బ్యాగీ గ్రీన్ క్యాప్: డాన్ బ్రాడ్‌మన్ భారత్‌తో ఆడిన మ్యాచ్‌లో పెట్టుకున్న క్యాప్‌ వేలంలో ఎన్ని కోట్లు పలికిందంటే..

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌‌మన్ ధరించిన 'బ్యాగీ గ్రీన్' క్యాప్ వేలంలో రికార్డు ధరకు పలికింది

ఈ క్యాప్‌ను 4.6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 2.92 కోట్లు)కు వేలంలో కొనుగోలు చేశారు. 1947–48లో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా బ్రాడ్‌మన్ ఈ క్యాప్‌ను ధరించారు.

అప్పట్లో ఈ క్యాప్‌ను భారత క్రికెటర్ శ్రీరంగ వాసుదేవ్ సోహోనికి బ్రాడ్‌మన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.

75 ఏళ్లపాటు సోహోని కుటుంబం ఈ క్యాప్‌ను భద్రపరిచింది.

'బ్యాగీ గ్రీన్' క్యాప్ అనేది ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్‌కు ప్రతీకగా భావిస్తారు.

బ్రాడ్‌మన్‌ కాలంలో ప్రతి సిరీస్‌కు కొత్త క్యాప్ ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం టెస్ట్ అరంగేట్రం చేసే ఆటగాడికి ఒక్క క్యాప్ మాత్రమే ఇచ్చి, కెరీర్ అంతా దాన్నే ధరించే సంప్రదాయం ఉంది.

బ్రాడ్‌మన్‌ ధరించిన క్యాప్‌లలో ఇప్పటివరకు 11 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ఇది ఒకటి. ఈ క్యాప్ ఇప్పటివరకు ఎప్పుడూ పబ్లిక్‌లో ప్రదర్శనకు రాలేదు.

లాయిడ్స్ ఆక్షనియర్స్ అండ్ వాల్యూయర్స్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లీ హేమ్స్ మాట్లాడుతూ "మూడు తరాల పాటు ఈ క్యాప్‌ను తాళం, కీ వేసి భద్రపరిచారు. కుటుంబ సభ్యులు కూడా 16 ఏళ్లు పూర్తయ్యాక, కేవలం ఐదు నిమిషాలపాటు మాత్రమే చూడటానికి అనుమతి ఉండేది" అని చెప్పారు.

ఈ క్యాప్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను వెల్లడించలేదు. అయితే, దీన్ని ఆస్ట్రేలియాలోని ఒక మ్యూజియంలో ప్రదర్శించనున్నట్లు వేలం నిర్వాహకులు తెలిపారు.

క్యాప్ లోపల డీజీ బ్రాడ్‌మన్, ఎస్‌డబ్ల్యూ సోనీ అని ఇంగ్లిష్‌లో పేర్లు చెక్కి ఉన్నాయి. ఆ టోపీ ఇప్పటికీ మంచి కండీషన్‌లోనే ఉంది.

ఈ క్యాప్ 16.5 శాతం బయ్యర్ ప్రీమియంతో కలిపి, మొత్తం ధర 5,35,900 ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ. 3.40 కోట్లు) కు చేరింది. ఇది గతంలో నమోదైన రికార్డును అధిగమించింది.

డాన్ బ్రాడ్‌మన్ (1908–2001) క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందారు. 52 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆయన సగటు 99.94గా ఉండటం ఇప్పటికీ రికార్డే.

1947–48 భారత్ సిరీస్ ఆయన సొంతగడ్డపై ఆడిన చివరి సిరీస్. ఆ సిరీస్‌లో బ్రాడ్‌మన్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 715 పరుగులు, సగటు 178.75తో సాధించారు. మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి. ఆ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4–0తో గెలుచుకుంది.

స్వాతంత్ర్యం వచ్చాక భారత్ ఆడిన తొలి అంతర్జాతీయ క్రికెట్ టూర్ ఇది.

శ్రీరంగ వాసుదేవ్ సోహోని, భారత్ తరఫున నాలుగు టెస్టులు ఆడిన ఆల్‌రౌండర్. ఆయన 75 ఏళ్ల వయసులో 1993లో కన్నుమూశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)