You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మెఫెనామిక్ యాసిడ్: పీరియడ్స్ కడుపునొప్పి, ఇతర నొప్పులకు వాడే ఈ పెయిన్ కిల్లర్‌తో సైడ్ ఎఫెక్ట్స్...అలర్ట్ జారీ చేసిన ఐపీసీ
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమ్మాయిలకు పీరియడ్స్ కడుపు నొప్పి వస్తుందా? చిన్న పిల్లలకు ఫీవర్ వచ్చిందా? కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్నాయా? వీటన్నింటికీ చాలా మంది వాడేది మెఫెనామిక్ యాసిడ్ ఉన్న టాబ్లెట్లు. నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కల్పించే ఈ మెఫెనామిక్ యాసిడ్ ఉన్న టాబ్లెట్లను వాడుతూ ఉంటారు. కానీ, ఈ మెఫెనామిక్ యాసిడ్ వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్(ఐపీసీ) అలర్ట్ జారీ చేసింది.
నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మెఫనామిక్ యాసిడ్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై దృష్టి పెట్టాలని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) ఆరోగ్యసేవల సిబ్బందికి, రోగులకు సూచించింది.
సాధారణంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు , కీళ్లనొప్పులకు పెయిన్ కిల్లర్‌గా ఈ యాసిడ్ ఉన్న టాబ్లెట్లను వాడుతుంటారు.
అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్లపై ఫార్మాకోవిజిలెన్స్ ప్రొగ్రామ్ ఆఫ్ ఇండియా(పీవీపీఐ) జరిపిన ప్రాథమిక పరిశీలనలో ఈ యాసిడ్ వల్ల డ్రగ్ రాష్ విత్ ఎసినోఫిలియా, సిస్టమాటిక్ సిండ్రోమ్(డ్రెస్ సిండ్రోమ్) దుష్ప్రభావాలు వస్తున్నట్లు ఫార్మాకోపియా కమిషన్ తన రిపోర్టులో నివేదించింది.
ఈ మెఫెనామిక్ యాసిడ్ వల్ల డ్రెస్ సిండ్రోమ్ వంటి తీవ్ర అలర్టిక్ రియాక్షన్లు వస్తున్నాయని ఇవి శరీరంలో అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపింది.
గత నెల 30నే ఫార్మాకోపియా కమిషన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది.
రియాక్షన్లు వస్తే ఎక్కడ రిపోర్టు చేయాలి?
ఏదైనా రియాక్షన్‌ను గుర్తిస్తే, వెంటనే ప్రజలు www.ipc.gov.in వెబ్‌సైట్‌లో లభించే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ రిపోర్టింగ్ ఫామ్(ఏడీఆర్ ఫామ్)ను నింపడం ద్వారా పీవీపీఐ నేషనల్ కోఆర్డినేషన్ సెంటర్‌కు తెలియజేయాలని చెప్పింది.
అంతేకాక, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ఏడీఆర్ పీవీపీఐ, పీవీపీఐ హెల్ప్‌లైన్ నెంబర్ 1800-180-3024 ద్వారా కూడా తమకు తెలియజేయవచ్చని ప్రజలకు తెలిపింది.
అసలు డ్రెస్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
డ్రెస్ సిండ్రోమ్ అంటే తీవ్ర అలర్జిక్ రియాక్షన్. 10 శాతం మందిపై ఈ రియాక్షన్ ప్రభావం ఉంటుంది. కొందరు ఈ రియాక్షన్ వల్ల ప్రాణాలు కూడా కోల్పోతుంటారు.
డ్రగ్ తీసుకున్న రెండు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఈ రియాక్షన్లు వస్తూ ఉంటాయి.
తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు, లింఫాడెనోపథి(శరీరంలో పలు చోట్ల గడ్డలు గడ్డలు రావడం), హెమటోలజికల్ అబ్‌నార్మలటీస్(అంటే రక్త సంబంధిత వ్యాధులు), శరీరంలో అంతర్గత అవయవాలు దెబ్బతినడం వంటివి ఈ డ్రెస్ సిండ్రోమ్ రియాక్షన్లలో భాగమే. డ్రెస్ సిండ్రోమ్ అనేది ఏ డ్రగ్ వల్లనైనా రావొచ్చు.
