తొలిదశ శాంతి ఒప్పందానికి ముందు 24 నెలలపాటు గాజాలో జరిగిన విధ్వంసం, ఒప్పందం తర్వాత ఇజ్రాయెలీలలో ఆనందాన్ని చూపించే ఫోటోలు..

గడచిన రెండేళ్లలో ఇజ్రాయెల్ దళాలు గాజాలో చాలా భాగాన్ని ధ్వంసం చేశాయి. 67,183 మందికి పైగా పాలస్తీనీయులను, అందులో 20,179 మంది పిల్లలను, చంపాయని ఆ ప్రాంత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ సంఖ్యలను ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు నమ్మదగినవిగా పరిగణిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం వాటిని వ్యతిరేకిస్తోంది.

2023 అక్టోబర్ 7న హమాస్‌ నేతృత్వంలోని సాయుధులు సుమారు 1,200 మందిని చంపి, 251 మందిని బందీలుగా తీసుకెళ్లిన దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై సైనిక దాడిని ప్రారంభించింది.

"యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పోషకాహార లోపం కారణంగా మరో 460 మంది మరణించారు. అందులో 182 మంది ఆగస్టులో ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) గాజా నగరంలో మానవులు సృష్టించిన కరువు పరిస్థితి ఉందని నిర్ధరించిన తర్వాత మరణించారు" అని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

గాజాలో ఆకలిమరణాలను నిరాకరిస్తూ, ఆహారం, ఇతర సహాయక సరఫరాలను ఇజ్రాయెల్ సులభతరం చేస్తోందని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ అన్నారు.

హమాస్, ఇజ్రాయెల్ రెండూ తొలిదశ శాంతి ఒప్పందాన్ని పాటిస్తే, అనేకమంది అమెరికా రాజకీయ నాయకులు ఆశిస్తున్నట్లుగా...ఈ యుద్ధం ముగిసిపోతుంది.

అయితే గాజా పునర్నిర్మాణం, పునరుద్ధరణకు చాలా కాలం పట్టే అవకాశం ఉంది.

అక్టోబర్ 6, 2025న గాజా దక్షిణ ప్రాంతంలో తీవ్రంగా దెబ్బతిన్న షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ మసీదు సమీపంలో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన ప్రజలు తాత్కాలిక గుడారాల్లో నివసిస్తున్న దృశ్యం.

సెప్టెంబర్ 30, 2025న గాజా నగరంలోని అబూ హసీరా వీధిపై ఇజ్రాయెల్ దాడి తర్వాత, పాలస్తీనీ పిల్లలు శిథిలాల మధ్య నుంచి ఉపయోగపడే వస్తువులను ఏరుకున్నారు.

గాజాలోని ఈ మసీదు లానే, ఆ ప్రాంతంలోని మసీదులు పదుల సంఖ్యలో పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.

గాజా నగరంలో జరిగిన తీవ్రమైన ఇజ్రాయెల్ దాడుల తర్వాత, ఉత్తర గాజా నుంచి తరలిపోతున్న పాలస్తీనీయులు.

గాజా నగరంలో ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఒక ఇంట్లో మంటలు చెలరేగి, పొగలు ఎగసిపడుతున్నాయి.

నవంబర్ 1, 2023 న గాజా ప్రాంతంలోని పాలస్తీనా శరణార్ధ శిబిరంలో, రాత్రిపూట జరిగిన ఇజ్రాయెల్ దాడి అనంతరం విధ్వంసాన్ని పరిశీలిస్తున్న పాలస్తీనీయులు.

ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలోని ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు, భయంతో ఒక నిర్మాణం వెనుక దాక్కున్న బాలుడు.

సెప్టెంబర్ 1, 2024న గాజా నగరంలోని నుసెరాత్ శరణార్థి శిబిరంలో, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఉపశమన, పునరావాస సంస్థ (యుఎన్ఆర్‌డబ్యూఏ) నిర్వహించే పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి తర్వాత, పౌరులు శిథిలాల మధ్య నుంచి బాధితులను మోసుకెళుతున్న దృశ్యం.

మే 18, 2024న ఉత్తర గాజా ప్రాంతంలోని బైట్ లాహియ్యా పట్టణంలో కమాల్ అద్వాన్ హాస్పిటల్ చుట్టూ ఉన్న ఇళ్లను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేసిన తర్వాత, గాయపడ్డ పాలస్తీనీయులను శిథిలాల కింద నుంచి రక్షించారు.

గాజా నగరంలో ధ్వంసమైన భవనాలపైనుంచి ఎగసిపడుతున్న పొగలు.

ఇక తాజా శాంతి ఒప్పందంతో చాలాచోట్ల ఆనందం వెల్లివిరిసింది.

టెల్ అవివ్‌లో హోస్టేజెస్ స్క్వేర్‌లో రాత్రిపూట కేరింతలు కొడుతున్న ప్రజలు కనిపించారు. గాజాలో ఇంకా బందీగా ఉన్న ఇజ్రాయెలీల కుటుంబాలు వారి ఆత్మీయులను కలుసుకోబోతున్నందుకు సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి కొన్ని తాజా ఫోటోలు ఇలా ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)