తిరుపతి: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేపై పోక్సో చట్టం కింద కేసు, అసలేం జరిగింది?

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తన బిడ్డపై అత్యాచారయత్నం జరిగినట్టు చెవిరెడ్డి దుష్ప్రచారం చేశారని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.

బాలిక భవిష్యత్తు దెబ్బతీశారని, తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని బాలిక తండ్రి యర్రావారిపాలెం పోలీసులకు చెవిరెడ్డిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసుతోపాటూ బాధితులది దళిత కుటుంబం కావడంతో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.

ఏం జరిగిందంటే..

నవంబర్ 4న తిరుపతి జిల్లా యర్రావారి పాలెం మండలానికి చెందిన ఒక బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా.. కొందరు ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి దాడి చేశారని స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత బాలికను ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించారనే ఫిర్యాదుపైనే కేసు నమోదైంది.

ఈలోపు ఆ బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు బాలికను పరామర్శించి ఆమెపై అత్యాచారం జరిగినట్టు వస్తున్న వార్తలను ఖండించారు.

కేసు విచారణలో ఉందని బాలికపై దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని అదే రోజు హెచ్చరించారు. తర్వాత రోజు అంటే నవంబర్ 5న వైసీపీ నాయకులు రోజా, జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆస్పత్రిలో ఉన్న బాలికను పరామర్శించారు.

తరువాత బాలికపై అత్యాచారం జరగలేదని వైద్యులు తెలిపారని ఎస్పీ ప్రకటించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి ఒక మైనర్ బాలుడిని అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు.

తాజాగా బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డిపైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు బీబీసీతో చెప్పారు.

చెవిరెడ్డి ఏమన్నారు?

తనపై పోలీసులు పోక్సో కేసు నమోదుచేయడంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు.

బాలికకు అన్యాయం జరిగిందేమో అనే ఆందోళనలో ఆ కుటుంబానికి న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే మాట్లాడానే తప్ప తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడలేదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

“పరామర్శకు వెళ్లి, బిడ్డకు మెరుగైన వైద్యం అందించమని అడిగితే పోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, 11 రకాల సెక్షన్లతో కేసులు పెట్టొచ్చని భారత దేశ చరిత్రలో తొలిసారి నిరూపిస్తున్నారు. ఏ శిక్ష కైనా సిద్ధంగా ఉన్నాం. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసే మనస్తత్వం కాదు. ఎక్కడా ఫోను ఆఫ్ చేసేది లేదు. ఎక్కడకు వెళ్ళేది లేదు. ప్రజల్లోనే ఉంటాం. ఏ రకమైన శిక్ష విధించాలనుకున్నా దాన్ని భరించడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’’అని అన్నారు.

చట్టం ఏం చెబుతోంది?

మైనర్ బాలిక పై తప్పుడు ప్రచారం చేసిన పక్షంలో పోక్సో చట్టం వర్తిస్తుందని ఆ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయవచ్చని న్యాయవాది ఉషారాణి బీబీసీతో అన్నారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మీద పెట్టిన కేసులో పోలీసులు పోక్సో యాక్ట్‌లో 23(1) సెక్షన్‌‌ను కూడా జత చేశారు. అయితే 23(1) ఏం చెబుతుందనే విషయాన్ని సీనియర్ న్యాయవాది ఎ.ఎస్. సరస్వతి బీబీసీకి వివరించారు.

‘‘బాలల రక్షణ కోసం, 2012లో పోక్సో చట్టం తీసుకు వచ్చారు. పోక్సో యాక్ట్ లో మొత్తం 46 సెక్షన్లు ఉన్నాయి. ఎటువంటి ఆధారం లేకుండా బాలల హక్కులకు భంగం కలిగే విధంగా వారిపైన కామెంట్స్ చేసినప్పుడు, మీడియా ద్వారా, ఫోటోగ్రఫీ వంటివాటి ద్వారా ప్రచారం చేసినప్పుడు, వారి గౌరవానికి, గోప్యతకు భంగం కలిగినప్పుడు పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 23(1) కింద కేసు నమోదు చేస్తారు.’’

‘‘కేసు నిరూపణ అయితే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఫైన్ వేయవచ్చు. లేదా శిక్ష, జరిమానా రెండు కూడా వేయవచ్చు.’’

‘‘చట్ట ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు పోక్సో చట్టం కిందకు వస్తారు. లైంగిక వేధింపులు, అశ్లీలత, వారిని అసభ్యంగా తాకడం, సెక్సువల్ గా వారితో మాట్లాడడం, వారిపైన దాడిచేయడం లాంటివి చేసినప్పుడు కేసు తీవ్రతను బట్టి పోక్సో యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.’’అని సరస్వతి చెప్పారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసు విషయంలో కొందరు లాయర్లు భిన్నంగా స్పందించారు.

పరామర్శకు వెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడిన నాయకుడిపై పోక్సో కింద కేసు నమోదు చేయకూడదని న్యాయవాది శ్రీలక్ష్మి బీబీసీతో అన్నారు.

‘‘సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చు. నాయకుడు బహిరంగంగా మాట్లాడారు. బాలిక ఎస్సీ కులానికి చెందిన వారు కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయచ్చు. లేదంటే బాలిక తండ్రి పరువు నష్టం కేసు పెట్టవచ్చు. కానీ తప్పుడు ప్రచారం చేశారని పోక్సో కింద కేసు నమోదు చేసే అధికారం పోలీసులకు లేదు. కోర్టులో నిలబడుతుందో లేదో చూడాలి.’’ అని ఆమె అన్నారు.

చెవిరెడ్డి నేపథ్యం ఏంటి?

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 27 ఏళ్ళ వయసులో జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి గెలిచిన ఆయన తర్వాత 2007 నుంచి 2010 వరకు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యునిగా పని చేశారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌‌గా పనిచేశారు. మళ్లీ తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా 2019లో బాధ్యతలు చేపట్టారు. 2021లో టీటీడీ పాలకమండలి ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా నియమితులయ్యారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నుంచీ వైసీపీ తరుపున ఎంపిగా పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేతిలో ఓడిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)