You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మొహమ్మద్ డేఫ్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి, 141 మంది చనిపోయారన్న హమాస్
- రచయిత, రష్దీ అబులౌఫ్, టామ్ మెక్‌ఆర్థర్,
- హోదా, బీబీసీ ప్రతినిధులు
శనివారం నుంచి ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 141 మంది పాలస్తీనియన్లు చనిపోయారని గాజాలో హమాస్ నేతృత్వంలో నడుస్తున్న ఆరోగ్య శాఖ ఆరోపించింది.
ఈ దాడుల్లో దాదాపు 400 మంది గాయపడ్డారని హమాస్ తెలిపింది.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సమీపంలో ‘హ్యూమానిటేరియన్ ఏరియా’గా గుర్తించిన అల్-మవాసి ప్రాంతంలో శనివారం ఒక దాడి జరిగింది.
అయితే, "హమాస్ మిలిటెంట్లు మాత్రమే ఉన్న, సామాన్య పౌరులు లేని" బహిరంగ ప్రదేశంలో హమాస్ సైనిక విభాగం చీఫ్ మొహమ్మద్ డేఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ అధికారి ఒకరు చెప్పారు.
ఖాన్ యూనిస్ ప్రాంత హమాస్ కమాండర్ రఫా సలామాను కూడా ఈ దాడిలో లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతోనే దాడి చేశామని ఆ అధికారి చెప్పారు.
శనివారం జరిగిన రెండో దాడిలో 17 మంది చనిపోయారని హమాస్ నేతృత్వంలోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. పశ్చిమ గాజాలోని షతి శరణార్థి శిబిరంలో ఉన్న ఓ ప్రార్థనా భవనంపై ఆ దాడి జరిగినట్లు హమాస్ చెప్పింది. అయితే, దానిపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించలేదు.
హమాస్ ఏమన్నదంటే..
హమాస్ సీనియర్ లీడర్లే లక్ష్యంగా దాడి చేశామన్న ఇజ్రాయెల్ వాదన అవాస్తవమని హమాస్ చెప్పింది.
"పాలస్తీనా నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెప్పడం ఇది మొదటిసారి కాదు, అది అవాస్తవం అని తరువాత నిరూపణ అయింది" అని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.
దాడి జరిగినట్లుగా చెబుతున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెబ్‌సైట్‌లో ఉన్న వీడియో ఫుటేజీని ‘బీబీసీ వెరిఫై’ బృందం విశ్లేషించింది. మానవతా జోన్‌గా గుర్తించిన ప్రాంతంలోనే ఈ దాడి జరిగిందని తేలింది.
దాడి జరిగిన ప్రదేశంలో భూకంపం వచ్చినట్లుగా అనిపించిందని అల్-మవాసీలోని ఒక ప్రత్యక్ష సాక్షి బీబీసీతో చెప్పారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన కొన్ని వీడియోలలో శిథిలాల నుంచి పొగలు రావడం, క్షతగాత్రులను, మృతులను స్ట్రెచర్‌లపైకి ఎక్కించడం కనిపిస్తున్నాయి. ప్రజలు భారీ శిథిలాలను చేతులతోనే తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంతకూ, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న మొహమ్మద్ డేఫ్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి?
(ఇజ్రాయెల్‌కు కొరకరాని కొయ్యగా మారిన 'ఒంటి కన్ను' మిలిటెంట్ అంటూ బీబీసీ కరస్పాండెంట్ జాషువా నెవెట్ 2021 జూన్ 2న బీబీసీ కోసం రాసిన కథనం ఈ కింద చదవండి).
గాజా 'అతిథి'
పాలస్తీనా మిలిటెంట్ మొహమ్మద్ డేఫ్ తన కరకు స్వరంతో 2021లో ఇజ్రాయెల్‌కు ఓ హెచ్చరిక పంపారు. హమాస్ డిమాండ్‌లు నెరవేర్చక పోతే ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నది ఆ హెచ్చరిక సారాంశం. హమాస్ మిలిటరీ వింగ్‌కు ఆయన నాయకుడు.
గాజాలో ఇజ్రాయెల్‌కు మోస్ట్ వాంటెడ్ లీడర్ మొహమ్మద్ డేఫ్. గాజా మీద తీవ్రంగా దాడులు జరుగుతున్న తరుణంలో ఏడేళ్ల తర్వాత మహ్మద్ డేఫ్ గొంతు తొలిసారి (2021లో) వినిపించింది.
కాకపోతే, ఆయన హెచ్చరికలను ఆ సమయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
డేఫ్ గురించిన సమాచారం ఎక్కువగా ఇజ్రాయెల్, పాలస్తీన మీడియాల నుంచే వస్తుంది. వాటి ప్రకారం డేఫ్ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్ధి శిబిరంలో 1965లో పుట్టారు.
మొహమ్మద్ దయాబ్ ఇబ్రహిం అల్-మస్రి ఆయన అసలు పేరు కాగా, ఆయన వివిధ ప్రదేశాలకు తిరుగుతున్న క్రమంలో తన పేరును డేఫ్‌గా మార్చుకున్నారు. డేఫ్ అంటే అతిథి అని అర్థం.
అయితే, ఆయన ఎక్కువ కాలం ఎక్కడ ఉన్నారు? ఏం చదువుకున్నారు? అన్నది మాత్రం పెద్దగా తెలియదు.
