బిహార్: 15 రోజుల్లో 10 వంతెనలు కూలిపోయాయి.. ఎందుకిలా జరిగింది, గత అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

    • రచయిత, చందన్ కుమార్ జజ్వారే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లో వంతెనలు కూలిపోవడం ఆగడం లేదు. బుధవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 5 బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. వీటిల్లో సివాన్ జిల్లాలోని చాఢీ నదిపై నిర్మించిన 2 వంతెనలు కూడా ఉన్నాయి.

అదే నదిపై నిర్మించిన మరొక వంతెనకు వెళ్లే రోడ్డు మార్గం వర్షానికి కొట్టుకుపోవడంతో, ఇప్పుడా వారధికి దారి కూడా లేకుండా పోయింది.

బిహార్ లోని సరన్ జిల్లాలో గండకీ నదిపై నిర్మించిన 2 బ్రిడ్జ్‌లు బుధవారం కూలిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

సివాన్ జిల్లా కలెక్టర్ ముకుల్ కుమార్ గుప్తా బీబీసీతో మాట్లాడుతూ "ఇది మృత నది. దానిపై వంతెనలు కూడా 40-45 సంవత్సరాల పురాతనమైనవి. ఇటుక పునాదులపై కట్టారు. అవి అంత బలంగా ఉండవు. గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలో 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో మట్టి కోతకు గురికావడంతో వంతెనలు కూలిపోయాయి.’’ అని తెలిపారు.

ఈ ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవని, పాత వంతెనలను పునర్నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని ముకుల్ కుమార్ పేర్కొన్నారు.

15 రోజుల్లో కూలిన 10 వంతెనలు

సివాన్ పొరుగు జిల్లా అయిన సరన్ లోని శరణ్ గ్రామంలో బుధవారం రెండు వంతెనలు కూలిపోయాయి.

స్థానిక పాత్రికేయుడు అమిత్ కుమార్ గుప్తా బీబీసీతో మాట్లాడుతూ, "మొదటిసారి కురిసిన భారీ వర్షం తరువాత, 2004 లో నిర్మించిన ఒక వంతెన బుధవారం కూలిపోయింది. అదే నదిపై సుమారు 700 మీటర్ల దూరంలో నిర్మించిన మరో బ్రిడ్జి కూడా కూలిపోయింది." అని చెప్పారు.

రెండో బ్రిడ్జ్ చాలా పాతదని, బ్రిటిష్ కాలంలో నిర్మించారని స్థానికులు చెప్పినట్టు అమిత్ కుమార్ గుప్తా వెల్లడించారు.

ఈ వంతెనలు కూలిన ప్రదేశం నుండి నదిని దాటిన తరువాత 2 కి.మీ.కు సివాన్ జిల్లా మొదలవుతుందని, దీంతో దాదాపు 20-25 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని ఆయన చెప్పారు.

బిహార్‌లో పలు కొత్త వంతెనలు, నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. గత 15 రోజుల్లో రాష్ట్రంలో 10కి పైగా పాత, కొత్త వంతెనలు కూలిపోయాయి.

ఎందుకిలా?

బిహార్ లోని అరారియా, సివాన్, తూర్పు చంపారన్, కిషన్ గంజ్, మధుబని జిల్లాల్లో కూడా గత కొన్ని రోజులుగా వంతెనలు కూలిపోయాయి.

వీటిలో మూడు వంతెనలు నిర్మాణంలో ఉన్నవి కాగా, రెండింటి నిర్మాణం పూర్తయింది.

అరారియాలోని బక్రా నదిపై కూలిన వంతెన తప్ప మిగిలినవన్నీ ప్రమాదాలేనని గ్రామీణ పనుల విభాగం బ్రిడ్జ్ కన్సల్టెంట్ ఇంజనీర్ బీకే సింగ్ బీబీసీ ప్రతినిధి సితూ తివారీతో చెప్పారు.

బక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన గురించి చెబుతూ ‘‘నలుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందం నమూనాలు సేకరించింది. వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన దర్యాప్తు నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే దీనిపై ప్రతిస్పందించగలం.’’ అని బీకే సింగ్ తెలిపారు.

