You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అస్సాం: బహుభార్యత్వాన్ని నిషేధిస్తామంటున్న ప్రభుత్వం.. ముస్లింలలో భయం
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అస్సాంలో బహుభార్యత్వాన్ని నిషేధించే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ బహుభార్యత్వాన్ని నిషేధించే అధికారాలు రాష్ట్ర శాసనసభకు ఉన్నాయా, లేదా అన్నది పరిశీలిస్తుంది.
ఆరు నెలల్లో కమిటీ నివేదిక అందిస్తుందని అస్సాం ప్రభుత్వం చెప్పింది.
దీనికోసం కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం ప్రకటించారు.
బహుభార్యత్వాన్ని నిషేధించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25తో పాటు ముస్లిం పర్సనల్ లా (షరియా), 1937లోని నిబంధనలను ఈ కమిటీ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు.
"ఇది జాతీయ స్థాయిలో యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) కిందకు రాదు. కానీ దానికి సంబంధించిన అంశంగా, రాష్ట్ర చట్టాల ద్వారా అస్సాంలో బహుభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలన్నది మా ఉద్దేశం" అన్నారు హిమంత బిస్వా శర్మ.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి యూనిఫాం సివిల్ కోడ్ ఉండాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే, ఒక రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్‌లో భాగంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా, ఈ నిర్ణయం అస్సాంలో స్థిరపడిన బెంగాలీ మూలాలున్న ముస్లింలకు ఆందోళన కలిగిస్తోంది.
బెంగాలీ మూలాలున్న ముస్లింలు ఏమంటున్నారు?
రాష్ట్ర ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తోందని, ముఖ్యమంత్రి మాటలు నిజం కావని చార్-చపౌరి పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ హఫీజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
అస్సాంలోని నదీతీర ప్రాంతాల్లో స్థిరపడిన బెంగాలీ మూలాలున్న ముస్లింలను మియా ముస్లింలని అంటారు. వీరిలో అస్సామీ సంస్కృతిని పెంపొందించేందుకు కృషి చేస్తున్న సంస్థ చార్-చపౌరి పరిషత్.
"భారతదేశంలో బహుభార్యత్వానికి సంబంధించిన తాజా గణాంకాలలో, ఈ ఆచారం కేవలం ముస్లింలలోనే కాకుండా హిందువులలో కూడా ఉందని తేలింది" అని ఆయన చెప్పారు.
ఆల్ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు రిజావుల్ కరీం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు.
"మా సంస్థ 1980 నుంచి ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో బహుభార్యత్వం, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదు" అని ఆయన బీబీసీతో అన్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) తాజా గణాంకాల ప్రకారం, ముస్లింలలోనే కాకుండా ఇతర వర్గాలలో కూడా బహుభార్యత్వం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ట్రెండ్ తగ్గుతూ వస్తోంది.
ఎన్ఎఫ్‌హెచ్ఎస్ 5 డేటా ప్రకారం, భారతదేశంలో 1.4 శాతం మంది మహిళలు బహుభార్యత్వంలో ఉన్నారు. వీరి వయసు 15 నుంచి 49 సంవత్సరాల వయసు లోపు.
అధికంగా మేఘాలయలో 6.2 శాతం మంది మహిళలు బహుభార్యత్వంలో ఉండగా, అస్సాంలో ఇది 2.4 శాతంగా ఉంది. దేశంలో అస్సాం ఆరో స్థానంలో ఉంది.
"ప్రభుత్వం సదుద్దేశంతో బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టం తీసుకురావాలని భావిస్తే, మేమంతా దానిని స్వాగతిస్తాం. ముస్లింలలో బహుభార్యత్వం చట్టవిరుద్ధం కానప్పటికీ, అస్సాం ముస్లింలలో ఈ ఆచారం దాదాపు పోయిందనే చెప్పాలి" అని గువాహటి యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అబ్దుల్ మన్నన్ అన్నారు.
కొత్త చట్టంతో ఏం మారుతుంది?
గువాహటి హైకోర్టు సీనియర్ న్యాయవాది అన్షుమన్ బోరా మాట్లాడుతూ, "బహుభార్యత్వం ఎప్పటినుంచో ఉన్న సమస్య. దీని నియంత్రణకు ఇప్పటికే ఒక చట్టం ఉంది. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లో సెక్షన్ 494 ప్రకారం, రెండో పెళ్లి నేరం. ఇది ఉన్నా కూడా అస్సాం మరో కొత్త చట్టం తీసుకు రావాలనే ఆలోచనలో ఉందంటే, దీనికి వేరే అర్థాలు ఉంటాయి" అన్నారు.
