం వినిపించింది. అలాగే, గొంతు కదలికలపై అతని నియంత్రణ లేదని గుర్తించారు.
తుమ్మిన సమయంలో ఆ రోగి డ్రైవింగ్‌లో ఉన్నారు. ఆయనకు గతంలోనూ అలర్జీలు, గొంతు సమస్యలు ఉన్నాయి.
ఆ రోగికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే, ఆయన్ను వైద్యుల పరిశీలనలో ఉంచి తర్వాత డిశ్చార్జి చేశారు. ఆయనకు అనాల్జెసిక్, యాంటీహిస్టామైన్ మందులు ఇచ్చారు. రెండువారాల పాటు శారీరక శ్రమకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించారు.
ఐదు వారాల తర్వాత తీసిన స్కానింగ్‌లో ఆ గాయం నయమైనట్లు కనిపించింది.
సదరు రోగి మెడికల్ రిపోర్టులు తయారు చేసిన డాక్టర్ రసాడ్స్ మిసిరోవ్స్‌తో బీబీసీ మాట్లాడింది. ముక్కులోని చెడు పదార్ధాలను బయటకు పంపే క్రమంలో తుమ్ములు వస్తాయని, అవి సహజ రక్షణ యంత్రాంగాలని, వాటిని అడ్డుకోరాదని డాక్టర్ రసాడ్స్ అన్నారు.
‘‘అయితే, తుమ్మినప్పుడు లాలాజలం, శ్లేష్మం, వైరస్‌లు ఎదుటి వ్యక్తుల మీద పడకుండా, వారిని చేరకుండా నోరు, ముక్కులపై చేతులను సున్నితంగా కప్పి ఉంచితే చాలు’’ అని డాక్టర్ రసాడ్స్ అన్నారు.
ముక్కు నోరు మూసుకోకుండా తుమ్ములను ఆపుకోవడానికి కొన్ని పద్ధతులు ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.
"నేను ముక్కు మూసుకోవడం కాకుండా, పై పెదవిని బొటనవేలితో కొన్ని సెకన్ల పాటు నొక్కి పెడతాను. ఇది నాకు వర్కవుట్ అయ్యింది’’ అని అన్నారు.
ఇలా గొంతులో అకస్మాత్తుగా గాయం కావడాన్ని ‘‘స్పాంటెనియస్ ట్రాచిల్ రప్చర్’’ అంటారు. ఇలాంటి చాలా అరుదుగా ప్రాణాంతకమవుతాయి.
2018లో ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో ఒక వ్యక్తి తుమ్మును ఆపడానికి ప్రయత్నించడంతో అతని గొంతులో చిరుగు ఏర్పడిన కేసు ఒకటి నమోదైంది.
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రానిక్ ముక్కు: ఫుడ్ పాయిజన్‌ను ఇదెలా గుర్తిస్తుంది, ధర ఎంత?
- చైనా పిల్లల్లో వ్యాపిస్తున్న ఈ వ్యాధి ఏమిటి ? భారత్‌కు ఎంత ప్రమాదం
- స్మోకింగ్ బ్యాన్ ఎత్తేస్తున్న న్యూజీలాండ్, ఆదాయం కోసమే యూటర్న్...
- జంతువు నుంచి మనిషిగా మార్చిన జన్యువులే వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయా?
- రెడ్ వైన్ తాగితే తలనొప్పి వస్తుందా? ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)