You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యోగి ఆదిత్యనాథ్: బుల్డోజర్ వాడకాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఆపగలదా?
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బుల్డోజర్లను ఉపయోగించి చేసే కూల్చివేతలను ఆపేయాలని బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఒకవేళ ఒక వ్యక్తి నేరస్థుడైనా, లేదా ఏదైనా నేరారోపణలు ఎదుర్కొంటున్నా, వారి ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయకూడదని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
సర్కారీ ఉద్యోగులు తమను తాము న్యాయమూర్తులుగా భావించరాదని, నిందితులైనంత మాత్రాన వారి ఆస్తులను ధ్వంసం చేయవద్దని వ్యాఖ్యానించింది.
అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు నిందితులకు సంబంధించిన ఆస్తులపై బుల్డోజర్లతో చర్య తీసుకుంటున్న సమయంలో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ విధానాల కారణంగా భారత రాజకీయాల్లో బుల్డోజర్లపై చర్చ మొదలైంది.
యోగి మద్దతుదారులు ఆయనను ‘బుల్డోజర్ బాబా’ అని పిలవడంతో పాటు, ర్యాలీల్లో బుల్డోజర్లతో ఆయనకు స్వాగతం పలుకుతుంటారు.
ఈ నేపథ్యంలో, దేశంలోని ‘బుల్డోజర్ రాజకీయాలపై’ సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్న వినిపిస్తోంది.
ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ పాలనలోని ‘బుల్డోజర్ యాక్షన్’ను ఈ తీర్పు ఆపగలుగుతుందా?
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ న్యాయం
అక్రమ నిర్మాణాలను కూల్చేయడానికి చాలా ఏళ్లుగా సివిల్ ఏజెన్సీలు బుల్డోజర్లను ఉపయోగిస్తున్నాయి. కానీ, రాజకీయాల్లో బుల్డోజర్ వాడకంపై మొదటి నుంచి ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
రెండేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జావెద్ మొహమ్మద్ రెండంతస్తుల ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు.
2022లో బీజేపీ నేత నుపుర్ శర్మకు వ్యతిరేకంగా ఒక నిరసన ప్రదర్శన చేపట్టారని జావెద్‌పై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో నుపుర్ శర్మ, మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఉన్నారు.
నిరసన సమయంలో రాళ్లు రువ్వడంతో పాటు హింసకు పాల్పడ్డారని జావెద్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత స్థానిక అధికార యంత్రాంగం ఆయన ఇంటిని బుల్డోజర్‌తో ధ్వంసం చేసింది.
జావెద్ ఇల్లును అక్రమ నిర్మాణమని ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ పేర్కొంది.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఫతేపూర్‌కు చెందిన హాజీ రజా విషయంలోనూ ఇలాగే జరిగింది.
హాజీకి చెందిన నాలుగు అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్‌ను 2024 ఆగస్ట్‌లో బుల్డోజర్‌తో కూల్చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హాజీపై ఆరోపణలు ఉన్నాయి.
2020లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఇల్లును ధ్వంసం చేసినప్పుడు కూడా బుల్డోజర్ చర్య పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. దూబేపై అనేక క్రిమినల్ కేసులున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ చర్యకు సంబంధించిన అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసులు వరుసగా చాలా రోజుల పాటు వార్తల్లో నిలిచాయి.
2024 ఫిబ్రవరిలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక రిపోర్టును విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తలెత్తిన మత హింస, నిరసనల తర్వాత అస్సాం, దిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో 128 ఆస్తులు ధ్వంసమైనట్లు ఈ నివేదిక విశ్లేషించింది.
ఆమ్నెస్టీ దీన్ని ప్రతీకార చర్యలుగా అభివర్ణించింది. సీనియర్ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలిపింది. ఆమ్నెస్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, 617 మంది దీనివల్ల ప్రభావితులు అయ్యాయి.
యోగి ఆదిత్యనాథ్, బుల్డోజర్
ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 15 ఏళ్ల తర్వాత, 2017లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
యోగి ఆదిత్యనాథ్ సీఎంగా తొలి నాళ్లలో లవ్ జిహాద్, గో సంరక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టారని, క్రమంగా ఆయన ఆసక్తి బుల్డోజర్ల వైపు మళ్లిందని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది చెప్పారు.
‘‘ఈ బుల్డోజర్ యాక్షన్ ఒక నేరంలోని నిందితుడితో మొదలుపెట్టి ముస్లిం సమాజం వైపు మళ్లింది. హిందు సమాజంలో ఆనందాన్ని కలిగించింది. బుల్డోజర్లు ముస్లింలకు వ్యతిరేకమనే భావన ప్రజల్లో కలిగింది. యోగి ఆదిత్యనాథ్‌కు ఉన్న హిందుత్వ ఇమేజ్‌ను ఇది మరింత బలోపేతం చేసింది.’’ అని విజయ్ అభిప్రాయపడ్డారు.