ఈ యాసిడ్‌పై ఓ కన్నేసి ఉంచాలని సూచనలు జారీ చేయడంతో డ్రెస్ సిండ్రోమ్ వంటి దుష్ప్రభావాలను తగ్గించాలని ఫార్మాకోపియా కమిషన్ భావిస్తోంది.
‘పెయిన్ కిల్లర్స్ దీర్ఘకాలికంగా వాడితే ప్రమాదం’
అయితే, ఈ దుష్ప్రభావాలు చాలా అరుదుగా వస్తుంటాయని, పరిమిత డోసులోనే వీటిని ప్రిస్క్రయిబ్ చేస్తుంటామని డాక్టర్లు చెబుతున్నారు.
"మెఫనామిక్ యాసిడ్ మాత్రలను దీర్ఘకాలం రెగ్యులర్‌గా వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ, డ్రెస్ సిండ్రోమ్ దుష్ప్రభావాలు నా దగ్గర చికిత్స పొందిన వారెవరిలోనూ కనిపించలేదు" అన్నారు హైదరబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కావ్య ప్రియ వజ్రాలా అన్నారు.
అయితే, ఈ యాసిడ్ వల్ల వచ్చే ప్రభావాలు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
‘‘ఏ పెయిన్ కిల్లర్ అయినా దీర్ఘకాలికంగా వాడితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మెఫనామిక్ యాసిడ్ టాబ్లెట్స్ నెలలో ఒకటి రెండు వేసుకోవడం వల్ల అంత పెద్ద సమస్యలు రావు. చాలా మంది పీరియడ్స్ నొప్పికి ఈ టాబ్లెట్లనే వాడుతూ ఉంటారు. వీటి వాడకం ఎక్కువగా, రెగ్యులర్‌గా ఉన్నప్పుడు వేరే అవయవాలపై ప్రభావం ఉంటుంది" అని డాక్టర్ కావ్యప్రియ వివరించారు.
అయితే, డాక్టర్ సలహా మీదే వీటిని తీసుకోవాలని, సమస్య తీవ్రతను బట్టి టాబ్లెట్స్‌తో ట్రీట్ చేయాలా లేక సర్జరీ చేయాలా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారని ఆమె అన్నారు.
గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలు
మెఫనామిక్ యాసిడ్ వంటి డ్రగ్‌ను ఎక్కువ కాలం పాటు వాడితే కడుపులో పూతలు రావడం, రక్తస్రావం కావడం, దాని సంబంధిత ఇబ్బందులు పెరుగుతాయనే ఆందోళనలున్నాయి.
కార్డియోవస్క్యూలర్ సిస్టమ్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.
గుండె సంబంధిత వ్యాధులు ముందు నుంచే ఉన్న వారు దీన్ని వాడితే మెఫెనామిక్ యాసిడ్ వల్ల ఈ సమస్యలు మరింత పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మూత్రపిండ సమస్యలు కూడా మెఫనామిక్ యాసిడ్ వాడకం వల్ల వస్తాయని కొందరు అంటున్నారు.
మెఫనామిక్ యాసిడ్ చికిత్సను రాసే ముందు లేదా వాడుతున్న వారు ముఖ్యంగా గ్యాస్ట్రోఇంటెస్టినల్, కార్డియోవస్క్యూలర్, మూత్రపిండ సమస్యలున్న వారు వైద్యుల సూచన మేరకే దీన్ని వాడాలని వైద్యురాలు కావ్య ప్రియ సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: శ్వేతపత్రం విడుదలకు ఆదేశాలిచ్చిన కొత్త సర్కార్... ఇంతకీ శ్వేతపత్రం అంటే ఏంటి?
- విశాఖ: దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణం ఎందుకు ముందుకు కదలడం లేదు... తప్పు కేంద్రానిదా, రాష్ట్రానిదా?
- తెలంగాణలో ముస్లిం ఓటు చీలిందా, ఒవైసీ పిలుపును ఓటర్లు వినిపించుకోలేదా?
- గాజా నుంచి బీబీసీ రిపోర్టర్: 'బతుకుతామన్న ఆశ ఇక చచ్చిపోయింది'
- సీఎం రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఇవే.. ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)