You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తక్షణమే లెబనాన్‌ను విడిచి వెళ్లాలని తమ పౌరులను హెచ్చరించిన భారత్, అమెరికా, బ్రిటన్.. మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతోంది?
- రచయిత, టామ్ బెన్నెట్, ఆడమ్ డర్బిన్
- హోదా, బీబీసీ న్యూస్
మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతుండటంతో ఎంత వీలైతే అంత త్వరగా లెబనాన్‌ను విడిచిపెట్టి వెళ్లాలని బేరూత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది.
భారత్ కూడా తన పౌరులకు అలాగే సూచనలు చేసింది. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నందున లెబనాన్‌ను విడిచివెళ్లాలని బేరూత్‌లోని భారత రాయబార కార్యాలయం ఆగస్టు 1న సూచించింది. ఒకవేళ అక్కడి నుంచి బయటికి రాలేకపోతే, అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తదుపరి సూచనలు వచ్చే వరకూ ఎవరూ లెబనాన్‌కు వెళ్లొద్దని తెలిపింది. అలాగే, ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత ఎంబసీ సూచించింది.
ప్రాంతీయ పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నాయని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ కూడా తమ పౌరులను హెచ్చరించారు.
హనియె మరణం తర్వాత తీవ్రమైన ఉద్రిక్తతలు..
తెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియె మరణానికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఆయన ఉన్న ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హనియె చనిపోయారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హమాస్ తెలిపింది.
బేరూత్‌లో ఉన్న హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ తమ వైమానిక దాడిలో చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత, కొన్ని గంటల వ్యవధిలోనే హమాస్ అగ్రనేత హనియె తెహ్రాన్‌లో చనిపోయారన్న వార్త వచ్చింది.
హనియె మరణం తర్వాత ఇజ్రాయెల్‌పై తమ ప్రతీకార చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
ప్రతీకార దాడుల్లో ఇరాన్ మద్దతు ఉన్న, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా కీలక పాత్ర వహించనుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ నుంచి కూడా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందనే భయాలు ఉన్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం, ఆదివారం అర్ధరాత్రి 00.25 గంటలప్పుడు ఉత్తర ఇజ్రాయెల్‌లోని బెయిట్ హిల్లెల్ పట్టణంపైకి డజన్ల కొద్ది రాకెట్లను హిజ్బుల్లా ప్రయోగించింది.
ఈ రాకెట్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (ఐరన్ డోమ్) అడ్డుకున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫుటేజీలో కనిపించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరిగినట్లు రిపోర్టు కాలేదు.
అక్కడున్న తమ పౌరులు తక్షణమే లెబనాన్‌ను విడిచి వెళ్లాలని చెబుతూనే, ఆ దేశానికి వెళ్లొద్దని జోర్డాన్ విదేశాంగ మంత్రి కూడా అడ్వైజరీ జారీ చేశారు.
లెబనాన్‌కు వెళ్లొద్దని సూచనలు జారీ చేయడంతో పాటు, ఇజ్రాయెల్‌కు కూడా ప్రయాణించడాన్ని మానుకోవాలని కెనడా తన పౌరులను హెచ్చరించింది.
ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారవచ్చని చెప్పింది.
లెబనాన్‌లో ఉండాలనుకుంటున్న వారు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని శనివారం అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే చాలా విమానయాన సంస్థలు లెబనాన్‌కు పలు విమానాలను రద్దు చేశాయి, నిలిపివేశాయి.
కానీ, లెబనాన్ నుంచి వచ్చే కమర్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆప్షన్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయి.
ఇరాన్, దాని మిత్ర దేశాల దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్‌కు రక్షణగా, దానికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలో అదనపు యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ చెప్పింది.