శక్తిమంతమైన పాలనకు బుల్డోజర్‌ను పర్యాయపదంగా యోగి ఆదిత్యనాథ్ మార్చారని మరో సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా అన్నారు.
‘‘ఈ దేశంలో చివరకు అజ్మల్ కసబ్‌కు కూడా సరైన న్యాయ విచారణ ప్రక్రియ అందింది. కానీ, బుల్డోజర్ కేసుల విషయానికొస్తే, నిందితుల కుటుంబాలకు కనీసం ఒక మాట మాట్లాడే అవకాశం కూడా దక్కలేదు. చాలా ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో ఇళ్లను కూల్చేశారు. చట్టంలో ఇలాంటి చర్యకు చోటే లేదు.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు నుంచే ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ల వాడకం ఉందని మరో సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ తివారీ చెప్పారు.
‘‘మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న 2007-2012 మధ్య కాలంలో చాలామంది మాఫియా నేతలకు చెందిన ఆస్తులపై బుల్డోజర్లను పంపి కూల్చేశారు. 2017లో యోగి వచ్చాక బుల్డోజర్ చర్యలు పెద్ద ఎత్తున జరిగింది. అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో మాఫియా, రౌడీయిజం చేసిన గూండాల వెన్ను విరగ్గొడతామని ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన ప్రమాణమే దీనికి కారణం.’’ అని తివారీ అన్నారు.
మార్పు వస్తుందా?
ఉత్తరప్రదేశ్‌లో మొదలైన బుల్డోజర్ చర్య చాలా త్వరగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, హరియాణా వంటి రాష్ట్రాలకు పాకింది.
బుల్డోజర్ల వాడకంతో వచ్చిన ఫలితాలను చూసి ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో కావడం మొదలుపెట్టాయని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది అన్నారు.
హిందువులను ఏకం చేయడానికి, వారిని సంతోషపెట్టడానికి బుల్డోజర్లను ఉపయోగించారని శరద్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఈ పనిలో బీజేపీ, యోగి విజయం సాధించారని చెప్పారు.
బుల్డోజర్ చర్యకు సంబంధించి ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఉత్తరప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యను తగ్గించగలవని శరద్ గుప్తా అన్నారు. అయితే, దీనితో రాజకీయాలు కొనసాగుతాయని ఆయన అన్నారు.
విజయ్ త్రివేది కూడా ఇదే మాట అన్నారు. దీనివల్ల యోగి ఇమేజ్‌లో ఎలాంటి తేడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ బుధవారం బుల్డోజర్ యాక్షన్‌పై కీలక తీర్పును వెలువరించారు.
‘‘ఒక మామూలు పౌరుడికి ఇల్లు కట్టుకోవడం అనేది ఎన్నో ఏళ్ల కృషి, కల, ఆశయం’’ అని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది.
‘‘ఒకవేళ ఒకవ్యక్తిపై నేరారోపణ ఉందనే కారణంగా యంత్రాంగం వారి ఇల్లును కూల్చివేస్తే, ఆ యంత్రాంగం చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా మేం పరిగణిస్తాం. ఇలాంటి కేసుల్లో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారులు తమ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి ఏకపక్షంగా, వివక్షాపూరితంగా, ఇష్టానుసారంగా చేసే చర్యలను ఆపేందుకు కొన్ని మార్గదర్శకాలు అవసరం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది
- ఏదైనా నిర్మాణాన్ని కూల్చివేయడానికి 15 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి
- సంబంధిత ఆస్తులకునోటీసును అంటించడం తప్పనిసరి
- ఫిర్యాదు అందుకున్న తర్వాత సదరు జిల్లా కలెక్టరుకు సమాచారం ఇవ్వాలి
- మూడు నెలల్లోగా ఒక డిజిటల్ పోర్టల్ తయారు చేయాలి
- ఆ పోర్టల్‌లో ప్రతీ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి
- అధికారులు సంబంధిత వ్యక్తి ఫిర్యాదును ఓపికగా వినాలి, ఫిర్యాదు నమోదు చేయాలి
- ప్రాపర్టీ యజమానికి కోర్టుకు వెళ్లే అవకాశం కల్పించాలి.
- ప్రాపర్టీ కూల్చివేత ప్రక్రియను తప్పనిసరిగా వీడియో రికార్డ్ చేయాలి
- ఈ మార్గదర్శకాలను పాటించకపోతే అధికారులు బాధ్యత వహించి, సొంత ఖర్చుతో ఆ ప్రాపర్టీని పునర్నిర్మించాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)