‘శవాలను తిని మా ప్రాణాలు కాపాడుకున్నాం, మాకు వేరే ఆప్షన్ లేదు’ – విమాన ప్రమాద విషాద గాథ

    • రచయిత, ఫెలిప్ లాంబియాస్
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

‘‘మేం చనిపోయిన వారిని కోసుకుని తినడం ప్రారంభించాం, ఎందుకంటే మా వద్ద మరో ఆప్షన్ లేదు’’ అని ఆండీస్ పర్వతాల్లో జరిగిన, ప్రపంచంలోనే అత్యంత ఘోర ప్రమాదాన్ని వర్ణిస్తూ రగ్బీ ఆటగాళ్లలో ఒకరు తన ఉత్తరంలో రాశారు.

ఉరుగ్వేలోని మాంటెవీడియో ఓల్డ్ క్రిస్టియన్స్ క్లబ్‌కి చెందిన రగ్బీ ఆటగాళ్లు పలు దేశాల జట్ల మధ్య జరుగుతున్న టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి 1972వ సంవత్సరం అక్టోబర్ 13న చిలీ రాజధాని శాంటియాగోడికి బయలుదేరారు.

వీరిలో గుస్తావో కోకో నికోలిచ్ కూడా ఒకరు. అప్పుడు ఈయన వయసు 20 ఏళ్లే.

వారు ప్రయాణించిన ఉరుగ్వే ఎయిర్‌ఫోర్స్ విమానం ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రమాదానికి గురైంది.

ఏవియేషన్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ప్రమాదం ఇది. వారు బయటపడిన తీరు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచం షాక్ అయ్యింది.

ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. సముద్ర మట్టానికి 3,500 మీటర్లపైన ఆండీస్ పర్వత శ్రేణులను తాకడంతో ఈ విమానం కుప్పకూలింది.

ఈ సమయంలో కొందరు ప్రాణాలు విడవగా... కొందరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించుకున్నారు.

ప్రపంచానికి దూరంగా, పగటిపూటే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఇక రాత్రయితే భరించలేని మంచు ఉండే వాతావరణంలో 72 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి బతికి బయటపడ్డారు కొందరు.

ఈ విమానంలో ఉన్న 40 మంది ప్రయాణికుల్లో చాలా మంది రగ్బీ ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులున్నారు. ఐదుగురు విమాన సిబ్బంది.

కోకో నికోలిచ్ ఈ ప్రమాద ఘటనను, ఆ రోజు బయటపడిన తీరును తాను రాసిన రెండు ఉత్తరాల్లో పూస గుచ్చినట్లు వివరించారు. దీనిలో ఆంత్రోపోఫాగి గురించి కూడా చెప్పారు.

ఆంత్రోపోఫాగి(నరమాంస భక్షకులు) అంటే ప్రాణాలను రక్షించుకునేందుకు చనిపోయిన వారిని కోసుకుని తినడమన్నమాట. ఆఖరికి ఆ మంచుకొండల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు చనిపోయిన వారిని కూడా తిన్నారు.

నికోలిచ్ ఉత్తరాల ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

‘నా శరీరంతో ఒకరి ప్రాణాలు కాపాడాల్సి వస్తే...’

‘‘ఈ రోజు రావొద్దని నేను దేవుడ్ని ప్రార్థించాను. కానీ, వచ్చింది. ఇప్పుడు ధైర్యం, విశ్వాసంతో ఎదుర్కోవాలి. విశ్వాసం ఎందుకు అన్నానంటే.. శరీరాలు అక్కడున్నాయి, వాటిని దేవుడు అక్కడ ఉంచాడని విశ్వసించాం. ఇక ఆత్మ విషయానికి వస్తే, పెద్దగా పశ్చాత్తాపం చెందాల్సినవసరం లేదనుకున్నాను’’ అని నికోలిచ్ ఆ ఉత్తరంలో రాశారు.

‘‘ఒకవేళ నా శరీరంతో ఒకరి ప్రాణాలని కాపాడాల్సిన రోజు వస్తే.. నేను సంతోషంగా చేస్తాను’’ అని రాశారు.