ఒకవేళ ప్రజలను అక్కడి నుంచి తరలించాల్సి వస్తే సాయపడేందుకు అదనపు సైన్య బలగాలను, కాన్సులర్ స్టాఫ్‌ను, సరిహద్దు దళాల అధికారులను పంపిస్తున్నట్టు బ్రిటన్ కూడా తెలిపింది. అయితే, కమర్షియల్ విమానాలు నడుస్తున్నప్పుడు, తక్షణమే లెబనాన్‌ను విడిచిపెట్టి వెళ్లాలని తన పౌరులకు సూచించింది.
బ్రిటన్‌కు చెందిన రెండు సైనిక నౌకలు ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్లాయి. రాయల్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది.
ఈ ఘర్షణలు ఈ ప్రాంతమంతా విస్తరించడం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ అన్నారు.
కాగా, గాజాలో నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్న ఒక స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 17 మంది మరణించినట్లు శనివారం హమాస్ అధికారులు తెలిపారు.
గాజా నగరంలోని షేక్ రాద్వాన్ పక్కన ఉన్న హమామా స్కూల్‌ను మిలటెంట్ల కోసం కమాండ్ సెంటర్‌గా వాడుతున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.
అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండించింది. సామాన్య పౌరులు ఉండే ప్రాంతాల నుంచి తాము కార్యకలాపాలు నిర్వహించడంలేదని తెలిపింది.
దేశ సమాచార వ్యవస్థపై ఒకవేళ దాడి జరుగుతుందేమోన్న అనుమానంతో ఇప్పటికే ఇజ్రాయెల్ మంత్రుల ఇళ్లకు శాటిలైట్ ఫోన్లను అధికారులు పంపించారు.
ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ వైమానిక దాడి చేసింది. ఈ సమయంలో 170 డ్రోన్లను, 30 క్రూయిజ్ క్షిపణులను, కనీసం 110 బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించింది.
సిరియాలోని డమాస్కస్‌లో ఇరానియన్ కాన్సులేట్‌పై బాంబు దాడి జరిగింది. అది ఇజ్రాయెల్ పనేనని ఆరోపించిన ఇరాన్, అప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడి చేసింది.
ఇప్పుడు కూడా ఇరాన్ ప్రతీకారం ఈ విధంగానే ఉంటుందని చాలా మంది భయపడుతున్నారు. ‘‘ఇజ్రాయెల్‌ను శిక్షించే హక్కు ఉంది’’ అని ఇరాన్ అంటోంది.
ప్రపంచం అసాధారణమైన పరిస్థితులను చూడబోతుందంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీలో ఒక అనౌన్సర్ అన్నారు.
‘‘మున్ముందు మరింత సవాళ్లు ఎదురవుతాయి. అన్నివైపుల నుంచీ ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన పౌరులతో అన్నారు.
కొన్ని రోజుల కిందట గోలన్ హైట్స్‌పై జరిగిన దాడితో పరిస్థితులన్నీ మారిపోయాయి.
ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని సాకర్ మైదానంలో జరిగిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు, యువకులు మరణించడంతో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
ఈ దాడికి కారణం హిజ్బుల్లా అని ఇజ్రాయెల్ ఆరోపించింది. తీవ్ర ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే, ఈ దాడిలో తమ ప్రమేయం లేదని హిజ్బుల్లా చెబుతోంది.
ఈ దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే, బేరూత్‌లో ఇజ్రాయెల్ జరిపిన లక్షిత దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ మరణించారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులతో సహా మరో నలుగురు చనిపోయారు.
ఆ తర్వాత గంటల వ్యవధిలోనే హమాస్ అగ్రనేత హనియె ఇరాన్‌లోని తెహ్రాన్‌లో చనిపోయారు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు హనియె తెహ్రాన్‌కు వెళ్లి, తన గెస్ట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు ఆయనపై దాడి జరిగిందని ఇరాన్ తెలిపింది.
హనియె అంత్యక్రియల కార్యక్రమం గురువారం తెహ్రాన్‌లో జరిగింది. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ హత్యలకు ఇజ్రాయెల్ కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)