జూన్ 18న అరారియా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది.

జూన్ 22న సివాన్ లోని గండక్ కాలువపై ఉన్న కల్వర్టు కూలిపోయింది. ఈ వంతెన 34 ఏళ్ల నాటిది.

జూన్ 22 రాత్రి తూర్పు చంపారన్ లోని అమ్వాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ బ్రిడ్జిని రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. సాయంత్రం సమయంలో ఈ బ్రిడ్జి పైభాగం కూలగా, రాత్రికి పూర్తిగా నేలమట్టమయ్యింది.

జూన్ 26న కిషన్ గంజ్ జిల్లాలో మరియా నదిపై ఉన్న 13 ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది.

రాజకీయం దుమారం

జూన్ 28న మధుబనిలోని ఝంఝర్పూర్ సబ్ డివిజన్లోని మాధేపూర్ బ్లాక్ లోని భూతాహి బాలన్ నదిలో నిర్మాణంలో ఉన్న వంతెన కిషన్ గంజ్ వద్ద కూలిపోయింది. 2.98 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు వర్షాకాలంలోనే జరగడం గమనార్హం.

గత ఏడాది బిహార్ లో గంగా నదిపై ఉన్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది.

భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్, ఖగారియా జిల్లాలోని అగువానీ మధ్య దాదాపు రూ.1,717 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.

వంతెన కూలిన ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ప్రజలు షేర్ చేశారు. ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించారు.

దీని తర్వాత బిహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోవడంపై రాజకీయ దుమారం రేగింది.

అగువానీ వంతెన కూలిపోయిన సమయంలో, బిహార్ లో మహాకూటమి ప్రభుత్వం ఉంది. దీంతో నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ నాయకత్వంపై బీజేపీ విమర్శలు చేసింది.

బిహార్ లోని మహాకూటమి ప్రభుత్వంలో తేజస్వీ యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి.

ఇప్పుడు నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమిలో ఉన్నారు. దీంతో ఆర్జేడీకి ఆయనపై ఎదురు దాడి చేసే అవకాశం వచ్చింది.

తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ..‘‘ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఆరు పార్టీల డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం, వేలకోట్ల రూపాయల విలువైన వంతెనలు కూలిపోతుంటే దానిని అవినీతి అనడం లేదు.’’ అని విమర్శించారు.

పెట్టుబడులే కాదు, ప్రమాదాలూ పెరిగాయి

బిహార్‌లో ఈ ఏడాది మార్చి నెలలో సుపాల్‌ జిల్లాలో కోసి నదిపై నిర్మిస్తున్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా, 10 మంది గాయపడ్డారు.

దిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని బ్రిడ్జ్ ఇంజనీరింగ్, స్ట్రక్చర్ విభాగానికి చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రాజీవ్ కుమార్ గార్గ్ తన బృందంతో కలిసి వంతెనలు కూలిపోవడంపై అధ్యయనం చేశారు.

భారతదేశంలోని 80 శాతానికి పైగా వంతెనలు వరదలు, భూకంపాలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్లే కూలిపోతున్నాయని ఆయన అధ్యయనం తేల్చింది.

భారతదేశంలో వరదల కారణంగా 52 శాతం వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రధాన కారణం ఇసుకను అధికంగా తవ్వడం. దీనివల్ల వంతెన మూలాలు బలహీనంగా మారి త్వరగా కూలిపోతాయని ఆ అధ్యయనం వెల్లడించింది.

డాక్టర్ రాజీవ్ కుమార్ గార్గ్ బృందం అధ్యయనం ప్రకారం, భారతదేశంలో వంతెనలు కూలిపోవడానికి రెండో కారణం....నిర్మాణంలో ఉపయోగించే నాసిరకమైన సరుకు. దీనివల్ల 10 శాతానికి పైగా వంతెనలు ముందుగానే కూలిపోతాయి.

డిజైన్, నిర్మాణంలో ఉన్న వ్యత్యాసాల కారణంగా దాదాపు 4.13 శాతం వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో రోడ్లు, వంతెనల నిర్మాణ వ్యయం పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)