ఆ రోజు బతికి బయటపడ్డ వారిపై ‘సొసైటీ ఆఫ్ ది స్నో’ పేరుతో స్పానిష్ భాషలో ఫీచర్ ఫిల్మ్ వచ్చింది. ఈ సినిమాను స్పెయిన్ డైరెక్టర్ జేఏ బయోనా తీశారు.

ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో ఒకరి స్నేహితుడు, జర్నలిస్ట్ పాబ్లో వీర్సి 2008లో ఇదే పేరుతో రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వీర్సి ఈ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్.

లాటిన్ అమెరికా, స్పెయిన్‌లలో తెరపైకి వచ్చిన ఈ సినిమా.. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై జనవరి 4న స్ట్రీమ్ కాబోతుంది.

గోల్డెన్ గ్లోబ్స్ 2024లో ఉత్తమ విదేశీ భాష సినిమాగా ‘సొసైటీ ఆఫ్ ది స్నో’ నామినేట్ అయింది. ఆస్కార్‌కి స్పెయిన్ నుంచి ఈ సినిమా ఎంపికైంది.

ఈ సినిమా తీసేందుకు, 2011 నుంచి జేఏ బయోనా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ వారితో చాలాసార్లు మాట్లాడారు. ఈ సినిమాలో నటించిన నటులు చాలా మంది అర్జెంటీనా, ఉరుగ్వేకి చెందిన వారు. వారికి అంతర్జాతీయంగా పెద్దగా ప్రాచుర్యం కూడా లేదు.

తల్లిదండ్రులకు, ప్రియురాలికి రెండు ఉత్తరాలు రాసిన నికోలిచ్

ఓల్డ్ క్రిస్టియన్స్ క్లబ్‌కి చెందిన రగ్బీ ఆటగాళ్లలో ఒకరు నికోలిచ్. స్టెల్లా మారిస్ ప్రైవేట్ క్యాథలిక్ స్కూల్ మాజీ విద్యార్థుల్లో ఒకరు. చిలియన్ ఓల్డ్ బాయ్స్‌తో ఆట ఆడేందుకు వీరు విమానంలో బయలుదేరారు.

గుస్తావో నికోలిచ్‌కు రాయడమంటే ఇష్టం. అందుకే తాను ఎదుర్కొన్న ఈ ప్రమాదాన్ని ఉత్తరాల ద్వారా తెలియజేయాలనుకున్నారు.

రెండు ఉత్తరాల్లో ఒకటి తన తల్లిదండ్రులకు, ముగ్గురు సోదరులకు రాయగా.. మరొకటి ప్రత్యేకంగా తన ప్రియురాలికి మాత్రమే రాశారు. కొన్ని అంశాలను ఆయన ఎంతో సున్నితంగా వివరించారు. ముఖ్యంగా ఈ ఉత్తరం ప్రారంభంలో మంచుకొండలను అద్భుతంగా వర్ణించారు.

‘‘మా చుట్టూ మంచుకొండలున్నాయి. ఈ సుందర వాతావరణాన్ని మాటల్లో వర్ణించలేను. ఆ మంచు కరగడం ప్రారంభమైతే, సరస్సుగా మారిపోతుందని మాకందరికీ తెలుసు’’ అని నికోలిచ్ చెప్పారు.

విమానం 571లో 45 మంది ప్రయాణికులుండగా.. 18 మంది ప్రమాదం జరిగిన రోజే చనిపోయారు.

అది 1972 అక్టోబర్ 21. ఇంకా అప్పటికి వారు చనిపోయిన మృతదేహాలను తినడం ప్రారంభించలేదు. కానీ, ఆ తర్వాత విమానంలో ఆహారం అయిపోవడంతో చనిపోయిన వారి మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నారు కొందరు.

రూట్ మార్పుపై ఆ లేఖలో ఏముంది?

విమానాన్ని వేరే మార్గంలోకి మలుపు తిప్పడంపై ఉత్తరంలో ప్రస్తావించిన నికోలిచ్.. ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగోలేవని చెప్పారు. అందుకే పైలట్, కో-పైలట్ నేరుగా శాంటియోగోకు వెళ్లకూడదని నిర్ణయించారు. తొలుత సౌత్ ఫస్ట్‌ మీదుగా అత్యంత క్లిష్టమైన మార్గంలో ప్రయాణించాలనుకున్నారు. అక్కడ పర్వత శ్రేణులను దాటాల్సి ఉంది.