హమాస్ పుట్టే నాటికి డేఫ్ యువకుడు. 1980లలో ఆయన హమాస్‌లో చేరారు. ఇజ్రాయెల్‌పై ద్వేషాన్ని నరనరాన నింపుకొన్న డేఫ్, హమాస్ సైన్యంలో వేగంగా ఎదిగారు.
''హమాస్‌లో ఆయనొక అతివాది'' అని అమెరికా కౌంటర్ టెర్రరిజం మాజీ సలహాదారు లెవిట్ అన్నారు. హమాస్ కీలక నేతలకు ఆయన చాలా సన్నిహితుడు. ముఖ్యంగా బాంబ్ మేకర్, ఇంజినీర్ అనే పేరున్న అయ్యాష్‌కు డేఫ్ సన్నిహితుడు.
స్నేహితుడి కోసం ప్రతీకారం
1990లలో ఇజ్రాయెల్ మీద బాంబులతో విరుచుకు పడిన వారిలో అయ్యాష్ కీలకమైన వ్యక్తి. 1996లో అయ్యాష్‌ను ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి.
అయితే, ఆ తర్వాత మరిన్ని బాంబు దాడులను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని వెనక ఉన్న వ్యక్తి డేఫ్ అని చెబుతారు. తన స్నేహితుడిని చంపినందుకు ఆయన ప్రతీకారం తీర్చుకున్నారని అంటారు.
తన వ్యూహాత్మక ఎత్తుగడలతో హమాస్‌లో ఆయన వేగంగా అగ్రస్థాయికి చేరుకున్నారు. 2002లో హమాస్ మిలిటరీ వింగ్ నాయకుడిగా మారారు.
కస్సామ్ అనే రాకెట్‌ను తయారు చేయడంలో డేఫ్ కీలక పాత్ర పోషించారు. ఈ మిసైల్‌ను హమాస్ అత్యంత విలువైన ఆయుధంగా చెబుతారు.
ఇజ్రాయెల్ మిలిటరీ దాడుల నుంచి తప్పించుకోవడానికి డేఫ్ గాజాలోని సొరంగ మార్గాలలో నివసించేవారు. అక్కడి నుంచి తన సైన్యానికి ఆదేశాలిచ్చేవారు.
అనేక హత్యాయత్నాలు
ఇజ్రయెల్ రాడార్ నీడలో డేఫ్ నిత్యం మృత్యువుతో యుద్ధం చేస్తుండేవారు. 2000 సంవత్సరం నుంచి ఆయనపై అనేకమార్లు ఇజ్రాయెలీ దళాలు దాడికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఆయన కన్ను, ఎముక దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది.
''ఆయన ఇక మిలిటరీ నాయకుడిగా పని చేయడం అసాధ్యమని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన కోలుకుని తిరిగి విధుల్లో చేరారు'' అని ఇజ్రాయెల్‌కు చెందిన మిలిటరీ మాజీ జనరల్ ఒకరు బీబీసీతో అన్నారు.
అనేకమార్లు ఆయన ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడంతో హమాస్ వర్గాల్లో డేఫ్ అంటే క్రేజ్ పెరిగింది. అందరూ ఆయనను 'క్యాట్ విత్ నైన్ లైవ్స్' అని అనే వారు.
2014లో ఆయనపై 5వ సారి హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ''డేఫ్ జీవించే ఉన్నారు. మిలిటరీ ఆపరేషన్‌లలో పాల్గొంటున్నారు'' అని హమాస్ ప్రకటించింది.
ఆయన ఇలా పలుమార్లు తప్పించుకోవడం ఇజ్రాయెల్ గూఢచార సాంకేతిక పరిజ్ఞానం మీదనే అనుమానాలు పెరిగేందుకు కారణమైంది.
''మీరు ఫోన్ వాడకపోతే, కంప్యూటర్ ఉపయోగించకపోతే, మీరు ఎక్కడున్నారన్నది కనుక్కోవడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కూడా చాలా కష్టం'' అని లెవిట్ అన్నారు.
''హమాస్ తవ్విన టన్నెల్స్ లోతు, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న కొంత పాత తరం టెక్నాలజీ కారణంగా డేఫ్‌ను గుర్తించి చంపడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేకసార్లు విఫలమవుతోంది'' అని ఇజ్రాయెల్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒకరు అన్నారు.
డేఫ్ మీద ఇజ్రాయెల్ తన దృష్టినంతా కేంద్రీకరించడం విశేషమేమీ కాదని, అయితే ఆయన మీద జరుగుతున్న విఫల హత్యా యత్నాలన్ని ఆయన ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయని లెవిట్ వ్యాఖ్యానించారు.
''హమాస్‌లో ఉన్న పాతతరం నాయకుల్లో ఆయన ఒకరు. ఉద్యమం ఆరంభం నుంచి ఉన్న నాయకులు చాలా తక్కువమంది ఉన్నారు. ఒక రకంగా ఆయన వారిలో కాస్త విలక్షణమైన నాయకుడు'' అన్నారు లెవిట్.
అక్టోబర్ 7 దాడి తర్వాత..
2023 అక్టోబర్ 7న హమాస్‌కు చెందిన అనేక మంది సాయుధులు ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. ఆ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ వాసులు, విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిని హమాస్ సాయుధులు గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. ఆ దాడుల వెనకున్న ప్రధాన సూత్రధారుల్లో మొహమ్మద్ డేఫ్ కూడా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 38,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ చెప్పింది.
బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)