రాబిన్‌హుడ్ సినిమా రివ్యూ: కొంచెం కామెడీ, మరికొంచెం....

    • రచయిత, జీ ఆర్ మహర్షి
    • హోదా, బీబీసీ కోసం

రాబిన్‌హుడ్ అంటే ఉన్న వాళ్లని దోచి, లేని వాళ్లకి పంచిపెట్టే ఒక క్యారెక్ట‌ర్‌. ఈ జాన‌ర్‌లో చాలా సినిమాలు వ‌చ్చినా మ‌నకి బాగా గుర్తుండేవి జెంటిల్‌మ‌న్, కిక్‌.

సీరియ‌స్‌గా సాగే క‌థ జెంటిల్‌మ‌న్‌. కామెడీతో న‌వ్వులు కురిపిస్తూ న‌డిచే సినిమా కిక్.

రెండింటిలోనూ ఒక గ‌ట్టి పోలీస్ ఆఫీస‌ర్ ఉంటాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య టామ్ అండ్ జెర్రీ, హైడ్ అండ్ సీక్ న‌డుస్తుంటుంది.

నితిన్ హీరోగా వ‌చ్చిన రాబిన్‌హుడ్ కూడా ఇలాంటి క‌థే అనుకుంటాం. కానీ, అది గంజాయి దొంగ‌ల ముఠాతో మిళ‌త‌మైంది.

క‌థ ఏంటంటే..

రామ్ ఒక అనాథాశ్ర‌మంలో ఉంటాడు. మంచిపని కోసం దొంగ‌త‌నం చేసినా త‌ప్పులేద‌ని చిన్నప్పుడే న‌మ్ముతాడు.

పెద్ద‌య్యాక రాబిన్‌హుడ్‌గా మారి ఒక‌ట్రెండు దొంగ‌త‌నాలు చేస్తాడు. ఇది హోంమంత్రి వ‌ర‌కూ వెళుతుంది. దీంతో ఒక గ‌ట్టి పోలీస్ అధికారిని(షైన్ టామ్ చాకో) నియ‌మిస్తారు.

ఇదిలాఉండగా, ఆస్ట్రేలియాలో ఉన్న కోటీశ్వ‌రుడి కూతురు (శ్రీలీల‌), భారత్‌లోని రుద్ర‌కొండ అనే గ్రామానికి రావాల్సి వ‌స్తుంది.

అదే ఊళ్లో ఒక భ‌యంక‌ర విల‌న్, గంజాయి పండిస్తూ అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గాల‌నుకుంటాడు.

హీరో దొంగ‌త‌నాలు మానేసి హీరోయిన్‌కి సెక్యూరిటీగా రుద్ర‌కొండ వెళ‌తాడు. అత‌నితో పాటు రాజేంద్ర‌ప్రసాద్ ఉంటాడు. హీరోయిన్ వెంట వెన్నెల‌ కిషోర్ కూడా ఉంటాడు. వీళ్లంతా రుద్ర‌కొండ వెళ్లి ఏం చేస్తార‌నేది మిగ‌తాక‌థ‌..

రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఊరట

మొదట ఈ కథని దొంగ పోలీస్ కథ అనుకుంటాం. కాసేపటికి, హీరోయిన్‌ని విలన్ నుంచి హీరో రక్షించే కథ అనుకుంటాం. చివరకు ఇది ఏమీ అర్థంకాక బయటకు వస్తాం.

సినిమాని కామెడీగా నడపడం దర్శకుడు వెంకీ కుడుముల స్టైల్. అయితే, కాసేపు కామెడీ ఇంకాసేపు యాక్షన్ మిక్స్ చేసి ప్రతి సీను ఎక్కడో చూసినట్టుగా, రాబోయే సీన్స్ అన్నీ ముందే తెలిసినట్టుగా అనిపించడం దర్శకుడి లోపమే.

విలన్‌ని అంత క్రూరంగా చూపించిన తర్వాత వాడిని బఫూన్‌ని చేయడం ప్రేక్షకులకి నచ్చే విషయం కాదు.

బలమైన సంఘటనలేమీ లేకుండా తెరమీద ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఉన్నంతలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊరట. అయితే, అది కూడా చాలా చోట్ల తెచ్చి పెట్టుకున్నట్లు ఉంది.

శ్రీలీల‌ అందంగా ఉంది. నటించడానికి స్కోప్ ఏమీ లేదు.

కథల బ్లెండింగ్ ఓకే.. మిక్సింగ్ నాట్ ఓకే

చాలా సీరియస్ డ్యూటీ మైండెడ్‌గా పరిచయమైన పోలీస్ అధికారి అంత సులభంగా మూర్ఖుడు కావడం మరీ ఓవర్ సినిమాటిక్ లిబర్టీ. కథనం వేగంగా ఉంటే తప్ప ప్రేక్షకున్ని కుర్చీలో కూర్చోపెట్టలేని కాలంలో ఇంత సాగదీత ఉంటే కష్టం.

హీరో సమాజ హితం కోసం దొంగతనాలు చేయడం దశాబ్దాల క్రితం నాటి కథ.

దాన్ని గంజాయి స్మగ్లింగ్, ఒక ఊరు, హీరోయిన్ రక్షణ, ఇలా అనేక ఉపకథలతో మిక్స్ చేయడం కరెక్ట్ బ్లెండ్. కానీ మిక్సింగ్ కుదరలేదు, నిడివి పెద్దగా లేకపోయినా సుదీర్ఘంగా అనిపించడానికి ఇదే కారణం.

నితిన్ కామెడీ యాక్షన్ బాగా చేసినా, కథలో విషయం లేకపోయేసరికి వృథా అయింది. వెన్నెల కిషోర్ కామెడీ, రాజేంద్రప్రసాద్ టైమింగ్ సినిమాని కాసేపు నిలబెట్టాయి.

ఐటెం సాంగ్ అదిదా సర్ప్రైజ్ కూడా ఆకట్టుకోలేదు. క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ అతిథి పాత్ర‌లో ఉన్నా ప్ర‌యోజ‌నం శూన్యం.

కామెడీ సినిమాల‌కు ఉన్న సమస్య ఏంటంటే అవి కరెక్ట్‌గా కుదరకపోతే నవ్వుల పాలవుతాయి.

ప్లస్ పాయింట్స్

  • రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ
  • శ్రీలీల గ్లామర్
  • జీవీ ప్రకాష్ కుమార్ రెండు పాటలు

మైనస్ పాయింట్స్

  • వేగం లేని కథనం
  • రోటీన్ యాక్షన్ సీన్స్
  • బలమైన పాయింట్ మిస్ కావడం

(గమనిక: రివ్యూలో అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)