‘‘మేమెలా బతికామన్నది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు? అవును, ఆ సమయంలో విమానం ప్రమాదానికి గురికావడంతో అంతా సరైన స్థితిలో లేదు. ఆ సమయంలో మాకది పెద్ద హోటల్ కాకపోవచ్చు. కానీ, నివసించడానికి అదే అనువైన ప్రదేశం. మా దగ్గర నీళ్లున్నాయి. అదృష్టవశాత్తు ఒక క్యాన్ కోస్టామర్, రెండు క్యాన్ల మిఠాయిలు, మూడు క్యాన్ల సీఫుడ్, కొన్ని చాకోలెట్లు, రెండు బాటిళ్ల విస్కీ ఉన్నాయి. అవును, ఆ ఆహారం మాకు సరిపోయేది కాదు. కానీ, జీవించడానికి అది చాలు’’ అని నికోలిచ్ ఉత్తరాల్లో రాశారు.

తినడానికి ఏమీ లేనప్పుడు, మూడు రోజుల పాటు పీనట్ చాకోలెట్‌తో కడుపు నింపుకున్నారు ఒక ప్రయాణికుడు. తొలి రోజు చాకోలెట్ కోటింగ్‌ తిని, పీనట్‌ను జేబులో దాచుకున్నాడు. రెండో రోజు పీనట్‌ను రెండు ముక్కలు చేసి, సగం ముక్కను రెండో రోజూ, మరో సగాన్ని మూడో రోజు తిన్నాడు.

విమాన ప్రమాదం జరిగిన మొదటి రోజు తాను అనుభవించిన బాధను నికోలిచ్ ఉత్తరాల్లో తెలిపారు.

‘‘ఈ చలిలో నేను చచ్చిపోతున్నాను. భరించలేకపోతున్నాను. గడ్డకట్టిపోతున్నా అని ఆటగాళ్లలో ఒకరి స్నేహితుడు రోమన్ మోంచో సబెల్లాతో అన్నాను. పక్కనే ఒక మృతదేహం ఉంది. వారెవరో మాకు తెలియదు. ఐరన్లకు, సీట్లకు మధ్య ఇరుక్కుపోయి చనిపోయిన వ్యక్తిది అది’’ అని తెలిపారు నికోలిచ్.

మోంచో నికోలిచ్‌పై కూర్చుని గట్టిగా తన్నారు. దీంతో నికోలిచ్ శరీరంలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. శరీరంలో ఉష్ణోగ్రతల కోసం తర్వాత రోజులన్నీ ఒకరినొకరు ఇలానే తన్నుకున్నారు.

వారి చేతులను గట్టిగా పట్టుకోవడం, జేబుల్లో పెట్టుకోవడం, గట్టిగా గాలి పీల్చడం ఇలా చేస్తూ కాస్త వెచ్చదనాన్ని పొందారు.

మెల్లమెల్లగా ఇలా చేస్తూ తాము కాస్త సౌకర్యవంతంగా భావించామని తెలిపారు.

ఆ లేఖలో కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలియజేశారు. మోంటెవీడియో తిరిగి వస్తే తన ప్రియురాలు కోరుకుంటే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారు.

‘‘నేను అంతకుమించి ఆలోచించలేను. ఎందుకంటే ఏడుపు తన్నుకుంటూ వస్తోంది. ఏడవద్దు, డీహైడ్రేట్ అయిపోతానని వారు చెప్పారు. ఇది నిజంగా అద్భుతం కదా’’ అని నికోలిచ్ తన ఉత్తరంలో నాటి క్షణాలను వర్ణించారు.

నికోలిచ్ రాసిన రెండో ఉత్తరంలో ఏముంది?

నికోలిచ్ రెండో ఉత్తరాన్ని ప్రత్యేకంగా తన ప్రియురాలు రోసినా మాకిటెలీకి రాశారు. ‘‘ఈ రోజు చాలా అద్భుతమైంది. సూర్యుడు ఉదయించాడు. సూర్యకిరణాలు మా మీద పడుతున్నాయి’’ అని ఆయన ఈ లేఖలో రాశారు.