"బహుభార్యత్వానికి సంబంధించి అత్యంత కష్టమైన పని ఒకే వ్యక్తికి నాలుగైదు పెళ్లిళ్లు అయ్యాయని నిరూపించడం. ఐపీసీలో కూడా ఇన్ని వివాహాలు జరిగాయని సాక్ష్యాధారాలతో నిరూపించడం చాలా కష్టం. మతాలతో సంబంధం లేకుండా బహుభార్యత్వం నేరమని ఐపీసీ చెబుతుంది. చట్టం ముస్లింలకు మినహాయింపు ఇస్తోందన్నది నిజం కాదు. ముస్లిం చట్టాల కింద ఒకే పురుషుడు పలు వివాహాలు చేసుకోవచ్చు. కానీ, ఐపీసీ కింద దాన్ని విచారణ చేయవచ్చు" అని లాయర్ అన్షుమన్ బోరా వివరించారు.
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలనే చర్చ జరుగుతున్నప్పుడు, అస్సాం ప్రభుత్వం బహుభార్యత్వం కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఏముందని అన్షుమాన్ ప్రశ్నిస్తున్నారు.
"ఇది ఓ రాజకీయ నాటకంలా కనిపిస్తోంది. బాల్యవివాహాలపై ప్రభుత్వం చర్యలు మొదలెట్టింది కానీ, అవి కుంటుపడ్డాయి. గిరిజన ప్రాంతాల్లో బాల్యవివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు" అని ఆయన అన్నారు.
బహుభార్యత్వంపై అస్సాం ఏర్పాటు చేసిన కమిటీకి రిటైర్డ్ జడ్జి రూమి కుమారి ఫుకాన్ నేతృత్వం వహిస్తున్నారు.
ఈ కమిటీలో ఉన్న ఏకైక ముస్లిం సభ్యుడు గువాహటి హైకోర్టు సీనియర్ న్యాయవాది నెకిబుర్ జమాన్.
"ప్రస్తుతానికి కమిటీ మాత్రమే ఏర్పడింది. మొదటి సమావేశం జరిగే వరకు మున్ముందు తీసుకుబోయే చర్యలేమిటి అనేది చెప్పడం తొందరపాటు అవుతుంది. బెంగాలీ మూలాలకు చెందిన ముస్లింలలో బహుభార్యత్వం కేసులు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ అధ్యయనం చేస్తాం. ముస్లిం పర్సనల్ లాలోని నిబంధనలు సహా అన్ని చట్టాలను పరిగణనలోకి తీసుకుంటాం" అని నెకిబుర్ జమాన్ చెప్పారు.
ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలు
"దేశంలో ఇప్పటివరకు యూనిఫాం సివిల్ కోడ్ రూపొందించలేదు. కానీ, అస్సాం ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమైపోతోంది. ఈ రకం ప్రోపగాండాకు సమయాన్ని, ప్రభుత్వ సొమ్మును వృథా చేసే బదులు రాష్ట్రంలో ఇతర సమస్యలపై దృష్టి పెట్టడం మంచిది" అని అస్సాం శాసనసభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియా అభిప్రాయపడ్డారు.
"బహుభార్యత్వం ముస్లింలలో మాత్రమే కాదు, ఇతర వర్గాలలో కూడా ఉంది. అలాంటప్పుడు ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదు" అని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు.
ముస్లిం పర్సనల్ లా (షరియత్), 1937 ప్రకారం, ముస్లిం పురుషులు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చు. కానీ, దీనికి మొదటి భార్య సమ్మతి ఉండాలి. ఈ చట్టం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. ముస్లిం స్త్రీలకు రెండో పెళ్లికి అనుమతి లేదు.
"అస్సాంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చాలా రకాల చర్యలకు బెంగాలీ ముస్లింలు ఎక్కువగా బలయ్యారు. బాల్యవివాహాలైనా, ఆక్రమణలను తొలగించడమైనా, మదర్సాలపై చర్యలైనా ముస్లింలకు ప్రతికూలంగా మారింది. హిందుత్వ రాజకీయాల అజెండా కింద బీజేపీ ప్రభుత్వం చేసే పనులకు ప్రభావితమయ్యే వారిలో ఎక్కువ మంది ముస్లింలే" అని అక్కడి సీనియర్ జర్నలిస్ట్ బైకుంఠ్ నాథ్ గోస్వామి అన్నారు.
బీజేపీ ఏమంటోంది?
రాజకీయ నాయకులు దేన్నయినా విమర్శించడానికి వెనుకాడరని అస్సాం బీజేపీ సీనియర్ నాయకుడు ప్రమోద్ స్వామి అన్నారు.
"బహుభార్యత్వం లాంటి ఆచారాలు సమాజానికి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా అన్నది ప్రశ్న. మా ప్రభుత్వం దానిని నిషేధించడానికి చట్టపరమైన అంశాలను పరిశీలిస్తోంది. మేం మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాం. అందుకే ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం" అని ఆయన చెప్పారు.
ఇవి కూా చదవండి:
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
- ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)