చాలా మంది నిరాశ చెందినప్పటికీ, తనకింకా నిరాశ రాలేదన్నారు. చూస్తున్న దాని గురించి ఆలోచిస్తే.. తనలో ఏదో అద్భుతమైన శక్తి వచ్చిందన్నారు.

‘‘మా దగ్గర ఆహారం అయిపోతుంది. అది కూడా అందర్ని నిరాశకు గురి చేసింది. మా వద్ద కేవలం రెండు క్యాన్ల సీఫుడ్, ఒక బాటిల్ వైట్ వైన్, కొద్దిగా గ్రెనడైన్(దానిమ్మతో చేసే ఆల్కాహాల్ రహిత రసం) ఉన్నాయి. ఇవి 26 మందికి కావాల్సి ఉంది, ఇంతకుమించి మా దగ్గర ఏమీ లేవు’’ అని చెప్పారు.

ఆహారం కోసం తామేం చేశారో కూడా నికోలిచ్ ప్రియురాలికి వివరించారు.

‘‘ఒకటి నీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. నాకు కూడా. ఇవాళ మేం మృతదేహాలను కోసి తినడం మొదలుపెట్టాం. ఎందుకంటే, మా దగ్గర మరో ఆప్షన్ లేదు’’ అని చెప్పారు.

‘‘ఒకవేళ నేను చనిపోతే, వేరే వాళ్లు బతికేందుకు నా శరీరాన్ని తిన్నా నాకు సమ్మతమే’’ అని నికోలిచ్ వివరించారు.

‘‘నీవు నన్ను చూస్తే భయపడిపోతావు. రోతగా మారిపోయాను. గడ్డం గుబురుగా పెరిగింది. బక్కచిక్కిపోయాను. నా తలపై పెద్ద గాయం అయింది. మరొకటి నా నుదుటిపై. కాళ్లు, మెడ, భుజాలపై చిన్నచిన్న గాయాలు. కానీ, నేను బాగానే ఉన్నాను’’ అని ఆ విషాదం గురించి చెబుతూనే భయపడవద్దంటూ కొన్ని సానుకూల అంశాలను కూడా ప్రస్తావించారు.

ఆ సంకల్ప బలమే నడిపించింది

చివరికి బతికేందుకు వారికి కలిగిన ఆశలను వివరించారు. రగ్బీ ఆటగాళ్లు రాబర్టో కానెస్సా, ఫెర్నాండో పరాడోలు సాయం కోసం పది రోజుల పాటు నడుచుకుంటూ వెళ్లారు. విమాన ప్రమాదం జరిగిన 72 రోజుల తర్వాత పర్వతాల్లో చిక్కుకుపోయిన 16 మందిని కాపాడారు సహాయక సిబ్బంది.

ఈ విమానం ఎక్కడ కుప్పకూలిందో తెలియనప్పటికీ, ఈ విమాన అవశేషాలు, గల్లంతైన ప్రయాణికులను గుర్తించేందుకు సహాయక బృందాలు ఆ మంచు పర్వతాల్లో ఎన్నో రోజులు వెతికాయి. అయినా వారి ఆచూకీ దొరక్కపోవడంతో చిలీకి చెందిన విమాన సహాయ సిబ్బంది సహాయ చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

వాళ్లందరూ ఆ ప్రమాదంలో చనిపోయి ఉంటారని అంతా భావించారు.

అయితే, ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని సంకల్పించుకున్న రగ్బీ ఆటగాళ్లు ఒక చిన్న మెటల్‌తో బయట ప్రపంచ ప్రసారాలను వినేలా సిద్ధం చేసుకున్నారు. రేడియోలో వారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో నికోలిచ్ విన్నారు. ఆ విషయాన్ని పరిగెత్తుకెళ్లి తన వారితో చెప్పారు.

‘‘మీకోసం నా దగ్గర రెండు వార్తలున్నాయి. ఒకటి శుభవార్త, రెండోది చెడువార్త. బాధాకరమైన విషయం ఏంటంటే.. వారు మన కోసం వెతుకులాట ఆపివేశారు. శుభవార్త ఏంటంటే.. బతకడం లేదా చావడం కేవలం మన మీదే ఆధారపడి ఉంది’’ అని అన్నారు.

ఆండీస్ పర్వతాల్లో అద్భుతం

చిలీలో గుస్తావో నికోలిచ్ తండ్రి ఎంతో ఆశతో ఏదో ఒకరోజు తన కొడుకు దొరుకుతాడని ఆశిస్తూ వెతుకుతున్నారు.

ఆ రోజు డిసెంబర్ 1972. క్రిస్మస్ దగ్గరికి వస్తోంది. ఆ సమయంలో కొందరు ఉరుగ్వే ప్రజలు పర్వత శ్రేణి మధ్యలో కనిపించారని వార్తలు వచ్చాయి. అది వారి కుటుంబానికి ఆశను చిగురించేలా చేసింది.

బతికున్న వారిలో గుస్తావో నికోలిచ్ పేరును విన్న తర్వాత ఆయన తల్లి రాక్వెల్ అరోసేనా క్షణం కూడా ఆలోచించకుండా, తొలి విమానంలోనే శాంటియోగో వచ్చేశారు.

రాక్వెల్ అరోసేనా ఆస్పత్రికి చేరుకోగానే, లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. గుస్తావో జెర్బినో కనిపించారు. ఆ సమయంలో రాక్వెల్ అరోసేనా గట్టిగా ఏడ్చారు. జాబితాలో ఉన్న పేరు తన కొడుకుది కాదని ఆమె తెలుసుకున్నారు.

అక్టోబర్ 29న జరిగిన మంచు కొండలు విరిగిపడినప్పుడు, గుస్తావో కోకో నికోలిచ్, మరో ఏడుగురు మంచులో కూరుకుపోయి చనిపోయారు.

గుస్తావో జెర్బినో ఆమెను ఓదార్చి, ఒక ముద్దుపెట్టి.. ‘‘మీకోసం మీ కొడుకు ఒక ఉత్తరం రాశారు’’ అని చెప్పారు.

చనిపోయిన వారి జేబుల్లో ఉన్న లేఖలను, వారికి సంబంధించిన వస్తువులను సేకరించిన జెర్బినో వాటిని కుటుంబ సభ్యులకు అందజేశారు.

తను చేయాల్సిన పని ఇదేనని జెర్బినో భావించారు.

చనిపోయేటప్పుడు ఈ ఉత్తరాలను తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని జెర్బినోకు గుస్తావో కోకో నికోలిచ్ తెలిపారు.

తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ ఉత్తరాలను చదివారు. ఆ ఉత్తరాలను నికోలిచ్ బరువెక్కిన గుండెతో రాశారని ఆయన సోదరుడు అలెజాండ్రో బీబీసీతో అన్నారు.

‘‘నా సోదరుడు చెప్పిన విషయాలు నన్ను గర్వపడేలా చేశాయి. ఆయన చెప్పాడని నాకు తెలుసు. ఎందుకంటే అవన్నీ రాసి ఉన్నాయి. ఆంత్రోపోఫాంగి గురించి బాగా అర్థం చేసుకున్నారు. అందుకే కావొచ్చు, బతికున్న వారికి అండగా నిలుస్తున్న వారిలో నా తండ్రి ఒకరు’’ అని అలెజాండ్రో చెప్పారు.

గుస్తావో నికోలిచ్ సీనియర్, చనిపోయిన మరో వ్యక్తి తండ్రితో కలిసి 1973 ఫిబ్రవరిలో ఆ పర్వతాల వద్దకు ప్రయాణించారు. ఉరుగ్వేలో వారి కొడుకు అవశేషాలకు వారు అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు.

వారు తిరిగి వచ్చినప్పుడు, చాలా భిన్నంగా కనిపించారు. రెండో లేఖలో రాసిన కొన్ని విషయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

బయటపడ్డ కొందరు ఈ విషయాల గురించి మాట్లాడినప్పటికీ, నికోలిచ్ తల్లిదండ్రులు మాత్రం నరమాంస భక్షణకు చెందిన విషయాలను ప్రైవేట్‌గానే ఉంచారు.

ఈ రెండు లేఖలను నికోలిచ్ తల్లి ఒక సొరుగులో భద్రంగా దాచిపెట్టారు. ప్రస్తుతం ఆమె వయసు 96 ఏళ్లు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)